Saturday, March 31, 2012

ఆత్మీయ స్పర్శతో నూతనోత్తేజంఒకోసారి మాటలకన్నా.. సంఘటనలకన్నా.. చల్లటి ఆత్మీయతతోకూడిన స్పర్శ ఎంతో రిలాక్సింగ్‌గా, సంతోషంగా అనిపిస్తుంది. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. గతంలో పెద్దవాళ్లు తమ పాదాలను తాకి నమస్కరించిన చిన్నవాళ్ళను లేవనెత్తి తలపైఆత్మీయంగా స్పృశిస్తూ ఆశీర్వదించేవారు. వారి స్పర్శ,ఆశీర్వాద బలం చిన్నవాళ్లలో విద్యుత్‌లా ప్రవహించి విజయాలకు కారణమవుతుంది.
తల్లి ఒడిలోని హాయి, చల్లని చేతుల స్పర్శను మించినది లేనే లేదని మనోవిశే్లషకులు కూడా నిర్థారిస్తున్నారు. స్పర్శను బటి,్ట స్పృశించబడే శరీర భాగాలను బట్టి వారిమధ్య రిలేషన్‌షిప్‌ని గుర్తించడం మనకు సాధ్యమవుతుంది. నేడు జనజీవనంలో పాశ్చాత్య అలవాట్లు ఎక్కువగానే కనబడుతున్నాయి. ఫంక్షన్ జరుగుతున్నపుడు చాలామంది సెలబ్రిటీస్ ఆడవారైనా, మగవారైనా కరచాలన స్పర్శతో మాత్రమే ఆగటంలేదు. గాఢంగా ఆలింగనం చేసుకుని ఒకరినొకరు వీపు తట్టి అభినందించుకోవటం కూడా చూస్తున్నాం.
ఆత్మీయుల స్పర్శ, అపరిచితుల స్పర్శ ఇట్టే తెలిసిపోతుంది. మిత్రురాలు భుజం మీద చేయివేస్తే ఏమీ అనిపించదు. అదే అపరిచిత వ్యక్తి భుజం మీద చేయివేస్తే వెంటనే రియాక్ట్ అవుతాం. పసిపిల్లల సంగతే తీసుకోండి- ఎంతమంది ఎత్తుకొని జోకొట్టి లాలించినా ఏడుపు ఆపరు. అదే తల్లిచేతుల్లోకి తీసుకోగానే వెంటనే ఏడవటం ఆపేస్తుంటారు. చక్కిలిగింత అందరికీ ఒకేలా ఉండదు. అదివారి వారి మనోస్థితిని బట్టి వుంటుంది. చక్కిలిగింత అనేది అసంకల్పిత ప్రతి చర్య. అయినా సరే కోపంలో వున్నపుడు ఎవరైనా చక్కిలిగింత పెడితే నవ్వురాదు. కానీ మంచి మూడ్‌లో ఉన్నపుడు మాత్రం చక్కిలిగింత పెడితే కిలకిలా నవ్వులు వాటంతటవే వస్తాయి.
జ్వరమొచ్చి పది లంఖణాలు చేసిన వాళ్ళ దగ్గర కూర్చుని నుదుటిమీద, బుగ్గలమీద చేయి వేసి ఆత్మీయంగా నిమురుతూ రెండు ఓదార్పు మాటలు పలికితే చాలు వారిలో కొత్త చైతన్యం పొంగుకు వచ్చి త్వరగా కోలుకుంటారు. డిప్రెషన్‌లో ఉన్నవాళ్ళకు ఓదార్పు మాటలతో పాటు కాస్త ఆత్మీయ స్పర్శ తప్పనిసరి అంటున్నారు డాక్టర్లు. ఆధ్యాత్మిక గురువుల పాదస్పర్శతో తిరిగి ఆరోగ్యాన్ని పొందవచ్చని చాలామంది గాఢంగా విశ్వసిస్తుంటారు. పాజిటివ్ వేవ్స్ ఉన్న వ్యక్తుల స్పర్శవల్ల ఇవతలివారిలో కూడా ఆ పాజిటివ్ తరంగాలు ప్రసరించి ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. ఆత్మీయులను స్పర్శించండి.. పెద్దవాళ్ళ దీవెనలను తప్పకుండా అందుకోండి. ఆ స్పర్శాభావాలతో మనసును ఉల్లాసంగా... ఉత్సాహంగా మార్చుకోండి.
-హిమజారమణ
( Collection from andhrabhoomi Daily )

No comments:

Post a Comment