Sunday, April 1, 2012

శ్రీరామ నవమి ప్రాశస్థ్యం

చైత్రశుద్ధ నవమినాటి కోలాహలం అంతాఇంతా కాదు. ఎక్కడా చూసినా సీతారాముల కల్యాణోత్సవాలు, శ్రీరాముని పట్ట్భాషేక మహోత్సవాలు కనిపిస్తాయి. శ్రీరాముని గుణనామాల కీర్తనలే వినిపిస్తాయి. త్రేతాయుగంనాటి దశరథుడు పుత్రకామేష్ఠి జరిపి యజ్ఞప్రసాదంగా రాముని పొందాడు. అల్లారుముద్దుగా పెంచి విద్యాబుద్ధులను నేర్పించాడు. ధర్మమే మూర్త్త్భీవించినట్లుగా రాముడు యువకుడు అయ్యాడు. సర్వులకుప్రియుడైన రాముణ్ణి తమరాజుగా కావాలనుకున్నారు అయోధ్యావాసులు. దశరథుడూ రాముణ్ణి యువరాజును చేద్దామనుకొన్నాడు. కాని మంథర బోధతో కైకవరాల కారణంగా కోసలరాముడు వనవాసరాముడయ్యాడు.
వనవాసంలో అష్టకష్టాలను ఎదుర్కొన్నారు. రాక్షసుల మాయోపాయంవల్ల తన ప్రాణ సఖియైన సీతమ్మను దూరం చేసుకొన్నాడు. లక్ష్మణుని సాయంతో సీతానే్వషణ మొదలు పెట్టాడు. ఆ సమయంలో తారసిల్లిన రాక్షసగణాన్ని సంహరిస్తూ సుగ్రీవునితో స్నేహం చేశాడు. ఆంజనేయ సుగ్రీవాదుల సాయంతో సీతమ్మను అపహరించిన రావణుని స్థావరాన్ని తెలుసుకొన్నాడు. సముద్రంపై వారథిని నిర్మించి లంకాపట్టణంలో ప్రవేశించి రావణుని సీతను అపహరించిన రావణుని సంహరించాడు. ఆంజనేయుడు, సుగ్రీవుడు, విభీషణాదులతో కూడిన మిత్రబృందంతో కలసి సీతాలక్ష్మణసమేతంగా భరతుని స్వాగతసత్కారాలను అందుకుంటూ రాముడు తిరిగి అయోధ్యకు వచ్చాడు. అందరూ కలసి రామపట్ట్భాషేకం చేశారు. సుశ్యామలంగా రాముడు 11 ఏండ్లు పరిపాలన చేశాడు. సత్యనిష్టకు, ధర్మ పరిపాలనకు మారుపేరైన ఆ అయోధ్యారాముడి జయంతిని పురస్కరించుకుని నేటికీ రామనవమి ఉత్సవాలు జరుపుకుంటారు. చైత్ర శుక్ల పాడ్యమి రోజునుంచి శ్రీరామ నవమి వరకు నవరాత్రోత్సవాలను జరుపుతారు. ఈ రామనవమిని అంగస్త్య సంహిత రామనవమనే మూడురోజుల పండుగగాచేస్తారని తెల్పుతుంది. మహారాష్ట్రులలో రామనవమి రోజు పొద్దుటినుంచి రామాయణగాధను చదవడం, రాముని లీలలను కీర్తించడం లాంటివి చేస్తారు.
సుమారు మధ్యాహ్నం 12 అవుతుండగా రాముని జననకాలమని తలచి ఒకరిపై ఒకరు బుక్కాను చల్లుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. రామునికోసం జోలపాటలు పాడుతారు. అందరూ పంచదార కలిపిన శొంఠిపొడిని ప్రసాదంగా తీసుకొంటారు. మన దగ్గర ఈ శ్రీరాముని జయంతి రోజున శ్రీరామునికి షోడశోపచారాలను చేసి అష్టోత్తర శతనామావళులతో పూజిస్తారు. దేవాలయాలల్లో ప్రముఖంగా సీతారాముల కల్యాణాన్ని శ్రాస్తోక్తంగా చేస్తారు. ఈ శ్రీరామనవమి రోజు ముఖ్యంగా పానకం వడపప్పును ప్రసాదంగా తీసుకుంటారు. మిరియాలపొడి , బెల్లంతో చేసిన ఈ పానకం ఆరోగ్యానికి ఎంతో మంచిదంటారు కూడా.
శ్రీహరి దశావతారాల్లో పూర్ణావతారం శ్రీరాముడు. ‘ఆత్మానం మానుషం మనే్య’ అని స్వయంగా తన్ను మానవునిగా దాశరథిగా ప్రకటించుకున్నవాడు శ్రీరాముడు. శ్రీరామావతారం కంటే రామనామం ప్రాచీనమైనది. అది కేవల భౌతిక రూపాన్ని సూచించేది కాదు, చిదానందరూపం. సచ్చిదానంద స్వరూపమగు ఏ పరబ్రహ్మను నిరంతరమూ భావిస్తూ మునీంద్రులు ఆనందముననుభవిస్తారో అట్టి పరతత్వమే రాముడు. ఆ పరతత్వమే తరువాతి కాలంలో దాశరథిగా అవతరించడం జరిగింది. ఆ తత్వాన్ని తెలియబరచే వేదం రామాయణంగా రూపొందింది. శ్రీరామ నామంలోని ‘ర’ వర్ణం ఈశ్వర చైతన్యం; ‘మ’ వర్ణం జీవ చైతన్యం ఈ రెంటిని సంయోజనపరచుటయే ‘రామ’నామం. ‘ర’ వర్ణం- తత్ వాచకం ‘మ ’ వర్ణం- త్వం వాచకం. తత్వమసి అనే మహావాక్యార్థమే రామనామం. నామ జపానికి ఏ వస్తువులు అవసరం లేదు. సమయా సమయాలు లేవు. కుల మత జాతి రంగ వివక్ష లేక సమస్త జనులు సులభంగా చేయగల అనుష్ఠానం నామధ్యానం. ఆ నామాన్ని ధ్యానం చేస్తూ రాముని వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోదాం.
- చరణ శ్రీ ( From Andhrabhoomi.net )

1 comment:

  1. మీపై సదా రామకృపావర్షం కురియాలని కోరుకుంటూన్నాను జైశ్రీరాం

    ReplyDelete