Sunday, January 29, 2012

ఉత్తరప్రదేశ్‌లో ‘హంగ్’తప్పదా?

ఇసి ఆదేశాల దరిమిలా ఏనుగు బొమ్మలను గులాబీ రంగు షీట్లతో కప్పుతున్నారు. గులాబీ రంగును ఎంపిక చేసుకోవడానికి బహుశా అది రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన రంగు కాకపోవడమే కారణ మని చెప్పవచ్చు. అంతేకాక మాయావతికి అత్యంత ఇష్టమైన రంగు కూడా. ఎన్నికల్లో ఎన్నో చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. కానీ విగ్రహాలను కప్పి ఉంచిన సన్నివేశం కార్టూనిస్టులు ఆనందంగా బొమ్మలు గీసుకోవడానికి అనువైనది. డెహ్రాడూన్‌కు చెందిన ఒకాయన రాజాజీ పార్క్ నుంచి ఓ ఏనుగుల గుంపు వస్తే ఏం జరుగుతుందని ప్రశ్నించాడు? అప్పుడు ఎన్నికల సంఘం అధికారులు ఆ ఏనుగులను గులాబీ రంగు బెడ్‌షీట్లు తీసుకుని తరుముతారా? మాయావతి విగ్రహాలను, ఏనుగు బొమ్మలను మూసి ఉంచడానికి రాష్ట్ర ఖజానా నుంచి కోటి రూపాయలు ఖర్చుచేయాల్సి వచ్చిందట. ఇప్పుడు బాగానే ఉంది కానీ మున్ముందు లెక్కల తనిఖీ జరిగినప్పుడు ఈ కోటి గురించి భారతీయ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆరా తీసే అవకాశం లేకపోలేదు.
భవిష్యత్ సంగతి అలా ఉంచితే ఇప్పుడు మాత్రం ఉత్తరప్రదేశ్ ఎన్నికలను గురించి రోజురోజుకు, గంట గంటకూ జనం ఆసక్తి పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ‘విగ్రహాల వ్యవహారాన్ని’ గురించి మాయావతి ప్రస్తావించడమే కాక దాన్నుంచి గరిష్టస్థాయలో రాజకీయ ప్రయోజనాన్ని పొందడానికి చూస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఈ వ్యవహారం బహుజన సమాజ్‌కు మేలు చేస్తుందా? చేస్తే ఎంతవరకు చేస్తుంది? ఒకవేళ కీడే జరిగితే ఏస్థాయలో ఉంటుందనేది ఇప్పుడే చెప్పడం కష్టం. ఒకవేళ మాయావతి ఎన్నికల్లో పరాజయం పాలైతే ఈ విగ్రహాల గతి ఏమవుతుందనేది సమాధానం లేని ప్రశే్న! సాధారణగా ఎన్నికల్లో పాలకపక్షం ఎదుర్కొనే ప్రజా వ్యతిరేకతనే ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో మాయావతి ప్రభుత్వం ఎదుర్కొం టున్నది. ఇది బిఎస్‌పిని ప్రధానంగా వేధిస్తున్న సమస్య. ఈ కారణంగా బిఎస్పీ తీవ్రమైన వత్తిడికి గురవుతోంది. అవినీతి ఆరోపణలు వచ్చిందే తడవుగా మంత్రులను ఆఖరి నిముషంలో బర్తరఫ్ చేస్తూ పోవడం వల్ల పార్టీకి పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.
మాయావతి తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో నాల్గవ విడత ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. కొందరు మంత్రులతో సహా వందమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అధికార పార్టీ టికెట్లు దొరకలేదు. బహుజన సమాజ్ పార్టీ జాబితాలో 88 మంది షెడ్యూలు కులాల అభ్యర్థులు, 113 మంది వెనుకబడిన తరగతులకు చెందినవారు, ముస్లింలతో సహా 85 మంది మైనారిటీ వర్గాలకు చెందినవారు, 74 మంది బ్రాహ్మణులతో సహా 115 మంది అగ్రవర్ణాలవారు ఉన్నారు. అయితే మాయావతి ఇంకా ప్రచారం మొదలెట్టలేదు. ఇప్పటికే పక్కా ప్రణాళికతో తమ పార్టీ క్యాడర్‌ను ఉరుకులు పెట్టిస్తున్న మాయావతి సుడిగాలి పర్యటనలతో కూడిన ప్రచార కార్య్రకమాన్ని ఇప్పటికే రూపొందించారు. ఇక ఆమె రంగంలోకి దిగితే ప్రచారం మంచి రసపట్టులో పడుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. పకడ్బందీగా వ్యవహరించే మాయావతి ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఇప్పుడున్న అంచనాల ప్రకారం బహుజనసమాజ్ పార్టీకి 110సీట్లు రాగలవని ఒక అంచనా! అయతే అధినేత్రి రంగంలోకి దిగి, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఈ సంఖ్య మరింత పెరగవచ్చు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో ప్రధానంగా మనం చెప్పుకోవలసింది ఇద్దరు యువకుల గురించి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ, సమాజ్‌వాది పార్టీకి చెందిన అఖిలేష్ యాదవ్‌లు ప్రచారంలో ముందున్నారు. ఇద్దరు యువనాయకులూ ఎన్నికల క్షేత్రంలో తమ శక్తివంచన లేకుండా తలపడేందుకు సిద్ధమయ్యారు. వారిద్దరు రాజకీయాల్లో ఆరితేరిన మాయావతిని ఎదుర్కొని విజయకేతనం ఎగురవేయాలని ఉవ్విళ్ళూరుతున్నారు.
ఉత్తరప్రదేశ్ ప్రచారంలో రాహుల్‌గాంధీ చాలా దూకుడుగా ముందుకెళ్తున్నారు. గడచిన రెండు దశాబ్దాలలో పోయిన కాంగ్రెస్ ప్రతిష్ఠను పునరుద్ధరించాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ ఎన్నికలలో ఆయన వ్యవహారశైలిని చూసినవారిలో కొందరికి మున్ముందు రాహుల్ మరింత పెద్ద బాధ్యతలను ఎంతమేరకు చేపడతాడనే సందేహాలు ఏమైనా ఉంటే అవి పటాపంచలైపోయాయ. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలోని 403 సీట్లలో కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీలకు కలపి 80-90 సీట్లు లభించే అవకాశముంది. మైనారిటీ ఓట్లకోసం కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీల మధ్య తీవ్రస్థాయలో పోరు జరుగుతోంది. మైనారిటీ ఓట్లను ఆకర్షించడంలో విజయం సాధించడంపై ఈ రెండు పార్టీల బలాలు పెరగడం లేదా తరగడం ఆధారపడివుం ది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ములాయంసింగ్ నేతృత్వంలోని సమాజ్‌వాది పార్టీ అందరికంటే ముందంజలో ఉన్నదని విశే్లషకుల అభిప్రాయం. పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆచి తూచి అడుగు ముందుకేస్తారని ప్రతీతి. ఆయన తీసుకున్న జాగ్రత్తలే ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ మంచి దూకుడుమీద ఉండటానికి కారణం. పార్టీ నుంచి అమర్‌సింగ్ వెళ్లిపోవడంతో రెండు అధికార కేంద్రాల వల్ల ఏర్పడిన అయోమయం తొలగిపోయింది. పార్టీపై ములాయంకు పూర్తి నియంత్రణ వచ్చింది. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాన్ని రూపొందించడం, పార్టీలో క్రమశిక్షణను అమలుచేయడం, ప్రతి అంశంపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ఒక్క ములాయం సింగ్ యాదవ్‌కు మాత్రమే ఉంది. పార్టీ నాయకులకు, ఓటర్లకు ఆయన మరింత చేరువయ్యారు. అన్నీ దగ్గర ఉండి చూసుకుంటున్నారు. అఖిలేష్ కూడా పార్టీ దిగువశ్రేణి నాయకులకు చేరువయ్యారు. పలువురు నాయకులు అఖిలేష్‌ను సంప్రదించి పనులు చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం సమాజ్‌వాది పార్టీకి 140 సీట్లు రాగలవని ఒక అంచనా. ఇదే ఒరవడి కొనసాగి ఓటర్ల నిర్ణయం మరింత బలపడితే అది సమాజ్‌వాది పార్టీకి అనుకూలంగా మారవచ్చు.
పై కారణాల వల్ల ఉత్తరప్రదేశ్‌లో సంకీర్ణ ప్రభుత్వం తథ్యంగా కనిపిస్తోంది. ఎందుకంటే 403 సీట్లున్న సభలో అధికారానికి అవసరమైన 202 సీట్లు ఏ పార్టీకి కూడా వచ్చే సూచనలు కనిపించడం లేదు. అప్పుడు కాంగ్రెస్, ఎప్పీ కలిస్తేనే సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడగలదు. పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో కాంగ్రెస్ విజయదుందుభి మోగించవచ్చు. రెండు రాష్ట్రాలలో కూడా అవినీతే ప్రధాన అంశం. రెండుచోట్లా భారతీయ జనతా పార్టీయే దోషి. పంజాబ్ సభలోని 117 సీట్లలో అమరీందర్ సింగ్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ 60-65 సీట్లు గెలవవచ్చు. అకాలీదళ్ తన బలాన్ని కాపాడుకుని 40-45 సీట్లను గెలిచే అవకాశాలున్నాయి. ఎక్కువగా నష్టపోయేది బిజెపియే. బిజెపి బలం 19 నుంచి నాలుగు సీట్లకు తగ్గవచ్చు. ఎక్కువలో ఎక్కువ ఆరు చోట్ల గెలిచే అవకాశాలున్నాయి. ఉత్తరాఖండ్‌లో కూడా అదే పరిస్థితి. ఎన్నికల క్షేత్రంలో బిజెపి తరపున అన్నా హజారే, యోగా గురువు బాబా రాందేవ్ రాజకీయ ప్రచారం చేస్తున్నారు. బిజెపి అధిష్ఠానం ఉందో లేదో తెలియని పరిస్థితి. ఒకవేళ ఉంటే ఒక్కమాట మీద నిలవడం లేదు. భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరి దారి వారిదే. ఉత్తరప్రదేశ్‌లో అవినీతి మచ్చపడి మాయావతి బర్తరఫ్ చేసిన మంత్రిని బిజెపిలో చేర్చుకున్నారు. ఆ తరువాత తిరస్కరించారు. ప్రతి స్థాయిలో ప్రతిభావంతులున్న జాతీయ పార్టీలో ఇంతటి ఉదాసీన పరిస్థితులు నెలకొనడం దారుణం.
రాజకీయ వర్గాలకు 2012 సంవత్సరం బాగానే మొదలైంది. దేశ వ్యాప్తంగా వివిధ నగరాలు, పట్టణాలలో నిరసనలు, మూకుమ్మడి అరెస్టులకు వెళ్లాలని సంకల్పించిన అన్నా హజారే ప్రతిపాదనకు జనం నుంచి తగిన స్పందన రాలేదు. పౌర సమాజం కార్యకర్తలు ప్రజా తనిఖీకి అతీతం కాదనే విషయం స్పష్టమైంది. రెండవ ఇన్నింగ్స్‌లోని ప్రథమార్థంలో యుపిఎ ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. ప్రతిష్ట దెబ్బతిన్నది. నాయకులు, కార్యకర్తల్లో ఉదాసీనత నెలకొంది. అధిష్ఠానం వ్యాకులతకు లోనైంది. వచ్చే రెండేళ్లు 2012-14 మధ్య యుపిఎలో మునుపటి కన్నా సుస్థిరత నెలకొనవచ్చు. యుపిఎ నాయకుల్లో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఐదు అసెంబ్లీల ఎన్నికల ఫలితాలు వచ్చే మార్చి ఆరవ తేదీన వెల్లడవుతాయి. ప్రతి చోటా విజేతలు, పరాజితులు ఉంటారు. భవిష్యత్తులో బిజెపి దెబ్బతిని కాంగ్రెస్‌కు మేలు జరగవచ్చు. ఏది ఏమైనా ప్రాంతీయ పార్టీలు తమ తమ బలాలను నిలబెట్టుకుంటాయి. ఈ ఏడాది చివర్లో అన్నిటికన్నా కీలకమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అప్పటికి దేశంలో ఇప్పటికన్నా మెరుగైన రీతిలో శాంతియుత వాతావరణం నెలకొనవచ్చు.

-అరుణ్ నెహ్రూ(ఆంధ్రభూమి నుండి)

No comments:

Post a Comment