Monday, June 18, 2012

మహిళా సంక్షేమంలో కెనడా భేష్విద్య, ఉపాధి రంగాల్లో పురుషులతో పాటు మహిళలు కూడా ఎంతో ముందుకు దూసుకుపోతున్నారని మన పాలకులు ఎంతగా గొప్పలు చెబుతున్నా- వాస్తవ దృశ్యం ఇందుకు భిన్నంగా ఉంది. బాల్య వివాహాలు, బానిసత్వం, భ్రూణహత్యల వంటి ప్రతికూల అంశాలతో మన దేశం అగ్రభాగాన నిలిచింది. ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన జి-20 దేశాలతో పోల్చిచూస్తే మహిళా సంక్షేమానికి సంబంధించి కెనడా ముందంజలో ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆరోగ్య సంరక్షణ, ఉపాధి, సమానత్వం, భద్రత వంటి విషయాల్లో తగిన విధాన నిర్ణయాలతో మహిళలకు అండగా నిలవడంలో కెనడా ప్రశంసనీయమైన పాత్రను పోషిస్తోంది. మహిళల హక్కులను పరిరక్షించడంలో, వారికి తగిన స్వేచ్ఛ ఇవ్వడంలో ఈ దేశం మెరుగైన విధానాలను అమలు చేస్తోంది. ఆరోగ్యం, విద్య, ఆర్థిక స్వాతంత్రం వంటి విషయాల్లో మహిళలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని ఇటీవల మెక్సికోలో జరిగిన ఓ సదస్సులో కెనడా ప్రతినిధి ఫరా మొహముద్ చెప్పారు. పౌరహక్కులు, గృహహింస చట్టాలు, విద్యకు అవకాశాలు, ఉపాధి కల్పన, భావ ప్రకటన స్వేచ్ఛ వంటి విషయాల్లో అమెరికా వంటి సంపన్న దేశాలు వెనుకబడే ఉన్నాయ. ఇవే విషయాల్లో భారత్‌తో పాటు చాలా దేశాలు ఎంతో సాధించాల్సి ఉందని సర్వేలో గుర్తించారు.
మహిళా సంక్షేమానికి సంబంధించి కెనడా తర్వాతి స్థానంలో జర్మనీ, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, అమెరికా, జపాన్ ఉండగా 20వ స్థానంలో ఇండియా నిలిచిందని అధ్యయనం నిర్వహించిన ‘ట్రస్ట్ లా’ సంస్థ ప్రకటించింది. సౌదీ అరేబియాలో మహిళలు విద్యారంగంలో రాణిస్తున్నప్పటికీ వారికి వాహనాలను నడిపేందుకు అనుమతించక పోవడం గమనార్హం. ఈ దేశంలోని మహిళలకు ఈ మధ్యనే ఓటు హక్కు మాత్రం కల్పించారు. ‘సౌదీ అరేబియా సంపన్న దేశం, భారత్ పేదరికంతో సతమతమవుతున్న దేశం.. అయినప్పటికీ ఈ రెండు చోట్లా మహిళలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నార’ని సర్వే నిపుణులు అభిప్రాయపడ్డారు. మహిళల హక్కుల కోసం చాలా దేశాల్లో చట్టాలు చేస్తున్నా ఆశించిన మేరకు ఫలితాలు దక్కడం లేదన్నందుకు భారత్ ఓ ఉదాహరణగా నిలుస్తోంది. బాల్యవివాహాలు, వరకట్నం, భ్రూణహత్యలు, లింగ నిర్ధారణ పరీక్షలు, గృహహింసను అరికట్టేందుకు భారత్‌లో ఎన్నో చట్టాలు చేస్తున్నారు. పాత చట్టాలను సవరణల పేరిట ఆధునీకరిస్తున్నారు. అయినప్పటికీ, మన దేశంలో ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతునే ఉన్నాయి. కట్నం వేధింపులు, మహిళలపై హింస యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే జి-20 దేశాల అధిపతుల సమావేశం నేపథ్యంలో వివిధ అంశాలపై అధ్యయనం చేయగా, పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. ‘్భరత్‌లో మహిళలు, బాలికలు హింస, బానిసత్వం, వివక్ష కారణంగా సతమతమవుతున్నార’ని బ్రిటన్‌లోని ‘సేవ్ ది చిల్డ్రన్’ సలహాదారు గుల్షన్ రెహమాన్ అంటున్నారు. లింగ వివక్ష వల్ల మహిళలకు భారత్‌లో భద్రత,్భవిత లేకుండా పోతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆరోగ్య సంరక్షణ, హింస నుంచి విముక్తి, రాజకీయ ప్రాతినిధ్యం, ఉపాధి అవకాశాలు, విద్య, ఆస్తిహక్కు, స్వేచ్ఛ, సామాజిక భద్రత వంటి కీలక విషయాలకు సంబంధించి ఆరు కేటగిరీలుగా విభజించి జి-20 దేశాల్లో పరిస్థితులను నిపుణులు విశే్లషించారు. 63 దేశాలకు చెందిన ప్రతినిధులు, పలు అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు అధ్యయనంలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. మహిళలకు సంబంధించి కెనడాలో సానుకూల పరిస్థితులు ఉన్నాయని మెజారిటీ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, ఆర్థిక స్వాతంత్య్రం, భద్రత వంటి విషయాల్లో మహిళలకు ఎంతో చేయాల్సి ఉందని వారు సూచించారు. కొన్ని దేశాల్లో ప్రమాదకరమైన గర్భస్రావాల కారణంగా మహిళల ఆరోగ్యం ప్రమాదాల బారిన పడుతోందని ఆందోళన చెందారు. లింగ వివక్ష, హింస నివారణకు కెనడా అనుసరిస్తున్న వినూత్న విధానాలు ఇతర దేశాలు ఆదర్శప్రాయమని నిపుణులు సూచిస్తున్నారు.

Source: Andhrabhoomi

Wednesday, June 13, 2012

జగన్ పార్టీ కేంద్రంగా ఊపందుకున్న పందేలు

ఒకప్పుడు క్రికెట్ ఆటకే పరిమితమైన బెట్టింగ్‌లు కొంతకాలంగా రాజకీయాలకు సైతం పాకాయి. గతంలో వన్‌డే క్రికెట్ మ్యాచ్‌లు, వరల్డ్‌కప్ మ్యాచ్‌లు, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్‌లు జోరుగా కాసేవారు. ఇప్పుడు ఆ బెట్టింగ్‌లు రాష్ట్రంలో, దేశంలో జరిగే ఎన్నికల, ఉప ఎన్నికలపై సైతం కాస్తున్నారు. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో సైతం జగన్ పార్టీ గెలుపుపై కోట్ల రూపాయల బెట్టింగ్‌లు జరిగినట్లు సమాచారం. రాష్ట్రంలో 18 అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి మంగళవారం ఎన్నికలు జరిగాయి. ఈ స్థానాలను గెల్చుకునేది ఎవరన్న దానిపై జోరుగా బెట్టింగ్‌లు నడుస్తున్నట్లు సమాచారం. ఇందులో టోకుగానూ, రిటైల్‌గానూ బెట్టింగ్‌లు ఉండటం విశేషం. మొత్తంగా జగన్‌కు ఎన్ని వస్తాయన్నది ఒక బెట్టింగ్ అయితే.. ఎక్కడెక్కడ ఎవవరు గెలుస్తారు? ఎంత మెజార్టీ వస్తుంది? అనే కేటగిరీల్లో సైతం బెట్టింగ్ రాయుళ్లు నోట్లు బయటికి తీస్తున్నారు. ఈ బెట్టింగ్‌ల ద్వారా కోట్లు చేతులు మారే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత ఉప ఎన్నికల ఫలితాలు ఈ నెల 15న వెల్లడికానున్నాయి. అప్పటిదాకా ఈ జోరు మరింత పెరుగుతుందే తప్పించి.. తగ్గే అవకాశాల్లేవని పలువురు పందెంరాయుళ్లు చెబుతున్నారు. రెండు నెలల క్రితం జరిగిన ఉప ఎన్నికల సమయంలో కూడా బెట్టింగ్ జోరుగా జరిగింది. ముఖ్యంగా కోస్తాంవూధాలోని కోవూరు అసెంబ్లీ స్థానం నుంచి జగన్ పార్టీ తరఫున బరిలో దిగిన నల్లపుడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై కొందరు జోరుగా పందేలు కాసినట్లు వార్తలు వచ్చాయి. జగన్ పార్టీకి ఇక్కడ భారీ మెజారిటీ దక్కుతుందని, ప్రసన్నకుమార్‌డ్డి 40 వేలకు పైగా మెజారిటీతో గెలుస్తాడంటూ పందేలు నడిచాయి. అయితే ఆ ఎన్నికల్లో వారు ఆశించిన మేరకు ఆయనకు మెజారిటీ రాలేదు. ప్రస్తుతం కేసుల్లో ఇరుక్కుని జైల్లో ఉన్న జగన్ కేంద్రంగా వైఎస్‌ఆర్సీ అభ్యర్థులపైనే బెట్టింగ్‌లు ఎక్కువగా నడుస్తున్నాయి. అయితే ఈ సారి జగన్ పార్టీ అత్యధిక స్థానాలు గెల్చుకుంటారా? ఆ పార్టీ అభ్యర్ధులు భారీ మెజారిటీతో విజయం సాధిస్తారా?, లేక కోవూరు ఫలితం పునరావృత్తమై పందాలు కాసిన వారి జేబులకు చిల్లు పడుతుందా? అనేది మరో మూడు రోజుల్లో తేలనున్నది.

Tuesday, June 12, 2012

భారత్, చైనాల్లో ఆర్థిక వృద్ధిరేటు మందగమన సంకేతాలు: ఓఈసీడీ


ప్రపంచంలోనే జోరైన వృద్ధిరేటును కనబరుస్తున్న భారత్, చైనాల్లో మందగమనం సంకేతాలు వెలుగుచూస్తున్నాయని పారిస్‌కు చెందిన ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోపరేషన్ అండ్ డెవలప్‌మెంట్(ఓఈసీడీ) పేర్కొంది. మరోపక్క, జపాన్, అమెరికా, రష్యాల్లో ఆర్థిక వృద్ధిరేటు మెరుగవుతోందని తెలిపింది. ఒక దేశ ఆర్థిక కార్యకలాపాల్లో టర్నింగ్ పాయింట్‌లకు తొలి సంకేతంగా భావించే కాంపోజిట్ లీడింగ్ ఇండికేటర్స్(సీఎల్‌ఐ) ఆధారంగా గుర్తించిన తాజా గణాంకాల ప్రకారం ఓఈసీడీ ఈ వివరాలను వెల్లడించింది.

భారత్, చైనాల దీర్ఘకాలిక ఆర్థిక కార్యకలాపాల ధోరణి సీఎల్‌ఐ పాయింట్ ప్రకారం మార్చి తర్వాత తగ్గుముఖం పట్టిందని వివరించింది. భారత్ సీఎల్‌ఐ మార్చిలో 98.2 కాగా, ఏప్రిల్‌లో ఇది 98కి తగ్గింది. అదేవిధంగా చైనా సీఎల్‌ఐ మార్చిలో 99.4గా నమోదైంది. ఏప్రిల్‌లో 99.1కి తగ్గింది. గతేడాది భారత్ వృద్ధిరేటు తొమ్మిదేళ్ల కనిష్ట స్థాయి అయిన 6.5 శాతానికి పడిపోయిన నేపథ్యంలో ఓఈసీడీ అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Friday, June 8, 2012

గెలుపు ఎలాగూ దక్కదని డబ్బు పంపిణీని నిలిపివేసిన టిడిపి, కాంగ్రెస్

అత్యంత కీలకంగా భావిస్తున్న ఉప ఎన్నికల్లో వారం రోజులుగా ఉధృతస్థాయిలో ప్రచారం చేస్తున్న అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు ఫలితాలపై స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఉప ఎన్నికల్లో నిధుల వరదను నిలిపివేశాయి. అధికార కాంగ్రెస్ అయితే అనుకున్న మొత్తంలో సగం నిధులకు కోత విధించింది. తెలుగుదేశం కూడా ఖర్చును తగ్గించినప్పటికీ, కాంగ్రెస్ కన్నా ఎక్కువే ఖర్చు పెడుతోంది. ఉప ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా ఉండొచ్చని మొదట్లో అనుకున్నారు. పోటీలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నందున ఎన్నికల్లో డబ్బును కూడా భారీగానే ఖర్చు పెట్టవచ్చని భావించారు. ముఖ్యంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు భారీ మొత్తంలోనే ఖర్చు పెట్టేందుకు మొదట్లో ప్రణాళికలు రూపొందించాయి. అనుకున్న మొత్తంలో ఇప్పటి వరకు సగం వరకు ఖర్చు పెట్టారు. మిగిలిన సగం ఖర్చు పెట్టాల్సిన ప్రస్తుత కీలక సమయంలో రెండు పార్టీలు నిలిపివేశాయి. ‘అవసరమైన’ నియోజకవర్గాల్లో మాత్రమే ఖర్చు పెట్టాలని నిర్ణయించాయి.
పద్దెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఒక లోక్‌సభ స్థానానికి 12న ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఫలితాలు ఏకపక్షంగా ఉండవన్న ఉద్దేశంతో రెండు ప్రధాన పార్టీలు భారీ మొత్తంలోనే ఖర్చు పెట్టేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నాయి. ఎంతెంత ఇస్తామన్న విషయాన్ని పోటీలో ఉన్న అభ్యర్థులకు కూడా తెలియజేశాయి. తొలి విడతలో రెండు పార్టీలు ధారాళంగానే ఖర్చుపెట్టాయి. కనీసం ఐదారు స్థానాలను గెలుచుకోగలమన్న నమ్మకంతో రెండు పార్టీలు మొదట్లో ఉన్నాయి. ఎప్పటికప్పుడు సర్వేలు జరిపిస్తూ తాజా పరిస్థితిని రెండు పార్టీలు అంచనాలు వేసుకుంటున్నాయి. కొన్ని స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మధ్య వ్యత్యాసం రెండు, మూడు శాతం ఓట్లు మాత్రమే ఉన్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పర్యటనకు ముందు ఆ పార్టీలు తెప్పించుకున్న సర్వే నివేదికల్లో తేలింది. కొద్దిగా కష్ట పడితే మొదటి స్థానానికి చేరుకోవచ్చని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అనుకున్నాయి. అయితే విజయమ్మ పర్యటన తర్వాత ఆమె ప్రభావం ఎలా ఉందన్న దానిపై తాజాగా సర్వే నివేదికలను తెప్పించుకున్నాయి. గతంలో రెండు, మూడు శాతం ఓట్లు తేడా ఉన్న నియోజకవర్గాల్లో విజయమ్మ పర్యటన తర్వాత ఐదు నుంచి పది శాతం ఓట్లు తేడా ఉన్నట్టు తేలడంతో రెండు పార్టీల నాయకత్వాలు విస్తుపోయాయి. దీంతో పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ రెండు పార్టీలు ఆశలను క్రమంగా వదులుకుంటున్నాయి. ఈ పరిస్థితిలో భారీ మొత్తంలో ఖర్చు పెట్టడం దండగన్న అభిప్రాయానికి రెండు పార్టీలు వచ్చాయి. కాంగ్రెస్‌కు చెందిన కీలక నాయకుడు ఒకరు మూడు స్థానాల్లో తమకు గెలిచే అవకాశం ఉందని చెబుతూంటే, మరో ముఖ్య నాయకుడు ఐదారు స్థానాలను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. గెలుస్తామన్న స్ధానాల సంఖ్యను ఒక్కోటి తగ్గించుకుంటూ వస్తున్నాయి. క్రమంగా ఫలితాలపై అంచనాకు వస్తున్న పార్టీలు ఆచితూచి ఖర్చు పెడుతున్నాయి. గెలిచేందుకు ఏమాత్రం అవకాశం లేదనుకుంటున్న నియోజకవర్గాలకు నిధుల పంపిణీని పూర్తిగా నిలిపివేశాయి. దీంతో తమకు రెండో విడత నిధులు అందలేదంటూ పోటీలోని అభ్యర్థులు తమతమ నాయకత్వాలపై ఒత్తిడి తెస్తున్నారు. గెలిచేందుకు అవకాశం ఉందనుకుంటున్న నియోజకవర్గాల్లో మాత్రం రెండోవిడత నిధుల విడుదలకు సన్నాహాలు చేస్తున్నాయి.
మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా తిరుపతి
ఉప ఎన్నికలు జరుగుతున్న పద్దెనిమిది నియోజకవర్గాల్లో ఒక్క తిరుపతిని మాత్రం కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మిగిలిన నియోజకవర్గాల్లో కన్నా ఈ నియోజకవర్గంలో నిధులన్ని కొద్ది ఉదారంగానే ఖర్చు పెడుతున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిది, ప్రతిపక్ష నేత చంద్రబాబుది కూడా చిత్తూరు జిల్లా కావడం, తిరుపతి నియోజకవర్గానికి నిన్నటి వరకు చిరంజీవి ప్రాతినిధ్యం వహించిన నేపథ్యంలో తిరుపతిలో గెలుపొందటడం ద్వారా ముగ్గురు ముఖ్య నేతలను దెబ్బ కొట్టవచ్చని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్, చిరంజీవి కూడా తిరుపతిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నియోజకవర్గంపై వారిద్దరూ ప్రత్యేక దృష్టి పెట్టారు. తిరుపతి నియోజకవర్గంలో గెలిచినట్లయితే జగన్‌ను, ప్రతిపక్ష నేత చంద్రబాబును దెబ్బతీసినట్టు అవుతుందని ముఖ్యమంత్రి కిరణ్ అనుకుంటున్నారు. ఇక చంద్రబాబు కూడా తన సొంత జిల్లాలోని నియోజకవర్గం అయినందున ఆయన కూడా ఇక్కడ ప్రత్యేక దృష్టి సారించారు. తిరుపతిలో గెలుపొందినట్లయితే ముఖ్యమంత్రి కిరణ్‌ను నైతికంగా దెబ్బతీసినట్టు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.

This Article Source: Andhrabhoomi Daily.