విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తేయాలని, సకల జనుల సమ్మె సందర్భంగా జరిగిన ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తు జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణజిల్లాల కలెక్టరేట్ల ఎదుట మహా ధర్నా,ముట్టడి నిర్వహించారు. మహబూబ్‌నగర్‌లో జేఏసీ చైర్మన్ కోదండరామ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, బలహీనమైన రాష్ట్ర ప్రభుత్వం కూలేదశకు చేరుకుందని విమర్శించారు.దేశంలో వస్త్ర వ్యాపారంలో తెలంగాణ నాల్గోస్థానంలో ఉందని, మధ్య భారతదేశానికి ఇక్కడి నుంచే పెద్దఎత్తున వస్త్రాలు పంపిణీ అవుతాయని, అలాంటి వస్త్రవ్యాపారాన్ని దెబ్బతీయడానికి ప్రభుత్వం ఐదు శాతం వ్యాట్ విధించిందని ఆరోపించారు. తెలంగాణ సాధన కోసం త్వరలోనే జేఏసీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేపడతామన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు నాగం, జూపల్లి ,జితేందర్‌రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నల్లగొండలో టీఆర్ఎస్ శాసనసభపక్షనేత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ప్రజాఉద్యమాన్ని అణచి వేస్తున్న ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు గోరీ కట్టటం ఖాయమన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు పోషించిన పాత్ర మాటల్లో చెప్పలేనిదన్నారు.
ప్రపంచ చరిత్రలో ప్రజలదే తుది విజయమని అన్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో హరీశ్‌రావు మాట్లాడుతూ ఉద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలు కోసం ఫిబ్రవరి 13న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలను స్తంభింపజేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్‌కలెక్టరేట్‌లో న్యూడెమోక్రసీ నేత ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్‌లు అనుచరులతో సమీక్ష సమావేశం లోపలికి చొచ్చుకెళ్లి.. తెలంగాణ నినాదాలు చేశారు. దాంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఎంపీ మధుయాష్కీ తెలంగాణ ద్రోహి అంటూ నినాదాలు చేశారు.
కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడిలో టీఆర్ఎస్ జిల్లా కన్వీనర్ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు,ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, సోమారపు సత్యనారాయణ, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో బీజేపీ, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, టీఆర్ఎస్ నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు అరవింద్‌రెడ్డి, నల్లాల ఓదెలు, కావేటి సమ్మయ్య, మాజీఎమ్మెల్యే జోగు రామన్న, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రావుల రాంనాథ్ పాల్గొన్నారు. ఖమ్మంలో భారీర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అలాగే జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు స్వామిగౌడ్ అరెస్ట్‌ను నిరసిస్తూ రాస్తారోకో నిర్వహించారు.
No comments:
Post a Comment