Saturday, March 31, 2012

ఆత్మీయ స్పర్శతో నూతనోత్తేజంఒకోసారి మాటలకన్నా.. సంఘటనలకన్నా.. చల్లటి ఆత్మీయతతోకూడిన స్పర్శ ఎంతో రిలాక్సింగ్‌గా, సంతోషంగా అనిపిస్తుంది. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. గతంలో పెద్దవాళ్లు తమ పాదాలను తాకి నమస్కరించిన చిన్నవాళ్ళను లేవనెత్తి తలపైఆత్మీయంగా స్పృశిస్తూ ఆశీర్వదించేవారు. వారి స్పర్శ,ఆశీర్వాద బలం చిన్నవాళ్లలో విద్యుత్‌లా ప్రవహించి విజయాలకు కారణమవుతుంది.
తల్లి ఒడిలోని హాయి, చల్లని చేతుల స్పర్శను మించినది లేనే లేదని మనోవిశే్లషకులు కూడా నిర్థారిస్తున్నారు. స్పర్శను బటి,్ట స్పృశించబడే శరీర భాగాలను బట్టి వారిమధ్య రిలేషన్‌షిప్‌ని గుర్తించడం మనకు సాధ్యమవుతుంది. నేడు జనజీవనంలో పాశ్చాత్య అలవాట్లు ఎక్కువగానే కనబడుతున్నాయి. ఫంక్షన్ జరుగుతున్నపుడు చాలామంది సెలబ్రిటీస్ ఆడవారైనా, మగవారైనా కరచాలన స్పర్శతో మాత్రమే ఆగటంలేదు. గాఢంగా ఆలింగనం చేసుకుని ఒకరినొకరు వీపు తట్టి అభినందించుకోవటం కూడా చూస్తున్నాం.
ఆత్మీయుల స్పర్శ, అపరిచితుల స్పర్శ ఇట్టే తెలిసిపోతుంది. మిత్రురాలు భుజం మీద చేయివేస్తే ఏమీ అనిపించదు. అదే అపరిచిత వ్యక్తి భుజం మీద చేయివేస్తే వెంటనే రియాక్ట్ అవుతాం. పసిపిల్లల సంగతే తీసుకోండి- ఎంతమంది ఎత్తుకొని జోకొట్టి లాలించినా ఏడుపు ఆపరు. అదే తల్లిచేతుల్లోకి తీసుకోగానే వెంటనే ఏడవటం ఆపేస్తుంటారు. చక్కిలిగింత అందరికీ ఒకేలా ఉండదు. అదివారి వారి మనోస్థితిని బట్టి వుంటుంది. చక్కిలిగింత అనేది అసంకల్పిత ప్రతి చర్య. అయినా సరే కోపంలో వున్నపుడు ఎవరైనా చక్కిలిగింత పెడితే నవ్వురాదు. కానీ మంచి మూడ్‌లో ఉన్నపుడు మాత్రం చక్కిలిగింత పెడితే కిలకిలా నవ్వులు వాటంతటవే వస్తాయి.
జ్వరమొచ్చి పది లంఖణాలు చేసిన వాళ్ళ దగ్గర కూర్చుని నుదుటిమీద, బుగ్గలమీద చేయి వేసి ఆత్మీయంగా నిమురుతూ రెండు ఓదార్పు మాటలు పలికితే చాలు వారిలో కొత్త చైతన్యం పొంగుకు వచ్చి త్వరగా కోలుకుంటారు. డిప్రెషన్‌లో ఉన్నవాళ్ళకు ఓదార్పు మాటలతో పాటు కాస్త ఆత్మీయ స్పర్శ తప్పనిసరి అంటున్నారు డాక్టర్లు. ఆధ్యాత్మిక గురువుల పాదస్పర్శతో తిరిగి ఆరోగ్యాన్ని పొందవచ్చని చాలామంది గాఢంగా విశ్వసిస్తుంటారు. పాజిటివ్ వేవ్స్ ఉన్న వ్యక్తుల స్పర్శవల్ల ఇవతలివారిలో కూడా ఆ పాజిటివ్ తరంగాలు ప్రసరించి ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. ఆత్మీయులను స్పర్శించండి.. పెద్దవాళ్ళ దీవెనలను తప్పకుండా అందుకోండి. ఆ స్పర్శాభావాలతో మనసును ఉల్లాసంగా... ఉత్సాహంగా మార్చుకోండి.
-హిమజారమణ
( Collection from andhrabhoomi Daily )

Friday, March 30, 2012

2400 కోట్ల రూపాయల నష్టాల్లో ఆర్టీసీ: ఎండీ


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) 2400 కోట్ల రూపాయల నష్టాల్లో ఉందని ఎండీ ప్రసాదరావు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీకి 400 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ప్రసాదరావు తెలిపారు. 2011-12 ఆర్ధిక సంవత్సరంలో 4 వేల బస్సులు ప్రవేశపెట్టామని ఆయన తెలిపారు. 2012-13 సంవత్సరంలో మరో 50 ఇంద్ర సర్వీసులను ప్రవేశపెడతామని ఆయన అన్నారు. గ్రామీణ రవాణాకు స్వయం సహాయక సంఘాలతో కొత్త బస్సుల ఏర్పాటుకు యత్నిస్తున్నామని ఆర్టీసీ ఎండీ ప్రసాదరావు తెలిపారు.

Thursday, March 29, 2012

తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ రంగానికి అమ్ముడుపోయింది: హరికృష్ణ


న్యూఢిల్లీ, మార్చి 28: ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమారుడు. ప్రస్తుతం అదే పార్టీకి అధినేతగా కొనసాగుతున్న చంద్రబాబునాయుడుకు స్వయానా బావమరిది. అయినప్పటికీ ఇతరులకు లభిస్తున్న గౌరవంలో కాస్త అయినా తనకు దక్కడం లేదని, పార్టీలో సరైన ప్రాధాన్యత లభించటం లేదన్న ఆవేదనతో కుమిలిపోతున్నారు. పార్టీలోనేగాక చివరకు పార్లమెంటులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూడా తనకు తగిన స్థానం లభించటం లేదన్న భావన ఆయనను వెంటాడుతోంది. ఆయనే రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ. ఎన్టీఆర్ తనయుడైనప్పటికీ పార్టీ కార్యాలయం బయట సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన సోఫాలో కూర్చుంటున్నారు హరికృష్ణ. ఇదేమని అడిగితే తెలుగుదేశం పార్టీ కార్యాలయం లోపల కూర్చోవటానికి తగినన్ని కుర్చీలు లేవని, కార్యాలయంలోని మొత్తం సీట్లు కార్పొరేట్ రంగానికి, వారి ప్రతినిధులకు రిజర్వ్ అయిపోయాయని అంటున్నారు. తన తండ్రి ఎన్టీఆర్ పేదవారి కోసం, కష్టించి పనిచేసే కార్యకర్తల కోసం ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పూర్తిగా వేలాది కోట్లకు పడగలెత్తిన కార్పొరేట్ రంగానికి అమ్ముడుపోయిందని హరికృష్ణ బుధవారం తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో మధుకాన్ సంస్థ అధిపతి నామా నాగేశ్వర్‌రావు, సృజనా సంస్థల అధిపతి వైఎస్ చౌదరి, రాంకీ గ్రూప్‌నకు చెందిన ఎం వేణుగోపాల్ రెడ్డి పార్టీలో కార్పొరేట్ రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారన్న ఆయన ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన సిఎం రమేష్, దేవేందర్ గౌడ్ ఎంపికపైనా అసంతృప్తి వ్యక్తంచేశారు. సిఎం రమేష్ వ్యాపార రంగానికి చెందిన వారేనని, దేవేందర్ గౌడ్‌కు కూడా రియల్ ఎస్టేట్, ఫార్మా పరిశ్రమతో సంబంధాలున్నాయన్నారు. ఫలితంగా పార్లమెంటులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం రాజకీయ పార్టీ కార్యాలయంగాక ఒక కార్పొరేట్ కార్యాలయానికి దిగజారిందని పార్టీ అధినేత వైఖరి పట్ల తీవ్ర నిరసనను వ్యక్తంచేశారు.
అయితే పార్టీ అధినేత చంద్రబాబుతో తీవ్రంగా విభేదిస్తున్న హరికృష్ణ ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో వ్యవహరిస్తున్న తీరు పార్టీలోని కార్పొరేట్ దిగ్గజాలకు కలవరం పుట్టిస్తోంది. రాజ్యసభలో ఒంటరిగా కూర్చుంటున్న ఆయన కనీసం పార్టీ కార్యాలయంలో అడుగు పెట్టేందుకు సైతం అయిష్టత ప్రదర్శిస్తున్నారు. దీంతో హరికృష్ణను బుజ్జగించి పార్టీలో అభిప్రాయభేదాలు లేవని నమ్మించటానికి సీనియర్ నాయకులు పడరానిపాట్లు పడుతున్నారు

Tuesday, March 27, 2012

దరహాసంతో కోపం దూరం.. దూరం


‘‘తన కోపమే తనకు శత్రువని.. ’’
శతకకారుడు ఏనాడో పేర్కొన్నాడు.
పెదవి దాటని కోపం పెద్ద మేలు
చేస్తుందన్న నిజం కూడా మనందరం
తెలుసుకోవాలి. కోపాన్ని ప్రథమ స్థాయిలోనే నిలువరిస్తే మన జీవితాలలో
ఎన్నో అనర్థాలు తప్పిపోతాయి.
ప్రమాదాలు తొలగి, ఉపద్రవాలు
ఆగిపోతాయి. ఈ విషయం ప్రతి
మనిషికి తెలుసు. అయనా ఏదో
ఉద్రేకంలో అణచుకోలేని కోపంతో
ఎదుటివారిపై విరుచుకుపడతాం.
సమాజంలో మన చుట్టూ ఎందరో ఎన్నో రకాల మనస్తత్వాలు కలవారు ఉంటారు. అలాంటివారితో అడ్జస్టయిపోతూ ముందుకు సాగిపోవాలే తప్ప, మన గొప్పతనాన్ని గుర్తించకుండా అవాకులు, చవాకులు పేలుతున్నారనే మిషతో అడుగడుగునా మీ కోపాన్ని ప్రదర్శిస్తూ అందర్నీ విరోధులు చేసుకోవడం మతిమాలిన పని. మీ చుట్టూ వున్నవారు, మీ వద్ద పనిచేసేవారు, మీ సహచరులు, మీ బంధువులు, కుటుంబ సభ్యులు మీరు కోరినట్లు నడుచుకోకపోవచ్చు. మీ ఆలోచనలకనుగుణంగా ప్రవర్తించి ఉండకపోవచ్చు. ఇలాంటి సందర్భాలో మీరు కోపంతో చిర్రెత్తిపోవటం సహజం. అయితే మీరిక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి. మీకు మీ అభిప్రాయాలు ఎలా వుంటాయో, ఎదుటి వారికి కూడా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. మీకనుగుణంగా బలవంతంగా కోపంతో, ఆగ్రహాలతో వారిని మార్చాలని ప్రయత్నించటం ఎంతవరకు సమంజసమో ఒకసారి మీరే ఆలోచించండి. ప్రశాంతంగా ఆలోచించి ఆ సందర్భాన్ని ఓసారి మననం చేసుకొని విజ్ఞత ప్రదర్శిస్తే మరో సందర్భంలో అలాంటి కోపం కాని ఆగ్రహం కాని రాకుండా ఉండేందుకు బోలెడంత అవకాశం ఉంటుంది.
జీవితంలో అనుకోని అవాంతరాలు, అవరోధాలు ఎదురైనపుడు, ఊహించని అపజయాలు, అవహేళనలు ఎదుర్కొన్నపుడు మీకు అనుకోకుండానే కోపం వస్తుంది. అయితే ఇక్కడ చిన్నవిషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. చిన్నవారు మధ్య తరగతి, మహోన్నత వ్యక్తుల జీవితాలలో కూడా ఈ వ్యధలు, వేదనలు, అవహేళనలు, అవమానాలు తప్పలేదు. అలాంటప్పుడు మీరెందుకు అంతగా రెచ్చిపోయి కోపం పెంచుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందో ఆలోచించండి.
కాలంతో పరుగులు తీస్తూ దొంగ వెంట పోలీసుల పరుగులా, మనుషులు కాలం వెనక పరిగెత్తే సమయంలో ‘టైమ్ మేనేజ్‌మెంట్’ తెలియని మనుషులు స్ట్రెస్‌కు గురవుతున్నారు. మీరూ ఆ కోవకే చెందినవారే కావచ్చు. అలా అయి వుంటే ఆ స్ట్రెస్‌లో మునిగితేలుతూ కూడా పెదవులపై చిరునవ్వు చెదరనీయకుండా ఎంతమంది మీ చుట్టూ ఉంటున్నారో గమనించండి. స్ట్రెస్ కారణంగా కోపం వచ్చినా పెదవి దాటనీయకుండా నిగ్రహాన్ని పాటించి, కోపాన్ని జయించండి. కోపాన్ని జయిస్తే సమాజాన్ని, ప్రపంచాన్ని జయించినట్టే! ఎవరికీ దూరం కాకుండా, ఏ విధమైన నష్టం పొందకుండా ప్రతినిత్యం ఆనందంగా, ఉత్సాహంగా ఉండాలంటే కోపాన్ని వదులుకోవాలి.
-దాసరి కృష్ణారెడ్డి
( From Andhrabhoomi daily)

Monday, March 26, 2012

నేడు ‘పండితారాధ్యుల’ శతజయంతి!
పాత్రికేయులంటే ఎలా ఉండాలో పండితారాధ్యుల నాగేశ్వరరావును చూసి నేర్చుకోవాల్సిందే నని తలపండిన పాత్రికేయులు సైతం అంగీ కరిస్తారన్నది అతిశయోక్తి కాదు. గుంటూరు జిల్లా, ఇంటూరు గ్రామంలో 1912 మార్చి 26న జన్మిం చిన పండితారాధ్యుల నాగేశ్వరరావు, గుంటూ రు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో విద్యాభ్యాసం అనంతరం పత్రికారచయితగా ప్రసిద్ధిగాంచారు. పిఠాపురం మహా రాజావారి ‘దేశబంధు’ పత్రికలో కొన్నాళ్లు పనిచేసి, ఆచార్యరంగా నెలకొల్పిన ‘వాహిని’ పత్రికలో 1932లో చేరారు. 1943 నుంచి 1959 వరకూ ఆంధ్రపత్రికలో పనిచేశారు. 1960లో ‘ఆంధ్రభూమి’ వ్యవస్థాపక సంపాదకులుగా విశేషమైన సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సంఘం ఆధ్వర్యంలో వెలువడిన ‘ఆంధ్ర జనత’కు 1965లో ఏడాదిపాటు సంపాదకత్వం వహించారు. 1966 నుంచి 1976 వరకూ ‘ఆంధ్రప్రభ’ బెంగళూరు రెసిడెంట్ ఎడిటర్‌గా పనిచేశారు. 1969-72 మధ్య కాలంలో రాష్ట్రంలో తలెత్తిన వేర్పాటువాద ఉద్యమ సందర్భాలలో సమన్వయానికి, సంఘటితత్వానికి దోహదం చేయడంలో ప్రముఖపాత్ర నిర్వహించారు. పండిత పాత్రికేయులుగా ప్రఖ్యాతిగాంచిన పండితారాధ్యుల 1976 నవంబర్ 13న తుదిశ్వాస విడిచారు. ఆయన జన్మించి వంద సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ, వయోధిక పాత్రికేయుల సంఘం సంయుక్తంగా మార్చి 26 ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ప్రెస్ అకాడమీ కార్యాలయంలో ‘శతజయంతి’ సమావేశాన్ని ఏర్పాటు చేయటం ముదావహం.
ముదిగొండ వీరభద్ర శాస్త్రి హైదరాబాద్( From Sakshi )
(పండితారాధ్యుల నాగేశ్వరరావు జన్మించి నేటికి శత వసంతాలు)

Sunday, March 25, 2012

పరీక్షలంటే భయం ఎందుకు? (రేపట్నుంచి టెన్త్ పరీక్షలు)

పరీక్షల కాలం వచ్చింది. దీంతో చాలామంది విద్యార్థులకు భయం పట్టుకుంటుంది. ఎలా చదవాలి? పరీక్షలు ఎలా రాయాలి? అని తెగ ఆందోళన పడుతుంటారు. నేడు పరీక్షల విషయంలో పిల్లలకంటే వారి తల్లిదండ్రులకే కంగారు ఎక్కువగా వుంటోంది. తమ ఇరుగుపొరుగువారి పిల్లలకంటే తమ పిల్లలకు ఎక్కడ తక్కువ మార్కులు వస్తాయేమోనని వారు భయపడతారు. ఈ కారణంతో తమ పిల్లల శక్తి సామర్థ్యాలతో సంబంధం లేకుండా బాగా చదవాలంటూ వారిపై వత్తిడి తీసుకువస్తారు. స్కూలులో టీచర్లు, ఇంటి దగ్గర తల్లిదండ్రులు పిల్లలపై అధిక ఒత్తిడి తీసుకువచ్చి వారిలో వచ్చే మానసిక, శారీరక సంఘర్షణలకు కారణమవుతున్నారు.
ప్రతిరోజూ ఉదయం 8 గంటలనుండి రాత్రి 8 గంటలవరకూ అంటే పనె్నండు గంటల పాటు పిల్లలకు స్కూలు, ట్యూషన్‌తోనే సరిపోతుంది. ఇక పరీక్షలు వచ్చిన సమయంలో నిరంతరం చదుతూనే వుంటారు. ఇలా ఎప్పుడూ చదువులో మునిగితేలుతూంటే వారిలో మానసిక ఒత్తిడి పెరిగి అనార్యోం పాలవుతున్నారు. పిల్లలపై ప్రతినిత్యం తల్లిదండ్రులు ఈ విధంగా ఒత్తిడి చేయడం, చదువు విషయంలో కఠినంగా ప్రవర్తించటం మంచిది కాదు.
సర్వసాధారణంగా పరీక్షలు దగ్గరపడినపుడు, అవి ప్రారంభమైనపుడు పిల్లలు తమ మెదడుని పూర్తిగా పుస్తకాలకే అంకితం చేసేస్తారు. అలా చేయటం మంచిది కాదు. ఈ సమయంలోనే పిల్లలకు మానసికంగా, శారీరకంగా విశ్రాంతి అవసరం. మానసికంగా ఆందోళన చెందితే వారు పరీక్షలు సరిగా రాయలేరు. పైగా అంతకుముందు చదివినదంతా మర్చిపోయే ప్రమాదమూ వుంది. పరీక్షల సమయంలో పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుంటే వారిలో భయం, ఆందోళన వంటివి మాయమవుతాయి.
సమయ పరిధి
చదువుకునేటపుడు అదేపనిగా గంటలకు గంటలు చదవకుండా 40-45 నిముషాలకోసారి చదివేలా నిర్దిష్ట సమయాన్ని పిల్లలే నిర్ణయించుకోవాలి. మధ్యమధ్యలో టీవీ చూడకుండా కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవాలి.
స్థలం
పిల్లలు చదువుకోవటానికి నిర్దిష్టమైన స్థలాన్ని లేదా చోటును చూసుకోవాలి. నలుగురు కూర్చున్నచోట కూర్చుని చదవటంవల్ల వాళ్ళేం చదువుతున్నారో వారికి అర్థం కాదు. అందుకని సాధ్యమైనంత వరకూ ఏ విధమైన అడ్డంకులు లేకుండా చూసుకోవాలి. టీవీనో, డివిడిలో సినిమాలు చూస్తూనే చదువద్దు. మంచంపైన ఫ్లాట్‌గా, బోర్లా పడుకుని చదవకూడదు.
స్వీయ పరీక్షలు
స్కూలులో ఎలాగా టెస్ట్‌లు పెడతారు కదా అని బద్ధకించకూడదు. వాళ్ళకి వాళ్ళే స్వయంగా ఇంట్లో టెస్ట్ పెట్టుకుంటే పరీక్షలంటే భయం పోయి వారిపై వారికి ధైర్యం, నమ్మకం ఏర్పడతాయి.
ఆత్మవిశ్వాసం
ఒకచార్టు తయారుచేసుకుని, దానిలో రోజూ మీరేం చదువుతున్నారో, ఎంత చదువుతున్నారో రాసుకోవాలి. ఆ విధంగా టైంటేబుల్ తయారుచేసుకుని ఒక క్రమపద్ధతి ప్రకారం చదివితే పరీక్షలు సమీపించే సమయానికి సిలబస్ పూర్తిచేయగలుగుతారు.
రిలాక్సేషన్ కోసం
అప్పుడప్పుడూ వ్యాయామాలు చేయటంవల్లకూడా మనసుకు సంతోషంగా అనిపించి రిలాక్స్ పొందే అవకాశం వుంది. మనసులో ఎటువంటి భయాలను పెట్టుకోకుండా హాయిగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటే తేలికగా పరీక్షలను ప్రశాంతంగా వారు రాయగలుగుతారు.
పౌష్టికాహారం
పౌష్టికాహార లోపంవల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఆ కారణంగా పరీక్షలు సరిగా రాయలేకపోతారు. కాబట్టి సరైన సమయానికి ఆహారం తీసుకోవాలి. టీ, కాఫీలు వంటివి మానేయాలి.
నెగెటివ్ థింకింగ్
చదువుకు సంబంధించి మనసులో ఏ విధమైన నెగెటివ్ థింకింగ్ (వ్యతిరేకంగా ఆలోచించటం)ను పెంపొందించుకోకూడదు. ప్రతి విషయాన్ని సానుకూల దృక్పథంతో ఆలోచించుకోవాలి. అప్పుడు భయం, ఆందోళన లాంటివి దరిచేరవు.
నిపుణుల సలహా
విద్యార్థినీ విద్యార్థులు మానసిక వత్తిడికి లోనైతే కనుక ఒకసారి మానసిక వైద్య నిపుణులను సంప్రదించటం మంచిది. నిపుణుల కౌనె్సలింగ్ వల్ల పిల్లలలో నూతనోత్సాహం వస్తుంది.
ఇక పిల్లల చదువుకు సంబంధించి తల్లిదండ్రుల పాత్ర ఎలా వుంటుందో పరిశీలిస్తే- పరీక్షల సమయంలో తల్లిదండ్రులు పిల్లలకు అన్నివిధాలా సహకరించాలి. ఆ సమయంలో వారికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం తల్లిదండ్రుల బాధ్యత. అంతేకాక పిల్లల ఆరోగ్యం విషయంలోనూ తగిన శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలు ఏ విధమైన మానసిక, శారీరక వత్తిడులకు లోనుకాకుండా చూసే బాధ్యత కూడా తల్లిదండ్రులదే.
పరీక్షల సమయంలో చాలామంది విద్యార్థులలో ఈ కింది మార్పులు వచ్చే అవకాశం ఉంది.
* మూడ్ మారటం
* ఉద్వేగాన్ని ఆపుకోలేకపోవటం
* అందరితో కలిసిమెలిసి వుండలేకపోవటం
* తమపై తమకు శ్రద్ధ తగ్గిపోవటం
* నిద్రసరిగా ఉండకపోవటం
* తలనొప్పి, వొళ్ళునొప్పి వంటివి రావటం
* ఆకలి లేకపోవటం లేదా మందగించటం
* ఆత్మన్యూనతతో తమని తాము తక్కువ చేసుకుని బాధపడటం
* నిత్యం తాము చేసుకునే పనులపై ఆసక్తి తగ్గటం
* త్వరగా గానీ, కారణం లేకుండా గానీ కోపంరావటం
* దేనిపైనా శ్రద్ధ లేకపోవటం
* తాము దేనికీ అర్హులం కామని అనుకోవటం
* అశక్తతతో బాధపడటం
* అకారణంగా తమని తాము నిందించుకోవటం, మనసులో వ్యతిరేక ధోరణిని, భావాలను పెంపొందించుకోవటం- ఇలాంటివన్నీ కనిపించవచ్చు.
-పైన పేర్కొన్న వాటిని అందరూ పిల్లలకూ అన్వయించి చూడటం మంచిదికాదు. అందరూ పిల్లలు అలా వుండకపోవచ్చు. ఒకవేళ తమ పిల్లలలో ఈ ధోరణి, లక్షణాలు కనిపించినట్లయితే వాటినుంచి బయటపడేలా తల్లిదండ్రులు చూ డాలి. తల్లిదండ్రులు శ్రద్ధ చూపిస్తే పిల్లలలో పరీక్షలంటే భయం తప్పకుండా పోతుంది.
-మనస్విని
From Andhrabhoomi daily

Friday, March 23, 2012

ప్రయత్నం మంచిదే..కానీ..: "బ్లాగు పుస్తకం" గురించి ఓ విశ్లేషణ


ఈ మధ్య కాలంలో మనం కంప్యూటర్ పరిచయ పుస్తకాలనే ఎక్కువగా చూస్తున్నాం. వీటికి భిన్నంగా బ్లాగు పుస్తకం అనేది తాజాగా మార్కెట్‌లోకి వచ్చింది. 109 పేజీల్లో రూపొందిన ఈ రచనల్లో బ్లాగంటే ఏమిటి?, వర్డ్‌ప్రెస్‌లో బ్లాగునెలా రూపొందించుకోవాలి?, బ్లాగునెలా చదవాలి(???), బ్లాగునెలా కొనసాగించాలి. తెలుగులో టైపుచేయటం ఎలా, - ఈ విషయాలన్నీ తెలియజేసే ప్రయత్నం చేసారీ పుస్తక రచయిత్ర(్త)లు. అసలు బ్లాగ్ అంటే ఏమిటి- బైనఠీ లాగింగ్. అంటే 0,1- బైనరీ అంకెలతో సూచించడంగా లాగ్ చేయడం. అంటే మనం అనుకునే ప్రతి అంశాన్నీ డిజిటల్‌గా నమోదు లేదా రికార్డుచేయడం. ఈ బైనరీ లాగింగే బ్లాగ్‌గా రూపొందింది. అంటే, డిజిటల్‌గా డైరీని రాసుకోవడమే. బ్లాగింగ్ చేయడానికి బ్లాగర్.కామ్, వర్డ్‌ప్రెస్, బ్లాగ్ సిటీ, లైవ్‌జర్నల్- ఇలా పలు సౌకర్యాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో వర్డ్ ప్రెస్‌ను ఉదాహరణగా తీసుకుని ఎలా బ్లాగింగ్ చేయవచ్చో తెలియజేసే ప్రయత్నమే ఈ పుస్తకం. చిత్రాలన్నిటినీ రంగుల్లో ముద్రించడంతో అవి పుస్తకానికి వనె్నతెచ్చిపెట్టాయి. ఐతే, పుస్తకం డిజైనింగ్ లోపంవల్లా, వాడిన భాష సరిగ్గా లేనందువల్లా చదివేవారికి ఇబ్బందిగానే ఉంటుంది.
కొత్తగా బ్లాగులను ఏర్పాటుచేసుకోవడం మొదలుపెట్టేవారికి ఈ పుస్తకం కరదీపికగా ఉండటం అటుంచితే, ఇందులో వాడిన పదాలు- వేగు, తెరపట్టు, అనుకోలు, అంతర్జాలం, విహారిణి, వాడుకరి పేరు, మొదటిసారి టపాకట్టడం (???), టపా పాఠ్యం, ప్రచురించుమీట, కుడి పట్టీ, ఎడమ పట్టీ, పాద పీఠిక, శరీరం, ఉప పేరు, బ్లాగుట, దిద్దువాణి, జాల చిరునామా, మనుజూపు, మాఫీ, మాఫీ రద్దు, సంకలినులు, శోధన యంత్రాలు, అప్రమేయంగా, దస్త్రాలు, తోకలు- ఇలా సాగిపోతూ తికమకనూ, విసుగునూ కలగజేస్తాయి. తెలుగులో ఇలా పదాలను వాడేస్తే రచయితలకెంత తెలుగు భాషాభిమానమో అనుకొనే వారుంటారేమో గానీ, మొదటిసారి టపాకట్టడం లాటి ప్రయోగాలు నవ్వులపాలవుతాయి. ఇది చదివే కొద్దిమందికీ కూడా విసుగూ, చికాకునూ, కలిగించక మానవు. పోనీ, అట్లని పూర్తిగా తెలుగే వాడారా అంటే లేదు. ఇంగ్లీషునీ యధేచ్ఛగా వాడారు. అలాటప్పుడు వారు అవస్థపడుతూ, చదువరులను అవస్థపెట్టడం ఎందుకో అర్థంకాదు. అసలు రచయితకు (రచయిత్రికి) తెలుసోతెలీదో- లోగడ (అంటే 2010)లో కంప్యూటర్ విజ్ఞానం తెలుగు మాసపత్రిక ఈ బ్లాగుపై ఒక బోనస్ బుక్ ప్రచురించింది. అందులో బ్లాగర్.కామ్ వాడి ఎలా బ్లాగ్ ఏర్పాటుచేయవచ్చో వివరించారు. (దీనికి బ్లాగర్.కామ్‌లో ఉండే హెల్ప్ ఆధారం). 64 పేజీల పరిచయ పుస్తకం అది.
ఇంటర్నెట్‌ను ఇంటర్నెట్ అనీ, బ్రౌజర్‌ను బ్రౌజర్ అనీ అంటే చాలా సౌకర్యం. అంతే కానీ, అంతర్జాలం (మార్జాలం అన్నట్టు) అనీ, శోధకం లేదా విహారిణి అనీ తికమక పడటం ఎందుకు? ఇమెయిల్‌ను ఇమెయిల్ అంటే సులభంగా అర్థం అవుతుంది కదా! మొదటిసారిగా పోస్టుచేయడం అనడానికి మొదటిసారి టపా కట్టడం అనడం ఏమన్నా బావుందా? (మొదటిసారి టపా కట్టడం అంటే అర్థం ఏమిటో తెలియకుండా వాడారని నేను అనుకోను).
ఇంకో సంగతి. రచయిత(త్రి) ఎడమకీ, కుడికీ తికమక పడ్డారు. (చూ.పేజీ 31). ఎడమకి కుడి అనీ, కుడికి ఎడమ అనీ (అటునించి చూసుకోవాలేమో..) సూచించారు. అసలు తెలుగు బ్లాగులకే ఎలాటి మార్గదర్శకాల్లేవు. ఇక వాటి గురించి రాసే పుస్తకాలకేం ఉంటాయి? ఆ సంగతి అలా ఉంచితే, 109 పేజీల పుస్తకానికి ధర 230 రూపాయలు చాలా ఎక్కువే. ఒక చక్కని ఇతివృత్తాన్ని తీసుకుని సరిగ్గాతీయలేకపోయిన సినిమాలా మిగిలిందీ పుస్తకం.

Original Link : http://andhrabhoomi.net/content/d-1097

Tuesday, March 20, 2012

ఊరపిచ్చుకలారా మీరెక్కడ? :నేడు ప్రపంచ ఊరపిచ్చుకల దినోత్సవం


ఒకప్పుడు ఊర పిచ్చుకలు లేని ఊరులేదంటే అతిశయోక్తి కాదు. గ్రామీణ ప్రాంతాల్లో ఏ వాడ చూసినా, ఏ ఇల్లు చూసినా గుంపులు గుంపులుగా ఊరపిచ్చుకలు దర్శనమిచ్చేవి. పిచ్చుకలు, మానవులు ఒకే కుటుంబసభ్యులుగా సహజీవనం చేసేవారు. మిగతా పక్షులకు భిన్నంగా ఊరపిచ్చుకల జీవితాలు మానవ జీవితాలతో పెనవేసుకున్నాయి. ఆహారం కోసం, నివాసం కోసం, గూడు కోసం పూర్తిగా మానవులపై ఆధారపడతాయి అవి. మనుషులతో సన్నిహితంగా మెలుగుతాయి. చిన్న చిన్న పురుగులు, ధాన్యం గింజలు తిని జీవిస్తాయి ఊరపిచ్చుకలు.

ఊరపిచ్చుకలను తెలంగాణలో ఊరబిస్కలు అంటారు. చాలా బక్కపలచగా ఉన్న వాళ్లను ఊరబిస్క ప్రాణంతో పోలుస్తారు. డాబాపైన చుట్టూ ఉండే గోడను పిట్టగోడ అంటారు... అంటే చిన్న గోడ అని అర్థం. ఈ విధంగా ఊరపిచ్చుకలకు సంబంధించిన పదజాలం తెలుగు భాషలో ఇమిడిపోయింది. తెల్లవారితే చాలు కిచ కిచ అంటూ సందడి చేసే ఊరపిచ్చుకలు ఆహారం కోసం ఇళ్లచుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి. కడుపు నిండిన తర్వాత ఇంటిముందు బట్టలు ఆరేయడానికి కట్టిన దండెంపైనో, పిట్టగోడపైనో, కరెంట్ తీగపైనో వాలి కాస్త విశ్రాంతి తీసుకుంటాయి. గోడకు వేలాడదీసిన అద్దంలో ప్రతిబింబం చూసి ముక్కుతో పదే పదే పొడుస్తాయి. కానీ ఇప్పుడు ఊరపిచ్చుకల సందడి తక్కువైంది. గ్రామీణ చిత్రపటం నుంచి మెల్లగా అవి కనుమరుగవుతున్నాయి. చాలా పక్షుల మాదిరిగానే ఇవీ అంతరించే ప్రమాదం ఉంది. ఊరపిచ్చుకల జనాభా తగ్గడానికి అనేక కారణాలున్నాయి. పెరుగుతున్న జనాభావల్ల ఇళ్లు ఇరుకుగా మారుతున్నాయి. ఇళ్ల ముందు ఖాళీ స్థలం ఉండటం లేదు. గూణ ఇండ్లస్థానంలో కాంక్రీట్ స్లాబ్ ఇండ్లు వచ్చేశాయి. గూణ ఇండ్ల చూరు పిచ్చుకల గూడు నిర్మాణానికి అనువుగా ఉండేవి. స్లాబ్ ఇళ్ళల్లో పిచ్చుకల నివాసానికి స్థానం లేదు. మట్టి ప్రహరీగోడల వెంబడి కూడా అవి గూళ్లు కట్టుకునేవి.

ప్రతి ఇంటిలో చేదబావి ఉండేది. చేదబావి సొరికల్లోనూ గూడుకట్టుకునేవి. బావి తవ్వేటప్పుడు కూలీలు పైకి కిందికి దిగడానికి కాళ్ల పట్టుకోసం అక్కడక్కడా కొంచెం లోతుగా తవ్వేవారు. పిచ్చుకలు వాటిని గూళ్లుగా మార్చుకునేవి. ఇప్పుడు వాటి స్థానంలో గొట్టం బావులు వచ్చాయి. ఇలా వాటి స్థావరాలు ధ్వంసం కావడంతో నిలువనీడ లేకుండా పోయింది. అధిక దిగుబడి కోసం రైతులు విపరీతమైన పురుగుమందులను పంటపొలాలపై చల్లుతున్నారు. దీనివల్ల కూడా పిచ్చుకలు కనుమరుగవుతున్నాయి. ఊరూరా వెలసిన సెల్‌ఫోన్ టవర్ల నుంచి వెలువడుతున్న రేడియేషన్ కూడా పిచ్చుకల పాలిట శాపంగా మారింది. పట్టణాలలో అపార్ట్‌మెంట్ సంస్కృతి పెరిగిపోవడం, చెట్లను నరికివేయడం వల్ల ఊరపిచ్చుకలకు ఆహార భద్రత కరువైంది. పాలిథిన్ సంచులలో, డబ్బాల్లో, ధాన్యాన్ని నిలువచేయడం లాంటివి కూడా పక్షుల పతనానికి కారణమవుతున్నాయి.

ఊరపిచ్చుకలు ఉంటే ఊర్లు పచ్చగా ఉంటాయని రైతులు నమ్మేవారు. అందుకే పిచ్చుకలను జీవ సూచికలుగా వాడతారు. అప్పట్లో వరి కంకులను కోసి ఇంటి చూరుకు తగిలించేవారు రైతులు. ఊరబిస్కలు వాటిపై వాలి, మెల్ల మెల్లగా రోజుల తరబడి ఆహారం తీసుకునేవి. అవి గింజలను తన బలమైన ముక్కుతో తింటూ ఉంటే పిల్లలు, పెద్దలు చూసి ఆనందించేవారు. పాలిచ్చే తల్లులు మారం చేస్తున్న పిల్లలకు వాటిని చూపిస్తూ అన్నం తినిపించేవారు. నేడు ఆ దృశ్యాలు అదృశ్యమయ్యాయి. గూడు చెదిరిపోయి, నిలువనీడలేని నిర్వాసితులయ్యాయి ఊరపిచ్చుకలు. ఈ వేగవంతమైన యాంత్రిక జీవితాల్లో వాటి గోడును, గూడును పట్టించుకునే వారెవ్వరు? వాటిని ఆదుకునే వారెవ్వరు? ఊరపిచ్చుకల జనాభా తగ్గటం పట్ల పక్షి ప్రేమికులు, శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు ఆధునిక నాగరికత పుణ్యమాని పల్లెల్లోనూ పాతతరం ఇళ్లు కనుమరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలో పిచ్చుకలకు ఆహారం లభించడం లేదు. మరోవైపు సెల్ టవర్లను ఇష్టానుసారం ఏర్పాటు చేయడంతో పక్షులు బతికే వీలు లేకుండా పోతోంది. సెల్‌టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ ప్రభావం వీటి పాలిట శాపమైంది. పరిమితికి మించి ఎలక్ట్రో మేగ్నటిక్ రేడియేషన్ తరంగాలు సెల్ టవర్ల నుంచి వెలువడుతున్నందున పిచ్చుకల్లో నాడీ వ్యవస్థను, గాలిలో ఎగిరే సామర్థాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ఈ టవర్ల సమీపంలో గూళ్లను వదిలి, పిచ్చుకలు కనిపించకుండాపోతున్నాయి. సాధారణంగా 10 నుంచి 14 రోజుల్లోపు పిచ్చుక గుడ్ల నుంచి పిల్లలు బయటకు వస్తాయి. అయితై, సెల్ టవర్ల చు ట్టుపక్కల గూళ్లలో నెలరోజులు గడిచినా గు డ్లు అలాగే ఉంటున్నాయని శాస్తజ్ఞ్రులు గు ర్తించారు. అలాగే, గడ్డితో నిండిన ఆరుబయ లు స్థలాలు లేకపోవడం, తోటలపై రసాయనాల వినియోగం, వాతావరణంలో వేడి పెరగడం, పూరిళ్లకు బదులు పల్లెల్లోనూ కాంక్రీ టు వనాలు వెలుస్తుండడం వంటి పరిణామాలతో పిచ్చుకల మనుగడ ప్రశ్నార్థకమైంది.

పిచ్చుకల జాతిని పరిరక్షించాలనే సంకల్పతో ఏటా మార్చి 20వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ‘అంతర్జాతీయ పిచ్చుకల దినం’ పాటిస్తున్నారు. 2010లో ఈ సాంప్రదాయం ప్రారంభమైంది. వీటి మనుగడ కోసం తగు చర్యలు చేపట్టాలని వివిధ దేశాల్లో స్వచ్ఛంద సంస్థలు, విద్యాలయాలు, పర్యావరణ సంస్థలు ఉత్సవాలను జరుపుతున్నాయ. వీటిపై జనచైతన్యం కోసం www. worldsparrowday.org ఫేరిట ఒక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. నేచర్ ఫరెవర్ సొసైటీ.. సేవ్ అవర్ స్పారోస్ (మన పిచ్చుకులను పరిరక్షించండి) పేరిట ఒక ప్రాజెక్టును ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆసక్తి కలిగిన పౌరులకు, సంస్థలకు బర్డ్ ఫీడర్లు అందజేయాలని సంకల్పించింది. వాటిని ఉచితంగా అందించాలని నిర్ణయించింది. వాటిని ఇంటి బాల్కనీలలో ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రపంచ ఊర పిచ్చుకల రోజును పురస్కరించుకొని, పక్షి ప్రేమికులు, పర్యావరణ అభిమానులు అందరూ ఊరపిచ్చుకల పరిరక్షణకు నడుంకట్టాలి. బర్డ్స్ నెస్ట్స్ (పక్షి గూళ్లు) కర్రతో చేసిన డబ్బాలాంటి గూళ్లను బాల్కనీలో వేలాడదీయాలి. కొద్ది రోజుల తర్వాత అవి మెల్లగా వాటిని గూడుగా మార్చుకుంటాయి. ఎండకాలంలో నీరు, ధాన్యం గింజలను సమకూర్చితే చాలు. పిచ్చుకల సందడి మళ్లీ మొదలవుతుంది. ప్రయత్నిద్దాం. తిరగి ఊర పిచ్చుకలతో స్నేహం చేద్దాం.
( Sources : Andhrabhoomi and namasthetelangana )

Monday, March 19, 2012

ఎండాకాలంలో ఆరోగ్యం కాపాడుకోవడం ఎలాగో తెలుసుకుందాం....ఎండాకాలంలో వడదెబ్బ చాలా ప్రమాదకరమైన ఆరోగ్య సమస్య. మద్యం తాగేవారిలో, వయసు మళ్లిన వారిలో ఈ సమస్య ఎక్కువగా రావొచ్చు. ఎండల్లో ఎక్కువగా తిరగడం వల్ల ఈ సమస్య వస్తుంది. వడదెబ్బ వచ్చిన వ్యక్తికి శరీరం ఎర్రగా, వేడిగా, పొడిగా ఉంటుంది. చెమటపట్టదు. చివరికి చంకలు కూడా తడిగా ఉండవు. శరీర ఉష్ణోగ్రత 110 డిగ్రీల ఫారన్‌ హీట్‌ వరకు పెరిగే అవకాశముంది. శ్వాసపీల్చడం పెరుగుతుంది. గుండె కొట్టుకునే వేగం అధికమవుతుంది. రక్తపోటు ఎక్కువైతుంది. కొందరు స్పృహ కూడా తప్పొచ్చు. వడదెబ్బ వచ్చిన వ్యక్తికి వెంటనే చికిత్స మొదలు పెట్టాలి. ఆలస్యమైతే మెదడు దెబ్బతినొచ్చు.మరణం సంభవించొచ్చు. గంటలో ఉష్ణోగ్రత బాగా తగ్గించే చర్యలు తీసుకోవాలి. వడదెబ్బ లక్షణాలు కలిగిన వ్యక్తిని వెంటనే నీడలోకి తీసుకెళ్లాలి. బట్టలు బాగా వదులు చేయాలి. తడి బట్టతో శరీరాన్ని చుట్టాలి. ఫ్యాన్‌ దగ్గర పడుకోబెట్టాలి. ఫ్యాన్‌లేకపోతే విసనకర్రతో విసరాలి. చల్లనీరు తాగించాలి. ఈ చికిత్స తర్వాత అవసరమనిపిస్తే ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

అలసటతో తగ్గే రక్తపోటు

ఎండల్లో ఎక్కువగా పనిచేయడం వల్ల నీరసం, అలసట కలుగుతుంది. వీరిలో చెమట ఎక్కువ పడుతుంది. రక్తపోటు తగ్గుతుంది. నాడీబలహీనంగా ఉంటుంది. ఈ లక్షణాలు గలవారిని వెంటనే చల్లని ప్రదేశానికి తీసుకెళ్లాలి. తలకంటే కాళ్లు ఎత్తుగా ఉండేట్టు పడుకోబెట్టాలి. కాళ్లు, చేతులు బాగా రుద్దాలి. ఒక లీటరు నీళ్లలో ఒకటే స్పూను ఉప్పు కలిపి కొంచెం కొంచెం తరచుగా పెట్టాలి. అపస్మారక స్థితి ఉంటే, ఎలాంటి ఆహారం ఇవ్వకుండా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. వీరు ఎక్కువ రోజులు అదనంగా ఉప్పు వాడాలి.

కండరాల నొప్పులు

ఎండాకాలం శరీరంలో లవణాల శాతం తగ్గిపోవడం వల్ల కండరాల నొప్పులు వస్తాయి. ఎక్కువగా ఎండల్లో పనిచేస్తూ, చాలా ఎక్కువగా నీరు తాగే వారిలో ఈ సమస్య రావొచ్చు. పనివేళల్లో సాయంత్రపూట ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. వీరికి ఒక లీటరు నీళ్లలో ఒక టీ స్పూను ఉప్పుకలిపి కొంచెం-కొంచెం తరచూ పట్టాలి. ఉప్పు కలిపిన నీటితో వీరికి తొందరగా ఉపశమనం కలుగుతుంది. ప్రథమ చికిత్స తర్వాత అవసరమనుకుంటే ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

చెమటకాయలు

ఎండల్లో కొందరికి చెమట కాయలు రావొచ్చు. ఇలాంటి వారుదురద లేకుండా 'కెలడ్రిల్‌' పూత మందు వాడవచ్చు. ఎక్కువ భాగం చల్లటి ప్రదేశాలలో ఉండాలి. నూలుబట్టలు ధరించాలి. చెమట ఎక్కువగా కలిగించే వేపుడు పదార్థాలు, మద్యపానానికి దూరంగా ఉండాలి.

ఎండాకాలంలో గ్లూకోజు ?

ఎండాకాలంలో చాలా మంది చల్లదనం వస్తుందని గ్లూకోజు నీటిలో కలిపి తాగుతుంటారు. ఇది అశాస్త్రీయం. గ్లూకోజుకు ఎండలకు ఎలాంటి సంబంధం లేదు. గ్లూకోజు కూడా ఇతర పిండి పదార్థాల్లాగానే ఒక పిండి పదార్థం. గ్లూకోజు శరీరానికి చల్లదనం ఇవ్వదు.

నీటికాలుష్య రోగాలు

ఎండాకాలం బావుల్లో, తాగునీటి వనరుల్లో నీరు ఇంకి కలుషితం అవుతుంది. ఇందు వల్ల నీళ్ల విరేచనాలు, చీము రక్త విరేచనాలు, కలరా, టైఫాయిడ్‌, అమీబియాసిస్‌, కొన్ని రకాల పచ్చకామెర్లు, నుళిపురుగుల వ్యాధులు, పోలియో వ్యాధి రావొచ్చు. నీళ్లు బాగా మరగకాచి, చల్లార్చి తాగితే ఈ వ్యాధులు నిరోధించొచ్చు.

ఆరోగ్యంగా ఉండటానికి....

* ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వీలైతే ఎండలో తిరగరాదు.

* నూలు, వదులు బట్టలు ధరించాలి.

* బయటికి వెళ్లినప్పుడు టోపి పెట్టుకోవాలి.

* మంచినీరు ఎక్కువగా తాగాలి.

* సాధారణ నీటితో తరచూ స్నానం చేయాలి.

* రోజూ వాడే ఉప్పుకంటే అదనంగా ఉప్పు వాడాలి.

కాచి చల్లార్చిన నీళు ్లతాగాలి

అందరూ ఆరోగ్యంగా ఉండాటానికి మంచినీరు అన్నిటికంటే ఎక్కువ పాత్ర నిర్వహిస్తుంది. రక్షిత మంచిన నీరు అందరికీ అందించడం ప్రభుత్వం చేయాల్సిన మొదటి బాధ్యత. ఇక్కడ మన ప్రభుత్వాలు దాదాపు ఫెయిలైనట్లే. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాలా ప్రకారం నీరు-పారిశుధ్యలోపాల వల్ల మన దేశంలో ఏటా 78 లక్షల మంది చనిపోతున్నారు. దీన్ని గురించి ఏడస్తూ కూర్చోకుండా, వ్యక్తులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. మనలో చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేస్తారు. నీరు వేడి చేసినప్పుడు సూక్ష్మజీవులు చనిపోతాయి. అంటే ఆ నీరు శుభ్రమైన నీరు. అశుభ్రమైన నీటితో స్నానం చేస్తాం. వేడి నీటితో స్నానం చేస్తే శరీరానికి ఆట్టే ప్రయోజనం లేదు. వేడి నీటితో స్నానం చేయడానికి ఎక్కువ నీరు కావాలి. ఎక్కువ ఇంధనం కావాలి. ఎక్కువ సమయం పడుతుంది. వేడి నీటి స్నానం వల్ల కాలం, ఇంధనం, డబ్బు వృధా అవుతుంది. మనలో చాలా మంది మనకు సాధారణంగా లభించే నీటిని ఏ చర్యలు చేయకుండా తాగుతాం. మనం తాగే నీటిలో వ్యాధులు కలిగించే ఎన్నోరకాల సూక్ష్మజీవులుంటాయి. అంటే మనం కలుషిత నీరు తాగుతున్నామన్నమాట. ఇందువల్ల నీళ్ల విరేచనాలు, చీము-రక్తవిరేచనాలు, కలరా, టైఫాయిడ్‌, అమీబియాసిస్‌, కొన్ని రకాల పచ్చకామెర్లు, నుళిపురుగుల వ్యాధులు, పోలియో రావొచ్చు. నీళ్లు బాగా కాచి, చల్లార్చి తాగితే ఈ వ్యాధులు రావు. నీరు మరిగేటప్పటి నుండి 15 నిమిషాలు కాచాలి. ఏ పాత్రలో కాచుతారో అదే పాత్రలో చల్లారనీయాలి. తాగటానికి స్నానం కంటే తక్కువ కావాలి. తాగేనీరు కాచటానికి తక్కువ సమయం పడుతుంది. ఆరోగ్యమూ వస్తుంది. వెరసి మనం పరిశుభ్రమైన నీరు స్నానం చేయడానికి, అపరిశుభ్రమైన నీరు తాగడానికి వాడి జబ్బులు, మరణాలు, తెచ్చుకుంటున్నాం. కాలం, ఇంధనం, డబ్బు వృధా చేస్తున్నాం. ఈ పద్ధతి మార్చుకుంటే ఆరోగ్యం, ఇంధనం మిగులు, డబ్బు మనకు వచ్చే లాభాలు. వెంటనే ఇప్పుడున్న పద్ధతులు రివర్స్‌ చేసుకోండి. తాగటానికి బాగా కాచి చల్లార్చిన నీరు, స్నానానికి మామూలుగా లభించే నీరు. ఈ ఎండాకాంలోనే ఈ మార్పుకు శ్రీకారం చుట్టాలి.

డాక్టర్‌ ఆరవీటి రామయోగయ్య

ఆర్గనైజేషన్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ సోషల్‌ డైమెన్షన్స్‌ ఆఫ్‌ హెల్త్‌

హైదరాబాద్‌.
( Courtesy: Prajasakthi)

Sunday, March 18, 2012

ముగిసిన ఉప ఎన్నికల పోలింగ్ : కోవూరులో 80 శాతం

రాష్ర్టంలో ఏడు నియోజక వర్గాలకు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ సాయంత్రం ఐదు గంటలకు వరకు పోలింగ్ కొనసాగింది. ఐదు గంటలలోపు వరుసలో నించుకున్న వారికి ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు. ఏడు స్థానాల్లోనూ భారీగా పోలింగ్ నమోదయినట్టు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజక వర్గంలో అత్యధికంగా 80 శాతం పోలింగ్ నమోదయినట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. సాయంత్రం 5 గంటలకు నమోదయిన పోలింగ్ శాతం ఈ విధంగా ఉంది.

నాగర్ కర్నూలు-65
మహబూబ్ నగర్-70
కొల్లాపూర్- 61
కామారెడ్డి-68
స్టేషన్ ఘన్ పూర్-64
కోవూరు-80
ఆదిలాబాద్-61
పోలింగ్ ప్రక్రియ పూర్తవడంతో ఇక టీవీల్లో ఎవరుగెలుస్తారనే సర్వేలూ, పందెంరాయుళ్ళ బెట్టింగులూ జోరందుకోనున్నాయి

Saturday, March 17, 2012

వార్షిక పరీక్షల్లో నెగ్గేదెలాటెన్త్ పరీక్షల వెనువెంటనే స్కూల్ ఎగ్జామ్స్ అన్ని క్యూ కడతాయి. టెన్త్ పరీక్షలకు పిల్లలు ఎంత టెన్షన్ పడతారో ఇతర పరీక్షలకూ అంతే హైరానా పడతారు. దీనిని చూసి తల్లిదండ్రులు కలవరం చెందుతారు. స్కూల్ మేనేజ్‌మెంట్స్, టీచర్ల హడావిడి సరేసరి. వార్షిక పరీక్షలతో ముడిపడిన అందరూ ఎలా రిలీఫ్ పొందాలో కొన్ని సూచనలు ఈవారం.

-పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ విద్యార్థులు ఒక్కసారిగా చదివే సమయాన్ని పెంచుతూ ఉంటారు. స్కూల్లో ఉపాధ్యాయులు, ఇంట్లో తల్లిదండ్రులు అసలే టెన్షన్‌లో ఉండే పిల్లలను మరింతగా చదవాలని పదే పదే చెబుతూంటారు. అదే పనిగా నిద్రాహారాలు మాని చదువుతూ ఉండడం వల్ల తీరా పరీక్షలు ప్రారంభమయ్యే సమయానికి అనారోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయి. పైగా తను ఏకభిగిన చదవడం వల్ల పలు అంశాల్లో విస్తృతికి లోనై అవి ఎంత గుర్తు చేసుకున్నా గుర్తురావు. అప్పుడు కూడా తల్లిదండ్రులు దీన్ని ‘మతి మరుపు’ వ్యాధిగా నిర్ధారించి వైద్యం కోసం, టానిక్‌ల కోసం పరుగులు తీస్తుంటారు.

-తమ సబ్జెక్టులో విద్యార్థులు ఎక్కువ శాతం మార్కులు సాధించాలని ఉపాధ్యాయులు, తమ పిల్లలు ఫస్ట్ రావాలని పేరెంట్స్ అనుకోవడం సహజం. అయితే వారు విద్యార్థులను లక్ష్యానుగుణంగా సిద్ధపరిచేటప్పుడు మాత్రం అసహజంగా ప్రవర్తించకూడదు. స్కూల్‌లో గడిపే 6 గంటలకు అదనంగా ఇంట్లో మరో 5 లేక 6 గంటలకు మించి విద్యార్థులు చదవలేరన్న సంగతి గ్రహించాలి. అలాగే విద్యార్థులు కూడా తమ పేరెంట్స్, టీచర్స్ అప్పుడప్పుడు కొన్ని కఠినమైన లక్ష్యాలు ఇచ్చినా కూడా వెంటనే ‘అది నేను చేయలేను’ అని అనుకోకుండా తమ ప్రయత్నం తాము చేయాలి.

g-srinivasulu-ఇక పరీక్షల్లో కొందరు విద్యార్థులు నిర్ణీత ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాసి ఊరుకుంటారు. గణితంలో మొత్తం 24 ప్రశ్నలకుగాను 14 ప్రశ్నలు మాత్రమే కచ్చితంగా రాయడం వల్ల 35 మార్కులకు 35 మార్కులు పొందవచ్చని వారు భావిస్తారు. అందులో ఏదో ఒక సమాధానంలో ఊహించని విధంగా పొరపాటు జరిగితే రావాల్సిన గరిష్ట మార్కులు రావు. అందుకే సమయం మిగిలినట్లయితే ఒక్కో సెక్షన్‌లో అదనంగా ఒక ప్రశ్నకు సమాధానం రాయడం వల్ల ఎగ్జామినర్ తక్కువ మార్కులు వేసిన సమాధానాన్ని వదిలేసి, ఎక్కువ మార్కులు వేసిన సమాధానాన్ని పరిగణించే అవకాశం ఉంటుంది. తద్వారా గరిష్ట మార్కులు పొందవచ్చు.

-అలాగే, కొందరు విద్యార్థులు ప్రశ్నలకు వరుసగా సమాధానాలు రాస్తూ వెళతారు. వరుస తప్పితే ఏమవుతుందో అనుకుంటారు. అలాంటిదేమీ ఉండదు. ఈ విషయంలో ఎగ్జామినర్ ఎలాంటి అసౌకర్యానికీ గురయ్యే అవకాశం ఉండదు. అయితే, విద్యార్థులు తాము బాగా రాయగలమని అనుకున్న ప్రశ్నలను ముందే ‘టిక్’ చేసుకుని, వాటి నెంబర్లు సరిగ్గా వేసి సమాధానాలు రాయడం వల్ల అధిక ప్రయోజనం ఉంటుంది. రాయాల్సిన 14 ప్రశ్నలలో మీరు ప్రశ్నలు పర్‌ఫెక్ట్‌గా రాయగలిగితే అవి ఎక్కడున్నా వాటినే ముందుగా ప్రజెంట్ చేయడం వల్ల ఎగ్జామినర్‌కు మీపై మంచి అభ్రిపాయం (good impression) కలుగుతుంది. ఈ ప్రభావం మిగిలిన 6 ప్రశ్నలు వ్యాల్యూ చేసేటప్పుడు పని చేసి, వాటిలో కూడా మీకు మాగ్జిమమ్ మార్కులు వచ్చే అవకాశముంటుంది.

-ప్రశ్నలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం, ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయకపోవడానికి దారితీస్తుంది. ఉదాహరణకు పదో తరగతి తెలుగులోని ‘మాతృవేదన’ పాఠ్యాంశంలో ‘విధికృతము గడవ నేరగ లావె’ అనే సందర్భ సహిత వ్యాఖ్య ఉంది. ‘ప్రవరుని స్వగతం’ పాఠ్యాంశంలో ఇలాంటిదే ‘దైవ కృతమున కిల నసాధ్యంబు గలదే’ అనే మరో సందర్భ సహిత వ్యాఖ్య ఉంది. ఈ రెండింటి సమాధానాలు మాత్రం ఒకటి కావు. ఇలాంటి సందర్భంలో విద్యార్థులు ఒక ప్రశ్న సమాధానాన్ని ఇంకో ప్రశ్నకు రాసే ప్రమాదముంది. అదే విధంగా, జాతీయాల వివ రణకు, జాతీయాలను సొంత వాక్యాల్లో ప్రయోగించడానికి గల తేడాను కూడా విద్యార్థులు గమనించడం లేదు. అందుకే ప్రశ్నలను ప్రశాంతంగా చదివి అర్థం చేసుకున్న తర్వాతనే సమాధానం రాయడానికి ఉపక్రమించాలి.

-విద్యార్థులు ఒక్కోసారి సమాధానాన్ని మధ్యలో ఆపేస్తుంటారు. వాక్యం మధ్యలోనో, గణితంలో అయితే స్టెప్ మధ్యలోనో ఇలా ఆపి వదిలేస్తారు. ఇది ఎగ్జామినర్‌కు తప్పుడు సంకేతాలను ఇస్తుంది. బహుళా విద్యార్థి ‘కాపీ’ కొట్టాడేమోనని వారు నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది.

-గణితంలో అప్పుడప్పుడు విద్యార్థులు సమాధానాలు రాసేటప్పుడు డైరెక్ట్ స్టెప్స్ వేస్తుంటారు. 5 స్టెప్పుల్లో ఉండాల్సిన సాధన 3 స్టెప్పులకు పరిమితం కావడం వల్ల తార్కిక క్రమం తప్పుతుంది. ఇది గమనించిన ఎగ్జామి నర్స్ మార్కులను తగ్గించేస్తారు. అదే విధంగా 5 స్టెప్పుల సమస్యను అనవసరంగా పెంచి 7, స్టెప్స్ రాయడం కూడా క్రమం తప్పడమే అవుతుంది. కాబట్టి విద్యార్థులు ఇది గమనించి నిర్దిష్టమైనన్ని స్టెప్స్ మాత్రమే రాసి సమాధానాన్ని ప్రజెంట్ చేస్తే పూర్తి మార్కులు పొందే అవకాశం ఉంటుంది.

-గణితంలో విద్యార్థులు చేసే మరో పొరపాటు కాలుక్యులేషన్స్ కనబడకుండా సమాధానాలు రాయడం. తాము సమాధానాలు రాసే పేజీలోనే కుడి వైపునకు మార్జిన్‌లో రఫ్ వర్క్ చేసుకోవాలి. అందులో ఆ సమస్యకు సంబంధించిన చిన్న చిన్న గణనలు నమోదు చేయడం ద్వారా ఈ సాధన ఎగ్జామినర్‌కు సహజంగా తోస్తుంది. లేదంటే స్టెప్స్ అన్నీ మీరు బట్టీ పట్టారనో లేదా చూసి రాశారనో భావించి, మార్కులు తగ్గించే అవకాశం ఉంది. మీరు చేసిన వర్క్‌కు ‘రఫ్ వర్క్’ ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుందనే విషయం విద్యార్థులు ఎప్పుడూ మరిచిపోకూడదు.

ఇలా చేయండి !
అదే పనిగా నిద్రాహారాలు లేకుండా చదవడం ఆపి, మీరు చదివగలిగినంత సేపు చదివి విశ్రాంతి తీసుకుంటూ ఉండండి.
-హార్డ్ అనుకునే సబ్జెక్ట్ అయినా ఓపిగ్గా ప్రతి రోజూ కాసేపు చదివి క్రమంగా ఒంటపట్టించుకోండి.
-ప్రశ్నలు జాగ్రత్తగా చదివి అర్థం చేసుకుని దానికి సరిపోయే సమాధానాన్ని రాయండి.
-బాగా తెలిసిన సమాధానాలను ముందుగా ప్రజెంట్ చేయండి.
-దీర్ఘ సమాధాన ప్రశ్నను స్వల్ప సమాధాన ప్రశ్నగా అడిగినప్పుడు మీ సమాధానంలోని ప్రధానమైన వ్యాల్యూ పాయింట్లు రెండింటిని మాత్రమే రాయండి.
-సమాధానాన్ని మధ్యలో నుంచి ప్రారంభించడంగానీ, రాసే సమాధానాన్ని హఠాత్తుగా మధ్యలో ఆపడంగానీ చేయకండి.
-ప్రశ్నలు రాయడానికి సమయం వృథా చేసుకోకుండా ప్రశ్న నంబర్ వేసి సమాధానాలు రాయండి.
-సమాధానాన్ని తార్కిక క్రమంలో ప్రజెంట్ చేయండి.
-గణితంలో ‘రఫ్ వర్క్’ను తప్పనిసరిగా మార్జిన్‌లో చేయండి.

- వ్యాసకర్త ః అక్నాపూర్
జిల్లా పరిషత్ హైస్కూల్ హెడ్‌మాస్టర్.( From Namasthetelangana NewsPaper)

మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న మన జీవనవిధానాలు

మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న మన జీవనవిధానాలు
1.నడక తగ్గిపోవడం,కాలు బయటపెడితె ద్విచక్రవహనం వినియోగం.
2.కూర్చునిచేసే ఉద్యోగాలు.
3.యాంత్రిక జీవనవిధానం:బట్టలు ఉతకక్కరలేకుండా వాషింగ్ మెషిన్,బూజులు దులపటానికి వక్యూం క్లీనర్స్
4.టి.వి.చూస్తున్నపుడు కూడా లేవక్కరలేకుండా రిమోట్
5.ఈరోజుల్లో అన్ని వస్తువులు ఒకేచోటా దొరికే సదుపాయం ఉదా:-సూపర్ మార్కెట్స్,ఇంటర్ నెట్ షాపింగ్,ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు.మన ఇంట్లొకే సామానులు వస్తాయి.మన పూర్వీకులు ఒకరోజు గడపడానికి చాలా శక్తిని ఖర్చుచేసేవారు.కాని ఇప్పుడు భోజనం కావాలంటె వంట చేయనవసరం లేదు.ప్రతి పదార్థం రెడీమేడ్ గా దొరుకుతుంది.కూర్చున్నచోటునుండి పనులు చేసుకోవచ్చు.మనం ఉన్న పరిస్థితులే మన ఆనారోగ్యానికి కారణం.దీనివల్ల వచ్చే పరిణామం స్థూలకాయం.కొవ్వు ఎక్కువగా పేరుకుపోయి స్థూలకాయం ఏర్పడుతుంది.
Posted by NANDA YARRACHOWDU
originalPost: http://nandayarrachowdu.blogspot.in/2010/02/blog-post_31.html

Friday, March 16, 2012

సచిన్ వందో సెంచరీ కొట్టాడోచ్ !!


అంతర్జాతీయ క్రికెట్ లో సచిన్ చరిత్ర సృష్టించాడు. ఏడాదిగా ఎదురు చూస్తున్న వందవ సెంచరీ కొట్టాడు. ఆసియా కప్‌లో భాగంగా భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య ఇక్కడ జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో సచిన్ సెంచరీ కొట్టాడు. ఉత్కంఠగా ఎదురు చూసిన అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు. 33 ఇన్నింగ్స్ తరువాత ఈ సెంచరీ కొట్టాడు.
టెస్ట్ లో 51 సెంచరీలు చేసిన సచిన్ వన్డేల్లో 49 సెంచరీలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో వంద సెంచరీలు చేసిన ఒకేఒక్కడుగా సచిన్ నిలిచాడు. సచిన్188 టెస్ట్ మ్యాచ్ లు, 462 వన్డే మ్యాచ్ లు ఆడాడు. అన్ని టెస్ట్ దేశాలపైన సెంచరీ చేశాడు. ఒన్డేల్లో అన్ని టీమ్ లపై సెంచరీలు చేసిన ఘనత దక్కించుకున్నాడు.ఆస్ట్రేలియాపై అత్యధికంగా 8 సెంచరీలు చేశాడు. 1990 ఆగస్ట్ 14న సచిన్ ఇంగ్లండ్ పై తొలి సెంచరీ చేశాడు.

ఉప ఎన్నికల ప్రచారానికి నేడు తెర- కోవూరులో ధన ప్రవాహం


రాష్ట్రంలో ఉప ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెరపడనుంది. రాష్ట్రంలోని ఏడు స్థానాలకు ఈ నెల 18న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లా కోవూరును మినహాయిస్తే.. మిగిలిన ఆరు స్థానాలు తెలంగాణ ప్రాంతంలోనివి. ఇప్పటివరకు ఈ స్థానాల్లో ప్రచారం హోరెత్తింది. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలతో ప్రచారహోరుకు బ్రేక్ పడనుంది. కాగా కోవూరు ఉప ఎన్నికను అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలో గెలుపు చాలా ముఖ్యం. కోల్పోయిన స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవడమో లేక YSRకాంగ్రెస్ పార్టీయే తమ పార్టీ కంటే ఆధిపత్యంలో ఉందని ఒప్పుకోవడమో చేయాల్సిన సమయమిది. ఈ ఎన్నికలో ఏ పార్టీ గెలిసినా మిగతా రెండు పార్టీలపై ప్రభావం తప్పకుండా ఉంటుంది.
ఇప్పటికి పూర్తయిన అన్ని సర్వేలూ YSRకాంగ్రెస్ కే అనుకూలమని చెప్పడంతో TDP,కాంగ్రెస్ లలో గుబులు మొదలైంది. దీంతో పోలింగ్ గడువు దగ్గర పడటంతో ప్రలోభాల జాతరకు రాజకీయ నాయకులు తెర తీశారు. గత రెండురోజుల నుంచి ఈ క్రమం ఊపందుకోవడం గమనార్హం. ప్రధాన అభ్యర్థులంతా ఒక్కో ఓటుకు వెయ్యి నుంచి మూడు వేల రూపాయలు పంపిణీ చేసే పనిలో ఉన్నారు. ఉప ఎన్నిక బరిలో మొత్తం 14 మంది పోటీ పడుతుండగా ప్రధాన పోటీ టిడిపి, వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ మధ్యనే కేంద్రీకృతమై ఉంది. గెలుపుధీమాతో ఉన్న ఓ పార్టీకి డబ్బుకు కొదవ లేదని, భారీ స్థాయిలో డబ్బు పంచుతారని ఓటర్లు ఎదురుచూస్తుంటే రెండువందల రూపాయల వంతున మాత్రమే పంపిణీ చేశారు. మరో అభ్యర్థి మూడొందల రూపాయలు, పురుష ఓటర్లైతే అదనంగా రెండు క్వార్టర్ మద్యం సీసాలు సరఫరా చేయసాగారు. ఇక గెలుపోటముల నడుమ ఊగిసలాడుతున్న ఇంకో అభ్యర్థి ఏకంగా వెయ్యి రూపాయల వంతున అందించడానికి శ్రీకారం చుట్టారు. స్వల్ప తేడాతోనైనా పరిస్థితి అనుకూలపరచుకోవాలనే పట్టుదలతో ఓటుకు వెయ్యి ఇచ్చేందుకు వెనుకాడటం లేదని తెలుస్తోంది. దీంతో తమదే గెలుపున్న ధీమాతో ఉన్న పార్టీ వర్గీయులు ఆలోచనలో పడ్డారు. ముందు తక్కువగా అందజేసి మరోవిడతగా మిగిలిన సొమ్ము ఇవ్వాలని గెలుపుధీమాతో ఉన్న అభ్యర్థి వర్గీయులు బుచ్చిరెడ్డిపాళెం మండలంలో తొలుత పంపిణీ చేపట్టారు. కేవలం రెండువందల రూపాయలు మాత్రమే అందజేస్తుండటంతో ఓటర్ల నుంచి విముఖత వ్యక్తమైంది. ఈ సందర్భంలో నాయకులు చెప్పిన మాటలు వింత గొలిపాయి. తమ పార్టీ అధినేత స్థానికంగా పర్యటిస్తున్నందున ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకే ఈ మొత్తమని సర్ది చెప్పారు. గెలుపుతథ్యమని, ఈ నియోజకవర్గంలో తమ వాస్తవ సామర్థ్యం తేల్చుకునేందుకే భారీ నజరానాలకు స్వస్తిపలికామంటున్నారు. పోలింగ్ రోజున పనికి వెళ్లకుండా ఓటు వేసేందుకు వస్తున్నందున నష్టపోయే కూలికి ప్రత్యామ్నాయంగా రెండువందల రూపాయలు అందజేస్తున్నట్టు వివరిస్తున్నారు. మత్స్యకారుల నివాసిత ప్రాంతాలైన పట్టపుపాళాల్లో తమ దురాయి (ఓట్లన్నీ ఒకరికే వేసే కట్టుబాటు) ప్రకారం అభ్యర్థుల నుంచి భారీగానే మొత్తాలు స్వీకరించారు. కోవూరు నియోజకవర్గ పరిధిలోని 19 పట్టపుపాళాల్లో 15వేల వరకు మత్స్యకార్ల ఓటింగ్ ఉన్నట్లు లెక్కలు చెపుతున్నాయి. ఒక పట్టపుపాళెంలో జరిగిన దురాయికి సంబంధించిన వివరాలు అనధికారికంగా వెల్లడిస్తున్నారు. అక్కడ ఆరువందల వరకు ఓటింగ్ ఉండగా ఒక పార్టీ అభ్యర్థికి మద్దతిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇందుకుగాను 22లక్షల రూపాయలకుపైగానే ఆ పార్టీ ప్రతినిధులు ముట్టచెప్పారు. ఓటుకు మూడువేల రూపాయల వంతున అందించడంతో సహా పెద్దకాపు ప్రత్యేక ఖర్చులు, మద్యానికి మరికొంత సొమ్ము లెక్కగట్టి ఇస్తుండటం విశేషం

Tuesday, March 13, 2012

ఉత్తరాఖండ్ కాంగ్రెసులో అప్పుడే ముసలం, కేంద్ర మంత్రి రాజీనామా

ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఉత్తరాఖండ్ కాంగ్రెసులో ముసలం బయలుదేరింది. అది యుపిఎ ప్రభుత్వాన్ని తాకింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవిని ఆశించి భంగపడిన కేంద్ర సహాయ మంత్రి హరీష్ రావత్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అందించినట్లు సమాచారం. తనను విస్మరించి, పార్లమెంటు సభ్యుడు విజయ్ బహుగుణను ముఖ్యమంత్రి పదవికి అధిష్టానం ఎంపిక చేయడంపై అసంతృప్తికి గురైన హరీష్ రావత్ రాజీనామా చేశారు.

ముఖ్యమంత్రి ఎవరనేది శాసనసభ్యులు నిర్ణయించుకుంటారని, విజయ్ బహుగణను ముఖ్యమంత్రి పదవికి ఎన్నుకున్నారని కాంగ్రెసు సీనియర్ నేత, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ చెప్పారు. రావత్ రాజీనామా చేశారనే వార్తను ప్రధాని కార్యాలయం తోసిపుచ్చింది. ముఖ్యమంత్రి పదవికి రావత్‌ను విస్మరించడం ఇది రెండోసారి. గతంలో హరీష్ రావత్‌ను తోసిపుచ్చి ఎన్డీ తివారీకి కాంగ్రెసు నాయకత్వం మఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టింది. ఇది ఒత్తిడి రాజకీయమని, దాన్ని పరిష్కరిస్తామని బహుగుణ చెప్పారు.

కుర్రకారు తప్పులకు పెద్దలదే బాధ్యత


ఉదయం నుంచి సాయంత్రం వరకూ తమ పిల్లలు చదువుల్లో బిజీగా వున్నారని సంబరడిపోవటమే కానీ వారేమైనా దురలవాట్లకు లోనవుతున్నారా అని ఆలోచించట్లేదు. దీనికితోడు ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్‌ఫోన్‌లు వుంటాయి. చెడిపోవటానికి సులభమార్గం ఇవేనని వారు గుర్తించటంలేదు. ఇక సెలవుదినాల్లో చెప్పనక్కర్లేదు. సినిమాలు, పార్టీలు, టీవీ చానెళ్లు ఇదీ వారి ప్రపంచం. ముఖ్యంగా పదిహేడు సంవత్సరాలు దాటినవారి సంగతి చెప్పనక్కర్లేదు. నూటికి డెబ్భై శాతం మంది పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు.

ఈ-మెయిల్‌లు, ఎస్సెమ్మెస్‌లు, ఫేస్‌బుక్స్, పార్టీలు, ఫ్రెండ్స్, పెద్దవాళ్లు చెప్పింది వినకపోవటం, ఎదురు సమాధానాలు చెప్పడం- ఇవి ఈనాటి యువతలో ఎక్కువగా కనిపిస్తున్నాయ. పిల్లలు చిన్నతనంలో తెలియక అల్లరి చేస్తే ఒక అందం, మరి యుక్తవయస్సులో టీనేజ్ పిల్లలు పెద్దల మాట వినకపోతే, వారు మొండిగా తయారై ఎందుకూ పనికిరాకుండాపోతారు. కొందరు ఆకతాయితనంతో చదువుని నిర్లక్ష్యం చేస్తూ వీడియోగేమ్స్, టీవీ చానెల్స్‌తో తమ అమూల్యమైన కాలాన్ని వృథా చేస్తూ, వారి బంగారు భవిష్యత్తును పాడుచేసుకుంటున్నారు. దీనికంతటికీ మూల కారణం ఎవరు? పిల్లలా లేక పెద్దవారా? అని ప్రశ్నిస్తే కచ్చితంగా పెద్దవారే అని చెప్పవచ్చు.
పాశ్చాత్య దేశాలలో తల్లిదండ్రులు పిల్లలను అంతగా పట్టించుకోరని అంటారు. ఎందుకంటే అవన్నీ అభివృద్ధిచెందిన దేశాలు. అక్కడ ప్రతి ఒక్క రూ కష్టపడి పనిచేయాలి. కాబట్టి వారికి పిల్లలను పట్టించుకునే తీరికుండదు. కానీ మన దేశం అలా కాదు. ఇక్కడ సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. కాబట్టే పిల్లల విషయంలో జాగ్రత్త పడుతుంటారు. కానీ నేటి సమాజంలో పిల్లలను సక్రమంగా ఎంతమంది పెంచుతున్నారు? ప్రతిఒక్కరూ తమ కొడుకు గానీ, కూతురు గానీ ఏ సాఫ్ట్‌వేర్ ఇంజనీరో, డాక్టరో అవ్వాలని కోరుకుంటూ సంపాదనలో పడిపోతున్నారే తప్ప వారిని సరైన మార్గంలో పెంచుతున్నామా? లేదా? అని ఆలోచించేవారు లేరు. దీని ఫలితం పిల్లలు, ముఖ్యంగా టీనేజ్ వయసు వారు చెడు మార్గాలను అనుసరిస్తున్నారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకూ తమ పిల్లలు చదువుల్లో బిజీగా వున్నారని సంబరడిపోవటమే కానీ వారేమైనా దురలవాట్లకు లోనవుతున్నారా? అని పెద్దలు ఆలోచించట్లేదు. దీనికితోడు అమ్మాయలైనా, అబ్బాయలైనా ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్‌ఫోన్‌లు వుంటాయి. చెడిపోవటానికి సులభమార్గం ఇవేనని వారు గుర్తించటంలేదు. ఇక సెలవుదినాల్లో చెప్పనక్కర్లేదు. సినిమాలు, పార్టీలు, టీవీ చానెళ్లు... ఇదీ వారి ప్రపంచం. ముఖ్యంగా పదిహేడు సంవత్సరాలు దాటినవారి సంగతి చెప్పనక్కర్లేదు. నూటికి డెబ్భై శాతం మంది పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. తాగుడు, సిగరెట్లు కాల్చడం, బ్లూఫిల్మ్‌లు చూడటం వంటి వ్యసనాలకు బానిసలవుతున్నారు. ఇక కొందరు అమ్మాయిల సంగతి చెప్పనక్కర్లేదు. చిన్నవయసులోనే ప్రేమ పేరుతో అబ్బాయిల వెంబడి తిరుగుతున్నారు. పెద్దవారు ఇవేం పట్టించుకోవటంలేదు. ఇలా చెడు అలవాట్లకు గురయ్యే పిల్లలు ఎవరినీ పట్టించుకోవట్లేదు. తల్లిదండ్రులను లక్ష్యపెట్టడం లేదు. ఇంత జరిగిన తరువాత గానీ పెద్దవాళ్లకు జ్ఞానోదయం కలగదు. ఈ పరిణామాలన్నింటికీ కారణం పెద్దలకూ, పిల్లలకూ మధ్య తగిన అవగాహన లేకపోవటమే. వీరు పిల్లలకు కావలసినంత ప్యాకెట్‌మనీ ఇవ్వడం తప్ప కనీస ప్రేమాభిమానాలను అందించటంలేదు, వారి కదలికలను పట్టించుకోవటంలేదు. ఇంత కష్టపడేది వారికోసమే కదా.. అని సమర్థించుకుంటున్నారు.
సంపాదన మోజులోపడి పెద్దవాళ్లు పిల్లలను పట్టించుకోకపోతే అదివారికే కాదు సమాజానికి కూడా తీరని నష్టం. చెడు అలవాట్లకు బానిసలయినవారు సంఘ విద్రోహులుగా మారుతున్నారు. పిల్లలు చెడిపోతే వారిని బాగు చేసే ప్రయత్నం చేయాలే కానీ, అలా వదిలేస్తే వారు సమాజానికి చీడపురుగుల్లా తయారవుతారు. ఈ సమస్యకు కొంత పరిష్కారం ఉమ్మడి కుటుంబాలు. నేటి ఆధునిక యుగంలో ఇవి చాలా తక్కువగా ఉన్నాయి. పిల్లలను తల్లిదండ్రులు పట్టించుకోకపోయినా కనీసం వారి తాతలు, నాయనమ్మలు, మిగిలినవారు చూస్తారు. దీనివల్ల కొంత మార్పు రావచ్చు. ఇంట్లో అందరూ కలిసిమెలిసి వుండటంవలన పిల్లలకు ప్రేమానురాగాల విలువ తెలుస్తుంది. వారు దారితప్పే అవకాశాలు తక్కువవుతాయి. పెద్దవారంటే వినయం, విధేయతలు పెరుగుతాయి. ఉమ్మడి కుటుంబాల వలన సంప్రదాయాలు, సంస్కృతి మరిచిపోకుండా వుంటారు. ఇంకా విద్యా సంస్థలు కూడా కొంతవరకు కృషి చేయవచ్చు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పిల్లలతో గడిపే ఉపాధ్యాయులకు పిల్లల ప్రవర్తన మీద అవగాహన వుంటుంది. కనీసం వారానికొకసారైనా సమావేశాలు ఏర్పాటు చేసి తల్లిదండ్రులతో పిల్లల గురించి చర్చించాలి. ఇలా చేస్తే ప్రతి ఒక్కరికీ తమ తమ పిల్లల మీద తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశం వుంటుంది. తల్లిదండ్రులకూ, పిల్లలకూ మధ్య ఒక గట్టి బంధం వుందని, అది ఎంత లాగినా సాగుతుందే గానీ ఊడిపోదు అని తెలుసుకోగలగాలి. పిల్లలతో కనీసం రోజుకు ఒక గంటయినా గడపటానికి కేటాయించాలి. వారితో కలిసి భోజనం చేయటం, టీవీ చూడటం, ఇండోర్ గేమ్స్ ఆడుకోవటం, సరదాగా ఎక్కడికైనా వెళ్లడం చేస్తే వారి ప్రవర్తనలో మార్పు వస్తుంది. వారు ఏదైనా తప్పులు చేస్తే నెమ్మదిగా మందలించటానికి ప్రయత్నించాలి. చెడు అలవాట్లు వుంటే ఎలా మార్పించాలో ఆలోచించాలి. వారితో స్నేహితుల్లా మెలగాలి. అపుడే వారు అన్ని విషయాలు పేరెంట్స్‌కు చెప్పగలరు. వారేమన్నా మంచి చేస్తే వారి ముందరే పొగడవద్దు. చెడుచేస్తే మాత్రం మందలించాలి. వారిని క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నించాలి కాని అది మితిమీరకూడదు. ఏదైనా అతిగా వుంటే పిల్లలు తొందరగా చెడిపోతారు. విచ్చలవిడిగా డబ్బు ఇవ్వద్దు. వారు ఖర్చుపెట్టే తీరు గమనిస్తూ వారికి డబ్బువిలువ తెలియజేయండి. పిల్లలకు నీతి, నిజాయితీ, తెలివితేటలు, అందరితో కలిసిమెలసి వుండటం వంటి మంచి లక్షణాలు నేర్పించండి. వారు మీ రూపాలకి ప్రతిబింబాలన్న సంగతి మరచిపోవద్దు. తల్లిదండ్రులూ... మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే వుందన్న సంగతి గుర్తుంచుకోండి. అలాగే, తమ బాధ్యతలను తెలుసుకుని క్రమశిక్షణతో జీవితాన్ని సాగించాలని యువత కూడా అర్థం చేసుకోవాలి.
-సుబ్బలక్ష్మి ( in Andhrabhoomi)

Monday, March 12, 2012

ప్రపంచ దేశాలతో పోల్చితే భారత ఆర్ధిక రంగం మెరుగ్గా ఉంది:రాష్ట్రపతి ప్రతిభాపాటిల్

ప్రపంచ దేశాలతో పోల్చితే భారత ఆర్ధిక రంగం మెరుగ్గా ఉందని రాష్ట్రపతి ప్రతిభాపాటి ల్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తూ ప్రపంచ దేశాలకు 2011 సంవత్సరం ఆర్థికంగా కలిసి రాలేదని, ఆర్థిక అస్తిరత్వం మధ్య ప్రభుత్వం సగం పదివీకాలం పూర్తి చేసిందని ఆమె అన్నారు. నిజాయితీ, పారదర్శకతతో కూడిన మార్గదర్శక పాలన అందిస్తామని ప్రతిభాపాటిల్ తెలిపారు.

త్వరలో 8 నుంచి 9 శాతం ఆర్థిక వృద్దిరేటు సాధిస్తామన్నారు. నల్లధనాన్ని అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నల్లధనం నియంత్రణకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని రాష్ట్రపతి పేర్కొన్నారు. అవినీతి నియంత్రణకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఈ- గవర్నెన్స్ ద్వారా ప్రజా సేవలు మెరుగుపరుస్తామని ఆమె తెలిపారు. వికలాంగుల కోసం ప్రతే ్యక శాఖ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయన్నారు.

మైనార్టీలకు సబ్‌కోటా అమలు చేస్తామని రాష్ట్రపతి తెలిపారు. ఆరోగ్యరంగంలో సిబ్బంది కొరత ఉందని ప్రతిభాపాటిల్ అన్నారు. భారత్‌ను పోలియో రహిత దేశంగా గుర్తించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయం తీసుకుందని ఆమె ప్రకటించారు. డిసెంబర్ 2014 నాటికి దేశవ్యాప్తంగా డిజిటల్ కేబుల్ ప్రసారాలు ప్రారంభమవుతాయని ఆమె తెలిపారు. ప్రజా పంపిణీ విధానాన్ని కంప్యూటరీకరణ చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.

వచ్చే ఐదేళ్లలో యూరియా ఉత్పత్తిలో స్వాలంబన సాధిస్తామన్నారు. రైల్వే ఆధునికీకరణ పనులు వేగవంతం చేస్తామన్నారు. పన్నుల సంస్కరణలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, పన్నుల చెల్లింపుదారుల సమస్యలను పరిష్కరించేందుకు సింగిల్ విండో ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్రపతి తెలిపారు. దేశ వ్యాప్తంగా అన్ని గ్రామపంచాయితీలను బ్రాండ్‌బాండ్ ద్వారా అనుసంధానిస్తామన్నారు.

వచ్చే పదేళ్లలో విద్యుత్ అవసరాలు పెరుగుతాయని అంచనా ఉందని, విద్యుత్ డిమాండ్ ను తట్టుకునేందుకు అదనంగా 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం వల్లే దేశంలో ధరలు పెరిగాయని రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ పేర్కొన్నారు.

ఎన్డీయేలోకి సుబ్రహ్మణ్యస్వామిబీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో మరో పార్టీ చేరింది. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవ ప్రదర్శన నేపథ్యంలో ఎన్డీయే కూటమిని పటిష్ఠపరిచే దిశగా కృషి చేస్తున్న బీజేపీ.. సుబ్రహ్మణ్యస్వామి నేతృత్వంలోని జనతా పార్టీని తమ కూటమిలోకి తీసుకోవాలని నిర్ణయించింది. బీజేపీ అగ్రనేత అద్వానీ నివాసంలో ఆదివారం జరిగిన ఎన్డీయే ఫ్లోర్ లీడర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘మా కూటమిలో చేరేందుకు స్వామి ఆసక్తి కనబరుస్తున్నారు. ఆయన ఎన్డీయే నేతలతో కొన్ని రోజులుగా సంప్రదింపులు జరుపుతున్నారు’ అని బీజేపీ సీనియర్ నేత అహ్లూవాలియా విలేకరులకు తెలిపారు. జనతా పార్టీ రాకతో ఎన్డీయే మిత్రపక్షాల సంఖ్య ఆరుకు చేరింది. ప్రస్తుతం బీజేపీ, జేడీయూ, శిరోమణి అకాలీ దళ్, శివసేన, రాందాస్ అథావాలె రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఉన్నాయి. అయితే ఈ భేటీకి అథావాలె, సుబ్రమణ్యస్వామి హాజరుకాలేదు.

Thursday, March 8, 2012

రంగుల హోలీ


శుభాకాంక్షలతో...

చిత్రకళకు తెలుగు ప్రతీక- దామెర్ల!


గోదావరి తీరాన 1897 మార్చి 8న రాజమండ్రిలో జన్మించిన దామెర్ల రామారావు, ఆధునిక దృష్టితో పెరిగి మహాసౌందర్యాన్ని విరగబూసి తెలుగు వాళ్లకి మరొకటి ఏదీ తోచనీయకుండా చేశారు. గురజాడ కన్యాశుల్కం, గిరజాలజుత్తు, భావకవుల మహా విహారం, తెలుగునాట అన్ని ప్రాంతాలా విప్లవ తిరు గుబాటు జెండాలూ... వీటన్నిటి మధ్యా తెలుగు ఆధునిక చిత్రకళకు దారిచూపెట్టిన నిలువెత్తు కాగడా దామెర్ల.

చిన్నారి సంపెంగ మొగ్గదశ లోనే వెళ్లిపోకపోతే ప్రపంచస్థాయిలోనే తెలుగు చిత్రకళకి ‘లోగో’ ఒకటి స్థాపించి, ఇక కానీండర్రా అనేసి ఉండేవారేమో! ఓ చెంపన చెంపపెట్టు లాగ కలోనియల్ ఆంగ్ల సిల్వర్ పాయింట్ చిత్రాలు, మరోవైపు చైనా, జపాన్ కొండగాలిలాంటి వాష్ ఇంక్ చిత్రకళ బెంగాల్ దాటిరావటం, ఇంకోవైపున ఇటాలియన్, కలోనియల్ మలయాళీ సుందరాంగుల రూపంలో రవివర్మగారి నూనెరంగుల ‘అదనపు ఆకర్షణ’! ఇంకెలాగా? అసలే తెలుగువాళ్ల ఇళ్లకి తలుపులుండవాయె! అందునా చిత్రకళ ఉక్కిరిబిక్కిరయే వేళ! అదిగో అప్పుడొచ్చారు కూల్డ్రే దొరవారు. పాపం బహు దొడ్డవారే! దామెర్ల రామారావనే అర్భక కుర్రవాడి వేళ్లు అరిగేలా డ్రాయింగులు చేయించారాయన.

అజంతా, లేపాక్షి, తోలు బొమ్మలు, కలంకారీ మొదలైన వాటి ఊపిరిపీలుస్తూ ఇటు పూర్తిగా ‘ఆంగ్లసైజు’ కాకుండా డ్రాయింగులు పుట్టించేదెలా? దేశంలో వివిధ ప్రాంతాలు చూసి నేర్చింది, బొంబాయి జేజే ఆర్ట్ కళాశాల పరిచయం చేసిందీ, కూల్డ్రే (క్రమ)శిక్షణ అంతా ఒక భాగమైతే దామెర్ల పరిశీ లనాశక్తి, చదువూ గొప్ప భాగమైంది. అందుకే తెలుగు సిద్ధార్థుడు, తెలుగు అర్జునుడు, తెలుగు ఊర్వశీ దామెర్ల చేతిలో చెప్పిన మాటవిన్నారు. ఇంకా ప్రస్ఫుటంగా నిలువెత్తు అద్భుతాన్ని చిత్రించేసత్తా చేరి మహావృక్షమయ్యే తీరు కనబడేలోగానే ఆధునిక వైద్యం లేక అన్యాయంగా వెళ్లిపోయారు రామారావు.

రవీంద్రనాథ్ టాగూర్ నుంచీ రాజమండ్రిలో సోడాలు అమ్ముకునే కష్టజీవి పిల్ల వరకు దామెర్ల చేసిన ముఖచిత్రాల రేఖలు, రంగులు, వాష్‌లూ అసమాన్యమై నవి. సౌందర్య దృష్టి బలం తప్ప శారీరక బలం లేకపోయిందాయనకు. 1925, ఫిబ్రవరి 6న ఆయన శాశ్వితంగా వెళ్లిపోయాక దేశవిదేశీ పత్రికలన్నీ బావురుమన్నాయి. ఐతే అంత బాధ గల ప్రపంచం ఆయన చిత్రాల్ని పెద్దసైజులో, మంచి రంగుల్లో అచ్చువేసి ప్రచారం చేయలేక పోయింది. దాదాపు 34 ఆయిల్ పెయింటింగ్‌లు, 1,390 వాటర్ కలర్ బొమ్మలు, వందల కొద్దీ స్కెచ్ బుక్‌లు రాజమండ్రిలో ఆయన పేరిట ఏర్పడ్డ ఆర్ట్ గేలరీలో ఉన్నాయి.

తెలుగు అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయం, ఆంధ్రా యూనివర్సిటీ, లలితకళా అకాడమీ పెద్దలు ఇందరుండి మంచి భారీసైజులో దామెర్ల వారి చిత్రాలు అచ్చువేసి కారుచౌక ధరలో జనానికి అందజేయగల పరిస్థితి లేదా? ఇదేనా మన గొప్ప? అని ఈ రోజు దామెర్ల జర్మదినాన తల పట్టుకు కూర్చోవలసివస్తోంది గదూ? చేసింది చాలదు. దామెర్ల ఆర్ట్ గ్యాలరీలో పాడైన, పాడవు తున్న, పాడవబోయే ఆ మహనీయుడి బొమ్మల్ని కాపాడకపోతే... మరుమాట అనవసరం! దామె ర్లకు తలవంచి నమస్కరించడం చేయగలం కదూ!
శివాజీ హైదరాబాద్
(నేడు దామెర్ల రామారావు 115వ జయంతి)
From Sakshi blogs

Friday, March 2, 2012

ఎట్టకేలకు జగన్ ఎమ్మెల్యేలపై అనర్హతవేటు

జగన్ కు మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యేలు 16 మందిని శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనర్హులుగా ప్రకటించారు.
సిబిఐ ఛార్జిషీట్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుని చేర్చడంతో మన:స్తాపం చెందిన వీరు ఆగస్టు 24న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ 17 మంది అవిశ్వాస తీర్మానికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ అంశానికి సంబంధించి సుదీర్ఘంగా జరిగిన డ్రామాకు తెరపడింది.

స్పీకర్ అనర్హులుగా ప్రకటించిన ఎమ్మెల్యేలు:

ఒంగోలు - బాలినేని శ్రీనివాస రెడ్డి
పత్తిపాడు - మేకతోటి సుచరిత
మాచర్ల - పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి
నరసన్నపేట - ధర్మాన కృష్ణదాస్
పాయకరావుపేట - గొల్ల బాబురావు
అనంతపురం - గురునాధరెడ్డి
రాజంపేట - ఆకేపాటి అమరనాథ రెడ్డి
రాయదుర్గం - కాపు రామచంద్రారెడ్డి
పరకాల - కొండా సురేఖ
రైల్వేకోడూరు - కొరముట్ల శ్రీనివాసులు
రామచంద్రాపురం - పిల్లి సుభాష్ చంద్రబోస్
ఉదయగిరి - మేకపాటి చంద్రశేఖర రెడ్డి
రాయచోటి - గండికోట శ్రీకాంత రెడ్డి
తెల్లం పోలవరం - బాలరాజు
ఎమ్మిగనూరు - కె. చెన్నకేశవ రెడ్డి
నర్సాపురం - ముదునూరి ప్రసాద రాజు
కాగా,
జగన్ కు మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యేలు 16 మందిని అనర్హులుగా ప్రకటించిన శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి రాజీనామాని ఆమోదించారు. శోభానాగిరెడ్డిని అనర్హురాలుగా ప్రకటించాలని పిఆర్ పి ఇచ్చిన లేఖని స్పీకర్ పరిగణనలోకి తీసుకోలేదు. ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయినందున, ఆమెని అనర్హురాలిగా ప్రకటిస్తే న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉన్నందున స్పీకర్ ఆమె రాజీనామాని ఆమోదించారని భావిస్తున్నారు.

జగన్ అరెస్టుకు రంగం సిద్దం చేస్తున్న "కాంగ్రెస్ అధిస్టానం"

ముందుగా నిమ్మగడ్డ అరెస్టుకు రంగం సిద్ధం
నాలుగైదు రోజుల్లో మద్దతు ఎమ్మెల్యేలపై వేటు
రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకోనున్న సంచలనాలు
హైదరాబాద్, మార్చి 1: కడప లోక్‌సభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి విషయంలో ఇక కఠినంగా వ్యవహరించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. జగన్‌కు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలపై చర్యలు తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. అదే సమయంలో అక్రమ ఆస్తుల కేసులో సిబిఐ విచారణను ఎదుర్కొంటున్న జగన్ అరెస్టుకు కూడా రంగాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర ‘ముఖ్యు’లకు కూడా అధిష్ఠానం చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. జగన్ విషయంలో కఠినంగా ఉండాలన్న నిర్ణయంలో భాగంగా ముందుగా ఆయనకు మద్దతు ఇస్తున్న నెల్లూరు లోక్‌సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి గతంలో లోక్‌సభ సభ్యత్వానికి చేసిన రాజీనామా లోక్‌సభ స్పీకర్ ఆమోదం పొందేలా చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో జగన్‌కు మద్దతు ఇస్తున్న పదిహేడు మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేలా చర్యలు తీసుకుంటోంది. ఈ వారంలోనే జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశాలున్నాయి. జగన్ వర్గానికి చెందిన ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి శాసనసభ్యత్వానికి చేసిన రాజీమానామాను ఆమోదిస్తూ, జగన్ వర్గానికి చెందిన పదహారు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హులు శాసనసభ స్పీకర్ ప్రకటించనున్నారు. ఈ వారంలోనే స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయని తెలిసింది. బహుశా మూడు లేదా నాలుగో తేదీన స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించవచ్చని శాసనసభ సచివాలయ వర్గాలు తెలిపాయి. ఆరో తేదీ ప్రాంతంలో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించవచ్చని భావిస్తున్నారు. 3, 4 తేదీల్లో కాని పక్షంలో రాజ్యసభ ఎన్నికల కార్యక్రమాన్ని ప్రకటించిన తర్వాతనైనా జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు పడవచ్చని భావిస్తున్నారు. ఇక అక్రమ ఆస్తుల వ్యవహారంలో జగన్ సిబిఐ విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. జగన్ ఆస్తుల వ్యవహారంలో కీలక పాత్రధారిగా భావిస్తున్న నిమ్మగడ్డ ప్రసాద్‌ను రెండు, మూడు రోజుల్లో సిబిఐ అరెస్టు చేయవచ్చని విశ్వసనీయంగా తెలిసింది. నిమ్మగడ్డ ప్రసాద్‌ను ఇప్పటికే సిబిఐ అధికారులు విచారించారు. అక్రమ ఆస్తుల కేసులో జగన్ అరెస్టుకు నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టు సంకేతంగా అభిప్రాయపడుతున్నారు. నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టయిన వారం పది రోజుల్లో జగన్ అరెస్టు కూడా ఖాయమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
జగన్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిన తర్వాత ఆరు నెలల్లో ఆ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. అక్రమ ఆస్తుల కేసులో జగన్ అరెస్టయిన పక్షంలో ఉప ఎన్నికల్లో ప్రచారం చేయడానికి ఉండదని, అదే విధంగా జగన్ అరెస్టుతో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు కూడా నైతికంగా కొంత దెబ్బ తినవచ్చని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. దీని ప్రభావం ఉప ఎన్నికలపై పడవచ్చని, కాంగ్రెస్ పరిస్థితి కొంత మెరుగుపడవచ్చని అనుకుంటున్నారు. అక్రమ ఆస్తుల వ్యవహారంలో ఏదో ఒక రోజు సిబిఐ తనను అరెస్టు చేయకతప్పదన్న అభిప్రాయంతో జగన్ కూడా ఉన్నారు. ఇందుకు మానసికంగా ఆయన సిద్ధంగానే ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. ఇటీవల పార్టీ ముఖ్యనేతలతో జగన్ సమావేశమైనపుడు సిబిఐ తనను అరెస్టు చేయవచ్చన్న అంశాన్ని ఆయనే స్వయంగా ప్రస్తావించారు. ‘సిబిఐ నన్ను అరెస్టు చేస్తే పార్టీని అమ్మ చూసుకుంటుంది’ అని జగన్ వ్యాఖ్యానించినట్లు ఆ పార్టీ నాయకులు తెలియజేశారు. జగన్ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాల వల్ల రానున్న పదిహేను రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

Source: Andhrabhoomi Daily

Thursday, March 1, 2012

మద్యం స్కాం లో ప్లేటు పిరాయించిన రమణ

రాష్ట్రంలో మద్యం ముడుపుల దుమారాన్ని లేపిన ఖమ్మం జిల్లాకు చెందిన మద్యం వ్యాపారి నున్నా రమణ ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించాడు. అసలు తనకు మద్యం వ్యాపారంతో సంబంధమే లేదని, మంత్రికే కాదు ఎవరికీ పైసా ఇవ్వలేదని చెప్పి అందరిని కంగుతినిపించాడు. ఈ అంశం ఇప్పుడు అత్యంత చర్చనీయాంశంమైంది. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఎసిబి కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటీషన్‌లో ఈ అంశాలను పేర్కొనడం రాజకీయ, అధికార వర్గాల్లో ఒక్కసారిగా కలవరం సృష్టించింది.
మద్యం ముడుపుల కేసులో ఎసిబి అధికారులు అరెస్టు చేయడంతో ప్రస్తుతం రమణ జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నాడు. ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణకు 10 లక్షల రూపాయలు చెల్లించినట్లు ఎసిబి విచారణ సందర్భంగా రమణ వెల్లడించి సంచలనం సృష్టించాడు. ఈ కేసుకు సంబంధించి మంత్రికి ముడుపులు ముట్టినట్లు పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగింది. స్వయంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అసెంబ్లీలో మంత్రులకు మద్యం ముడుపులతో సంబంధం లేదని ప్రకటించారు. మద్యం ముడుపుల అంశం చిచ్చు ఇంకా రగులుతుండగానే రమణ తాజాగా కోర్టుకు తెలిపిన వివరాలు మరో సంచలనానికి దారితీసింది.
తనపై థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఎసిబి అధికారులు ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నాడు. నిందితుడు చెప్పిన విషయాలు, ఎసిబి అధికారులు కేసులో పేర్కొన్న అంశాల్లో ఏది నిజమన్నది తేలాల్సి ఉంది. బలవంతంగా ఎసిబి అధికారులు తనతో చెప్పించి ఆ వాంగ్మూలాన్ని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారని బెయిల్ పిటీషన్‌లో పేర్కొన్నాడు. తాను మంత్రికి గానీ మరెవరికి గాని సొమ్ములు చెల్లించలేదని స్పష్టం చేశాడు. మద్యం వ్యాపారంతో సంబంధం లేదని, తాను వ్యవసాయం చేసుకుంటుంటానని పేర్కొన్నాడు. అనవసరంగా మద్యం కేసులో తనను ఇరికించిన ఎసిబి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.

నవ్వు నాలుగు విధాల మేలు

నవ్వు నాలుగు విధాల చేటు- అని ఓ సామెత వుంది. నిజమే కాని అది కారణం లేకుండా నవ్వేవారికే వర్తిస్తుంది. అసలు మనిషి నవ్వకపోతే ఆరోగ్యానికే హాని కలుగుతుందంటున్నారు వైద్యులు. మనిషి తన బాధలను మరిచిపోగలిగేది ఒక నవ్వుతో మాత్రమే అనేది నిజం. కష్టాలనేవి అందరికీ వుంటాయి. ఎవరైతే తమ కష్టాలను మరిచిపోయి హాయిగా మనసారా నవ్వుకోగలుగుతారో వారిని మించిన ఆరోగ్యవంతులు ఎవరుంటారు చెప్పండి. నవ్వు అనేది ఏ మనిషికైనా వారి వ్యక్తిత్వం మీద ఆధారపడి వుంటుంది. కొంతమంది ఎప్పుడు తాము నవ్వుతూ అందరినీ నవ్విస్తూ వుంటారు. మరికొందరు నవ్వటమే పాపం అన్నట్టు విచారంగా వుంటారు. వైద్యనిపుణుల అభిప్రాయం ప్రకారం ఎవరైతే హాయగా నవ్వగలుగుతారో వారి దరికి ఎలాంటి అనారోగ్యాలు చేరవు. పౌల్ ఎక్మాన్ అనే మానసిక శాస్తవ్రేత్త 1960లో నవ్వుమీద పరిశోధన చేసి, ప్రతి మనిషి ముఖంలో సుమారు 43 కండరాలు నవ్వటానికి సహాయపడతాయని చెప్పారు. నవ్వుగురించి ప్రత్యేకంగా పేషియల్ ఏక్షన్ కోడింగ్ సిస్టమ్స్ అనే పద్ధతిని కనిపెట్టి అందుకు సంబంధించి మన శరీరంలో 18 రకాలైన గ్రంధులు ఉంటాయని తేల్చారు.
మనిషి శరీరంలోని రక్తప్రసరణను క్రమబద్ధీకరించే శక్తి ఒక నవ్వుకు మాత్రమే వుంది. ప్రాణవాయువు, న్యూట్రిషన్స్ శరీరానికి ఎంత అవసరమో, నవ్వు కూడా అంతే అవసరమంటున్నారు ఆరోగ్య నిపుణులు. బిగ్గరగా నవ్వడంవలన ఉదరం, కాళ్లు, చేతులు, ముఖ కండరాలు అన్నింటికీ వ్యాయామం చేసిన ఫలితం దక్కుతుంది. శరీరానికి ఆహారం ద్వారా తీసుకున్న క్యాలరీలు ఖర్చు కావాలంటే నవ్వు తప్పనిసరి. నవ్వు మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు మానసిక బలాన్నికూడా అందిస్తుందనడంలో సందేహం లేదు. మనిషిలోని స్వచ్ఛమైన నవ్వుకి, ముఖంలోని హావభావాలకి దగ్గరి సంబంధం వున్నట్లే శరీరంలో జరిగే పలు రసాయనిక మార్పులకి కూడా సంబంధం వుంది. శరరంలో ఎంజైములు, హార్మోనులు విడుదల కావడానికి ఆరోగ్యవంతమైన నవ్వు దోహదపడుతుంది. ఎంజైములు, హార్మోన్లు శరీర అవయవాల పనితనాన్ని మెరుగుపరుస్తాయి. రక్తపోటును క్రమబద్దీకరించుకోవడానికి మందులతో పనిలేకుండా ప్రతి రోజు కాసేపన్నా మనసారా నవ్వుతుంటే రక్తపోటు సాధారణ స్థితికి చేరుకుంటుందని పరిశోధకులు సూచించారు. దీంతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా వుంటారు. హార్మోన్లలో అసమానతల కారణంగా, ఒత్తిడి, ఆందోళనకు గురవుతారు. నవ్వు శరీరంలోని హార్మోను ఉత్పత్తుల హెచ్చుతగ్గులను క్రమబద్ధీకరిస్తుంది. మనసారా నవ్వడంవలన ఒత్తిడి, ఆందోళన మాయమవుతాయి.
వయసు తగ్గించుకోండి..
వయసు పెరిగేకొద్దీ ముఖంపై ముడతలు ఏర్పడుతుంటాయి. వీటిని నివారించేందుకు నిత్యం చిరునవ్వుతో ఆనందంగా వుంటే వయసు అంతగా తెలియదంటున్నారు ఆరోగ్య నిపుణులు. భావాలను వ్యక్తీకరించడంతోపాటు, నిత్యం చిరునవ్వును చిందిస్తుంటే అందంగా కనపడుతుంటారని పరిశోధకులు అంటున్నారు. నవ్వు ముఖానికి మంచి వ్యాయామం లాంటిది. నవ్వు ముఖంలోని కండరాలు ముడతలు పడకుండా వుండేందుకు దోహదపడుతుంది. ముఖం మరింతగా అందంగా కనపడాలంటే నిత్యం చిరునవ్వును చిందిస్తుండాలి. వీలు చిక్కినప్పుడల్లా కాస్త బిగ్గరగా నవ్వుతుంటే, ముఖానికి మంచి వ్యాయామం కలుగుతుందంటున్నారు పరిశోధకులు. ప్రతిరోజు నవ్వును ఓ వ్యాయామంలా చేస్తుండాలి.
ప్రతిరోజు నవ్వడంవలన మనసుకు ఏకాగ్రత కలుగుతుంది. దీంతో మీకు తెలియకుండా మీలో ఉత్సాహం వెల్లివిరుస్తుంది. అలాగే మీ వ్యక్తిత్వంలో మార్పు వచ్చి నిత్య యవ్వనులుగా కనపడతారు. ప్రతిరోజు నవ్వటం నేర్చుకుంటే ఆరోగ్యంతోపాటు మనిషి నిత్య యవ్వనంగా వుంటారంటున్నారు పరిశోధకులు. నవ్వుతో శరీరంలోని ఎలాంటి జబ్బునైనా మటుమాయం చేయవచ్చంటున్నారు. నవ్వే శక్తి కేవలం మానవునికి మాత్రమే సాధ్యపడుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. మనిషి ఎప్పుడూ నవ్వుతూ వుంటే కనుక వారి ఆరోగ్యం బాగుండి ఎక్కువ కాలం జీవించి ఉండగలుగుతారు. నవ్వు ఎంత ప్రధానమైనదంటే మన మెదడులోని నరాలు శరీరంలోని కండరాలను నవ్వు ద్వారానే నియంత్రిస్తాయి. అందుకనే మనిషి హాయిగా నవ్వగలిగితే కండరాలన్నీ గట్టిపడి దృఢమైన ఆరోగ్యం మన సొంతమవుతుంది.
-సుబ్బలక్ష్మి ( From Andhrabhoomi )