Sunday, March 25, 2012

పరీక్షలంటే భయం ఎందుకు? (రేపట్నుంచి టెన్త్ పరీక్షలు)

పరీక్షల కాలం వచ్చింది. దీంతో చాలామంది విద్యార్థులకు భయం పట్టుకుంటుంది. ఎలా చదవాలి? పరీక్షలు ఎలా రాయాలి? అని తెగ ఆందోళన పడుతుంటారు. నేడు పరీక్షల విషయంలో పిల్లలకంటే వారి తల్లిదండ్రులకే కంగారు ఎక్కువగా వుంటోంది. తమ ఇరుగుపొరుగువారి పిల్లలకంటే తమ పిల్లలకు ఎక్కడ తక్కువ మార్కులు వస్తాయేమోనని వారు భయపడతారు. ఈ కారణంతో తమ పిల్లల శక్తి సామర్థ్యాలతో సంబంధం లేకుండా బాగా చదవాలంటూ వారిపై వత్తిడి తీసుకువస్తారు. స్కూలులో టీచర్లు, ఇంటి దగ్గర తల్లిదండ్రులు పిల్లలపై అధిక ఒత్తిడి తీసుకువచ్చి వారిలో వచ్చే మానసిక, శారీరక సంఘర్షణలకు కారణమవుతున్నారు.
ప్రతిరోజూ ఉదయం 8 గంటలనుండి రాత్రి 8 గంటలవరకూ అంటే పనె్నండు గంటల పాటు పిల్లలకు స్కూలు, ట్యూషన్‌తోనే సరిపోతుంది. ఇక పరీక్షలు వచ్చిన సమయంలో నిరంతరం చదుతూనే వుంటారు. ఇలా ఎప్పుడూ చదువులో మునిగితేలుతూంటే వారిలో మానసిక ఒత్తిడి పెరిగి అనార్యోం పాలవుతున్నారు. పిల్లలపై ప్రతినిత్యం తల్లిదండ్రులు ఈ విధంగా ఒత్తిడి చేయడం, చదువు విషయంలో కఠినంగా ప్రవర్తించటం మంచిది కాదు.
సర్వసాధారణంగా పరీక్షలు దగ్గరపడినపుడు, అవి ప్రారంభమైనపుడు పిల్లలు తమ మెదడుని పూర్తిగా పుస్తకాలకే అంకితం చేసేస్తారు. అలా చేయటం మంచిది కాదు. ఈ సమయంలోనే పిల్లలకు మానసికంగా, శారీరకంగా విశ్రాంతి అవసరం. మానసికంగా ఆందోళన చెందితే వారు పరీక్షలు సరిగా రాయలేరు. పైగా అంతకుముందు చదివినదంతా మర్చిపోయే ప్రమాదమూ వుంది. పరీక్షల సమయంలో పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుంటే వారిలో భయం, ఆందోళన వంటివి మాయమవుతాయి.
సమయ పరిధి
చదువుకునేటపుడు అదేపనిగా గంటలకు గంటలు చదవకుండా 40-45 నిముషాలకోసారి చదివేలా నిర్దిష్ట సమయాన్ని పిల్లలే నిర్ణయించుకోవాలి. మధ్యమధ్యలో టీవీ చూడకుండా కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవాలి.
స్థలం
పిల్లలు చదువుకోవటానికి నిర్దిష్టమైన స్థలాన్ని లేదా చోటును చూసుకోవాలి. నలుగురు కూర్చున్నచోట కూర్చుని చదవటంవల్ల వాళ్ళేం చదువుతున్నారో వారికి అర్థం కాదు. అందుకని సాధ్యమైనంత వరకూ ఏ విధమైన అడ్డంకులు లేకుండా చూసుకోవాలి. టీవీనో, డివిడిలో సినిమాలు చూస్తూనే చదువద్దు. మంచంపైన ఫ్లాట్‌గా, బోర్లా పడుకుని చదవకూడదు.
స్వీయ పరీక్షలు
స్కూలులో ఎలాగా టెస్ట్‌లు పెడతారు కదా అని బద్ధకించకూడదు. వాళ్ళకి వాళ్ళే స్వయంగా ఇంట్లో టెస్ట్ పెట్టుకుంటే పరీక్షలంటే భయం పోయి వారిపై వారికి ధైర్యం, నమ్మకం ఏర్పడతాయి.
ఆత్మవిశ్వాసం
ఒకచార్టు తయారుచేసుకుని, దానిలో రోజూ మీరేం చదువుతున్నారో, ఎంత చదువుతున్నారో రాసుకోవాలి. ఆ విధంగా టైంటేబుల్ తయారుచేసుకుని ఒక క్రమపద్ధతి ప్రకారం చదివితే పరీక్షలు సమీపించే సమయానికి సిలబస్ పూర్తిచేయగలుగుతారు.
రిలాక్సేషన్ కోసం
అప్పుడప్పుడూ వ్యాయామాలు చేయటంవల్లకూడా మనసుకు సంతోషంగా అనిపించి రిలాక్స్ పొందే అవకాశం వుంది. మనసులో ఎటువంటి భయాలను పెట్టుకోకుండా హాయిగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటే తేలికగా పరీక్షలను ప్రశాంతంగా వారు రాయగలుగుతారు.
పౌష్టికాహారం
పౌష్టికాహార లోపంవల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఆ కారణంగా పరీక్షలు సరిగా రాయలేకపోతారు. కాబట్టి సరైన సమయానికి ఆహారం తీసుకోవాలి. టీ, కాఫీలు వంటివి మానేయాలి.
నెగెటివ్ థింకింగ్
చదువుకు సంబంధించి మనసులో ఏ విధమైన నెగెటివ్ థింకింగ్ (వ్యతిరేకంగా ఆలోచించటం)ను పెంపొందించుకోకూడదు. ప్రతి విషయాన్ని సానుకూల దృక్పథంతో ఆలోచించుకోవాలి. అప్పుడు భయం, ఆందోళన లాంటివి దరిచేరవు.
నిపుణుల సలహా
విద్యార్థినీ విద్యార్థులు మానసిక వత్తిడికి లోనైతే కనుక ఒకసారి మానసిక వైద్య నిపుణులను సంప్రదించటం మంచిది. నిపుణుల కౌనె్సలింగ్ వల్ల పిల్లలలో నూతనోత్సాహం వస్తుంది.
ఇక పిల్లల చదువుకు సంబంధించి తల్లిదండ్రుల పాత్ర ఎలా వుంటుందో పరిశీలిస్తే- పరీక్షల సమయంలో తల్లిదండ్రులు పిల్లలకు అన్నివిధాలా సహకరించాలి. ఆ సమయంలో వారికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం తల్లిదండ్రుల బాధ్యత. అంతేకాక పిల్లల ఆరోగ్యం విషయంలోనూ తగిన శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలు ఏ విధమైన మానసిక, శారీరక వత్తిడులకు లోనుకాకుండా చూసే బాధ్యత కూడా తల్లిదండ్రులదే.
పరీక్షల సమయంలో చాలామంది విద్యార్థులలో ఈ కింది మార్పులు వచ్చే అవకాశం ఉంది.
* మూడ్ మారటం
* ఉద్వేగాన్ని ఆపుకోలేకపోవటం
* అందరితో కలిసిమెలిసి వుండలేకపోవటం
* తమపై తమకు శ్రద్ధ తగ్గిపోవటం
* నిద్రసరిగా ఉండకపోవటం
* తలనొప్పి, వొళ్ళునొప్పి వంటివి రావటం
* ఆకలి లేకపోవటం లేదా మందగించటం
* ఆత్మన్యూనతతో తమని తాము తక్కువ చేసుకుని బాధపడటం
* నిత్యం తాము చేసుకునే పనులపై ఆసక్తి తగ్గటం
* త్వరగా గానీ, కారణం లేకుండా గానీ కోపంరావటం
* దేనిపైనా శ్రద్ధ లేకపోవటం
* తాము దేనికీ అర్హులం కామని అనుకోవటం
* అశక్తతతో బాధపడటం
* అకారణంగా తమని తాము నిందించుకోవటం, మనసులో వ్యతిరేక ధోరణిని, భావాలను పెంపొందించుకోవటం- ఇలాంటివన్నీ కనిపించవచ్చు.
-పైన పేర్కొన్న వాటిని అందరూ పిల్లలకూ అన్వయించి చూడటం మంచిదికాదు. అందరూ పిల్లలు అలా వుండకపోవచ్చు. ఒకవేళ తమ పిల్లలలో ఈ ధోరణి, లక్షణాలు కనిపించినట్లయితే వాటినుంచి బయటపడేలా తల్లిదండ్రులు చూ డాలి. తల్లిదండ్రులు శ్రద్ధ చూపిస్తే పిల్లలలో పరీక్షలంటే భయం తప్పకుండా పోతుంది.
-మనస్విని
From Andhrabhoomi daily

No comments:

Post a Comment