పాశ్చాత్యులలో విడాకులు సర్వసాధారణమని సూచించే జోక్ ఒకటున్నది. ‘‘నీ పిల్లలూ, నా పిల్లలూ కలిసి మన పిల్లలను కొడుతున్నారు’’-అని ఒక భార్య తన భర్త దగ్గర వాపోయిందట. ఇందులో ఆశ్చర్యమేముంది? భార్యకు ముందు జరిగిన వివాహం ద్వారా పుట్టిన పిల్లలను ఆమె ‘‘నా పిల్లలు’’ అంటుంది. అదేవిధంగా భర్తకు పుట్టినవారు ‘‘నీ పిల్లలు’’. ఈ ఇద్దరికీ వివాహమయ్యాక జన్మించినవారు ‘‘మనపిల్లలు’’. పూర్వవివాహాల ద్వారా పుట్టినవారు ప్రస్తుత వివాహం ద్వారా పుట్టినవారికన్నా పెద్దవాళ్ళయి ఉంటారు. పెద్ద పిల్లలు చిన్న పిల్లలను కొట్టగలరు, కొడతారు. తల్లిదండ్రులు ఎవరిని శిక్షించాలి? ఆమె పిల్లలనా, అతని పిల్లలనా, అందరినీనా?
మన దేశంలో మధ్యతరగతిలో ఇంతవరకూ పైన చెప్పిన జోక్ సామాన్యమయ్యే పరిస్థితులు లేవు. అయినంతలో ‘నీ’, ‘నా’ అన్న మాటలు లేకుండా పోయాయా? ‘మన’ అన్న మాట అసలు వినిపిస్తున్నదా?
పెళ్ళైన కొత్తలో మధ్యతరగతి ఇళ్ళలో నూతన వధువుకి లభించే స్వాగతమేమిటి? ‘‘మీ వాళ్ళ మర్యాదల గురించే చెప్పుకోవాలి. మా పిన్ని కూతుళ్ళొచ్చారన్నది కూడా గుర్తించలేదు. రెండు గదులిచ్చి అందర్నీ సర్దుకోమన్నారు’’ అంటూ దెప్పుళ్ళు మొదలవుతాయి. ‘‘అసలు ఇంతకన్నా ఎన్నో మంచి సంబంధాలొచ్చాయి. జాతకాల దగ్గర తప్పిపోయాయి. మీ నాన్నగారు ఇంత డబ్బుకి చూసుకునే మసిషి అనుకోలేదు. పట్టుచీరలు మమ్మల్ని కొననిచ్చినా బాగుండేది. మీ అమ్మ ఇంత నాసిరకం కొంటుందనుకోలేదు. మరీ ఇంత చిన్న హాల్ మీ వాళ్ళు బుక్ చేస్తారనుకోలేదు. మా ఫ్రెండ్స్‌లో తలెత్తుకోలేకపోతున్నాను’’ అంటూ ఉపన్యాసాలు సాగుతాయి. మీవాళ్ళు, మీవాళ్ళు అన్నమాటేకానీ మా అత్తమామలు అన్నమాట భర్త నోట వినిపించదు. పెళ్ళయిన కొన్నాళ్ళకు నిలదొక్కుకున్న భార్య ‘‘మీ అమ్మ చాదస్తంతో నా ప్రాణం పోతోంది. పనిమనిషి వంటింట్లోకి రాకూడదట. ఇక మీ నాన్నకి ఎప్పుడూ తిండిగోలే. మీ చెల్లెలి అత్తవారు ఈ ఊరే కావడం నా ప్రాణానికొచ్చింది. వారానికి నాలుగు రోజులిక్కడే. నన్నయితే మా వాళ్ళింటికి ఎక్కువసార్లు పంపిస్తారా?’’ అంటూ భర్తను నిలదీస్తుంది. మీ అమ్మ, మీ నాన్న, మీ చెల్లెలు అనేకానీ అత్తమామలు, ఆడపడుచు అని ఆవిడ అనదు.
మీ వాళ్ళూ, మా వాళ్ళూ అన్నది కుటుంబ సభ్యులకే పరిమితం కాదు. భార్య వేలు విడిచిన మేనమామ తోడల్లుడు ఎసిబి వలలో పట్టుబడితే భర్త వెంటనే ‘‘మీ వాళ్ళంతా ఇంతే. నిజాయితీ లేదు. అవినీతికి శిక్షపడకుండా ఉంటుందా?’’ అని సంతోషంగా చూస్తాడు. అవినీతికీ, ఆవిడకూ సంబంధమేమిటి? ఆడవాళ్ళు మాత్రం తక్కువ తిన్నారా? భర్త దగ్గర అప్పు తీసుకున్న వాడెవరైనా అప్పు తీర్చకపోతే ‘‘మీ వాళ్ళందరూ ఇంతే. అప్పు తీసుకున్నప్పుడున్న హుషారు తీర్చేటప్పుడు ఉండదు. నేను నెత్తీ నోరూ మొత్తుకుంటూనే ఉన్నాను. మిమ్మల్ని ఎందుకనడం? ఈ దిక్కుమాలిన సంబంధం తెచ్చిన మా నాన్నని అనాలి’’అని భార్య దులిపేస్తుంది. అప్పు ఎగ్గొట్టింది భర్త దూరపు బంధువు నిజమే. పోయిందెవరి డబ్బు? అది ‘మన డబ్బు’ కాదా? ‘మన’ అన్నమాట నిఘంటువులో లేదా? పెళ్లవగానే తీసిపారేశామా?
మీ, మా అన్నది కుటుంబ సభ్యులకే పరిమితం కాదు. ప్రాంతాలకూ విస్తరిస్తుంది. ‘‘మీ పశ్చిమ గోదావరి వాళ్ళను చచ్చినా నమ్మకూడదు’’ అని భార్య అంటే ‘‘ఖర్మకాలి మీ తూర్పు సంబంధం చేసుకున్నాను’’ అని భర్త అంటాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో అతను పుట్టడం కాకతాళీయం. అందుకోసం అతను చేసిన ప్రయత్నమూ లేదు. ఆ జిల్లాపై అతనికి అధికారమూ లేదు. ఒక వ్యక్తి మీద కోపాన్ని ఓ ప్రాంతం మొత్తానికి ప్రసరింపచెయ్యడమెందుకు? ఆ ప్రాంతంపై ద్వేషమెందుకు? మీ, మీ అన్నమాట తప్ప మరొకటి రాదే. ప్రాంతాలే కాదు కులాలూ, మతాలూ, భాషలూ అన్నీ వచ్చేస్తాయి.
మీ, మా అన్నది భార్యాభర్తలకే కాదు అన్ని బంధుత్వాలకీ వర్తిస్తుంది. కూతుర్ని చూడ్డానికి వచ్చిన తల్లి ‘‘మీ ఊరి రిక్షాలో నా చీర చిరిగిపోయింది’’ అంటుంది. ఆ ఊరికి కూతురు మేయరా? రిక్షాలు చేసే ఫ్యాక్టరీకి యజమానా? ఏమీ కాదు. కూతుర్ని వేరు చేసి మాట్లాడాలి. అందుకో మార్గం ఎన్నుకోవాలి. కని పెంచిన కూతురి దగ్గర తల్లికీ, మీ, మా యేకానీ ‘మన’ లేదు.
ఏ ఇతర భాషలోనూ లేని పదం ‘మనం’. మిగిలిన అన్ని భాషలలోనూ ‘మా’కూ, ‘మన’కూ ఒక్కటే మాట. ఇలా మీ, మా అని ఆప్తులందరూ విడతీసి మాట్లాడుతున్నప్పుడు ‘మన’ అన్న పదం లేకుంటే బాగుండేదా? అనిపిస్తుంది. ఆత్మీయతను సూచించే ‘మనం’ అన్న పదం ఉండీ వాడడం లేదే అన్న దుఃఖం ఆ పదమే లేకపోతే కలగదు. అలా అనుకునే పరిస్థితి లేకుండా హాయిగా ఆత్మీయంగా మాట్లాడడం అందరూ అలవాటు చేసుకుంటే హాయిగా ఉండదా! మీ అమ్మ అనకుండా మా అత్తగారు, మీ ఆవిడ అనకుండా మా కోడలు, నీ తమ్ముడు అనకుండా మా బావమరిది.. ఇలా ఎన్ని ఉదాహరణలైనా చెప్పవచ్చు. మీ వాళ్ళంటే మీవాళ్ళని భార్యాభర్తలూ, వారి కుటుంబాలూ అనుకోకుండా మనం అన్నమాట అందరూ వాడితే అంతకన్నా కావలసిందేముంది?
వయస్సు పెరిగిన కొద్దీ భార్యాభర్తలమధ్య అనుబంధం పెరిగి ఎవరి స్వార్థం వారు కాకుండా ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ, కష్టసుఖాలు పంచుకోడం ఎక్కువవుతుందంటారు. అలా జరగడం ప్రారంభమయ్యేది కోడళ్ళు వచ్చాకనే అన్పిస్తుంది. యాభై, అరవై ఏళ్ళు వచ్చేసరికి మీ వాళ్ళూ, మా వాళ్ళూ అనుకునే వాళ్ళు ఎక్కువగా మిగలరు. ఇంక ఇద్దరే మిగుల్తారు. కోడళ్లొచ్చినా భార్యకు పని తగ్గలేదని భర్త అనుకుంటే, కోడలు పెట్టిన కాఫీ భర్త తాగలేకపోతున్నాడని భార్య బాధపడుతుంది. కోడళ్ళు సరైన వాళ్ళు దొరక్కపోవచ్చును, దొరికిన కోడలి ప్రవర్తన వారికి నచ్చకపోవచ్చును. ఇద్దరికీ కోడళ్ళను తిట్టుకునే విషయంలో ఏకాభిప్రాయమే. ఇక్కడ మీ, మా అన్న మాట లేదు. ఆమె ‘మన’ కోడలు కదా. ‘మన’ అన్నమాట భార్యాభర్తలమధ్య ప్రవేశించేది ఇద్దరికీ ఒకే శత్రువు దొరికినప్పుడేనా? మనువు జరిగిన నాడే ‘మన’ అనుకుంటే మనశ్శాంతితో మనుగడ సాగించవచ్చును కదా.
-పాలంకి సత్య Written in Andhrabhoomi Daily
Monday, February 27, 2012
‘మనం’లోనే మనశ్శాంతి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment