అమెరికా కంపెనీలు ఇప్పుడు ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్ రంగాల్లో నిపుణులైన, విద్యావంతులైన కార్మికులకోసం భారత్, చైనా లాంటి దేశాల వైపు చూస్తున్నాయని, అయితే అమెరికా కంపెనీలు అలాంటి వారికోసం ఆ దేశాలవైపు చూడకుండా ఉండా
లని తాను కోరుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. దీన్ని నిరోధించడానికి అమెరికాలోని విద్యార్థులకు శిక్షణ, తగిన విద్యను అందించడానికి విద్యా సంస్థలు, అధ్యాపకులకు తగిన వనరులను అందించాల్సిన అవసరముందని ఆయన అన్నారు.‘యాజమాన్యాలు నిపుణులైన, విద్యావంతులైన వర్కర్లను కోరుకుంటున్నాయి. అలాంటి వాళ్ల కోసం వారు భారత్, చైనాలలో వెతుకుతున్నారు. అమెరికాలోనే అలాంటి వారు వ్యాపార సంస్థలకు లభించేలా చేయాలని నేను అనుకుంటున్నాను’ అని 2013 సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను అమెరికా కాంగ్రెస్‌కు పంపించిన అనంతరం నగర శివార్లలోని ఒక కమ్యూనిటీ కాలేజిలో ప్రసంగిస్తూ ఒబామా అన్నారు. యాజమాన్యాలు కోరుకునే నైపుణ్యాలు, శిక్షణ తమ పిల్లలకు చదువు చెప్పించే స్ర్తి పురుషులతోనే ప్రారంభం కావాలని ఆయన అన్నారు. కేవలం పరీక్షలకోసం పాఠాలు చెప్పడం కాక విద్యార్థులు నేర్చుకోవడానికి వీలు కల్పించే అవకాశాన్ని, వనరులను విద్యాసంస్థలకు కల్పించాలని ఆయన అభిప్రాయ పడ్డారు. అంతేకాక చదువులు ఖరీదయినవిగా మారడానికి ఇది సమయం కాదని, అందువల్ల విద్యా రుణాలపై వడ్డీరేట్లను ఈ ఏడాది జూలైనుంచి రెట్టింపు చేయకుండా చూడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అమెరికాలో ప్రతి కుటుంబానికి చదువులు భారం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని , 21వ శతాబ్దంలో అమెరికా చేస్తున్న హామీలో ఇది కూడా ఒక భాగమని ఒబామా నొక్కి చెప్పారు.
No comments:
Post a Comment