Tuesday, November 20, 2012

మజ్లిస్‌ కటీఫ్‌పై ముందే సంకేతాలు?


మజ్లిస్‌ పార్టీ మద్దతు ఉపసంహరించుకోబోతున్నట్టు సర్కారుకు ముందుగానే సంకేతాలు అందాయా?
ఆ పార్టీ నేతలను శాంతిపజేసుకొని పొత్తును కొనసాగింపజేసేందుకు ముఖ్యమంత్రి తీవ్రంగా ప్రయత్నించారా?
మజ్లిస్‌ నేతలు వివిధ సందర్భాల్లో చేసిన విజ్ఞప్తులపై సర్కారు ఆగమేఘాలపై స్పందించిన తీరును చూస్తే అవుననే సమాధానం వస్తోంది. మజ్లిస్‌ నేతలను ప్రసన్నం చేసుకోవటానికి చాలా తంటాలు పడినట్టు స్పష్టమవుతోంది. మజ్లిస్‌ వివిధ సందర్భాల్లో పేర్కొన్న 41 కోర్కెలను సంబంధిత శాఖలకు పంపి వాటి పరిష్కారానికి ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేకంగా కృషి చేసింది. సంబంధిత దస్త్రాలను వెంటనే ముఖ్యమంత్రికి పంపాలంటూ ఆయా శాఖలకు పలు విడతలుగా లేఖలు పంపింది. రాజధానిలోని నిషేధిత భూములకు సంబంధించి తంటాలు పడి రూపొందించిన జాబితాను సర్కారు ఉపసంహరించుకోవడం ఇందులో భాగమే. ఇన్ని చేసినా అధికార పార్టీకి మజ్లిస్‌ దూరమయ్యింది.మజ్లిస్‌ నేతల డిమాండ్లపై ప్రభుత్వం ఇటీవల కాలంలో సత్వర చర్యలు చేపడుతూ వచ్చింది. వాటనిి పరిశీలించాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం వివిధ శాఖలకు సూచించటంతో పాటు తాజా పరిస్థితిని ముఖ్యమంత్రి తెలుసుకొంటూ వచ్చారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వివిధ శాఖలకు నవంబరు 7వ తేదీన, అంతకుముందు వెళ్లిన లేఖలు 'ఈనాడు'కు లభించాయి. రాజకీయ పార్టీలు ఇచ్చే వినతులను సీఎం కార్యాలయం సంబంధింత శాఖలకు పంపటం సాధారణమే అయినప్పటికీ మజ్లిస్‌ వినతులపై మాత్రం ప్రత్యేక దృష్టి కనబర్చింది. వినతులపై తాజా పరిస్థితిని సీఎం తెలుసుకోగోరుతున్నారని, దస్త్రాలను వెంటనే పంపాలని, దస్త్రం అవసరం లేకుంటే నోట్‌లను పంపాలని ఆయా శాఖలను తొందరపెట్టింది.నవంబరు 7వ తేదీ నాటి లేఖలో ప్రధానంగా 9 అంశాలను సీఎం కార్యాలయం పొందుపర్చింది. రిజిస్ట్రేషన్లను చేయకూడని భూముల జాబితా ఉపసంహరణ, ఖదీర్‌ను పెరోల్‌పై విడిచిపెట్టటం, పోలీసు కానిస్టేబుళ్ల ఎంపిక ఫలితాల విడుదల, దార్‌ సలాం విద్యా సంస్థకు 5 ఎకరాల భూమి అందజేత, ఎంఐఎం కార్యాలయానికి భూమి ఇవ్వటం, ఏసీ గార్డ్సులోని భూమి వ్యవహారాన్ని కొలిక్కి తేవటం, మైనారిటీ సంక్షేమానికి కమిషనరేట్‌ ఏర్పాటు, అమాయక యువతపై కేసుల ఉపసంహరణ ఈ జాబితాలో ఉన్నాయి. వీటిపై తాజా పరిస్థితిని నవంబరు 9వ తేదీలోగా తెలపాలని సీఎం కార్యాలయం ఆ లేఖలో పేర్కొంది. ఈ లేఖలో పేర్కొన్న నిషేధిత భూముల జాబితా ఉపసంహరణతో సహా కొన్నింటిపై ఆయా శాఖలు సానుకూలంగా స్పందించాయి. అంతకు ముందు సెప్టెంబరు 3వ తేదీన ముఖ్యమంత్రి కార్యాలయం పంపిన లేఖలో మరికొన్ని ముఖ్యమైన కొర్కెలు ఉన్నాయి. నోటరీపై కొనుగోలు చేసిన భూములకు ఒక సారి రిజిస్ట్రేషన్లను అనుమతించటం ఇందులో ఒకటి. మైనారిటీలకు ఉప ప్రణాళిక అమలు, రుణ మంజూరీకి ఆదాయ పరిమితి పెంపు, ఫిరోజ్‌ గాంధీ నగర్‌ భూముల క్రమబద్ధీకరణ వంటివి వాటిలో ఉన్నాయి. ఆగస్టు 17నాటి లేఖలో మొత్తం 41 అంశాలు ఉన్నాయి. 'నిర్దిష్ట గడువు ప్రాతిపదికన అత్యవసర చర్యలు అవసరం' అంటూ ఆనాటి లేఖలో సీఎం కార్యాలయం పేర్కొంది. ఒవైసీ ఆసుపత్రి అంశం, 2006 నాటి పాతనగరం ప్యాకేజి అమలు, మూసీ ఆధునికీకరణ, మెట్రోపాలిటన్‌ ముసాయిదా ప్రణాళికను నోటిఫై చేయకుండా ఉండటం, పాత నగరంలో కొత్తగా జూనియర్‌, డిగ్రీకాలేజీల ఏర్పాటు వంటివి వీటిలో ఉన్నాయి.
From :eenadu

No comments:

Post a Comment