కాగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉత్తరాఖండ్‌లో రెండు రోజులు పర్యటించి బిజెపి ప్రభుత్వం అవినీతిని ఎండగట్టారు. అవినీతితో కూడుకున్న బిజెపి ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. సోనియా గాంధీ ఇచ్చిన పిలుపు ప్రజల్లోకి బాగానే వెళ్ళింది. సోనియా ఆరోపణలను రాష్ట్ర బిజెపి సమర్థవంతంగా ఖండించలేకపోయింది. అందుకే బిజెపి అధినాయకత్వం తాజాగా పౌరసమాజం నాయకుడు అన్నా హజారే, యోగా గురువు బాబా రాందేవ్‌ను ఎన్నికల ప్రచార బరిలోకి దించుతోందని అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి రమేష్ పోక్రియాల్ అవినీతి నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఖండూరి రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే లోకాయుక్తను ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభించారు. హజారే తయారు చేసిన లోకపాల్ బిల్లును యథాతథంగా తీసుకుని రాష్ట్ర లోకాయుక్త చట్టాన్ని తయారు చేసి శాసనసభలో ఆమోదించారు. తమ బిల్లును చట్టం చేసిన ఖండూరి పట్ల అన్నా హజారేకు ఎంతో సానుభూతి ఏర్పడింది. జన లోకపాల్ బిల్లును ఆమోదించాలన్న తన డిమాండ్‌ను బుట్టదాఖల చేసిన కాంగ్రెస్‌పై ఆగ్రహంతో ఉన్న హజారే ఉత్తరాఖండ్‌లో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. బాబా రాందేవ్ కూడా కాంగ్రెస్ పట్ల ఆగ్రహంతో ఉన్నారు. రాంలీలా మైదానంలో రాందేవ్ చేపట్టిన నిరాహార దీక్షను కాంగ్రెస్ ప్రభుత్వం భగ్నం చేసిన సంగతి తెలిసిందే. దీంతో బాబా రాందేవ్ ఇప్పుడు అన్నా హజారేతో చేతులు కలిపి ఉత్తరాఖండ్‌లో బిజెపికి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు.
( From Andhrabhoomi Daily )
No comments:
Post a Comment