Tuesday, March 27, 2012

దరహాసంతో కోపం దూరం.. దూరం


‘‘తన కోపమే తనకు శత్రువని.. ’’
శతకకారుడు ఏనాడో పేర్కొన్నాడు.
పెదవి దాటని కోపం పెద్ద మేలు
చేస్తుందన్న నిజం కూడా మనందరం
తెలుసుకోవాలి. కోపాన్ని ప్రథమ స్థాయిలోనే నిలువరిస్తే మన జీవితాలలో
ఎన్నో అనర్థాలు తప్పిపోతాయి.
ప్రమాదాలు తొలగి, ఉపద్రవాలు
ఆగిపోతాయి. ఈ విషయం ప్రతి
మనిషికి తెలుసు. అయనా ఏదో
ఉద్రేకంలో అణచుకోలేని కోపంతో
ఎదుటివారిపై విరుచుకుపడతాం.
సమాజంలో మన చుట్టూ ఎందరో ఎన్నో రకాల మనస్తత్వాలు కలవారు ఉంటారు. అలాంటివారితో అడ్జస్టయిపోతూ ముందుకు సాగిపోవాలే తప్ప, మన గొప్పతనాన్ని గుర్తించకుండా అవాకులు, చవాకులు పేలుతున్నారనే మిషతో అడుగడుగునా మీ కోపాన్ని ప్రదర్శిస్తూ అందర్నీ విరోధులు చేసుకోవడం మతిమాలిన పని. మీ చుట్టూ వున్నవారు, మీ వద్ద పనిచేసేవారు, మీ సహచరులు, మీ బంధువులు, కుటుంబ సభ్యులు మీరు కోరినట్లు నడుచుకోకపోవచ్చు. మీ ఆలోచనలకనుగుణంగా ప్రవర్తించి ఉండకపోవచ్చు. ఇలాంటి సందర్భాలో మీరు కోపంతో చిర్రెత్తిపోవటం సహజం. అయితే మీరిక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి. మీకు మీ అభిప్రాయాలు ఎలా వుంటాయో, ఎదుటి వారికి కూడా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. మీకనుగుణంగా బలవంతంగా కోపంతో, ఆగ్రహాలతో వారిని మార్చాలని ప్రయత్నించటం ఎంతవరకు సమంజసమో ఒకసారి మీరే ఆలోచించండి. ప్రశాంతంగా ఆలోచించి ఆ సందర్భాన్ని ఓసారి మననం చేసుకొని విజ్ఞత ప్రదర్శిస్తే మరో సందర్భంలో అలాంటి కోపం కాని ఆగ్రహం కాని రాకుండా ఉండేందుకు బోలెడంత అవకాశం ఉంటుంది.
జీవితంలో అనుకోని అవాంతరాలు, అవరోధాలు ఎదురైనపుడు, ఊహించని అపజయాలు, అవహేళనలు ఎదుర్కొన్నపుడు మీకు అనుకోకుండానే కోపం వస్తుంది. అయితే ఇక్కడ చిన్నవిషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. చిన్నవారు మధ్య తరగతి, మహోన్నత వ్యక్తుల జీవితాలలో కూడా ఈ వ్యధలు, వేదనలు, అవహేళనలు, అవమానాలు తప్పలేదు. అలాంటప్పుడు మీరెందుకు అంతగా రెచ్చిపోయి కోపం పెంచుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందో ఆలోచించండి.
కాలంతో పరుగులు తీస్తూ దొంగ వెంట పోలీసుల పరుగులా, మనుషులు కాలం వెనక పరిగెత్తే సమయంలో ‘టైమ్ మేనేజ్‌మెంట్’ తెలియని మనుషులు స్ట్రెస్‌కు గురవుతున్నారు. మీరూ ఆ కోవకే చెందినవారే కావచ్చు. అలా అయి వుంటే ఆ స్ట్రెస్‌లో మునిగితేలుతూ కూడా పెదవులపై చిరునవ్వు చెదరనీయకుండా ఎంతమంది మీ చుట్టూ ఉంటున్నారో గమనించండి. స్ట్రెస్ కారణంగా కోపం వచ్చినా పెదవి దాటనీయకుండా నిగ్రహాన్ని పాటించి, కోపాన్ని జయించండి. కోపాన్ని జయిస్తే సమాజాన్ని, ప్రపంచాన్ని జయించినట్టే! ఎవరికీ దూరం కాకుండా, ఏ విధమైన నష్టం పొందకుండా ప్రతినిత్యం ఆనందంగా, ఉత్సాహంగా ఉండాలంటే కోపాన్ని వదులుకోవాలి.
-దాసరి కృష్ణారెడ్డి
( From Andhrabhoomi daily)

No comments:

Post a Comment