Sunday, May 20, 2012

అమాత్యులూ ఇరుక్కున్నట్టే

అక్రమ ఆస్తుల కేసులో కడప లోక్‌సభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అరెస్టు దాదాపు ఖాయం అవడంతో సిబిఐ అధికారులు ఇప్పుడు మంత్రులపై దృష్టిపెట్టారు. ఇప్పటికే అరడజను మంది మంత్రులను సిబిఐ విచారించగా మరికొంత మందిని విచారించేందుకు నోటీసులు జారీ చేయడానికి సిబిఐ సిద్ధమవుతోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇప్పటి వరకు విచారణ జరిపిన మంత్రుల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో గనుల శాఖను నిర్వహించిన హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, వౌలిక వసతులు, పెట్టుబడులు, ఓడరేవుల శాఖను నిర్వహించిన ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ దాదాపు ఇరుక్కున్నట్టేనని తెలిసింది. వీరిని అరెస్టు చేయడానికి అవసరమైన సాక్ష్యాధారాలను సిబిఐ ఇప్పటికే సేకరించినట్లు తెలిసింది. అయితే జగన్‌ను అరెస్టు చేయడానికి ముందే మంత్రులను అరెస్టు చేయాలా లేక జగన్ అరెస్టు తర్వాత చేయాలా అన్న ఆలోచనలో సిబిఐ ఉన్నట్లు తెలిసింది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నెల 28న జగన్ సిబిఐ కోర్టుకు హాజరైనపుడు ఆయన్ను అరెస్టు చేసేందుకు సిబిఐ సన్నాహాలను పూర్తి చేసినట్లు చెబుతున్నారు. జగన్ అక్రమ ఆస్తుల కేసులో వివిధ అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు జీవోలు రావడానికి కారకులైన మంత్రుల్ని కూడా అరెస్టు చేయాలని వివిధ వర్గాల నుంచి ఒత్తిడి వస్తోంది. వైఎస్ హయాంలో కీలకమైన 26 జీవోల జారీకి సంబంధించి ఆరుగురు మంత్రులకు, ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంత్రులపై విచారణను సిబిఐ వేగవంతం చేసింది. జగన్ అరెస్టు వల్ల ఏర్పడే ఉద్రిక్తతల ప్రభావాన్ని తగ్గించాలంటే ఆయన్ను అరెస్టు చేయడానికి ముందే ఒకరిద్దరు మంత్రుల్ని అరెస్టు చేయాలన్న అభిప్రాయంతో సిబిఐ ఉన్నట్లు తెలిసింది. దీనివల్ల జగన్‌పై కక్షసాధింపు చర్యలు తీసుకుంటున్నారన్న విమర్శలకు సమాధానం చెప్పినట్లవుతుందని, అదే సమయంలో అవినీతికి పాల్పడితే సొంత పార్టీ వారు ఏ స్ధాయిలో ఉన్నా క్షమించేది లేదన్న సంకేతాన్ని ప్రజలకు ఇవ్వడం ద్వారా పార్టీ ప్రతిష్ఠను పెంచుకోవచ్చునని అధిష్ఠానం కూడా భావిస్తున్నట్లు తెలిసింది.
సబితకు బిగిస్తున్న ఉచ్చు
హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని సిబిఐ అధికారులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. మొదటిసారి ఓబుళాపురం గనుల కేసులోను, రెండో సారి జగన్ అక్రమ ఆస్తుల కేసులోను మంత్రి సబితను సిబిఐ అధికారులు విచారణ జరిపారు. అయితే ఓబుళాపురం గనుల కేసులో ఒకరకమైన వాదనను వినిపించిన సబిత జగన్ అక్రమ ఆస్తుల కేసులో మరో రకమైన వాదనను వినిపించినట్లు సిబిఐ వర్గాలు తెలిపాయి. ఓబుళాపురం గనుల కేసులో తనకు సంబంధం లేదని, తనకు తెలియకుండానే అప్పటి గనుల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి తన ఇష్టం వచ్చినట్లు జీవోలు జారీ చేశారని మంత్రి సబిత చెప్పినట్లు తెలిసింది. అదే జగన్ అక్రమ ఆస్తుల కేసులో సాక్షి సంస్థలో పెట్టుబడులు పెట్టిన సిమెంట్ కంపెనీలకు గనుల కేటాయింపు గురించి సిబిఐ అధికారులు ప్రశ్నించినపుడు పారిశ్రామిక రంగంలో ఆ సంస్ధలకు ఉన్న పేరు ప్రతిష్ఠలను దృష్టిలో పెట్టుకుని కేటాయించినట్లు మంత్రి సబిత చెప్పినట్లు తెలిసింది. ఓబుళాపురం గనుల కేసులో జీవోలకు సంబంధించి తనకు సంబంధం లేదని వాదించిన మంత్రి సబిత సాక్షి సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన సిమెంటు కంపెనీలకు గనుల కేటాయింపు జీవోలకు తానే బాధ్యత వహిస్తున్నట్లుగా చెప్పినట్లు తెలిసింది. ఆ సిమెంటు కంపెనీలకు పారిశ్రామిక రంగంలో పేరు ప్రతిష్ఠలు ఉన్న మాట ఎలాగున్నా, వాటికి గనుల కేటాయింపు వెనుక మంత్రికి ఎటువంటి దురుద్దేశాలు లేనప్పటికీ జగన్ సంస్థల్లో అవి పెట్టుబడులు పెట్టినందున ‘క్విడ్ ప్రో కో’ను ప్రోత్సహించే విధంగా ఉన్నందున ఈ జీవోల జారీలో మంత్రి సబిత ఇరుక్కున్నట్టేనని సిబిఐ వర్గాలు చెబుతున్నాయి.
మరోసారి కీలక విచారణ
ఇప్పటికే రెండు సార్లు మంత్రి సబితను సిబిఐ అధికారులు విచారించగా మరోసారి ఆమెను విచారించాలన్న ఉద్దేశంతో సిబిఐ అధికారులు ఉన్నట్లు తెలిసింది. మంత్రి సబితపై మూడోసారి సిబిఐ జరపనున్న విచారణ జగన్ అక్రమ ఆస్తుల కేసులో కీలక మలుపు తిరగవచ్చునని భావిస్తున్నారు.
ఇక వాన్‌పిక్‌కు కేటాయింపుల విషయంలో అప్పటి పెట్టుబడులు, ఓడరేవులు, వౌలిక వసతుల కల్పనా శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా దాదాపు ఇరుక్కున్నట్టేనని సిబిఐ వర్గాల కథనం. మంత్రి మోపిదేవిని సిబిఐ అధికారులు ఇప్పటికే ఒకసారి విచారించగా ఈ నెల 21న మరోసారి విచారించనున్నారు. ఈ విచారణ కీలక ఘట్టంగా భావిస్తున్నారు. అదే రోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ వ్యక్తిగత కార్యదర్శి సూరీడును కూడా సిబిఐ విచారించనుంది.
పొన్నాల, గీతారెడ్డికికూడా నోటీసులు
ఇలా ఉండగా సుప్రీంకోర్టు నుంచి నోటీసులు అందుకున్న మంత్రుల జాబితాలో ఉన్న ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి జె గీతారెడ్డికి కూడా నోటీసులను సిబిఐ సిద్ధం చేస్తోంది. వైఎస్ మంత్రివర్గంలో భారీ నీటిపారుదల శాఖను నిర్వహించిన మంత్రి పొన్నాలను జలయజ్ఞం పనుల కేటాయింపుతో పాటు ఇండియా సిమెంటు కంపెనీకి కృష్ణా జలాల కేటాయింపు గురించి సిబిఐ ప్రశ్నించనుంది. అదే విధంగా బ్రహ్మణి స్టీల్ ఫ్యాక్టరీకి భూముల కేటాయింపు జీవో గురించి భారీ పరిశ్రమ శాఖ మంత్రి గీతారెడ్డిని సిబిఐ ప్రశ్నించనున్నట్లు తెలిసింది.

3 comments:

  1. శీఘ్రమేవ శ్రీ కృష్ణ జన్మస్థాన (కటకటాల) ప్రాప్తిరస్తు

    ReplyDelete
  2. ఇవి అన్నీ వుత్కంఠ కలింగించే బంగారమ్మ గారి సీరియల్ దృశ్యనాటకంలోని ఘట్టాలు, 'చివరకు మిగిలేది' బోఫోర్సే. CBI పాత్ర ఓ నిమిత్త మాత్రం. జగన్ లొంగి, అవినీతి సాక్షాధారాలు (డాక్యుమెంట్లు, టేపులు వగైరాలు) 10 జనపథ్ వద్దకు చేర్చేవరకూ ఈ వుత్కంఠ భరితమైన డ్రామా మనం చూడక తప్పదు. చానల్సు వారికి ఇలాంటి వార్తలు అమ్ముకుని, దాన్నీ సొమ్ముచేసుకోవడం బంగారి టాలెంట్. మినిస్టర్లు అరెస్టు అన్నది పుకారు పథకం ప్రకారమే విడుదల చేశారు అని నా వూహ.

    ReplyDelete
  3. చట్టం ముందు సమానత్వం లేని ఇండియా అనే దేశంలో జగన్ చెరసాలకి వెళ్ళడమా? వాట్ ఎ జోక్? జగన్ ఎన్నికల నియమాలకి విరుద్ధంగా దేవాలయంలో ప్రచారం చేసినా ఎన్నికల కమిషన్ అతన్ని ఏమీ అనలేదు.

    ReplyDelete