రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రభుత్వ
వెబ్‌సైట్ల హ్యాకింగ్ గుట్టు రట్టు చేసేందుకు దర్యాప్తు సంస్థలు వేగంగా
ముందుకు సాగుతున్నాయి. దర్యాప్తులో ఒక విదేశీ ఐటి సంస్థ పాత్ర
ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఒక మతానికి చెందిన వెబ్‌సైట్‌ను
లక్ష్యంగా చేసుకుని హ్యాకింగ్‌కు ప్రయత్నించగా, ఆ సర్వర్ ద్వారా రాష్ట్ర
ప్రభుత్వ వెబ్‌సైట్లపైనా హ్యాకింగ్ ప్రభావం పడినట్టు గుర్తించారు. ఇదే
సమయంలో హ్యాకింగ్‌కు గురైన సెట్లను మరమ్మతు చేసే ప్రక్రియను
రాష్ట్ర అధికారులు వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ
ఉత్తర్వులకు సంబంధించిన వెబ్‌సైట్‌ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి
తీసుకురాగా, మిగిలిన వెబ్‌సైట్లను కూడా సుమారుగా మంగళవారం
నాటికి వినియోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఐటి శాఖకు
చెందిన సీనియర్ అధికారి వెల్లడించారు. ఒక మతానికి చెందిన వెబ్
సైట్‌ను లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఉగ్రవాదుల పాత్ర ఉన్నట్టు కూడా
నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా
అప్రమత్తమై హ్యాకింగ్ సమస్యపై దృష్టి పెడుతోంది.
రెండు రోజుల క్రితం దాదాపు 27 ప్రభుత్వ వెబ్‌సైట్లను హ్యాక్ చేసినట్టు
గుర్తించిన ప్రభుత్వం సిఐడిని రంగంలోకి దింపడంతోపాటు, కేంద్ర
కంప్యూటర్ అత్యవసర రెస్పాన్స్ టీమ్‌నూ ఆశ్రయించింది. దీనిపై
వెంటనే దర్యాప్తు ప్రారంభం కాగా, ముందుగా బంగ్లాదేశీయుల పాత్ర
ఉందని గుర్తించినట్టు అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని సిఐడి
అధికారులు ప్రకటించారు కూడా. ఇదే సమయంలో ఇక్కడ సిఐడి,
కేంద్రంలో సిఇఆర్‌టి బృందాలు దర్యాప్తును ముమ్మరం చేయగా,
విదేశాల్లోనే హ్యాకింగ్ కుట్ర జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు.
హ్యాకర్లు స్వదేశీయులా? విదేశీయులా? అన్న కోణంలో దర్యాప్తు
చేస్తున్నారు. స్థానికంగా ఉన్న వారైనప్పటికీ విదేశాల్లోని సైట్ల ద్వారా
హ్యాకింగ్‌కు పాల్పడి ఉండవచ్చునన్న కోణంలోనూ దర్యాప్తు
సాగుతోంది. ప్రధానంగా ఒక మత సంస్థకు చెందిన వెబ్‌సైట్‌ను
లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు హ్యాకింగ్‌కు పాల్పడి ఉండొచ్చునని,
ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రభుత్వ వెబ్‌సెట్లకు కూడా నష్టం కలిగి
ఉంటుందని దర్యాప్తు బృందాలు ఒక అంచనాకు వచ్చినట్టు
సమాచారం. హ్యాకింగ్ ఏ వెబ్‌సైట్ నుంచి జరిగింది, నిర్ధిష్టంగా
ఏప్రాంతం నుంచి జరిగిందన్న వివరాలను కూడా ప్రభుత్వం
సేకరించినట్టు సమాచారం.
కాగా, వరుసగా జరుగుతున్న హ్యాంకింగ్ దాడులు అటు కేంద్రాన్ని,
ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత ఏడాది
కూడా రాష్ట్రంలోని కొన్ని వెబ్‌సైట్లపై హ్యాకర్లు దాడులకు దిగారు.
ఇందులో హోంమంత్రిత్వశాఖ, సాధారణ పరిపాలన శాఖల సైట్లు
కూడా ఉండటం, వెబ్‌సైట్లు తెరవగానే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థకు
చెందిన చిత్రాలు రావడంతో మొత్తం దేశం ఉలిక్కిపడింది. ఇదేవిధంగా
గత ఏడాది జనవరి నుంచి జూన్ మధ్యకాలంలో ఏకంగా 117 కేంద్ర
ప్రభుత్వ వెబ్‌సైట్లు హ్యాకింగ్‌కు గురైనట్టు కేంద్ర ప్రభుత్వమే
అధికారికంగా ప్రకటించడం గమనార్హం. నిశితంగా అధ్యయనం చేసిన
కేంద్రం కొన్ని మార్గదర్శకాలను కూడా రూపొందించింది. వెబ్‌సైట్లు
ప్రారంభించే ముందు అన్ని సైట్లను సెక్యూరిటీ ఆడిటింగ్
చేయించాలన్నది ఆ ఆదేశాల సారాంశం. సైబర్ సెక్యూరిటీ లేని సైట్లను
వినియోగించవద్దని కూడా ఎన్‌ఐసి సూచించింది. ఎప్పటికప్పుడు
సెక్యూరిటీ విధానాలను పునరుద్ధరించుకోవాలని, అన్ని కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వ శాఖలు సొంతంగా వైపరీత్య నివారణ ప్రణాళికలు
రూపొందించుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. కేంద్ర
కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ద్వారా సైబర్ దాడులకు
సంబంధించి ఎప్పటికప్పుడు హెచ్చరికలు వస్తాయని, వాటిని దృష్టిలో
పెట్టుకుని ముందుకు సాగాలని కూడా గతంలోనే కేంద్రం హెచ్చరికలు
చేసింది. అయినప్పటికీ రాష్ట్రంలో ఇంకా హ్యాకింగ్ సమస్య
తలెత్తుతుండడంతో ఐటి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా హ్యాంకింగ్ వెనుక బంగ్లా దేశీయులు ఉన్నట్టు
అనుమానిస్తుండగా, అదే బంగ్లాదేశ్‌లో కూడా ఐదు రోజుల క్రితం రెండు
డజన్లకు పైగా వెబ్‌సైట్లు హ్యాంకింగ్‌కు గురికావడం గమనార్హం. ఇవన్నీ
గమనిస్తుంటే ఉగ్రవాదులు సైబర్ యుద్ధాన్ని ప్రారంభించినట్టు
కనిపిస్తోందని నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు.
No comments:
Post a Comment