ఇరవై నాలుగుగంటలూ ఆగకుండా పనిచేసే అద్భుతమైన శరీర భాగం మెదడు. అనుక్షణం తనచుట్టూ వున్న వాతావర ణాన్ని, సంఘటన లనూ, మనుషులనూ గమనిస్తూ, వాటిని విశే్లషిస్తూ, అవసరమైతే తిరిగి గుర్తుచేసుకుంటూ నిరంతరం పనిచేసే మెదడును నియంత్రిం చడం చాలా క్లిష్టమైన పని. అందుకే ఇంగ్లీషు భాషలో ‘ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్’ అని ఒక ఆంగ్ల కవి అన్నాడు. మనిషి ఆలోచనలు పాదరసం కన్నా వేగంగా ప్రవహిస్తాయి. కాబట్టి అవన్నీ మనిషి ముఖంలో కనబడడం అనేది అసాధ్యం.
ఒకే రకమైన ఆలోచనలను చేతన స్థితిలో మనిషిచే మెదడు చేయిస్తుంది. అదే మెదడు తీరిక ఉన్నపుడు మనంచేసిన తప్పొప్పులను వివరించి చెప్పే శక్తిని కలిగి ఉంటుంది. దీనినే మనస్సాక్షిగా చెప్పుకోవాలి. మనసు ఆధిపత్యంలో మనస్సాక్షి పనిచేస్తుంది. మనసులో జరిగే ఆలోచనలు బలవంతంగా మనస్సాక్షిని నొక్కి ఉంచుతాయి. ఆ రెండింటికీ మధ్య సంఘర్షణ మొదలైతే మనిషి ప్రశాంతంగా జీవించలేడు. మనిషి, మనిషికీ మధ్య మనస్సాక్షి విషయంలో విభేదాలుంటాయి. కాకపోతే దానిని మలచుకునే విధానంలోనే మనిషి యొక్క, మనిషిలోని మంచి చెడు అనేవి నిర్దేశించబడతాయి. ఎంతో తేలికగా మనస్సాక్షిలో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. కాబట్టి ముందుగా ఆలోచనలను రేకెత్తించే మెదడును నియంత్రించుకోవటం నేర్చుకోవాలి.
మనిషి జీవితంలో ఎంత ఎత్తుకు ఎదుగుతారనేది ఆ మనిషికి జీవితం పట్ల గల దృక్పథాన్ని బట్టి ఉంటుంది. మనసులో రూపొందించుకున్న ఆశలు, ఆశయాలే జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తాయి. కాబట్టి మనసులోకి చెడు ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. ఆలోచనలు సక్రమమైనపుడే మేధస్సు వికసిస్తుంది. సాధనతోగానీ ఏదీ అందుకోలేం. అందుకని ఒక మంచి ఆలోచన మనకు తట్టినపుడు దానిని పదే పదే మననం చేసుకోవాలి. అయితే ఆలోచనలను అదుపు చేయటం అనుకున్నంత సబబు కాదు. అయినా సరే ఆ ప్రయత్నంలో విఫలం చెందకుండా చూసుకోవాలి. ఖాళీగా కూర్చుంటే మనిషి ఆలోచనలు పరి పరి విధాలుగా పోతూంటాయి. అందుకని అసలు తీరిక అనేది లేకుండా నిరంతరం పనిచేస్తూంటే మనసుకు, దానిలో చెలరేగే ఆలోచనలకు స్థిరత్వం ఏర్పడుతుంది. అలాగే మనసును ధ్యానంతో పూర్తిగా నియంత్రించుకోవచ్చు. దీనివల్ల మనసు, శరీరం అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతాయి. మంచిని తప్ప చెడును చూడలేని, చెడు ఆలోచన చేయలేని స్థితికి ధ్యానమార్గం తీసుకువెళుతుంది.
మనసును తట్టుతున్న ఆలోచనలు ఎటువంటివి ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. అదుపులోకి రాని మనసు ఎటు పోతోందో గమనించాలి. వ్యక్తిగత ఆలోచనలకు సాక్షిగా ఎవరికి వారే నిలబడగలిగిన స్థితికి వెళ్ళడం, ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది. మనిషిని చెడు మార్గంలోకి తీసుకెళ్ళేది అతనిలోని కోపం, భయం. ఈ రెండింటినీ నియంత్రించుకోవటం ద్వారా మనిషి తన స్థితిని మెరుగుపరచుకోగలుగుతాడు.
కోపమనేది ఏ మనిషికైనా వివిధ స్థాయిలలో వుంటుంది. అదే సమయంలో ఈ కోపం అంతులేని అగాధాలను, ప్రమాదాలను సృష్టిస్తుంది. ఆపుకోలేని కోపం వస్తే ముందు మాటలు, తరువాత చేతలు మనిషిని దిగజారుస్తాయి. మాటలలో ప్రదర్శించే కోపం వారితోపాటు ఎదుటివారి మనసులనూ బాధిస్తుంది. కోపం జయించాలంటే వౌనాన్ని ఆశ్రయించాలి. అలాగే కోపంవచ్చే సూచనలు కనిపించినా, కోపంవస్తోందని అనిపించినా ఒక గ్లాసు చల్లని నీరు తాగాలి. కోపంరాకుండా నిగ్రహించుకునేలా పలుమార్లు ‘నన్ను ఎవరూ రెచ్చగొట్టలేరు’ అన్న మాటను మననం చేసుకోవాలి.
సర్వసాధారణంగా అందరూ ఉపయోగించే పదం భయం. భయం అనేది మనసులో అదుపులో లేనపుడు దేని గురించైనా నెగెటివ్‌గా ఆలోచించినపుడు ఏర్పడే ఒక అసంకల్పిత చర్య. పలు రకాల భయాలు మనసును పట్టి పీడిస్తుంటాయి. భయం కలగటానికి ఊహలు, అనుభవాలు రెండూ ముఖ్యమైన కారణాలేనని చెప్పుకోవాలి. ఆ విధమైన భయాన్ని కలిగించే ఆలోచనలు ఎటువంటి పరిస్థితులలో వస్తున్నదీ గుర్తించి వాటిని వదిలించుకునే ప్రయత్నం చేయాలి. మానసికంగా తమపై తమకు పూర్తి విశ్వాసం ఉన్నవారికి భయమంటే ఏమిటో తెలీదు. ఈ అనుభవాలను, వాస్తవికతను అర్థం చేసుకోగలిగితే మనసును పక్కదోవ పట్టించే ఆలోచనలను అదుపు చేయటం తేలికవుతుంది.
(ఆంధ్రభూమి నుండి సేకరణ )
No comments:
Post a Comment