Friday, December 16, 2011

" దళిత ఆత్మగౌరవ పతాక! బోయి భీమన్న "

సాహిత్యంలో దాదాపు అన్ని ప్రక్రియల్లోనూ శక్తివంతమైన రచనలు చేసి అర్ధశతాబ్దం పైగా ఆంధ్రదేశాన్ని ప్రభావితం చేస్తున్న గొప్ప రచయిత, కవి, నాటకకర్త, దార్శనికుడు పద్మభూషణ్ డాక్టర్ బోయి భీమన్న. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో 1911 సెప్టెంబర్ 19న పుట్టిన భీమన్న కేవలం సాహితీవేత్త మాత్రమే కాదు. దళితుల అభ్యున్నతికి రచనలు చేసిన తొలి తరం దళిత రచయితల్లో అగ్రగామి. పాలేరు నుంచి పద్మభూషణుడి దాకా ఎదిగి వచ్చిన వాడు. చిన్ననాట తల్లి పాడే జానపద గీతాలు, తండ్రి ఆలపించే తాత్వాలు భీమన్నలోని సృజనకారుని జాగృతం చేస్తే, తను పుట్టి పెరిగిన కులం కుదురు దళిత సమస్యల మీద పాలేరు, జన్మాంతర వైరం, రాగవాశిష్టం, గుడిసెలు కాలిపోతున్నాయ్, పంచమస్వరం వంటి రచనలు చేయించింది. తొలి రోజుల్లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టినా, ఆ తరువాతి కాలంలో జనవాణి, జయభేరి, ప్రజామిత్ర, నవజీవన్, ఆంధ్రప్రభ వంటి పత్రికల్లో పనిచేసిన భీమన్న తొలి తరం దళిత పాత్రికేయులు. ‘జానపదుని జాబులు’ అచ్చయిన తొలి గ్రంథం. అప్పటికే పాలేరు నాటకం ఆంధ్రదేశమంతటా మారుమోగుతోంది. దళితుల అభ్యున్నతికి ప్రధాన అవరోధం అవిద్య అని గ్రహించిన భీమన్న పాలేరు నాటకంలో దళిత యువకుడు డిప్యూటీ కలెక్టరైన పరిణామాన్ని దృశ్యీకరించాడు. పాలేరు నాటకం చూసి ప్రభావితులైన నాటి దళిత యువతరం, పాలేరుతనం మానేసి ఉన్నతాధికారులు కావడం చరిత్ర. కూలిరాజు నాటకం ద్వారా శ్రామిక రాజ్యాన్ని ఆకాంక్షించాడు. హరిజనులు ఆర్యులే అని నిరూపించడానికి రాగవాశిష్టం, వాల్మీకి, వేదవ్యాసుడు, ధర్మవ్యాధుడు వంటి రచనలు చేశాడు. తను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని బలపరుస్తూ, తన గ్రంథాలకు విలువైన విపుల పీఠికలు రాశారు. అంబేద్కర్‌ను ఆంధ్రదేశ పర్యటనలో దగ్గరగా చూసిన భీమన్న, ఆయన భావాలతో, రచనలతో ప్రభావితమయ్యాడు.

అంబేద్కర్ రచించిన ‘అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్’ గ్రంథాన్ని ‘కుల నిర్మూలన’ పేరుతో అనువదించారు. దళిత విముక్తి కోసం మేనిఫెస్టో అనదగిన ‘ధర్మం కోసం పోరాటం’ గ్రంథాన్ని రచించాడు. ఉద్యమ రచనలతో పాటు సౌందర్య తత్వం నిండిన ‘రాగవైశాఖి’ వంటి శృంగార లేఖా సాహిత్యాన్ని సృష్టించాడు. విద్యార్థి దశ నుంచి రాజకీయాలపై ఆసక్తి గల భీమన్న ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు 1952లో ద్విసభ్య నియోజకవర్గం నుంచి పోటీ చేసి కమ్యూనిస్టుల చేతిలో ఓడిపోయారు. 1978-84 మధ్య ఆంధ్రప్రదేశ్ శాసనమండ లి సభ్యులుగా వ్యవహరించారు. ట్రాన్స్‌లేషన్ డిపార్ట్‌మెంట్ డెరైక్టర్‌గా సేవలందించారు. ‘గుడిసెలు కాలిపోతున్నాయ్’ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వరించింది. 2001లో భార త ప్రభుత్వం భూమన్నను పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. 2005 డిసెంబర్ 16న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచిన బోయి భీమన్న దళిత ఆత్మగౌరవ పతాకగా నిలిచిపోయారు. తెలుగుజాతి గర్వించదగ్గ మహారచయిత బోయి భీమన్న నేటి యువ రచయితలకు స్ఫూర్తి కావాలి!
-డాక్టర్ శిఖామణి హైదరాబాద్
(నేడు బోయి భీమన్న ఆరవ వర్ధంతి)

No comments:

Post a Comment