Tuesday, May 15, 2012

సామాజిక సైట్లలో ‘అసాంఘిక’ ధోరణులు!



ఎక్కడెక్కడో ఉన్నవారిని స్నేహ బంధంతో ఏకం చేస్తూ, పరస్పరం ఆలోచనలు పంచుకునేందుకు దోహదపడుతున్న సామాజిక వెబ్‌సైట్లలో ఇటీవల పెడ ధోరణులు చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఈ సామాజిక సైట్లలో అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నందున బంధుత్వాలు సైతం దెబ్బ తింటున్నాయి. ఇటీవలి కాలంలో విశేష ప్రాచుర్యం పొందిన సామాజిక వెబ్‌సైట్ ‘ఫేస్‌బుక్’లో కొందరు అనైతిక ‘పోస్టింగ్‌లు’ పెడుతున్నందున అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పెళ్లి నిశ్చితార్థాలు రద్దుకావడం, విభేదాల కారణంగా దంపతులు విడాకులకు సిద్ధం కావడం వంటి విపరిణామాలకు ‘ఫేస్‌బుక్’ కారణమవుతోంది. ఇందు కు పలు సంఘటనలు సాక్షీభూతంగా నిలుస్తున్నాయి. బి-్ఫర్మసీ చదివిన విద్యార్థినికి బ్రిటన్‌లో ఉంటూ ఎంటెక్ చదివిన ఒక యువకుడితో పెళ్లి నిశ్చితార్థం జరిగింది. అయితే, ఆ యువకుడు తన చిన్ననాటి స్నేహితురాలితో ఉన్న ఫోటోలు ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష మయ్యాయి. ఈ ఫోటోలు చూశాక నిశ్చితార్థం రద్దు చేసుకుంటున్నట్టు ఆ విద్యార్థినితోపాటు ఆమె తల్లిదండ్రులు ప్రకటించారు. ఫొటోలో ఉన్న గర్ల్‌ఫ్రెండ్‌తో స్నేహం తప్ప ఎలాంటి ‘సంబం ధం’ లేదని ఆ యువకుడు పదేపదే చెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తొమ్మిదేళ్లుగా కాపురం చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన దంపతులు సామాజిక వెబ్‌సైట్ పుణ్యమాని విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. తన స్నేహితురాలి ఫోటోకు సంబంధించి భర్త రాసిన కామెంట్లను ఆ గృహిణి సహించలేకపోయింది. పట్టణ ప్రాంతాల్లోని ఫ్యామిలీ కోర్టులలో ఇలాంటి కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో ఫోటోల్లోని ముఖ భాగాలను తారుమారు చేస్తూ వాటిని వెబ్‌సైట్లలో పెడుతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా మహిళలకు సంబంధించి అభ్యంతరకరమైన రాతలు, ఫోటోలు ఫేస్‌బుక్‌లో దర్శనమిస్తున్నాయి. దీంతో దాంపత్య సంబంధాలు దెబ్బతింటున్నాయని న్యాయవాదులు సైతం అంగీకరిస్తున్నారు.
మరో సంఘటనలో తమ కాబోయే కోడలి గురించి ఫేస్‌బుక్‌లో రాసిన వ్యాఖ్యానాలు చదివి కోయంబత్తూరుకు చెందిన ఓ దంపతులు తమ కుమారుడి వివాహాన్ని రద్దు చేశారు. స్నేహితులతో కలిసి తీయించుకున్న ఫోటోలో ఆ అమ్మాయి గురించి చెడుగా కామెంట్లు రాసి ఎవరో బయటి వ్యక్తులు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ ఆకతాయి చేష్ట కారణంగా పెళ్లి రద్దు కావడంతో యువతి తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు లోనయ్యారు. వారంరోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా ఢిల్లీకి చెందిన ఓ యువకుడు పెళ్లిని రద్దు చేసుకున్నాడు. కాబోయే వధువు కొంతమంది యువకులతో కలిసి ఉన్నట్లు ఫేస్‌బుక్‌లో ఓ ఫోటో ప్రత్యక్షం కావడమే ఇందుకు కారణం.
సామాజిక వెబ్‌సైట్లలో పోస్టింగులకు సంబంధించి ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంవల్లనే ఈ దుస్థితి నెలకొందని కొందరు న్యాయనిపుణులు చెబుతున్నారు. కొందరి బరితెగింపు కారణంగా కుటుంబ వ్యవస్థ, వివాహ బంధాలు విచ్ఛిన్నం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సైట్లలో నిర్లక్ష్యంగా లేదా ఉద్దేశపూర్వకంగా అనైతిక చర్యలకు పాల్పడితే అనర్థాలు తప్పవని, ముఖ్యంగా యువత దీనిని గ్రహించాలని మానవ సంబంధాల నిపుణులు సూచిస్తున్నారు.
Courtesy : Andhrabhoomi.net

1 comment: