Sunday, January 29, 2012

ప్రతిపక్ష నేతగానూ నాదే రికార్డు:చంద్రబాబు


ముఖ్యమంత్రిగానే కాదు ప్రతిపక్ష నేతగానూ నాదే రికార్డు అని టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు సగర్వంగా ప్రకటించుకున్నారు. తన రికార్డును చేరుకోవాలంటే 20 ఏళ్లు పడుతుందని అన్నారు. టిడిపి సాంకేతిక నిపుణుల విభాగం రాష్ట్ర కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం శనివారం ఎన్టీఆర్ భవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు తన రికార్డును వివరించారు. చంద్రబాబు నాయుడు దాదాపు తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం ఉన్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అంతకు ముందు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన కాసు బ్రహ్మానందరెడ్డి రికార్డును బాబు బ్రేక్ చేశారు. 2004 ఎన్నికల్లో ఓటమి తరువాత దాదాపు ఎనిమిదేళ్ల నుంచి చంద్రబాబు ప్రతిపక్ష నాయకునిగా ఉన్నారు. గతంలో ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చెరో ఐదేళ్ల పాటు మాత్రమే ప్రతిపక్ష నాయకునిగా బాధ్యతలు నిర్వహించారు. బాబు ఈ రికార్డును కూడా బద్దలు కొట్టి రెండవ సారి కూడా ప్రతిపక్ష నాయకునిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో ఎన్నికలు జరిగితే అప్పటికి ఆయన పదేళ్లపాటు ప్రతిపక్ష నాయకుని బాధ్యతలు నిర్వహించినట్టు అవుతుంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా ఉందని, ఈ పాలనను చూస్తుంటే ఆవేశం కలుగుతోందని చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్యం గుర్తుకు వచ్చి వౌనంగా ఉండాల్సి వస్తోందని తెలిపారు. టిడిపి తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేశానని, విదేశీ పెట్టుబడుల కోసం కాళ్లు అరిగేలా తిరిగానని అన్నారు. తాను సాధించిన అభివృద్ధిని వైఎస్‌ఆర్ అధికారంలోకి వచ్చాక సర్వనాశనం చేశారని, రాష్ట్రాన్ని ఇరవై ఏళ్లు వెనక్కి నెట్టివేశారని విమర్శించారు. వ్యవసాయం లాభసాటి చేయడమే ఇప్పుడు తన ముందున్న ప్రధాన ధ్యేయమని తెలిపారు.
ఫేస్‌బుక్, ట్విట్టర్‌ల ద్వారా సాంకేతిక నిపుణలు తమ ఆలోచనలు పంచుకోవాలని కోరారు. అందరి సలహాలు తీసుకుని రాష్ట్ర అభివృద్ధికి తగు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో 50శాతం యువత ఉందని, వారికి సరైన విద్యను అందిస్తే అద్భుతాలు చేస్తారని అన్నారు. తెలుగు వాణిజ్యవేత్తలు యూదుల వంటి వారని, అద్భుతంగా వ్యాపారాన్ని చేస్తారని అన్నారు. గుజరాతీలు సైతం మనతో పోటీకి రారని, వారు పైసా పైసా కూడబెడతారు కానీ మన వారు పెట్టుబడిని ఎన్నో రేట్లు పెంచుతారు అని అన్నారు. ముఖ్యమంత్రి పదవి లేదని తనకు వ్యక్తిగతంగా ఆవేదన లేదని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోతున్నాననే ఆవేదన చెందుతున్నానని అన్నారు
(ఆంధ్రభూమి నుండి)

No comments:

Post a Comment