Friday, February 24, 2012

భాషారక్షణ ప్రభుత్వ బాధ్యత కాదా?

 • మళ్ళీ యీ ఏడు అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం వచ్చింది. ప్రపంచంలోని భాషాజాతులన్నీ తమ భాషల్ని కాపాడుకోవాలని ఐక్యరాజ్యసమితి వారి విద్యాసాంస్కృతిక విభాగం- యునెస్కో-ఒక పుష్కరకాలంగా ప్రతి ఫిబ్రవరి 21న పిలుపు ఇస్తూనే ఉంది. సరిగ్గా ఆరోజున 1952లో తూర్పు పాకిస్తాన్‌లోని ప్రజలు, రచయితలు తమ మాతృభాష బెంగాలీకోసం రక్తతర్పణం చేశారు. ఆ ఉద్యమం చిలికి చిలికి, తర్వాత ఇరవైఏళ్ళకల్లా అది స్వతంత్ర దేశంగా-బంగ్లాదేశ్‌గా-ఆవిర్భవించడానికి దారితీసింది. మాతృభాషను తమ హక్కుగా స్వాభిమానసంపన్నులైన ఆ ప్రజలు భావించబట్టే అంతటి పరిణామం చోటు చేసుకుంది.
  అప్పుడు ఒక చిన్న భూభాగంలో పాలకులపైన తమ భాషకోసం ప్రజలు పోరాడి సాదించిన ఘన విజయం అది. కాని, ఇప్పుడు ప్రపంచీకరణ వల్ల మాతృభాషలన్నిటికీ పెనుముప్పు ముంచుకొస్తోంది. ప్రపంచీకరణ వాహికగా ఆంగ్లభాషముందుకు దూసుకొస్తోంది. అది ఒక వరదలాగా వస్తూ చిన్నచిన్న భాషల్ని మా యం చేస్తున్నది. వేలాది చిన్నచిన్న భాషలు పాశ్చాత్యదేశాల్లో, ఆఫ్రికన్ దేశాల్లో ఆ వరదలో కొట్టుకుపోతున్నాయి. ఈ ప్రమాదాన్ని గుర్తించిన యునెస్కో సర్వప్రతినిధిసభ రెండు మూడు సార్లు సమావేశమై లోతుగా చర్చించి 12 ఏళ్ళనాడు ప్రపంచదేశాలకు ఆ పిలుపు ఇచ్చింది. ఏడాదిలో ఒకరోజును ప్రత్యేకించి రుూ విషయంలో ప్రపంచ ప్రజలను మేల్కొల్పడానికై కేటాయించింది. బెంగాలీ ప్రజలు త్యాగం చేసిన ఆ రోజును అందుకై ఎంపిక చేసింది.ఆఫ్రికాలోని రోబీ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న గుగీవాథియాంగో అనే ఆంగ్లబోధకుడు తన మాతృభాష ‘గికురుూ’ రక్షణకోసం, అట్లాగే మరికొందరితో కలిసి ‘సావహిలీ’ వంటి తోటి చిన్న భాషల రక్షణకోసం చేసిన పోరాటం, నైజీరియాలోని ‘చెనువా అబీబీ’ చేసిన పోరాటం చిన్నవేమీకావు. ప్రపంచప్రఖ్యాత అమెరికన్ విద్యావేత్త నామ్‌చోమ్‌స్కీ చేస్తున్న పోరాటం ప్రపంచవ్యాప్తంగా మాతృభాషల రక్షణకోసం, విద్యారంగ సంస్కరణలకోసం జరుగుతున్న ఉద్యమాలకు స్ఫూర్తిదాయకంగా ఉంది. మున్ముందు ప్రపంచంలో రాగల సంఘర్షణలకు యుద్ధాలకు ‘్భష’ కూడా ఒక అంశంగా తయారయ్యే అవకాశాల్ని విజ్ఞులు త్రోసిపుచ్చడంలేదు.
  ఈ ఏడాది యునెస్కో డైరెక్టర్ జనరల్ ఇరినా బొకోవా అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం సందర్భంగా ఇచ్చిన సందేశం ప్రకారం బహుళభాషల సమాజాల మనుగడ వాస్తవం అవుతున్నది. ఏ సమాజమూ బహుళబాషల మనుగడను తిరస్కరించే అవకాశంలేదు. అనేక చారిత్రక, రాజకీయ కారణాలవల్ల ఒకటికంటె ఎక్కువ భాషలు ఒక సమాజంలో మనుగడ సాగించాల్సిన పరిస్థితుల్లో కూడ మాతృభాషల రక్షణ తప్పనిసరి అవుతోంది. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు మనదేశంలో త్వరత్వరగా ఏర్పడుతోంది. ప్రపంచీకరణ ప్రభావాలు ఇందుకు తోడై సమాజాల్లో భాషాపరమైన గందరగోళం నెలకొనే అవకాశం ఉంది. ప్రభుత్వాలకు స్పష్టమైన భాషావిధానం ఉండకపోతే, మాతృభాషల రక్షణకు ప్రభుత్వాలు దీక్ష వహించకపోతే, భాషా జాతుల్లో ఏర్పడే నైరాశ్యం వల్ల కాలక్రమంలో సంఘర్షణలకు, రాజకీయ పరిణామాలకు దారితీయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
  తెలుగుభాషాజాతి గురించీ దాని గతం, వర్తమానం, భవిష్యత్తు గురించీ లోతుగా చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంది. కానీ, అది ఇప్పుడు వేగం అందుకొంది. కొత్త ఆలోచనలు ముందుకు తెస్తున్నారు. వేలాది సంవత్సరాల తెలుగుజాతి భాషాపరంగా ఎదుర్కొంటున్న సంక్షోభానికి ఎన్నో కారణాలేకాదు, దాని వస్తుస్థితిని పరిశీలిస్తే ఎన్నో కోణాలు కూడా మనముందు ప్రత్యక్షమవుతాయి. గతంలో కవుల సాహితీ సృజనలోనే వెల్లడైన ధోరణులు వేరు, నాటి అవసరాల వరకే వారి చూపు సాగింది. నేటి అవసరాలకు తగ్గ కొత్త ఆలోచనలు తప్పనిసరి. కొత్త పదాలను కూర్చుకోవడమూ తప్పనిసరే. అయితే ఇదంతా తెలుగు మూలాలపై ఆధారపడే జరగాలి గాని ఇతర భాషల మూల పదాలపై ఆధారపడి కాదు. భాషను స్వంతమూలాలపై ఆధారపడి ఎదిగించుకొంటేనే, ఆ భాష నిలుస్తుంది. అన్ని అవసరాలకూ తగ్గట్లుగా ప్రపంచస్థాయి భాషగా పెంచుకుంటేనే తెలుగుకు భవిష్యత్తుంటుంది. దీనికి కర్త, కర్మ క్రియ తెలుగు ప్రజలే కావాలి. వారి భాషా సాంస్కృతిక వారసత్వమే ఇందుకు ఆధారం కావాలి.
  నేడు ఎదుర్కొంటున్న సంక్షోభాన్నుంచి మన మాతృభాషను రక్షించుకోవాలంటే ప్రాథమిక స్థాయినుంచి స్నాతకోత్తర విద్యదాకా, ఆపైన వృత్తి విద్యలదాకా అన్ని దశల్లోనూ తెలుగుకు గౌరవస్థానం దక్కాలి. ప్రజాజీవితంలో అన్ని దశల్లోనూ-పుట్టుకనుంచి జీవితాంతం వరకూ అన్ని అవసరాలకూ తెలుగే తెలుగు ప్రజాజీవితాన్ని వికసింపజెయ్యాలి. పరిపాలనలో, ఉద్యోగ వ్యాపారాల్లో తెలుగే రాజ్యం చెయ్యాలి. ఇందుకు తగ్గట్లుగా మన ప్రభుత్వ విధానాలుండాలి. కాని, మన ప్రభుత్వానికి తెలుగును కాపాడుకోవాలన్న ఉద్దేశం కనిపించడంలేదు. మనతోపాటే భాషా ప్రాతిపదికన ఏర్పడిన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలు స్పష్టమైన భాషా విధానంతో అంకిత భావంతో ముందుకు సాగుతుంటే, మన ప్రభుత్వం మాత్రం భాషా రక్షణ తన బాధ్యతేకానట్లు వదిలివేసింది. మన పొరుగు రాష్ట్రాల్లో వారి భాషలకోసం ప్రత్యేక మంత్రిత్వశాఖలు తొలినుండీ ఉన్నాయి. మన రాష్ట్రంలో మాత్రం 60ఏళ్ళయినా ఇంతవరకూ ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. 2001లో తమిళానికి మాత్రమే ప్రాచీన భాష హోదానిచ్చి, తోటి తెలుగు, కన్నడలను కేంద్రం నిర్లక్ష్యం చేస్తే తెలుగు ప్రజలు తిరగబడ్డారుగాని ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదు. తప్పని పరిస్థితుల్లో తమకు రాజకీయంగా దెబ్బతగులకుండా ఉండ టం కోసం కేంద్రాన్ని బ్రతిమాలి, గుర్తింపును సాధించినా, కేంద్రం ఇప్పుడిచ్చిన లక్షలాది రూపాయలను వినియోగించుకోవడానికి కావలసిన వ్యవస్థను ఏర్పరచేందుకు కూడా మన ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఇక-ఆధునిక భాషగా తెలుగును అభివృద్ధిచేసుకోవడం సంగతి సరేసరి.
  కొందరు పెద్దలు తమ ప్రసంగాల్లో ప్రజలే తెలుగును రక్షించుకోవాలని చెప్తుంటారు. నిజమే.విస్తృతమైన తెలుగు సమాజం తెలుగును రక్షించుకోగలదు. ప్రభుత్వాలు తమ బాధ్యతను విస్మరించి ఇదే రీతిగా వ్యవహరిస్తుంటే ప్రజలే ఇందుకు పూనుకుంటారు. అయితే ఇది రాజకీయాలను ప్రభావితం చేసేంత మలుపు తీసుకుంటుందా అనే ప్రశ్న ఉండనే ఉన్నది. సమాజానికి, దాని స్వాభిమానానికి దెబ్బతగిలే ఏ అంశమైనా సున్నితంగా ఉంటుంది. తెలుగు సమాజంలో భాష ఒక కీలకమైన రాజకీయాంశంగా మారేందుకు తగిన పరిణామాలు ఎప్పుడెలా వస్తాయో ఎవరూ చెప్పలేరు. పొరుగున ఉన్న రాష్ట్రాల్లో రెండవ పెద్ద భాషగా ఉన్న తెలుగు ప్రజల్లో అసంతృప్తి ఆ ప్రభుత్వాల మనుగడకు ప్రశార్థకంగా మారగల పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే, 50 ఏళ్ళ క్రితం తమిళనాడులోవున్న స్థితిలో యిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తెలుగు రానున్న 50 ఏళ్ళలో ప్రజా రాజకీయోద్యమాలను ప్రభావితం చెయ్యజాలదని ఎవరూ అనుకోకూడదు. ఇప్పుడు నడుస్తున్న తెలుగు భాషోద్యమం అలాంటి పరిణామశీలాన్ని పెంపొందించుకొంటే చాలు.-డాక్టర్ సామల రమేష్‌బాబు సెల్: 9848016136 ncharithra@gmail.com

1 comment:

 1. అసలు ప్రభుత్వాలకు భాషా రక్షణ అంటే తెలుసా?

  ReplyDelete