నిత్య జీవనంలో ఎందరో వ్యక్తులు తారసపడుతూంటారు. వారిలో కొందరి మనస్తత్వాలు, ప్రవర్తనలు చాలా విచిత్రంగా, విలక్షణంగా ఉంటాయి. వారిలో మళ్ళీ కొందరు కొన్ని తప్పుడు పనులు చేస్తూ వాటిని కప్పి పుచ్చుకోవటానికి వారు మాట్లాడే తీరు ఆశ్చర్యంగా ఉంటుంది.
లంచం తీసుకుంటే తప్ప పని చేయని అధికారి, మరొక వ్యక్తిని కించపరచి పరమ లంచగొండిగా చిత్రీకరిస్తూ మాట్లాడతాడు. వస్తువులను, సరుకులను నల్లబజారులో అమ్మే వ్యాపారి బ్లాక్ మార్కెట్‌ను విమర్శిస్తూ మాట్లాడతాడు. అతని గురించి తెలియనివారికి అతను చాలా నిజాయితీగా మాట్లాడుతున్నాడని అనిపిస్తుంది. ఇలా తాము చేసే తప్పుడు పనులను కప్పిపుచ్చుకొని పైకి మరో విధంగా మాట్లాడే పద్ధతిని ‘ప్రొజెక్షన్’ అంటారు. చాలా సందర్భాలలో వారి మాటలు వింటూంటూనే అది ‘ప్రొజెక్షన్’ అని అర్థమవుతుంది.
అసలు ఈ ప్రొజెక్షన్ (ఆక్షేపణ) అనేది రకరకాలుగా వుంటుంది. కొందరికి వివాహమైనా సరే ఇతరుల పట్ల ఆకర్షితులై వారిని ఇష్టపడుతూంటారు. అలాంటివారే ఎదుటివారు అలాంటి పనిచేస్తే వారిని విమర్శిస్తూంటారు. వాళ్ళు నీచులనీ, వారితో స్నేహం చేయటం, మాట్లాడటం పాపమనే ధోరణిలో మాట్లాడతారు. తాము చేస్తున్న తప్పుని కప్పిపుచ్చుకోవటానికే వారు ఎదుటివారిపై బురద జల్లుతూ ..... వేస్తూంటారు.
గుండె జబ్బుతో బాధపడుతూ వున్న మనుషులు ధూమపానం ఎక్కువగా చేస్తుంటారు. దానివల్ల గుండె జబ్బు సమస్య మరింత జటిలంగా మారుతుంది. అతను సిగరెట్లు కాలుస్తున్నాడన్న విషయం, అతగాడి భార్య డాక్టర్‌కు చెబితే, ఆ డాక్టర్ తిరిగి ఆ వ్యక్తిని ‘మీరు సిగరెట్లు కాలుస్తున్నారట కదా! నిజమేనా’’ అని అడుగుతాడు. అప్పుడు అతను తన తప్పును కప్పిపుచ్చుకోవటానికి ‘‘ఎవరు చెప్పారు, అంతా అబద్ధం. నేను సిగరెట్టు అసలు ముట్టుకోలేదు’’ అంటూ నిజం ఒప్పుకోవటానికి నిరాకరిస్తాడు.
ఈవిధంగా నిజాన్ని ఒప్పుకోకపోవడమనేది మద్యపానం చేసే వారిలో, ధూమపానం చేసేవారిలో, మత్తుమందులకు బానిసలైనవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. తమ బలహీనతలను అబద్ధాలు ఎన్నయినా చెప్పి కప్పిపుచ్చుకోవటానికి వీరు ఒకటే తాపత్రయపడతారు. ఆఫీసులో ఓ కింది ఉద్యోగిపై, అతని పైఅధికారి ఏదో పని విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. సదరు ఆ కింది ఉద్యోగి తన బాస్‌ను తిరిగి ఏమీ అనలేక నోరు మూసుకుని వూరుకుంటాడు. అంతటితో ఆగక తన కోపాన్ని ఇంటికి రాగానే భార్యా పిల్లలపై ప్రదర్శిస్తాడు. అకారణంగా తనపైన భర్త ఎందుకు కోపం చూస్తున్నాడో ఆ ఇల్లాలికి అర్థం కాదు. ఇలాంటి మనుషులను, వారి వైఖరిని మనం ఎన్నో కుటుంబాలలో చూస్తూంటాం.
తన పైఅధికారికి ఎదురుతిరగలేక, వారిని ఏమీ అనలేక తమలో తాము మానసిక ఆవేదన పడేవారు ఎందరో ఎదురుపడతారు. ఆ కోపాన్ని కొంచెంసేపు ప్రశాంతంగా కూర్చుని తగ్గించుకుందామని చూడకుండా, అకారణంగా ఇంటి ఇల్లాలిపై చూపిస్తే, ఏ పాపం - తప్పు చేయని ఎరగని ఆమె పరిస్థితి ఏంటనేది ఒక్క క్షం కూడా ఆలోచించరు. అలా ఒక్క క్షణం ఆలోచించగలిగితే అలాంటి మగవారు తమ ప్రవర్తనకు తామే సిగ్గుపడి మరింకెన్నడూ అలాంటి పిచ్చి పని చేయకూడదనుకుంటారు.
ఒకవైపు తాము తప్పు చేస్తూ, తాము నిజాయితీపరులుగా, మంచివారుగా అనిపించుకోవటానికి తాపత్రయపడటం అనేది చాలా హాస్యాస్పదంగా వుంటుంది. మనిషి ఎప్పుడూ ఒకేలా ఉండాలి. ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు అన్న ధోరణిలో ఉండకూడదు. తప్పు చేయటం మానవసహజం. చేసిన తప్పును నిజాయితీగా ఒప్పుకోగలిగితేనే మీ ఔన్నత్యం బయటపడుతుంది. అప్పుడు ఎదుటివారి దృష్టిలో మీ విలువ గౌరవం ఇనుమడిస్తాయి.
ప్రతి మనిషి జీవితంలోనూ ఏదో ఒక రూపంలో బాధలు, సమస్యలు వుంటాయి, వస్తాయి. ఎల్లప్పుడూ వాటి గురించే ఆలోచిస్తూ కూర్చునే కంటే, వాటిని అధిగమించటం ఎలా అన్న దిశలో ఆలోచన సాగిస్తే సమస్యలు మబ్బుల్లా విడిపోతాయి. కానీ మనలో ఎంతమంది ఆ విధంగా ఆలోచిస్తున్నారు అని ప్రశ్నిస్తే సమాధానం దాదాపుగా శూన్యమనే చెప్పాలి.
మనిషికి సమస్యలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఎదురైనపుడు ఆప్తులతో, బంధువులతో వాటిని చెప్పి, పంచుకోగలిగితే తప్పక పరిష్కారం దొరుకుతుంది. ఒకటి గుర్తుంచుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉంటేనే మనిషి కూడా ప్రశాంతంగా ఉండగలుగుతాడు. ప్రశాంతత అనేది మనకి మనం సృష్టించుకునేదే తప్ప అదేమీ ఎక్కడినుంచో రాదు. అందుకని మనిషి ఎప్పుడైనా ఒక పొరపాటు చేసినా, అబద్ధం చెప్పినా దాని పర్యవసానం ఏవిధంగా వుంటుందో అర్థంచేసుకుని ఆ తప్పును, నిజాన్ని నిజాయితీగా, నిర్భయంగా ఒప్పుకుంటే జీవితంలో ఏ సమస్య ఉండదు.
అందుకని నిజాలు ఒప్పుకుంటేనే ఏ మనిషికైనా జీవితం హాయిగా, ఆనందంగా గడిచిపోతుంది.
(ఆంధ్రభూమి నుండి )
No comments:
Post a Comment