ముందుగా నిమ్మగడ్డ అరెస్టుకు రంగం సిద్ధం
నాలుగైదు రోజుల్లో మద్దతు ఎమ్మెల్యేలపై వేటు
రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకోనున్న సంచలనాలు
హైదరాబాద్, మార్చి 1: కడప లోక్‌సభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి విషయంలో ఇక కఠినంగా వ్యవహరించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. జగన్‌కు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలపై చర్యలు తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. అదే సమయంలో అక్రమ ఆస్తుల కేసులో సిబిఐ విచారణను ఎదుర్కొంటున్న జగన్ అరెస్టుకు కూడా రంగాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర ‘ముఖ్యు’లకు కూడా అధిష్ఠానం చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. జగన్ విషయంలో కఠినంగా ఉండాలన్న నిర్ణయంలో భాగంగా ముందుగా ఆయనకు మద్దతు ఇస్తున్న నెల్లూరు లోక్‌సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి గతంలో లోక్‌సభ సభ్యత్వానికి చేసిన రాజీనామా లోక్‌సభ స్పీకర్ ఆమోదం పొందేలా చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో జగన్‌కు మద్దతు ఇస్తున్న పదిహేడు మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేలా చర్యలు తీసుకుంటోంది. ఈ వారంలోనే జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశాలున్నాయి. జగన్ వర్గానికి చెందిన ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి శాసనసభ్యత్వానికి చేసిన రాజీమానామాను ఆమోదిస్తూ, జగన్ వర్గానికి చెందిన పదహారు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హులు శాసనసభ స్పీకర్ ప్రకటించనున్నారు. ఈ వారంలోనే స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయని తెలిసింది. బహుశా మూడు లేదా నాలుగో తేదీన స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించవచ్చని శాసనసభ సచివాలయ వర్గాలు తెలిపాయి. ఆరో తేదీ ప్రాంతంలో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించవచ్చని భావిస్తున్నారు. 3, 4 తేదీల్లో కాని పక్షంలో రాజ్యసభ ఎన్నికల కార్యక్రమాన్ని ప్రకటించిన తర్వాతనైనా జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు పడవచ్చని భావిస్తున్నారు. ఇక అక్రమ ఆస్తుల వ్యవహారంలో జగన్ సిబిఐ విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. జగన్ ఆస్తుల వ్యవహారంలో కీలక పాత్రధారిగా భావిస్తున్న నిమ్మగడ్డ ప్రసాద్‌ను రెండు, మూడు రోజుల్లో సిబిఐ అరెస్టు చేయవచ్చని విశ్వసనీయంగా తెలిసింది. నిమ్మగడ్డ ప్రసాద్‌ను ఇప్పటికే సిబిఐ అధికారులు విచారించారు. అక్రమ ఆస్తుల కేసులో జగన్ అరెస్టుకు నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టు సంకేతంగా అభిప్రాయపడుతున్నారు. నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టయిన వారం పది రోజుల్లో జగన్ అరెస్టు కూడా ఖాయమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
జగన్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిన తర్వాత ఆరు నెలల్లో ఆ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. అక్రమ ఆస్తుల కేసులో జగన్ అరెస్టయిన పక్షంలో ఉప ఎన్నికల్లో ప్రచారం చేయడానికి ఉండదని, అదే విధంగా జగన్ అరెస్టుతో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు కూడా నైతికంగా కొంత దెబ్బ తినవచ్చని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. దీని ప్రభావం ఉప ఎన్నికలపై పడవచ్చని, కాంగ్రెస్ పరిస్థితి కొంత మెరుగుపడవచ్చని అనుకుంటున్నారు. అక్రమ ఆస్తుల వ్యవహారంలో ఏదో ఒక రోజు సిబిఐ తనను అరెస్టు చేయకతప్పదన్న అభిప్రాయంతో జగన్ కూడా ఉన్నారు. ఇందుకు మానసికంగా ఆయన సిద్ధంగానే ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. ఇటీవల పార్టీ ముఖ్యనేతలతో జగన్ సమావేశమైనపుడు సిబిఐ తనను అరెస్టు చేయవచ్చన్న అంశాన్ని ఆయనే స్వయంగా ప్రస్తావించారు. ‘సిబిఐ నన్ను అరెస్టు చేస్తే పార్టీని అమ్మ చూసుకుంటుంది’ అని జగన్ వ్యాఖ్యానించినట్లు ఆ పార్టీ నాయకులు తెలియజేశారు. జగన్ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాల వల్ల రానున్న పదిహేను రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
Source: Andhrabhoomi Daily
No comments:
Post a Comment