Sunday, October 11, 2015

రాజమండ్రి ఇకపై "రాజమహేంద్రవరం"


రాష్ట్రంలోని ప్రముఖ నగరాలకు ఒకప్పటి ఘనమైన పేర్లను మళ్లీ పెట్టాలని భావించిన ఆంధ్రప్రదేశ్… ఆ దిశగా తొలి అడుగు వేసింది. గోదావరి పుష్కరాలను రాజమండ్రిలో ఘనంగా నిర్వహించిన సర్కారు… రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్చాలని భావిస్తున్నట్టు అప్పుడే ప్రకటించింది. అయితే దీనిపై నిర్ణయాన్ని కొంతకాలం పాటు వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వం… శనివారం జరిగిన కేబినెట్ మీటింగ్ దీనిపై నిర్ణయం తీసుకుంది. రాజమండ్రి నగరం పేరును రాజమహేంద్రవరంగా మార్చుతూ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో… త్వరలోనే దీనిపై అధికారిక ఉత్తర్వులు వెల్లడికానున్నాయి. అయితే రాజమండ్రి నగరానికి కొత్త పేరు ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అధికారులు మాత్రం దసరా నుంచి రాజమండ్రి పేరు రాజమహేంద్రవరంగా మారబోతోందని చెబుతున్నారు. పేరు మార్పుతో పాటు నగరం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించిన ముఖ్యమంత్రి చంద్రబాబు…దీనిపై ఓ కమిటీ వేయాలని కూడా అభిప్రాయపడినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యనగరాల్లో ఒకటైన రాజమండ్రిని కేవలం పుష్కరాల సమయంలోనే పట్టించుకోవడం కాకుండా… మిగతా నగరాలతో సమానంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు గట్టిగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరి పేరు మార్పుతో రాజమండ్రి దశ తిరుగుతుందేమో చూడాలి.4545145

భయం లేదు.. ప్రళయం ఇప్పట్లో రాదు


భయం లేదు.. ప్రళయం ఇప్పట్లో రాదు
లండన్: భూమికి ఇప్పుడప్పుడే అంతం లేదని.. ప్రళయం వంటి విపత్కర పరిస్థితులు ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సోమవారం హామీ ఇచ్చింది. దాదాపు 2.5 కిలోమీటర్ల వ్యాసార్థం కలిగిన ఒక గ్రహశకలం భూమిపైకి దూసుకువస్తున్నదని.. దీని వేగం.. సాంద్రతను అంచనా వేసినప్పుడు..ఒకవేళ అది భూమిని ఢీకొంటే విశ్వ వినాశనం తప్పదన్న వార్తలను నాసా కొట్టిపారేసింది.

ఆస్టరాయిడ్86666 అనే పేరు గల ఈ గ్రహశకలం శనివారం భూమికి అతి సమీపం నుంచి వెళ్తుందని ముందుగానే నాసా శాస్త్రవేత్తలు చెప్పిన సంగతి తెలిసిందే. అది భూమిని ఢీకొంటుందని.. దానివల్ల ప్రపంచం క్షణాల్లో నాశనమవుతుందని గత నెలరోజులుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే.. దీని ప్రయాణం గురించి నాసా శనివారం తెలిపింది. ‘ఆస్టరాయిడ్ 86666 అక్టోబర్ 10న భూమిని 15 మిలియన్ మైళ్ల దూరం నుంచి సురక్షితంగా దాటుతుంది.’’ అని పేర్కొంది.  రానున్న వందేళ్లలో గ్రహశకలాల వల్ల భూమికి ప్రమాదం 0.01శాతం మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది.