Monday, January 9, 2012

పిల్లల ఆరోగ్యం ముఖ్యం



ఒంట్లో నలతగా ఉందంటే అడుగు ముందుకెయ్యటానికి ఆలోచిస్తారు. ఆ పూటకి చెయ్యాల్సిన పనులను వాయిదా వేస్తారు. పెద్దల తీరే ఇలావుంటే ఇక పిల్లల విషయం? హోమ్‌వర్క్ చెయ్యలేదంటే స్టిక్ దెబ్బలు తప్పవంటుంది స్కూల్ టీచర్. పోనీ వర్క్ చేద్దామంటే కడుపునొప్పో, తల నొప్పో అసహనాన్ని తెప్పిస్తుంటుంది. బలవంతాన కళ్లు, కలం కదిలినా ఎక్కడో ఒక చోట పొరపాటు,్ల తప్పిదాలు. పిల్లల్ని ఇటువంటి సంకట స్థితినుంచి బయటపడేయాలంటే పెద్దలే చొరవ తీసుకోవాలి. అనారోగ్య హేతువులైన ఫుడ్ విషయంలో తప్పనిసరి జాగ్రత్తలు పాటించాలి. సాధారణంగా చెరుపు చేసే పదార్థాలే ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి కనుక మంచి, చెడుల వ్యత్యాసం గుర్తించేలా ఇంటి దగ్గరే పిల్లలకు తర్ఫీదు ఇవ్వాలి. స్నాక్స్ ఇష్టపడే పిల్లలకి వాటితోపాటు ఆరోగ్యకరమైన ఐటెమ్ మరొకటి జత అయ్యేలాచూడాలి. క్రీమ్ బిస్కెట్స్, చాక్లెట్స్ విషయంలో అనర్థాలు తెలియజెప్పి మితం పాటించమని చెప్పాలి. మార్కెట్ కెళ్లినపుడు పిల్లలు కావాలన్నవి వెంటనే కొనేయకుండా ఆరోగ్యకరమైన పదార్థాలవైపువారి దృష్టి మళ్లేలా చెయ్యాలి.
‘ఏ ఫర్ యాపిల్, ‘బి’ ఫర్ బనానా.. అంటూ తాజాపండ్లు తినిపిస్తూ పాఠాల్ని గుర్తు చేస్తే పిల్లల్లో ఉత్సాహం రెట్టింపవుతుంది. అన్ని రకాల ఆహారాన్ని రుచి చూపుతూనే ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు పెంపొందేలా వారిని ముందుకు నడిపించాలి. పిల్లల బరువుని, వయసుని బట్టి ఎన్ని కేలరీలు అవసరమో ఎప్పటికప్పుడు నిపుణులను సంప్రదించి అనారోగ్యాలకి చోటులేకుండా చూడాలి. పోషక విలువలు కలిగిన పదార్థాలు పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. విటమిన్స్, మినరల్స్ సరైన మోతాదులో అందితే ఆరోగ్యం చక్కబడి కొత్తవిషయాలు తెలుసుకోవడంలో, పాఠాలు ఔపోసన పట్టడంలో పిల్లలు శ్రద్ధ వహిస్తారు. జీడిపప్పు, బాదం, ఖర్జూరం, వాల్‌నట్స్ వంటివి అలవాటుచేస్తే ఇష్టంగా తింటారు. అధిక కేలరీలు వుండే చిప్స్ వంటివాటి జోలికి అంతగా వెళ్లరు.

No comments:

Post a Comment