వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని
పెంచి పోషిస్తున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న గూగుల్, ఫేస్ బుక్ సహా మొత్తం
21 సామాజిక నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్లను ప్రాసిక్యూట్ చేయడానికి కేంద్ర
ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వీటిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి రంగం
సిద్ధమయింది. దేశంలోని వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచి పోషించడం,
దేశ సమగ్రతకు భంగం కలిగించడం లాంటి నేరాలకు పాల్పడినందుకు యాహూ,
మైక్రోసాఫ్ట్‌తో పాటుగా 21 సోషల్ నెట్‌వర్కింగ్‌పై చట్టపరంగా చర్యలు
తీసుకోవడానికి తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని ప్రభుత్వం శుక్రవారం ఢిల్లీ
కోర్టుకు తెలియజేసింది. అనుమతులు మంజూరు చేసే అథారిటీ తనముందుంచిన మొత్తం
రికార్డులను, సమాచారాన్ని స్వయంగా పరిశీలించిన అనంతరం నిందితులపై ఐపిసి
153ఎ, 153 బి, 295 ఎ సెక్షన్ల కింద విచారణ జరపడానికి తగిన
సాక్ష్యాధారాలున్నాయనే నిర్ధారణకు వచ్చినట్లు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్
సుదర్శన్ కుమార్ ముందు సమర్పించిన నివేదికలో కేంద్రం తెలిపింది.
విదేశాల్లోని పది నెట్‌వర్కింగ్ కంపెనీలకు సమన్లు జారీ చేయడంపై తన వైఖరిని
తెలియజేయాలని కోర్టు విదేశాంగ మంత్రిత్వ శాఖను కోర్టు ఆదేశించడంతో ఈ రెండు
పేజిల నివేదికను కేంద్రం కోర్టుకు సమర్పించింది. గత డిసెంబర్ 23న కోర్టు 21
సోషల్ నెట్‌వర్కింగ్ కంపెనీలకు సమన్లు జారీ చేసినప్పటికీ కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వాలు లేదా జిల్లా మేజిస్ట్రేట్‌నుంచి ముందస్తు అనుమతి లేకుండా
వాటిని అమలు చేయడానికి వీలు లేకపోవడంతో విదేశాలకు చెందిన పది కంపెనీలకు
మాత్రం వాటిని సర్వ్ చేయలేదు.
కాగా, వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచి పోషిస్తున్నందుకు, దేశ
సమగ్రతకు భంగం కలిగిస్తున్నందుకు 21 సోషల్ నెట్‌వర్కింగ్ కంపెనీలపై చర్యలు
తీసుకోవడానికి అనుమతి ఇచ్చినట్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తన
నివేదికలో కోర్టుకు తెలియజేసింది.
No comments:
Post a Comment