Thursday, March 29, 2012

తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ రంగానికి అమ్ముడుపోయింది: హరికృష్ణ


న్యూఢిల్లీ, మార్చి 28: ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమారుడు. ప్రస్తుతం అదే పార్టీకి అధినేతగా కొనసాగుతున్న చంద్రబాబునాయుడుకు స్వయానా బావమరిది. అయినప్పటికీ ఇతరులకు లభిస్తున్న గౌరవంలో కాస్త అయినా తనకు దక్కడం లేదని, పార్టీలో సరైన ప్రాధాన్యత లభించటం లేదన్న ఆవేదనతో కుమిలిపోతున్నారు. పార్టీలోనేగాక చివరకు పార్లమెంటులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూడా తనకు తగిన స్థానం లభించటం లేదన్న భావన ఆయనను వెంటాడుతోంది. ఆయనే రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ. ఎన్టీఆర్ తనయుడైనప్పటికీ పార్టీ కార్యాలయం బయట సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన సోఫాలో కూర్చుంటున్నారు హరికృష్ణ. ఇదేమని అడిగితే తెలుగుదేశం పార్టీ కార్యాలయం లోపల కూర్చోవటానికి తగినన్ని కుర్చీలు లేవని, కార్యాలయంలోని మొత్తం సీట్లు కార్పొరేట్ రంగానికి, వారి ప్రతినిధులకు రిజర్వ్ అయిపోయాయని అంటున్నారు. తన తండ్రి ఎన్టీఆర్ పేదవారి కోసం, కష్టించి పనిచేసే కార్యకర్తల కోసం ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పూర్తిగా వేలాది కోట్లకు పడగలెత్తిన కార్పొరేట్ రంగానికి అమ్ముడుపోయిందని హరికృష్ణ బుధవారం తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో మధుకాన్ సంస్థ అధిపతి నామా నాగేశ్వర్‌రావు, సృజనా సంస్థల అధిపతి వైఎస్ చౌదరి, రాంకీ గ్రూప్‌నకు చెందిన ఎం వేణుగోపాల్ రెడ్డి పార్టీలో కార్పొరేట్ రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారన్న ఆయన ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన సిఎం రమేష్, దేవేందర్ గౌడ్ ఎంపికపైనా అసంతృప్తి వ్యక్తంచేశారు. సిఎం రమేష్ వ్యాపార రంగానికి చెందిన వారేనని, దేవేందర్ గౌడ్‌కు కూడా రియల్ ఎస్టేట్, ఫార్మా పరిశ్రమతో సంబంధాలున్నాయన్నారు. ఫలితంగా పార్లమెంటులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం రాజకీయ పార్టీ కార్యాలయంగాక ఒక కార్పొరేట్ కార్యాలయానికి దిగజారిందని పార్టీ అధినేత వైఖరి పట్ల తీవ్ర నిరసనను వ్యక్తంచేశారు.
అయితే పార్టీ అధినేత చంద్రబాబుతో తీవ్రంగా విభేదిస్తున్న హరికృష్ణ ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో వ్యవహరిస్తున్న తీరు పార్టీలోని కార్పొరేట్ దిగ్గజాలకు కలవరం పుట్టిస్తోంది. రాజ్యసభలో ఒంటరిగా కూర్చుంటున్న ఆయన కనీసం పార్టీ కార్యాలయంలో అడుగు పెట్టేందుకు సైతం అయిష్టత ప్రదర్శిస్తున్నారు. దీంతో హరికృష్ణను బుజ్జగించి పార్టీలో అభిప్రాయభేదాలు లేవని నమ్మించటానికి సీనియర్ నాయకులు పడరానిపాట్లు పడుతున్నారు

1 comment:

  1. hii.. Nice Post Great job. Thanks for sharing.

    Best Regarding.

    www.ChiCha.inMore Entertainment

    ReplyDelete