Saturday, March 17, 2012

వార్షిక పరీక్షల్లో నెగ్గేదెలా



టెన్త్ పరీక్షల వెనువెంటనే స్కూల్ ఎగ్జామ్స్ అన్ని క్యూ కడతాయి. టెన్త్ పరీక్షలకు పిల్లలు ఎంత టెన్షన్ పడతారో ఇతర పరీక్షలకూ అంతే హైరానా పడతారు. దీనిని చూసి తల్లిదండ్రులు కలవరం చెందుతారు. స్కూల్ మేనేజ్‌మెంట్స్, టీచర్ల హడావిడి సరేసరి. వార్షిక పరీక్షలతో ముడిపడిన అందరూ ఎలా రిలీఫ్ పొందాలో కొన్ని సూచనలు ఈవారం.

-పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ విద్యార్థులు ఒక్కసారిగా చదివే సమయాన్ని పెంచుతూ ఉంటారు. స్కూల్లో ఉపాధ్యాయులు, ఇంట్లో తల్లిదండ్రులు అసలే టెన్షన్‌లో ఉండే పిల్లలను మరింతగా చదవాలని పదే పదే చెబుతూంటారు. అదే పనిగా నిద్రాహారాలు మాని చదువుతూ ఉండడం వల్ల తీరా పరీక్షలు ప్రారంభమయ్యే సమయానికి అనారోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయి. పైగా తను ఏకభిగిన చదవడం వల్ల పలు అంశాల్లో విస్తృతికి లోనై అవి ఎంత గుర్తు చేసుకున్నా గుర్తురావు. అప్పుడు కూడా తల్లిదండ్రులు దీన్ని ‘మతి మరుపు’ వ్యాధిగా నిర్ధారించి వైద్యం కోసం, టానిక్‌ల కోసం పరుగులు తీస్తుంటారు.

-తమ సబ్జెక్టులో విద్యార్థులు ఎక్కువ శాతం మార్కులు సాధించాలని ఉపాధ్యాయులు, తమ పిల్లలు ఫస్ట్ రావాలని పేరెంట్స్ అనుకోవడం సహజం. అయితే వారు విద్యార్థులను లక్ష్యానుగుణంగా సిద్ధపరిచేటప్పుడు మాత్రం అసహజంగా ప్రవర్తించకూడదు. స్కూల్‌లో గడిపే 6 గంటలకు అదనంగా ఇంట్లో మరో 5 లేక 6 గంటలకు మించి విద్యార్థులు చదవలేరన్న సంగతి గ్రహించాలి. అలాగే విద్యార్థులు కూడా తమ పేరెంట్స్, టీచర్స్ అప్పుడప్పుడు కొన్ని కఠినమైన లక్ష్యాలు ఇచ్చినా కూడా వెంటనే ‘అది నేను చేయలేను’ అని అనుకోకుండా తమ ప్రయత్నం తాము చేయాలి.

g-srinivasulu-ఇక పరీక్షల్లో కొందరు విద్యార్థులు నిర్ణీత ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాసి ఊరుకుంటారు. గణితంలో మొత్తం 24 ప్రశ్నలకుగాను 14 ప్రశ్నలు మాత్రమే కచ్చితంగా రాయడం వల్ల 35 మార్కులకు 35 మార్కులు పొందవచ్చని వారు భావిస్తారు. అందులో ఏదో ఒక సమాధానంలో ఊహించని విధంగా పొరపాటు జరిగితే రావాల్సిన గరిష్ట మార్కులు రావు. అందుకే సమయం మిగిలినట్లయితే ఒక్కో సెక్షన్‌లో అదనంగా ఒక ప్రశ్నకు సమాధానం రాయడం వల్ల ఎగ్జామినర్ తక్కువ మార్కులు వేసిన సమాధానాన్ని వదిలేసి, ఎక్కువ మార్కులు వేసిన సమాధానాన్ని పరిగణించే అవకాశం ఉంటుంది. తద్వారా గరిష్ట మార్కులు పొందవచ్చు.

-అలాగే, కొందరు విద్యార్థులు ప్రశ్నలకు వరుసగా సమాధానాలు రాస్తూ వెళతారు. వరుస తప్పితే ఏమవుతుందో అనుకుంటారు. అలాంటిదేమీ ఉండదు. ఈ విషయంలో ఎగ్జామినర్ ఎలాంటి అసౌకర్యానికీ గురయ్యే అవకాశం ఉండదు. అయితే, విద్యార్థులు తాము బాగా రాయగలమని అనుకున్న ప్రశ్నలను ముందే ‘టిక్’ చేసుకుని, వాటి నెంబర్లు సరిగ్గా వేసి సమాధానాలు రాయడం వల్ల అధిక ప్రయోజనం ఉంటుంది. రాయాల్సిన 14 ప్రశ్నలలో మీరు ప్రశ్నలు పర్‌ఫెక్ట్‌గా రాయగలిగితే అవి ఎక్కడున్నా వాటినే ముందుగా ప్రజెంట్ చేయడం వల్ల ఎగ్జామినర్‌కు మీపై మంచి అభ్రిపాయం (good impression) కలుగుతుంది. ఈ ప్రభావం మిగిలిన 6 ప్రశ్నలు వ్యాల్యూ చేసేటప్పుడు పని చేసి, వాటిలో కూడా మీకు మాగ్జిమమ్ మార్కులు వచ్చే అవకాశముంటుంది.

-ప్రశ్నలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం, ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయకపోవడానికి దారితీస్తుంది. ఉదాహరణకు పదో తరగతి తెలుగులోని ‘మాతృవేదన’ పాఠ్యాంశంలో ‘విధికృతము గడవ నేరగ లావె’ అనే సందర్భ సహిత వ్యాఖ్య ఉంది. ‘ప్రవరుని స్వగతం’ పాఠ్యాంశంలో ఇలాంటిదే ‘దైవ కృతమున కిల నసాధ్యంబు గలదే’ అనే మరో సందర్భ సహిత వ్యాఖ్య ఉంది. ఈ రెండింటి సమాధానాలు మాత్రం ఒకటి కావు. ఇలాంటి సందర్భంలో విద్యార్థులు ఒక ప్రశ్న సమాధానాన్ని ఇంకో ప్రశ్నకు రాసే ప్రమాదముంది. అదే విధంగా, జాతీయాల వివ రణకు, జాతీయాలను సొంత వాక్యాల్లో ప్రయోగించడానికి గల తేడాను కూడా విద్యార్థులు గమనించడం లేదు. అందుకే ప్రశ్నలను ప్రశాంతంగా చదివి అర్థం చేసుకున్న తర్వాతనే సమాధానం రాయడానికి ఉపక్రమించాలి.

-విద్యార్థులు ఒక్కోసారి సమాధానాన్ని మధ్యలో ఆపేస్తుంటారు. వాక్యం మధ్యలోనో, గణితంలో అయితే స్టెప్ మధ్యలోనో ఇలా ఆపి వదిలేస్తారు. ఇది ఎగ్జామినర్‌కు తప్పుడు సంకేతాలను ఇస్తుంది. బహుళా విద్యార్థి ‘కాపీ’ కొట్టాడేమోనని వారు నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది.

-గణితంలో అప్పుడప్పుడు విద్యార్థులు సమాధానాలు రాసేటప్పుడు డైరెక్ట్ స్టెప్స్ వేస్తుంటారు. 5 స్టెప్పుల్లో ఉండాల్సిన సాధన 3 స్టెప్పులకు పరిమితం కావడం వల్ల తార్కిక క్రమం తప్పుతుంది. ఇది గమనించిన ఎగ్జామి నర్స్ మార్కులను తగ్గించేస్తారు. అదే విధంగా 5 స్టెప్పుల సమస్యను అనవసరంగా పెంచి 7, స్టెప్స్ రాయడం కూడా క్రమం తప్పడమే అవుతుంది. కాబట్టి విద్యార్థులు ఇది గమనించి నిర్దిష్టమైనన్ని స్టెప్స్ మాత్రమే రాసి సమాధానాన్ని ప్రజెంట్ చేస్తే పూర్తి మార్కులు పొందే అవకాశం ఉంటుంది.

-గణితంలో విద్యార్థులు చేసే మరో పొరపాటు కాలుక్యులేషన్స్ కనబడకుండా సమాధానాలు రాయడం. తాము సమాధానాలు రాసే పేజీలోనే కుడి వైపునకు మార్జిన్‌లో రఫ్ వర్క్ చేసుకోవాలి. అందులో ఆ సమస్యకు సంబంధించిన చిన్న చిన్న గణనలు నమోదు చేయడం ద్వారా ఈ సాధన ఎగ్జామినర్‌కు సహజంగా తోస్తుంది. లేదంటే స్టెప్స్ అన్నీ మీరు బట్టీ పట్టారనో లేదా చూసి రాశారనో భావించి, మార్కులు తగ్గించే అవకాశం ఉంది. మీరు చేసిన వర్క్‌కు ‘రఫ్ వర్క్’ ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుందనే విషయం విద్యార్థులు ఎప్పుడూ మరిచిపోకూడదు.

ఇలా చేయండి !
అదే పనిగా నిద్రాహారాలు లేకుండా చదవడం ఆపి, మీరు చదివగలిగినంత సేపు చదివి విశ్రాంతి తీసుకుంటూ ఉండండి.
-హార్డ్ అనుకునే సబ్జెక్ట్ అయినా ఓపిగ్గా ప్రతి రోజూ కాసేపు చదివి క్రమంగా ఒంటపట్టించుకోండి.
-ప్రశ్నలు జాగ్రత్తగా చదివి అర్థం చేసుకుని దానికి సరిపోయే సమాధానాన్ని రాయండి.
-బాగా తెలిసిన సమాధానాలను ముందుగా ప్రజెంట్ చేయండి.
-దీర్ఘ సమాధాన ప్రశ్నను స్వల్ప సమాధాన ప్రశ్నగా అడిగినప్పుడు మీ సమాధానంలోని ప్రధానమైన వ్యాల్యూ పాయింట్లు రెండింటిని మాత్రమే రాయండి.
-సమాధానాన్ని మధ్యలో నుంచి ప్రారంభించడంగానీ, రాసే సమాధానాన్ని హఠాత్తుగా మధ్యలో ఆపడంగానీ చేయకండి.
-ప్రశ్నలు రాయడానికి సమయం వృథా చేసుకోకుండా ప్రశ్న నంబర్ వేసి సమాధానాలు రాయండి.
-సమాధానాన్ని తార్కిక క్రమంలో ప్రజెంట్ చేయండి.
-గణితంలో ‘రఫ్ వర్క్’ను తప్పనిసరిగా మార్జిన్‌లో చేయండి.

- వ్యాసకర్త ః అక్నాపూర్
జిల్లా పరిషత్ హైస్కూల్ హెడ్‌మాస్టర్.( From Namasthetelangana NewsPaper)

No comments:

Post a Comment