Friday, December 30, 2011

మిమిక్రీ ‘మణి’కంఠుడు నేరెళ్ల!


తెలుగుగడ్డపై జన్మించి, ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మిమిక్రీ ‘గళాన్ని’ వినిపించిన ఏకైక కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్. అమెరికా, రష్యా, కెనడా సహా ప్రపంచంలోని పలుదేశాల్లో ప్రదర్శనలిచ్చి మిమిక్రీ కళాప్రక్రియకు ఖండాతర ఖ్యాతిని ఆర్జించిన ‘మణిమకుటం’ వేణుమాధవ్. 1932 డిసెంబర్ 28న వరంగల్లు పట్టణంలో కళ్లు తెరిచిన నేరెళ్ల 1947లో పదిహేనేళ్ల పిన్న వయసులో మిమిక్రీని కళగా స్వీకరించి అనతికాలంలోనే ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్టు స్వయంకృషితో మిమిక్రీని దేశవ్యాప్తంగా ప్రదర్శించి ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిమిక్రీ’గా ప్రఖ్యాతిగాంచారు. ఉర్దూ మీడియంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నేరెళ్ల, ఆంగ్ల భాషపై అధికారం సాధించడం, అనర్గళంగా మాట్లాడటం అనితర సాధ్యమని చెప్పాలి.

ప్రపంచ ప్రఖ్యాత ఆంగ్ల నాటక కర్త షేక్స్‌పియర్ నాటకాల్లోని సన్నివేశాలను పాత్రోచితంగా అనుకరించి శ్రోతలను విశేషంగా ఆకట్టుకునేవారు. మెకనాస్‌గోల్డ్, టెన్ కమాండ్‌మెంట్స్, బెన్‌హర్ వంటి విశ్వవిఖ్యాత హాలీవుడ్ సినిమాల్లోని నటీనటుల కంఠస్వరాలనే కాక, నేపథ్య సంగీతాన్ని కూడా యథాతథంగా అనుకరించగలిగిన మేటి మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ మాత్రమేనన్నది అతిశయోక్తి కాదు. చిన్ననాటి నుంచీ చిత్తూరు నాగయ్య సినిమాలు ఎక్కువగా చూడటం వలన, ఆ మహాకళాకారుని గొంతును అద్భుతంగా అనుకరించేవారు. తెలుగునేలపై నేరెళ్ల మిమిక్రీ గళాన్ని వినిపించని పట్టణం ఒక్కటి కూడా లేదు. రాష్ట్రంలోనేకాక, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో లెక్కకు మించిన ప్రదర్శనలతో ఎందరో మిమిక్రీ కళాకారులకు స్ఫూర్తిగా నిలిచారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, కృష్ణమీనన్, హరీంధ్రనాథ్ ఛటోపాధ్యాయ వంటి ప్రముఖులతో నేరెళ్లకు స్నేహ సంబంధాలుండేవి. కాకతీయ, ఆంధ్రా, తెలుగు యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లతో నేరెళ్లను సత్కరించాయి. శాసన మండలి సభ్యునిగా, ఫిల్మ్‌బోర్డు, దూరదర్శన్ సలహా సంఘం, రైల్వే సలహా కమిటీ వంటి అనేక కమిటీల్లో సభ్యులుగా నేరెళ్ల సమాజానికి అందించిన సేవలు వెలకట్టలేనివి. 1998లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డును, సుబ్బిరామిరెడ్డి కళాపీఠం నుంచి లైఫ్‌టైమ్ అవార్డును అందుకున్నారు. కళాకారుడు ఈర్ష్యాద్వేషాలకు అతీతంగా మెలగగలిగినప్పుడే మంచి పేరు సాధించగలడన్నది వేణుమాధవ్ విశ్వాసం. ఆయన దానిని మనసావాచా ఆచరించి చూపడమేకాక, వందల సంఖ్యలో ఉన్న తన శిష్యులకు ఆ నిత్యసత్యాన్ని బోధించే వారు. నేరెళ్లకు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ‘ఏకలవ్య’ శిష్యులు ఉన్నారంటే మిమిక్రీ కళలో ఆయనకున్న ప్రతిష్ట ఎంతటిదో అర్థమవుతుంది. అందుకే భారత ప్రభుత్వం వేణుమాధవ్‌ను ‘పద్మశ్రీ’ బిరుదుతో సగౌరవంగా సత్కరించింది. ఎనభయ్యవ పడిలో ప్రవేశిస్తున్న నేరెళ్ల వేణుమాధవ్ ప్రతి పుట్టిన రోజును ‘ప్రపంచ మిమిక్రీ దినోత్సవం’గా జరుపుకోవడం ఆయనకు దక్కిన అరుదైన పురస్కారంగా భావించాలి. జల్లారపు రమేష్ మిమిక్రీ క ళాకారుడు, హైదరాబాద్
(నేడు ధ్వన్యనుకరణ సామ్రాట్ నేరెళ్ల వేణుమాధవ్ 79వ జన్మదినం)
సాక్షి నుండి

1 comment:

  1. Morning I wrote a comment and it was quietly removed. It was regarding the wrong picture of Venumadhav which is in no way connected to the article you have taken from Sakshi Paper.

    I just verified Sakshi online edition, there they have given the correct picture of Shri Nerella Venu Madhav.

    ReplyDelete