Sunday, February 5, 2012

‘ఐఎఎస్’లా? ‘అయ్యా ఎస్’లా?

ఐఎఎస్...అంటే అఖిల భారత సర్వీసు. రాష్ట్ర పాలనకు గుండెకాయ లాంటి వారు ఐఎఎస్ అధికారులు. పాలకులు తీసుకునే నిర్ణయాలు ప్రజల వద్దకు వెళ్ళేలా, అమలు జరిగేలా చూసేది వీరే. రాష్ట్రంలోని కోట్లాది ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర ప్రగతికి పాలకులు తీసుకునే నిర్ణయాలు అమలయ్యేట్లు చేసేది కేవలం రెండు నుంచి మూడు వందల మంది ఐఎఎస్ అధికారులే. కానీ కొందరు ఐఎఎస్‌లు ‘అయ్యా ఎస్’లుగా మారి ఐఎఎస్‌ల వ్యవస్థ ప్రతిష్ఠకే మచ్చతెస్తున్నారు.
పాలకులు వేరు. ప్రభుత్వం వేరు. ప్రభుత్వం అనేది శాశ్వతం. పాలకులు అనే వారు ఐదేళ్ళ కోసారి మారుతుంటారు. ప్రభుత్వం అంటే ప్రధానంగా ఐఎఎస్ యంత్రాంగమే. పాలకులు అందరూ విద్యావంతులు, అన్ని వ్యవహారాలపైన అవగాహన ఉన్నవారు కాకపోవచ్చు. కానీ ఐఎఎస్‌లు విద్యావంతులు, వివిధ అంశాలపై సమగ్ర అవగాహన ఉన్నవారు. తెలిసో, తెలియకో పాలకులు తప్పులు చేస్తే దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ఐఎఎస్ అధికారులదే. ఒక మంత్రి తీసుకున్న నిర్ణయం నిబంధనలకు విరుద్ధమని సదరు ఐఎఎస్ అధికారి అడ్డు తగిలితే అది అమలుకు నోచుకోదు. అవినీతీ జరగదు. అంత ధైర్యంగా అడ్డు చెప్పగలిగే కొందర్ని ప్రభుత్వం ఏ విధంగా చూస్తుందన్నదీ తెలిసిందే. పాలకులు, ప్రభుత్వంలో ఉన్న వారు (ఐఎఎస్)లు పాలలో నీళ్ళలా కలిసినపుడు ఎమ్మార్ వంటి కుంభకోణాలు జరుగుతూనే ఉంటాయి. అపుడు ఐఎఎస్‌లకైనా మరొకరైనా తిప్పలు తప్పవు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నది అదే.
ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్కరూ కోరుకునేది రెండే అంశాలు. ఒకటి అధికారం, రెండోది డబ్బు. రాజకీయ నాయకులైనా, ఐఎఎస్ అధికారులైనా మరొకరైనా కోరుకుంటున్నది ఇదే. రాజకీయ నాయకుల్లోను, ఐఎఎస్ అధికారుల్లో నీతికి, నిజాయితీకి కట్టుబడిన వారు లేక పోలేదు. అటువంటి వారి పరిస్థితి ఏమిటన్నది చూస్తూనే ఉన్నాం. రాజకీయ నాయకులకు అధికారాన్ని ఇచ్చేది ప్రజలు. ఐదేళ్ళకోసారి వారు ప్రజల తీర్పును కోరాలి. కానీ ఇపుడు రాజకీయ నాయకులు ప్రజల తీర్పును కూడా కొనుగోలు చేస్తున్నారు. ఇందుకు భారీ మొత్తానే్న ఖర్చు పెడుతున్నారు. అధికారంలో ఉన్నపుడు సంపాయిస్తేనే కదా రేపు ఎన్నికల్లో ఖర్చు పెట్టగలిగేది అన్నది పాలకుల వాదన. ఈ విషయంలో అన్ని పార్టీలు ఒక తానులోని ముక్కలే!
రాష్ట్రంలో ప్రస్తుతం మూడు ప్రధాన కుంభకోణాలపై సిబిఐ దర్యాప్తు జరుగుతోంది. ఎమ్మార్ ప్రాపర్టీస్, ఓబులాపురం గనులు, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అస్తులు. ఈ మూడు కేసుల్లో ముప్పయ్ మంది వరకు ఐఎఎస్ అధికారులకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. వీరిలో సగం మందిని ఇప్పటికే విచారణ జరిపింది. ఇద్దరు ఐఎఎస్ అధికారుల్ని సిబిఐ అరెస్టు కూడా చేసింది. చట్టం ముందు పెద్ద, చిన్నా, ధనికుడు, పేద అన్న తేడాలు ఉండవు. ఎంత పెద్ద గుమ్మడి కాయ అయినా కత్తిపీటకు లోకువే అన్నట్లు ఎంత పెద్ద అధికారి అయినా దోషి అయినపుడు చట్టం ముందు తల దించుకోవలసిందే. సిఐబి వ్యవహరిస్తున్న తీరు పట్ల ఐఎఎస్ అధికారులు మండి పడుతున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డెబ్బయ్ మంది వరకు ఐఎఎస్ అధికారులు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి తమగోడు వెళ్ళ గక్కారు. నిర్ణయాలు తీసుకున్న మంత్రుల్ని వదిలిపెట్టి వాటిని అమలు చేసిన ఐఎఎస్ అధికారుల్ని నేరస్తులుగా సిబిఐ చిత్రీకరిస్తోందని, సీనియర్ల అన్న గౌరవం కూడా ఇవ్వడం లేదని వారు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తే తప్పు ఏ ఒక్కరిలో కాదు, అందరిలోను కనిపిస్తోంది.
నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో అవినీతి జరిగిందన్న దానిపైనే సిబిఐ విచారణ జరుపుతోంది. నిర్ణయాలు తీసుకున్నది మంత్రులు కాబట్టి వారిపైనే చర్యలు తీసుకోవాలి, వాటిని అమలు చేసిన తమ మీద కాదన్నది ఐఎఎస్‌ల వాదన. సచివాలయ బిజినెస్ నిబంధనలు తెలియని వారికి, విషయ పరిజ్ఞానం లోతుగా తెలియని వారికి ఇది నిజమే అనిపించవచ్చు. ముఖ్యమంత్రో, మంత్రో ఒక నిర్ణయం తీసుకున్నపుడు దాన్ని అమలు చేయక తప్పదు కదా అని భావిస్తుంటారు. ఇది నిజమే. కానీ దీనికి ముందు చాలా తతంగం ఉంటుంది. ఈ తతంగం అంతా నోట్‌ఫైల్‌లో ఉంటుంది. దీన్ని చదివితే తప్పు ఎవరు చేశారన్నది ఖచ్చితంగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వారు ఒక అంశంపై నిర్ణయం తీసుకుంటారు. అది నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లయితే ఆ విషయానే్న సంబంధిత శాఖ కార్యదర్శో, ముఖ్య కార్యదర్శో మరో ఐఎఎస్ అధికారో ఫైలులో పేర్కొంటూ రాసి తిరిగి ముఖ్యమంత్రికి తిప్పి పంపించవచ్చు. సంబంధిత శాఖ అధికారి కూడదని ఫైలు మీద రాసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి తనకున్న విచక్షాధికారాలతో దాన్ని అమలు చేయాల్సిందే నంటూ మళ్ళీ ఫైలును సంబంధిత అధికారి ఆమోదం కోసం పంపిస్తారు. అపుడు తన అభిప్రాయాన్ని స్పష్టంగా ఫైలులో పేర్కొంటూ ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు సంతకం చేయక తప్పడంలేదని పేర్కొనవచ్చు. విచారణ సందర్భంగా ఇటువంటి నోట్‌ఫైళ్ళవల్లనే ఐఎఎస్‌లు అక్రమాలకు పాల్పడ్డారా లేదా అన్నది బయటపడుతుంది.
అధికారం కోసం రాజకీయ నాయకులకు ఏమైనా చేసినట్లు కీలక పోస్టింగ్‌ల కోసం ఐఎఎస్ అధికారులు కూడా కొందరు దేనికైనా సిద్ధపడతారు. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రో, మంత్రో చెప్పినట్లుగా గుడ్డిగా సంతకం చేసే అధికారులకు కీలక పోస్టింగ్‌లు ఇవ్వడం, నిబంధనలకు అనుగుణంగా నడుచుకునే నిజాయితీ అధికారులకు ప్రాధాన్యం లేని పోస్టింగ్‌లు ఇవ్వడం అన్నది చూస్తూనే ఉన్నాం. రాజకీయ వత్తిళ్ళకో, కీలక పోస్టింగ్ మీద ఆశతోనో ఒక అధికారి సంతకాలు చేయవచ్చు. ముఖ్యమంత్రిగాని, మంత్రులుగాని తమకున్న విచక్షణాధికారాలను పేద ప్రజల సంక్షేమానికో ప్రయోజానికో వినియోగిస్తే తప్పు పట్టాల్సిన పని లేదు, తప్పు పట్టినా బాధ పడాల్సిన అవసరం లేదు, ఒక పేద వాడు ఉండటానికి ఒక గుడిసె వేసుకోవడానికి నిబంధనలకు విరుద్ధంగా వంద గజాల స్థలాన్ని ఉచితంగా కేటాయిస్తే ఎవరూ తప్పుపట్టరు. మానవతా దృక్పధంతోనే దీన్ని చూస్తారు. కానీ అదే ఒక బడా పారిశ్రామిక వేత్తకో, కోట్లకు పడగలెత్తిన ధనికునికో ఒక గజం స్థలాన్ని కేటాయించినా ప్రతి ఒక్కరూ తప్పు పడతారు. తప్పు పట్టాల్సిందే కూడా.
ఐఎఎస్ అధికారులు తమ గోడును చెప్పుకున్నపుడు ‘అరెస్టు శిక్ష కాదు కదా, బెయిల్ తీసుకోవచ్చు’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారట. ఒకసారి జైలుకు వెళ్ళి వచ్చిన వారికి సమాజంలో ఎంత గౌరవం ఉంటుందన్నది చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అనేక మంది ప్రముఖుల్ని సిబిఐ అరెస్టు చేసి జైలుకు పంపించింది. ఏడాదికో ఆ తర్వాతనో న్యాయస్థానంలో ఈ కేసు విచారణకు వచ్చినపుడు సిబిఐ తగిన సాక్ష్యాధారాలు చూపలేక పోయిందని, సదరు వ్యక్తులు నిర్దోషులని తీర్పు ఇచ్చిందనుకున్నాం. తాను నిర్దోషి అని తేలినందుకు ఆ వ్యక్తి అనంద పడాలా లేక ఇంతకాలం జైలు జీవితాన్ని అనుభవించిన తాను సమాజం దృష్టిలో దోషిగానే నిలబడాల్సి వస్తుందని బాధ పడాలా?
ఇక విచారణలో సిబిఐ తీరు కూడా అనేక విమర్శలకు అనుమానాలకు దారితీస్తోంది. ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలకు కేవలం అధికారులదే బాధ్యత, అధికారంలో ఉన్న మంత్రులదో, మరో రాజకీయ నాయకులతో కాదన్న ధోరణితో వ్యవహరిస్తున్నట్లు తోస్తోంది. సీనియర్ ఐఎఎస్ అధికారుల్ని, హైకోర్టు న్యాయమూర్తి హోదా ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంతరెడ్డిని కూడా తన వద్దకు పిలిపించి విచారణ జరిపిన సిబిఐ అధికారులు మంత్రులను మాత్రం వారి ఇళ్ళకు వెళ్ళి రెండోకంటికి తెలియకుండా విచారణ జరపడంలోని ఆంతర్యం ఏమిటి? సిబిఐ భావిస్తున్నట్లుగా కోట్లాది రూపాయలు ప్రభుత్వ ఖజానాకు దక్కకుండా చేశారన్న కారణంతో ఐఎఎస్‌లపై కేసులు పెట్టిన సిబిఐ అసలు ఆ నిర్ణయాలకు కారకులైన మంత్రులను ఎందుకు వదిలిపెడుతున్నట్లు? ఒక శాఖలో అవినీతి జరిగినపుడు అందుకు బాధ్యులు ఎవరన్నది కాకుండా ఆ సమయంలో ఆ శాఖలో పనిచేయడమే నేరం, పాపం అన్నట్లు అందరిపైనా సిబిఐ కేసులు పెడుతోంది. రాజకీయ నాయకులు తప్పులు చేస్తే విద్యావంతులైన మీరు ఎందుకు అడ్డుకోలేదు,రాజకీయ వత్తిళ్ళకు ఎందుకు తలొగ్గారు అని ఐఎఎస్ అధికారుల్ని సిబిఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సిబిఐ కూడా రాజకీయ వత్తిళ్ళకు లోబడే విచారణ జరపడం లేదా, ఇపుడు విచారణ జరుపుతున్న కేసుల్లో రాజకీయ నాయకుల్ని వదలిపెట్టి కేవలం అధికారులే దోషులుగా చిత్రీకరించడం రాజకీయ వత్తిళ్ళ వల్లనే కదా అని ఐఎఎస్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
సాధారణంగా ఐఎఎస్‌లకు, ఐపిఎస్‌లకు మధ్య పొసగదు. జిల్లాల్లో నేను గొప్ప అంటే నేనే గొప్ప అని ఐఎఎస్ అధికారి అయిన జిల్లా కలెక్టర్, ఐపిఎస్ అధికారి అయిన జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అనుకోవడం సర్వ సాధారణం. ఇప్పుడు సిబిఐకి, ఐఎఎస్‌లకు మధ్య జరుగుతున్న పోరులో ఈ కోణం కూడా కొంత దాగి ఉంది. తాము చేస్తున్నది తప్పా, ఒప్పా అన్నది ఆలోచించకుండా ఐదేళ్ళ పాటు అధికారంలో ఉండే పాలకులు చెప్పినట్లు ‘అయ్యా ఎస్’ అనే ఐఎఎస్‌లు, ఐపిఎస్‌లు విచారణల పేరిట న్యాయస్థానాల చుట్టూ, జైళ్ళ చుట్టూ తిరగాల్సిందే. దీని ప్రభావం పాలనా యంత్రాంగంపై పడుతుంది. అంతిమంగా నష్ట పోయేది రాష్ట్ర ప్రజలు..
  • -ఎస్‌ఎన్‌సిఎన్ ఆచార్యులు ( From Andhrabhoomi మెయన్ ఫీచర్)
  • 3 comments:

    1. ఐయ్యేఏస్సులు ఎంత అమాయకం నటిస్తున్నారు... మంత్రివర్గంలో తీసుకొన్న నిర్ణయాలలో ఏవి రాజ్యాంగ పరంగా, చట్టబద్ధంగా ఉన్నాయో చూసే బాధ్యత ఈ ఐయ్యేఎస్సులదేనన్న సంగతి మరచారా??? అవునులే అవినీతి మంత్రుల మోచేతి క్రింద నీళ్ళు త్రాగటం అలవాటుపడింతరవాత, చట్టాన్ని తమ చుట్టంలాగా మార్చి మంత్రులకి బ్రోకర్లులాగా మారినతరవాత ఐయ్యేఎస్సులో చందివిందేమి గుర్తుంటుంది.....ఏ ఫైలులో ఎంతొన్స్తుందో అన్న సంగతి తప్ప........ సీబీఐ వాళ్ళు చాలా చక్కగా కీలెరిగి వాత పెడుతున్నారు. చెడ్డ పనిచేసేవాడితొబాటు దానిని చెసెపెట్టేవారిని కొడితె నీతి నిజాయతీ కోసం కాకపోయినా...కనీసం పరువు పోతుందనే భయంతోనైనా ఈ దొంగ బ్రొకరు పనులు మానేస్తారేమో "మన ఉన్నతాధికారులు".

      ReplyDelete
    2. /నిర్ణయాలు తీసుకున్న మంత్రుల్ని వదిలిపెట్టి వాటిని అమలు చేసిన ఐఎఎస్ అధికారుల్ని నేరస్తులుగా సిబిఐ చిత్రీకరిస్తోందని/
      ఇది నిజమే. ప్రధాని కనుసన్నలలో పనిచేసే సిబీఇ దిగజారిన తన ప్రతిష్ట నిలుపోవడానికి ఇలాంటి తొట్టికేసులు కొన్నాళ్ళు సాగిస్తుంది. రాష్ట్రంలో కుంభకోణాల ప్రధాన సూత్రధారులైన మంత్రులను అరెస్టు చేయకుండా, నిస్సహాయులైన IAS లపై తన తఢాకా చూపించి చేతులు దులుపుకుంటోంది.

      /సీనియర్ల అన్న గౌరవం కూడా ఇవ్వడం లేదని వారు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు/

      గౌరవమంటే... జైల్లోకి తీసుకెళ్ళే ముందు, ఎర్రబుగ్గ లైటు కారులో తీసుకెళ్ళడం, సెల్/కారు డోర్ తీసి పట్టుకోవడం, సెల్యూట్ చేయడం లాంటిది కావాలనా? ఇదేమి అధికార పర్యటన కాదు కదా, అవి అంతగా బాగుండదేమో... ఘనతవహించిన IASలు ఆలోచించాలి.

      ReplyDelete
    3. IAS అధికారుల వాదనలో నిజముంది. ఆ విషయం కాదనలేము.

      కానీ వీళ్ళు ఇప్పుడు చూపిస్తున్న ఐకమత్యం స్కాములు జరిగినప్పుడు ఏమయింది?
      అప్పుడే అందరూ కలిసి ప్రధానమంత్రికో మరొకరికో తమ కష్టాలు చెప్పుకుంటే ఇంతవరకూ వచ్చేది కాదు కదా!

      ReplyDelete