Monday, May 28, 2012

CBI లో ఆంధ్రజ్యోతి సీక్రెట్ ఏజెంట్లు

ఈనాటి ఆంధ్రజ్యోతి పేపర్ చదివితే ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది .CBI టీం లో ఎప్పటికప్పుడు   ఆంధ్రజ్యోతికి వార్తలు అందిoచే సీక్రెట్ ఏజెంట్ ఉండడం నిజంగా ఆ పత్రిక గొప్పతనం. నిన్న జగన్ ను CBI ఎలా విచారించిందీ  కళ్ళకు కట్టినట్లుగా వివరించింది ఈ పత్రిక . జగన్ ను నిమ్మగడ్డ కోప్పడ్డారనీ , జగన్ ఒక్క ఉదుటున లేచి కుర్చీ తోసేసాడని ఎంత గొప్పగా వర్ణించింది ! నాకు తెలిసీ దిల్ కుశ గెస్ట్ హౌసులో ఆంధ్రజ్యోతి స్పై కెమెరా అయినా పేటి ఉండాలి. ఇది నిజంగా CBI  వైఫల్యమే . దీన్ని బట్టి మన రాష్ట్రంలో సెక్యూరిటీ ఎంత చండాలంగా ఉందో చెప్పొచ్చు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా బాద్యత వహించాలి. జగన్ ఫైర్ అయిన విషయం CBI  కనీసం ఈరోజు కోర్టులో కూడా చెప్పుకోలేక సిగ్గు పడినట్లుంది .
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని ఈ సీక్రెట్ ఏజెంట్ ను పట్టుకోవాలి. అదేలాగంటారా? అదికూడా నేనే చెప్పాలా!
సరే .... ఆంధ్రజ్యోతి రామకృష్ణ ని బొక్కలో పడేసి నాలుగు కుమ్మితే సరి ... అంతా బయటికి వస్తుంది... లేకపోతె రేపు మిగతా మంత్రులను విచారించించే టప్పుడు డైరెక్ట్ గా లైవ్ టెలికాస్ట్  ఇచ్చినా ఇవ్వోచ్చు ఈ ప్రభుద్దుడు ...

Sunday, May 27, 2012

వైఎస్ జగన్ అరెస్ట్ ; 'దిల్ కుష్'కు జగన్ కుటుంబీకులు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీబీఐ ఆదివారం రాత్రి 7.20 గంటల సమయంలో అరెస్ట్ చేసినట్టు ఆ పార్టీ నేత జూపూడి ప్రభాకర్ రావు మీడియాకు వెల్లడించారు. సోమవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉన్నా కూడా.. జగన్ ను సీబీఐ దుందుడుకుగా వ్యవహరించి అన్యాయంగా అరెస్ట్ చేసిందని ఆయన విమర్శించారు. వైఎస్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎలాంటి ఉద్రేకానికి పోకుండా ప్రశాంతంగా ఉండాలని ఆయన కోరారు. ఈ అరెస్ట్ దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.వరుసగా మూడో రోజూ సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు ఆయన కుటుంబీకులు ఆదివారం సాయంత్రం 7.15 గంటల సమయంలో దిల్ కుష్ అతిథి గృహానికి బయల్దేరారు. వారిలో జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతి, చెల్లెలు షర్మిల, బావ అనిల్, వైవీ సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు. 

Thursday, May 24, 2012

పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల

పదో తరగతి పరీక్షా ఫలితాలను ఈ రోజు విడుదల చేసారు. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎస్సెస్సీ బోర్డు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె. పార్థసారథి ఫలితాల సీడీని విడుదల చేసారు. ఈ సారి పదో తరగతి పరీక్షా ఫలితాల్లో గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఫలితాల సీడీల్లో విద్యార్థులు సాధించిన గ్రేడ్ పాయింట్లు మాత్రమే ఉంటాయి. ఏపీ ఆన్‌లైన్, ఈ సేవా కేంద్రాల్లో మాత్రం సబ్జెక్టుల వారీగా గ్రేడులు, గ్రేడ్ పాయింట్లు అందుబాటులో ఉంటాయి మొత్తం 87.84శాతం ఉత్తీర్ణత నమోదయింది .
వీటిని క్రింది లింకుల ద్వారా చూడవచ్చు.



Wednesday, May 23, 2012

Grading System for SSC RESULTS - 2012


SSC Grading System

New SSC Grade Point Average (GPA) Sytem implemented from this year

The SSC Board has now changed the Grading system wherein the passed candidates will be alloted grades according to their marks. The Grades are given from A1 to E, including the failure students. the changes will be implemented from this year.

SSC - Grade Point Average (GPA) System

English, Telugu, Mathematics, Science, Social -- marks range Hindi -- marks range Grade Grade Point
92-100 90-100 A1 10
83-91 80-89 A2 9
75-82 70-79 B1 8
67-74 60-69 B2 7
59-66 50-59 C1 6
51-58 40-49 C2 5
43-50 30-39 D1 4
35-42 20-29 D2 3
34-0 19-0 E --


Example : Suppose a student got the grades as below
Subject Grade Grade Point
Telugu A2 9
Hindi A1 10
English B1 8
Mathematics A1 10
Science A1 10
Social Studies A1 10
 
So, the Grade Point Average (GPA) of the student is : 9+10+8+10+10+10 = 57/6 = 9.5 Points
 

Tuesday, May 22, 2012

ఆతిద్యం ఇచ్చిన వారిపైనే చిరు బుర్రులాడిన చిరు : ' అనంత 'లో చేదు అనుభవం




అనంతపురం, మే 21: ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం నగరంలో సోమవారం పర్యటించిన రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి చేదు అనుభవం ఎదురైంది. నగరంలో ఉదయం నుంచి నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న చిరంజీవి సాయంత్రం యువజన కాంగ్రెస్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ కోగటం విజయభాస్కరరెడ్డి ఇంటికి తేనీటి విందుకు వెళ్లారు. చిరంజీవితో పాటు మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్, ఎంపి అనంత వెంకట్రామిరెడ్డి, పార్టీ అభ్యర్థి ముర్షీదాబేగం ఉన్నారు.
ఇంటికి వచ్చిన అతిథులకు మర్యాద చేయాలన్న ఉద్దేశంతో కోగటం విజయభాస్కరరెడ్డి చిరంజీవి దగ్గరకు వెళ్లి టీ, స్నాక్స్ తీసుకు రమ్మంటారా అని అడిగారు. దీంతో కోపోద్రిక్తుడైన చిరంజీవి ‘‘యూజ్‌లెస్ ఫెలో.. ఇంకా టీ, స్నాక్స్ తీసుకురమ్మని అడుగుతావా, బుద్ది లేదా నీకు, వెంటనే తీసుకు రా ఫో’’ అంటూ గదమాయించారు. చిరంజీవి మాటలతో కోపంతో ఊగిపోయిన కోగటం విజయభాస్కరరెడ్డి ‘‘ఏయ్ బుద్ది లేదా నీకు, తల తిరుగుతోందా, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదా నీకు, ఇదేమైనా నీ ఇల్లు అనుకున్నావా’’ అంటూ ఫైర్ అయ్యాడు. ఇలా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సాకే శైలజానాథ్ మధ్యలో కల్పించుకున్నారు. ‘‘మీకు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదా, ఇలా అయితే ఎలా అంటూ’’ సుతిమెత్తగా చిరంజీవిని హెచ్చరించారు. కోగటం, శైలజానాథ్ మాటలతో మనస్థాపానికి గురైన చిరంజీవి అలిగి వెళ్లిపోతుండగా పార్టీ కార్యకర్తలు, నాయకులు బుజ్జగించారు. కోగటం చేతే టీ, స్నాక్స్ ఇప్పించారు. కోగటం తెచ్చి ఇచ్చిన టీ, స్నాక్స్‌ను చిరంజీవి అయిష్టంగానే స్వీకరించారు.
(చిత్రం) చిరుపైకి దూసుకెళ్తున్న డిసిసి కార్యదర్శి కోగటం విజయభాస్కర్‌రెడ్డిని సముదాయస్తున్న మంత్రి శైలజానాథ్


Source; andhrabhoomi

Sunday, May 20, 2012

అమాత్యులూ ఇరుక్కున్నట్టే

అక్రమ ఆస్తుల కేసులో కడప లోక్‌సభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అరెస్టు దాదాపు ఖాయం అవడంతో సిబిఐ అధికారులు ఇప్పుడు మంత్రులపై దృష్టిపెట్టారు. ఇప్పటికే అరడజను మంది మంత్రులను సిబిఐ విచారించగా మరికొంత మందిని విచారించేందుకు నోటీసులు జారీ చేయడానికి సిబిఐ సిద్ధమవుతోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇప్పటి వరకు విచారణ జరిపిన మంత్రుల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో గనుల శాఖను నిర్వహించిన హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, వౌలిక వసతులు, పెట్టుబడులు, ఓడరేవుల శాఖను నిర్వహించిన ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ దాదాపు ఇరుక్కున్నట్టేనని తెలిసింది. వీరిని అరెస్టు చేయడానికి అవసరమైన సాక్ష్యాధారాలను సిబిఐ ఇప్పటికే సేకరించినట్లు తెలిసింది. అయితే జగన్‌ను అరెస్టు చేయడానికి ముందే మంత్రులను అరెస్టు చేయాలా లేక జగన్ అరెస్టు తర్వాత చేయాలా అన్న ఆలోచనలో సిబిఐ ఉన్నట్లు తెలిసింది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నెల 28న జగన్ సిబిఐ కోర్టుకు హాజరైనపుడు ఆయన్ను అరెస్టు చేసేందుకు సిబిఐ సన్నాహాలను పూర్తి చేసినట్లు చెబుతున్నారు. జగన్ అక్రమ ఆస్తుల కేసులో వివిధ అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు జీవోలు రావడానికి కారకులైన మంత్రుల్ని కూడా అరెస్టు చేయాలని వివిధ వర్గాల నుంచి ఒత్తిడి వస్తోంది. వైఎస్ హయాంలో కీలకమైన 26 జీవోల జారీకి సంబంధించి ఆరుగురు మంత్రులకు, ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంత్రులపై విచారణను సిబిఐ వేగవంతం చేసింది. జగన్ అరెస్టు వల్ల ఏర్పడే ఉద్రిక్తతల ప్రభావాన్ని తగ్గించాలంటే ఆయన్ను అరెస్టు చేయడానికి ముందే ఒకరిద్దరు మంత్రుల్ని అరెస్టు చేయాలన్న అభిప్రాయంతో సిబిఐ ఉన్నట్లు తెలిసింది. దీనివల్ల జగన్‌పై కక్షసాధింపు చర్యలు తీసుకుంటున్నారన్న విమర్శలకు సమాధానం చెప్పినట్లవుతుందని, అదే సమయంలో అవినీతికి పాల్పడితే సొంత పార్టీ వారు ఏ స్ధాయిలో ఉన్నా క్షమించేది లేదన్న సంకేతాన్ని ప్రజలకు ఇవ్వడం ద్వారా పార్టీ ప్రతిష్ఠను పెంచుకోవచ్చునని అధిష్ఠానం కూడా భావిస్తున్నట్లు తెలిసింది.
సబితకు బిగిస్తున్న ఉచ్చు
హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని సిబిఐ అధికారులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. మొదటిసారి ఓబుళాపురం గనుల కేసులోను, రెండో సారి జగన్ అక్రమ ఆస్తుల కేసులోను మంత్రి సబితను సిబిఐ అధికారులు విచారణ జరిపారు. అయితే ఓబుళాపురం గనుల కేసులో ఒకరకమైన వాదనను వినిపించిన సబిత జగన్ అక్రమ ఆస్తుల కేసులో మరో రకమైన వాదనను వినిపించినట్లు సిబిఐ వర్గాలు తెలిపాయి. ఓబుళాపురం గనుల కేసులో తనకు సంబంధం లేదని, తనకు తెలియకుండానే అప్పటి గనుల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి తన ఇష్టం వచ్చినట్లు జీవోలు జారీ చేశారని మంత్రి సబిత చెప్పినట్లు తెలిసింది. అదే జగన్ అక్రమ ఆస్తుల కేసులో సాక్షి సంస్థలో పెట్టుబడులు పెట్టిన సిమెంట్ కంపెనీలకు గనుల కేటాయింపు గురించి సిబిఐ అధికారులు ప్రశ్నించినపుడు పారిశ్రామిక రంగంలో ఆ సంస్ధలకు ఉన్న పేరు ప్రతిష్ఠలను దృష్టిలో పెట్టుకుని కేటాయించినట్లు మంత్రి సబిత చెప్పినట్లు తెలిసింది. ఓబుళాపురం గనుల కేసులో జీవోలకు సంబంధించి తనకు సంబంధం లేదని వాదించిన మంత్రి సబిత సాక్షి సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన సిమెంటు కంపెనీలకు గనుల కేటాయింపు జీవోలకు తానే బాధ్యత వహిస్తున్నట్లుగా చెప్పినట్లు తెలిసింది. ఆ సిమెంటు కంపెనీలకు పారిశ్రామిక రంగంలో పేరు ప్రతిష్ఠలు ఉన్న మాట ఎలాగున్నా, వాటికి గనుల కేటాయింపు వెనుక మంత్రికి ఎటువంటి దురుద్దేశాలు లేనప్పటికీ జగన్ సంస్థల్లో అవి పెట్టుబడులు పెట్టినందున ‘క్విడ్ ప్రో కో’ను ప్రోత్సహించే విధంగా ఉన్నందున ఈ జీవోల జారీలో మంత్రి సబిత ఇరుక్కున్నట్టేనని సిబిఐ వర్గాలు చెబుతున్నాయి.
మరోసారి కీలక విచారణ
ఇప్పటికే రెండు సార్లు మంత్రి సబితను సిబిఐ అధికారులు విచారించగా మరోసారి ఆమెను విచారించాలన్న ఉద్దేశంతో సిబిఐ అధికారులు ఉన్నట్లు తెలిసింది. మంత్రి సబితపై మూడోసారి సిబిఐ జరపనున్న విచారణ జగన్ అక్రమ ఆస్తుల కేసులో కీలక మలుపు తిరగవచ్చునని భావిస్తున్నారు.
ఇక వాన్‌పిక్‌కు కేటాయింపుల విషయంలో అప్పటి పెట్టుబడులు, ఓడరేవులు, వౌలిక వసతుల కల్పనా శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా దాదాపు ఇరుక్కున్నట్టేనని సిబిఐ వర్గాల కథనం. మంత్రి మోపిదేవిని సిబిఐ అధికారులు ఇప్పటికే ఒకసారి విచారించగా ఈ నెల 21న మరోసారి విచారించనున్నారు. ఈ విచారణ కీలక ఘట్టంగా భావిస్తున్నారు. అదే రోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ వ్యక్తిగత కార్యదర్శి సూరీడును కూడా సిబిఐ విచారించనుంది.
పొన్నాల, గీతారెడ్డికికూడా నోటీసులు
ఇలా ఉండగా సుప్రీంకోర్టు నుంచి నోటీసులు అందుకున్న మంత్రుల జాబితాలో ఉన్న ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి జె గీతారెడ్డికి కూడా నోటీసులను సిబిఐ సిద్ధం చేస్తోంది. వైఎస్ మంత్రివర్గంలో భారీ నీటిపారుదల శాఖను నిర్వహించిన మంత్రి పొన్నాలను జలయజ్ఞం పనుల కేటాయింపుతో పాటు ఇండియా సిమెంటు కంపెనీకి కృష్ణా జలాల కేటాయింపు గురించి సిబిఐ ప్రశ్నించనుంది. అదే విధంగా బ్రహ్మణి స్టీల్ ఫ్యాక్టరీకి భూముల కేటాయింపు జీవో గురించి భారీ పరిశ్రమ శాఖ మంత్రి గీతారెడ్డిని సిబిఐ ప్రశ్నించనున్నట్లు తెలిసింది.

Saturday, May 19, 2012

వేసవిలో నిద్రలేస్తూనే నీరు తాగి చూడండి.. మీకే తెలుస్తుంది..!!

FILE
ప్రొద్దున్నే నిద్రలేవగానే తల దిమ్ముగా ఉన్నా, కడుపులో వికారంగా ఉన్నా, నిస్సత్తువగా ఉందనిపిస్తున్నా, తల నొప్పి వేస్తున్నా ఇవి మన శరీరం నీటిని కోరుకుంటోందనడానికి సంకేతాలు అని గుర్తించాలి. అందుకే నిద్రపోవడానికి ముందు కూడా మన పెద్దలు తలగడ పక్కనో, మంచం కిందనో రాగి లేదా సాధారణ చెంబులో నీళ్లు పట్టి ఉంచడం చేసేవారు. పొద్దున్నే నిద్రలేచి ముఖం కడుక్కున్న వెంటనే పిల్లలకు నీళ్లు తాగించేవారు.

పొద్దుటిపూటే చెంబుడు నీళ్లు తాగితే రోజంతా చీకూ చింతా లేకుండా ఉంటారనే నమ్మకం వాళ్లది. వైద్య పరంగా కూడా దీనికి ఆధారం ఉంది. ఎందుకంటే మనం సాధారణంగా రాత్రి పూట భోంచేసింతర్వాత మరుసటి రోజు తెల్లవారే వరకూ ఏమీ పుచ్చుకోం గదా.. దీంతో శరీరం ఖర్చుపెట్టిన ద్రవపదార్థాల స్థానంలో నీరు వచ్చి చేరదు. శరీరం నీటిని కోరుకుంటున్నా మనం అందివ్వని స్థితి రాత్రిపూట ఉంటుంది కనుకే నిద్రలేచిన వెంటనే నీరు తాగాలని పెద్దలు చెబుతారు. దీనివల్ల శరీరం తిరిగి రీచార్జ్ అవుతుంది.

నీటి ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దామా..
డీహైడ్రేషన్‌కు లోనుకాకుండా ఉండాలంటే సాధ్యమైనంత ఎక్కువ నీళ్లు తాగాలి. నీళ్లకు జీర్ణశక్తిని పెంచే లక్షణం ఉంది. శరీరంలోని మలినాలను విసర్జింపజేసి, మూత్రపిండాలు సమర్థంగా తమ విధులు నిర్వర్తించాలంటే మనం వీలైనంత ఎక్కువగా నీరు త్రాగాలి.

శరీరం కోల్పోయిన ద్రవపదార్ధాలను తిరిగి సమకూర్చుకోవాలంటే నీరు అధికంగా తీసుకోవాలి. మనం చేసే ప్రతి చిన్న లేదా పెద్ద పనికి ఎంతో కొన్ని కెలోరీలు ఖర్చయిపోతుండడం ఎలా వాస్తవమో శరీరం తనలోని నీటి నిల్వను నిరంతరం ఖర్చు పెట్టుకుంటూనే ఉంటుందని గుర్చుంచుకోవాలి. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసులు నీటిని తాగడం తప్పనిసరి వైద్యనిపుణులు సూచిస్తూంటారు.

అలాగే నీటిశాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయలు, కమలా పళ్లు, నారింజ, దానిమ్మ వంటి ఫలాలను ఆయా సీజన్‌లలో అధికంగా తీసుకోవాలి. అన్నిటినీమించి నిద్రలేస్తూనే నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. కానీ ఖర్చు లేకుండా మన శరీర ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంచుకోవడానికి ఇదే కారుచౌక మార్గం... కాబట్టి నీరు తాగడం మానవద్దు, నీరు తాగడం మర్చిపోవద్దు. ప్రొద్దుటిపూట నీరు తాగడం అస్సలు మర్చిపోవద్దు.
సేకరించినది : http://telugu.webdunia.com/miscellaneous/health/articles/1205/18/1120518047_1.htm నుండి 

'వైఎస్‌ ఒత్తిడి వల్లే ఆ సంతకాలు' తప్పించుకోడానికి మంత్రి సబిత పాట్లు

జగన్‌ ఆస్తుల కేసుతో పాటు, ఓఎంసి అక్రమాల కేసులో రాష్ట్ర హోంశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిని సీబీఐ రెండోమారు విచారించింది. శుక్రవారం నాడు సీబీఐ అధికారులు మంత్రి ఇంటికి వెళ్ళి దాదాపు గంటన్నరపాటు వివిధ అంశాలపైన, గనులశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో జారీ అయిన 9 జీవోల పైన ప్రశ్నించినట్లు తెలిసింది. జగన్‌ ఆస్తుల కేసులో కొన్ని సిమెంట్‌ కంపెనీలకు ఉదారంగా సున్నపుగనులు కట్టబెట్టడం, మరికొన్ని కంపెనీలకు అనుమతులు మంజూరు చేయడం వంటి వాటిపై అధికారులు తాజా ప్రశ్నా వళితో సిద్ధమై ఆమెను విచారించారు. అయితే గనుల శాఖ మంత్రి గా తన హయాంలో జారీ అయిన 9 జీవోలపైన తానకెప్పుడూ పూర్తిస్థాయిలో సమా చారం అందలేదని, కేవలం క్లుప్తమైన సమాచారం, అవగాహనతో మాత్రమే తాను సంతకం చేశానని చెప్పినట్లు తెలిసింది. జీవోలకు సంబంధించి ఫైల్‌ తన వద్దకు వచ్చేముందే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సదరు ఫైలుకు సం బంధించి ఫోన్‌లు వచ్చేవని, ఆ కారణంగానే తాను వాటి పై ఎక్కువ దృష్టి పెట్ట కుండా సంతకాలు చేశానని చెప్పినట్లు తెలిసింది. కాకపొతే ఆమె వివరణతో  సీబీఐ అధికారులు సంతృప్తి చెందలేదని తెలుస్తోంది . 
రాజకీయంగా చూస్తె సబితను కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ కూడా చేయబోదని ఊహించవచ్చు ఎందుకంటే జగన్ తో పాటూ కనీసం ఇద్దరు,ముగ్గురు మంత్రులనైనా ఈ స్కేముకు భాద్యులుగా చేస్తే కానీ తన మీద పడ్డ అపవాదును
 కాంగ్రెస్ తుడుపివేయలేదని కొందరి నేతల నమ్మకం.కనుక ఎప్పటికైనా జగన్ పంచనచేరే అనుమానం ఉన్న సబితతో 
పాటూ మరో ఒకరిద్దరిని .కాపాద  కూడదని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

మరోమారు విచారించే అవకాశం
కాగా ఈ కేసులో సబితా ఇంద్రారెడ్డిని మరోమారు ప్రశ్నించే అవకాశం ఉందని సీబీఐ వర్గాల ద్వారా తెలిసింది. తాజా విచారణలో ఆమె చెప్పిన సమాచారాన్ని, అంతకు ముందు తమకు అందిన సమాచారాన్ని క్రోడీకరిం చుకున్న అనంతరం మరోమారు విచారిస్తామని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

Tuesday, May 15, 2012

సామాజిక సైట్లలో ‘అసాంఘిక’ ధోరణులు!



ఎక్కడెక్కడో ఉన్నవారిని స్నేహ బంధంతో ఏకం చేస్తూ, పరస్పరం ఆలోచనలు పంచుకునేందుకు దోహదపడుతున్న సామాజిక వెబ్‌సైట్లలో ఇటీవల పెడ ధోరణులు చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఈ సామాజిక సైట్లలో అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నందున బంధుత్వాలు సైతం దెబ్బ తింటున్నాయి. ఇటీవలి కాలంలో విశేష ప్రాచుర్యం పొందిన సామాజిక వెబ్‌సైట్ ‘ఫేస్‌బుక్’లో కొందరు అనైతిక ‘పోస్టింగ్‌లు’ పెడుతున్నందున అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పెళ్లి నిశ్చితార్థాలు రద్దుకావడం, విభేదాల కారణంగా దంపతులు విడాకులకు సిద్ధం కావడం వంటి విపరిణామాలకు ‘ఫేస్‌బుక్’ కారణమవుతోంది. ఇందు కు పలు సంఘటనలు సాక్షీభూతంగా నిలుస్తున్నాయి. బి-్ఫర్మసీ చదివిన విద్యార్థినికి బ్రిటన్‌లో ఉంటూ ఎంటెక్ చదివిన ఒక యువకుడితో పెళ్లి నిశ్చితార్థం జరిగింది. అయితే, ఆ యువకుడు తన చిన్ననాటి స్నేహితురాలితో ఉన్న ఫోటోలు ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష మయ్యాయి. ఈ ఫోటోలు చూశాక నిశ్చితార్థం రద్దు చేసుకుంటున్నట్టు ఆ విద్యార్థినితోపాటు ఆమె తల్లిదండ్రులు ప్రకటించారు. ఫొటోలో ఉన్న గర్ల్‌ఫ్రెండ్‌తో స్నేహం తప్ప ఎలాంటి ‘సంబం ధం’ లేదని ఆ యువకుడు పదేపదే చెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తొమ్మిదేళ్లుగా కాపురం చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన దంపతులు సామాజిక వెబ్‌సైట్ పుణ్యమాని విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. తన స్నేహితురాలి ఫోటోకు సంబంధించి భర్త రాసిన కామెంట్లను ఆ గృహిణి సహించలేకపోయింది. పట్టణ ప్రాంతాల్లోని ఫ్యామిలీ కోర్టులలో ఇలాంటి కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో ఫోటోల్లోని ముఖ భాగాలను తారుమారు చేస్తూ వాటిని వెబ్‌సైట్లలో పెడుతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా మహిళలకు సంబంధించి అభ్యంతరకరమైన రాతలు, ఫోటోలు ఫేస్‌బుక్‌లో దర్శనమిస్తున్నాయి. దీంతో దాంపత్య సంబంధాలు దెబ్బతింటున్నాయని న్యాయవాదులు సైతం అంగీకరిస్తున్నారు.
మరో సంఘటనలో తమ కాబోయే కోడలి గురించి ఫేస్‌బుక్‌లో రాసిన వ్యాఖ్యానాలు చదివి కోయంబత్తూరుకు చెందిన ఓ దంపతులు తమ కుమారుడి వివాహాన్ని రద్దు చేశారు. స్నేహితులతో కలిసి తీయించుకున్న ఫోటోలో ఆ అమ్మాయి గురించి చెడుగా కామెంట్లు రాసి ఎవరో బయటి వ్యక్తులు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ ఆకతాయి చేష్ట కారణంగా పెళ్లి రద్దు కావడంతో యువతి తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు లోనయ్యారు. వారంరోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా ఢిల్లీకి చెందిన ఓ యువకుడు పెళ్లిని రద్దు చేసుకున్నాడు. కాబోయే వధువు కొంతమంది యువకులతో కలిసి ఉన్నట్లు ఫేస్‌బుక్‌లో ఓ ఫోటో ప్రత్యక్షం కావడమే ఇందుకు కారణం.
సామాజిక వెబ్‌సైట్లలో పోస్టింగులకు సంబంధించి ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంవల్లనే ఈ దుస్థితి నెలకొందని కొందరు న్యాయనిపుణులు చెబుతున్నారు. కొందరి బరితెగింపు కారణంగా కుటుంబ వ్యవస్థ, వివాహ బంధాలు విచ్ఛిన్నం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సైట్లలో నిర్లక్ష్యంగా లేదా ఉద్దేశపూర్వకంగా అనైతిక చర్యలకు పాల్పడితే అనర్థాలు తప్పవని, ముఖ్యంగా యువత దీనిని గ్రహించాలని మానవ సంబంధాల నిపుణులు సూచిస్తున్నారు.
Courtesy : Andhrabhoomi.net

Sunday, May 13, 2012

నిత్యానంతకు పిఠాధిపతుల షాక్, వ్యతిరేకంగా తీర్మానం

మధురై పీఠాధిపతిగా ఎన్నికైన నిత్యానంద స్వామికి రాష్ట్రంలోని పలు పీఠాధిపతులు షాక్ ఇచ్చారు. మధురై ఆదీనం పీఠాధిపతిగా ఉన్న నిత్యానందను వెంటనే తొలగించాలని రాష్ట్రంలోని పదకొండు మంది పీఠాధిపతులు తీర్మానం చేశారు. ఆయన స్థానంలో కొత్త వారిని నియమించాలని వారు ప్రభుత్వాన్ని కోరనున్నారు. నిత్యానందపై తీవ్రమైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అలాంటి వ్యక్తిని పీఠాధిపతిగా కూర్చోబెట్టడం సరికాదని వారు ప్రభుత్వాన్ని కోరనున్నారు.

ఈ సందర్భంగా వారు మూడు తీర్మానాలు చేశారు. మధురై పీఠాధిపతిగా నిత్యానందను శాశ్వతంగా తొలగించాలని, ప్రధాన పీఠాధిపతిని కూడా తప్పించాలని, ప్రభుత్వమే జోక్యం చేసుకొని మధురపై పీఠాధిపతిని నియమించాలని సమావేశంలో ఆమోదించారు.

కాగా గతంలో నిత్యానందకు వ్యతిరేకంగా పదమూడు మంది పీఠాధిపతులు మాట్లాడారు. అయితే తీర్మానం చేసింది మాత్రం పదకొండు మంది పీఠాధిపతులే. మరోవైపు స్వామి నిత్యానంద ఈ విషయమై మాట్లాడుతూ.. తనను తొలగించాలని డిమాండ్ చేస్తున్న పీఠాధిపతులు అంతగా పెద్దగా లెక్కలోకి వచ్చే వారు కాదని చెబుతున్నారు. ముఖ్యమైన పీఠాధిపతులు తన నియామకాన్ని స్వాగతిస్తున్నారని చెప్పారు.

తాను ఏం చేసినా లోక కల్యాణం కోసమే చేస్తానని చెప్పారు. తనది న్యాయమైన నియామకం కాబట్టే కోర్టులో కూడా విజయం సాధించానని చెప్పారు. తాను మాస్టర్‌ను కాదని స్వామీజిని అన్నారు. నన్ను సరైన వారు ఎవరూ వ్యతిరేకించడం లేదన్నారు. కోర్టు కూడా తనకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టి వేసిందన్నారు. దీంతో సత్యమేవ జయతే అని మరోసారి నిరూపితమైందన్నారు. తాను సత్యానందాన్నని లోక కల్యాణం కోసమే ఉన్నానని చెప్పారు.

కాగా నిత్యానంద స్వామికి తమిళనాడులో మధురై కోర్టులో మూడు రోజుల క్రితం ఊరట లభించిన విషయం తెలిసిందే. నిత్యానందకు వ్యతిరేకంగా దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని (పిల్‌ను) మదురై కోర్టు గురువారం డిస్మిస్ చేసింది. మదురై ఆధీనం జూనియర్ పీఠాధిపతిగా నిత్యానంద స్వామి నియామకాన్ని వ్యతిరేకించిన కంచి కామకోటి మఠం జయేంద్ర సర్వసతి స్వాములు కోర్టులో పిల్ దాఖలు చేశారు.

నిత్యానందను జూనియర్ పీఠాధిపతిగా నియమించడం పట్ల కంచి స్వామి అసంతృప్తితో ఉన్నారు. నిబంధనల ప్రకారం నిత్యానంద తలను వెంట్రుకలు లేకుండా క్షవరం చేసుకోలేదనేది ఆయన అభ్యంతరం. మదురై ఆధీనం ఆచారం ప్రకారం పీఠాధిపతులు తప్పకుండా తలపై వెంట్రులు ఉండకూడదు. అదే సమయంలో రుద్రాక్షలు ధరించాలి. కొన్నాళ్ల క్రితం నిత్యానంద అవాంఛనీయమైన వివాదంలో కూడా చిక్కుకున్నారు.
Source:thatstelugu

Monday, May 7, 2012

మంచి ఇల్లాలు కావాలంటే...



వివాహ జీవితం గురించి మధుర భావనలతోపాటు కొన్ని సందర్భాల్లో ఎదురయ్యే చేదు అనుభవాల గురించి కూడా ఎంతో కొంత అవగాహన ఉండాలి. అప్పుడే ఇల్లాలిగా మహిళ తన పాత్రను చాకచక్యంగా నిర్వహించగలదు.
పెళ్లిచేసి అత్తవారింటికి పంపే సమయంలో కూతురికి నిన్నటి తరం వారు ఎన్నో జాగ్రత్తలు చెప్పేవారు. ప్రస్తుత కాలంలో అలా చెప్పి పంపేవారు లేరు. ఇప్పటివాళ్ళకు చెప్పే అవసరం లేదు. ఈ కాలం వాళ్ళు మనం చెబితే వింటారా? అంటున్నారు. కానీ ఇది తప్పు. నేటి యువతులు చదువు సంధ్యల్లో, వేషభాషల్లో పరిణతి ఉందనుకున్నా, మానసికంగా పరిపూర్ణత సాధించని అమాయకులే అనే విషయాన్ని గ్రహించాలి. కోడలు నిర్వహించే పాత్ర అత్తవారింటి పరిస్థితులమీద ఆధారపడి ఉంటుంది.
పుట్టింటి పరిస్థితులకు, అత్తవారింటి పరిస్థితులకు వైరుధ్యాలు ఉండవచ్చు. ఇక్కడి స్వేచ్ఛ అక్కడ లేకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో పుట్టింటివారిచ్చిన సలహాలను పాటించి, లౌక్యం అలవరచుకోవడం ద్వారా చాలావరకు సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. సమస్యల పరిష్కారంలో ముఖ్యంగా పాటించాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి. అవేమిటంటే-
తీ కుటుంబ వ్యవస్థగురించి మంచి అవగాహన కలిగి ఉండడం, వివాహ వ్యవస్థ పట్ల నమ్మకం కలిగి ఉండడం, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఒకరి సమస్యల పట్ల మరొకరు సరైన రీతిలో స్పందించగలగడం.
తీ మంచి స్నేహితుల్ని కలిగి ఉండటం, అసూయ, ద్వేషాలను పక్కకు నెట్టి, ప్రతి చిన్న విషయానికి ఆగ్రహించటం వంటివి తగ్గించుకోవడం.
తీ ఏదైనా సమస్య ఎదురైనప్పుడు, భయపడి పారిపోకుండా, ధైర్యంగా ఎదుర్కొని పరిష్కార మార్గాన్ని అనే్వషించడమనేది ఎంతో ముఖ్యమైన అంశం.
తీ కొత్త పెళ్లికూతురు అత్తగారింట్లో నడుచుకోవలసిన తీరు గురించి నిన్నటి తరం పెద్దలు చెప్పే ప్రతి అంశంలోనూ సైకాలజీ ఇమిడి ఉంది. ఇపుడది లేదు గనుకనే వధూవరుల మధ్య, అత్తా కోడళ్ళ మధ్య అభిప్రాయభేదాలు తలెత్తుతున్నాయి.
తీ ఇల్లాలిగా తన పాత్రను విజయవంతంగా నిర్వహించగల వ్యక్తిత్వాన్ని పెళ్లికిముందే సంతరించుకోవాలి. ముందుగా అందుకు సిద్ధం చేసే బాధ్యతను కుమార్తెకు పెళ్ళిచేయబోయే తల్లిదండ్రులు స్వీకరించాలి. ఆదర్శ ఇల్లాలిగా, కోడలిగా, భార్యగా, వదినగా, తల్లిగా రాణించాలంటే నేర్పుతో పాటు ఓర్పూ ఎంతో అవసరం. ఏ పని చేయాలన్నా కావలసింది శారీరక, మానసిక ఆరోగ్యం. వివాహం చేసుకోబోయే వధూవరులు శారీరకంగా, మానసికంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి. వైవాహిక జీవితానికి సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే కౌనె్సలింగ్‌కి వెళ్ళడం మంచిది.
తీ ఆలుమగలు చిలకాగోరింకల్లా ఉండాలనే వారు పెద్దలు. ఇప్పుడు అదే విషయాన్ని ఆధునికులు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటున్నారు. అనురాగం పంచుకుంటూ అభిప్రాయలూ, అభిరుచులూ గమనించుకుంటూ ఒకరికి ఒకరుగా జీవించాలి. ఆలుమగలు మాత్రమే ఉంటే స్వేచ్ఛగా ఉంటుందనే భావన చాలామందిలో ఉంది. సంసారమంటే స్వేచ్ఛ ఒక్కటే కాదు. కాబట్టి విచ్ఛిన్నమైన ఉమ్మడి కుటుంబాల ప్రాధాన్యత గుర్తించి, సైకాలజిస్టులు మళ్ళీ ఆ కుటుంబాల ఆవశ్యకతను తెలియజేస్తున్నారు. ఉమ్మడి కుటుంబంలో ఉండే కోడలు అత్తమామల్ని, ఆడబిడ్డల్ని, మరుదుల్ని చిన్నచూపు చూడకుండా సంసారంలో వాళ్ళ అవసరాన్ని గుర్తించి, చక్కగా ఉపయోగించుకుంటే, తన పిల్లల భవిష్యత్తుకు కూడా ఎంతో లాభం.

Source: Andhrabhoomi

Saturday, May 5, 2012

వేలంలో గాంధీ వస్తువులు దక్కించుకున్న వ్యాపారి

లండన్‌లో వేలం వేసిన మహాత్మాగాంధీకి చెందిన వస్తువులను ముంబయికి చెందిన ప్రముఖ వ్యాపారి దక్కించుకున్నారు. యుకెలోని ముల్లక్ అనే సంస్థ గాంధీ వస్తువులను మార్చి నెలలో వేలం వేసింది. బాపూజీ వస్తువులను వేలంలో తాను దక్కించుకున్నట్టు మాజీ కేంద్ర మంత్రి, పబ్లిషర్ కమల్ మోరార్కర్ వెల్లడించారు. వాటిని త్వరలోనే భారత్‌కు తీసుకురానున్నట్టు తెలిపారు. గాంధీ హత్యా స్థలం నుంచి సేకరించిన రక్తంతో తడిచిన గడ్డి, మట్టి కళ్ళజోడు, చెక్కతో చేసిన చరఖా గాంధీ సంతకంతో ఉన్న పత్రాలు, ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన కొన్ని లేఖలు వేలంలో దక్కించుకున్నట్టు చెప్పారు. వేలంలో లక్ష పౌండ్లకు పైనే చెల్లించానని అన్నారు.
వస్తువులను ఢిల్లీ జాతీయ లైబ్రరీలో ప్రదర్శించడానికి ప్రభుత్వం ముందుకు వస్తే సంతోషమని అంటూ వ్యాపార దృక్పధంతో వాటిని కొనలేదని వివరించారు. మోరార్కర్ ఫౌండేషన్ ఆఫ్ ఆర్ట్స్ తరఫున కొనుగోలు చేసిన వాటిని తిరిగి విక్రయించాలనే ఉద్దేశం తమకు లేదని చెప్పారు. జాతి సంపద బయట వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోకూడదనే ఉద్దేశంతోనే పాల్గొన్నట్టు పేర్కొన్నారు. త్వరలోనే వాటిని భారత్‌కు తీసుకురానున్నట్టు మోరార్కర్ వెల్లడించారు.

Thursday, May 3, 2012

ఎటుపోతోంది ఈ ప్రేమోన్మాదం ...



‘ప్రేమ’ అనే రెండక్షరాలకు ఇరు హృదయాలను కలపడమే కాదు.. మనసుల్ని గాయపరచడం, మనుషుల్ని హతమార్చడం కూడా తెలుసు. ప్రేమ ఉన్మాదంగా మారడంతో దేశ వ్యాప్తంగా పలురకాల నేరాలు నిత్యకృత్యమవుతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు, భౌతిక దాడులు, సంఘ బహిష్కరణలు, ‘పరువు హత్య లు’ వంటి నేరాలకు ప్రేమే కారణం కావడం పట్ల సామాజిక వేత్తలు ఎంతగానో ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం, కట్టుబాట్లకు కాలం చెల్లిపోవడం వంటి పరిస్థితుల్లో ప్రేమ పేరిట విచ్చలవిడి శృంగారం, అనైతిక సంబంధాలు నానాటికీ అధికమవుతున్నాయి.
ఈ సంస్కృతి దేశవ్యాప్తంగా వెర్రితలలు వేస్తున్నప్పటికీ, తమిళనాడులో ప్రేమోన్మాద నేరాల సంఖ్య పోలీసులను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రేమలు, లైంగిక సంబంధ నేరాల సంఖ్య చెన్నై నగరంలో ఇటీవలి కాలంలో 125 శాతం పెరిగినట్లు పోలీసుశాఖ గణంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ తరహా నేరాలు 2008లో 155 నమోదు కాగా, 2011లో ఆ సంఖ్య 341కు చేరడం గమనార్హం. ప్రేమ సంబంధ వ్యవహారాలతో పేరుకుపోతున్న హత్యలు, ఆత్మహత్యలు, దాడుల కేసులను పరిష్కరించడం పోలీసులకు తలకుమించిన భారంగా పరిణమించింది. ప్రేమను కాదన్న యువతులను హత్య చేయడం, పెళ్లికి పెద్దలు నిరాకరించారని ప్రేమజంటలు ఆత్మహత్యలకు పాల్పడడం, కులాంతర ప్రేమకు సిద్ధపడిన కుమార్తెలను తల్లిదండ్రులే కడతేర్చడం వంటి సంఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతునే ఉన్నాయి.
ఈ తరహా నేరాలు క్షణికావేశంలోనే అధికంగా జరుగుతున్నందున వీటిని ముందుగా పసికట్టడం అసాధ్యమని పోలీసులు అంటున్నారు. ప్రేమ వ్యవహారాల్లో మానసికంగా దెబ్బతిన్న వారు ఎప్పుడు, ఏ రకంగా నేరం చేస్తారో ఎవరికీ తెలియదని వారు చెబుతున్నారు. ప్రేమోన్మాదంతో ప్రవర్తించే వారి కదలికలను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులే కనిపెట్టాలని పోలీసులు సలహా ఇస్తున్నారు. చాలా సందర్భాల్లో నేరం జరిగిన తర్వాతే ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలు వెలుగు చూస్తుంటాయని, ఈ తరహా నేరాలను ముందుగా అంచనాకు రావడం సాధ్యం కాదని పోలీసులు విశే్లషిస్తున్నారు. కాగా, సమాజ పరమైన కట్టుబాట్ల వల్ల కొంతమంది బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోవడంతో తాము ఏమీ చేయలేని పరిస్థితి ఉందని పోలీసులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సాక్ష్యాలు కనుమరగవడం, కోర్టుకు వచ్చేందుకు స్థానికులు ముందుకు రాకపోవడంతో నిందితులకు శిక్షలు పడే అవకాశాలు తగ్గుతున్నట్లు కూడా పోలీసులు అంగీకరిస్తున్నారు.
సెల్‌ఫోన్లు, ఎస్‌ఎంఎస్‌లు, ఇ-మెయిల్స్, సామాజిక వెబ్‌సైట్ల వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కొంతమంది అనైతిక పనులను వాడుకోవడం వల్ల నేరాల సంఖ్య పెచ్చుమీరుతోందని మానసిక విశే్లషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలకు సైతం ఇంటర్నెట్ సౌకర్యం విస్తృతం కావడంతో కొంతమంది యువతీ యువకుల్లో విచ్చలవిడితనం పెరిగినట్లు సామాజిక వేత్తలు గుర్తించారు. ఎదిగిన పిల్లల కదలికలపై తల్లిదండ్రులు నిఘా ఉంచే పరిస్థితులు నేడు అంతగా లేకపోవడంతో ప్రేమ వ్యవహారాల ఆచూకీ అంతుపట్టడం లేదు. తాత్కాలిక ఆనందాల కోసం నైతిక విలువలను విస్మరించడం వల్లే ఈ దుర్గతి నెలకొందని, యువత పెడ ధోరణులతో కుటుంబ సంబంధాలు క్షీణిస్తున్నాయని విద్యావేత్తలు సైతం ఆవేదన చెందుతున్నారు.
సాంకేతిక పరిజ్ఞానం, విదేశీ సంస్కృతి కారణంగా ‘లక్ష్మణరేఖ’ను దాటేందుకు యువత ఏ మాత్రం వెనుకంజ వేయడం లేదు.
ఈ నేపథ్యంలోనే ఏకపక్ష ప్రేమలు, ముక్కోణపు ప్రేమలు, వివాహేతర సంబంధాలు వంటివి చోటు చేసుకుంటున్నాయి. కాగా, విడాకులకు సంబంధించి విదేశీ సంస్కృతి ప్రభావంతో కొత్తగా పెళ్లయిన దంపతులు సైతం విడిపోయేందుకు జంకడం లేదు.
ఇక ప్రేమలు, పెళ్లిళ్లు, లైంగిక విజ్ఞానం వంటి విషయాలపై యువతలో తగిన అవగాహన కల్పించేందుకు కుటుంబ పరంగా కానీ, సమాజ పరంగా గానీ ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. మానసిక అపరిపక్వతతో యువతీ యువకులు క్షణికావేశంలో నేరాలకు పాల్పడుతున్నారని, వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు వంటి విషయాలకు విద్యా బోధనలో ఎక్కడా చోటు లేకపోవడంతో ప్రేమోన్మాద సంస్కృతి పెచ్చుమీరిపోతోందని మానసిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Source: Andhrabhoomi