Thursday, May 3, 2012

ఎటుపోతోంది ఈ ప్రేమోన్మాదం ...



‘ప్రేమ’ అనే రెండక్షరాలకు ఇరు హృదయాలను కలపడమే కాదు.. మనసుల్ని గాయపరచడం, మనుషుల్ని హతమార్చడం కూడా తెలుసు. ప్రేమ ఉన్మాదంగా మారడంతో దేశ వ్యాప్తంగా పలురకాల నేరాలు నిత్యకృత్యమవుతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు, భౌతిక దాడులు, సంఘ బహిష్కరణలు, ‘పరువు హత్య లు’ వంటి నేరాలకు ప్రేమే కారణం కావడం పట్ల సామాజిక వేత్తలు ఎంతగానో ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం, కట్టుబాట్లకు కాలం చెల్లిపోవడం వంటి పరిస్థితుల్లో ప్రేమ పేరిట విచ్చలవిడి శృంగారం, అనైతిక సంబంధాలు నానాటికీ అధికమవుతున్నాయి.
ఈ సంస్కృతి దేశవ్యాప్తంగా వెర్రితలలు వేస్తున్నప్పటికీ, తమిళనాడులో ప్రేమోన్మాద నేరాల సంఖ్య పోలీసులను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రేమలు, లైంగిక సంబంధ నేరాల సంఖ్య చెన్నై నగరంలో ఇటీవలి కాలంలో 125 శాతం పెరిగినట్లు పోలీసుశాఖ గణంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ తరహా నేరాలు 2008లో 155 నమోదు కాగా, 2011లో ఆ సంఖ్య 341కు చేరడం గమనార్హం. ప్రేమ సంబంధ వ్యవహారాలతో పేరుకుపోతున్న హత్యలు, ఆత్మహత్యలు, దాడుల కేసులను పరిష్కరించడం పోలీసులకు తలకుమించిన భారంగా పరిణమించింది. ప్రేమను కాదన్న యువతులను హత్య చేయడం, పెళ్లికి పెద్దలు నిరాకరించారని ప్రేమజంటలు ఆత్మహత్యలకు పాల్పడడం, కులాంతర ప్రేమకు సిద్ధపడిన కుమార్తెలను తల్లిదండ్రులే కడతేర్చడం వంటి సంఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతునే ఉన్నాయి.
ఈ తరహా నేరాలు క్షణికావేశంలోనే అధికంగా జరుగుతున్నందున వీటిని ముందుగా పసికట్టడం అసాధ్యమని పోలీసులు అంటున్నారు. ప్రేమ వ్యవహారాల్లో మానసికంగా దెబ్బతిన్న వారు ఎప్పుడు, ఏ రకంగా నేరం చేస్తారో ఎవరికీ తెలియదని వారు చెబుతున్నారు. ప్రేమోన్మాదంతో ప్రవర్తించే వారి కదలికలను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులే కనిపెట్టాలని పోలీసులు సలహా ఇస్తున్నారు. చాలా సందర్భాల్లో నేరం జరిగిన తర్వాతే ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలు వెలుగు చూస్తుంటాయని, ఈ తరహా నేరాలను ముందుగా అంచనాకు రావడం సాధ్యం కాదని పోలీసులు విశే్లషిస్తున్నారు. కాగా, సమాజ పరమైన కట్టుబాట్ల వల్ల కొంతమంది బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోవడంతో తాము ఏమీ చేయలేని పరిస్థితి ఉందని పోలీసులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సాక్ష్యాలు కనుమరగవడం, కోర్టుకు వచ్చేందుకు స్థానికులు ముందుకు రాకపోవడంతో నిందితులకు శిక్షలు పడే అవకాశాలు తగ్గుతున్నట్లు కూడా పోలీసులు అంగీకరిస్తున్నారు.
సెల్‌ఫోన్లు, ఎస్‌ఎంఎస్‌లు, ఇ-మెయిల్స్, సామాజిక వెబ్‌సైట్ల వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కొంతమంది అనైతిక పనులను వాడుకోవడం వల్ల నేరాల సంఖ్య పెచ్చుమీరుతోందని మానసిక విశే్లషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలకు సైతం ఇంటర్నెట్ సౌకర్యం విస్తృతం కావడంతో కొంతమంది యువతీ యువకుల్లో విచ్చలవిడితనం పెరిగినట్లు సామాజిక వేత్తలు గుర్తించారు. ఎదిగిన పిల్లల కదలికలపై తల్లిదండ్రులు నిఘా ఉంచే పరిస్థితులు నేడు అంతగా లేకపోవడంతో ప్రేమ వ్యవహారాల ఆచూకీ అంతుపట్టడం లేదు. తాత్కాలిక ఆనందాల కోసం నైతిక విలువలను విస్మరించడం వల్లే ఈ దుర్గతి నెలకొందని, యువత పెడ ధోరణులతో కుటుంబ సంబంధాలు క్షీణిస్తున్నాయని విద్యావేత్తలు సైతం ఆవేదన చెందుతున్నారు.
సాంకేతిక పరిజ్ఞానం, విదేశీ సంస్కృతి కారణంగా ‘లక్ష్మణరేఖ’ను దాటేందుకు యువత ఏ మాత్రం వెనుకంజ వేయడం లేదు.
ఈ నేపథ్యంలోనే ఏకపక్ష ప్రేమలు, ముక్కోణపు ప్రేమలు, వివాహేతర సంబంధాలు వంటివి చోటు చేసుకుంటున్నాయి. కాగా, విడాకులకు సంబంధించి విదేశీ సంస్కృతి ప్రభావంతో కొత్తగా పెళ్లయిన దంపతులు సైతం విడిపోయేందుకు జంకడం లేదు.
ఇక ప్రేమలు, పెళ్లిళ్లు, లైంగిక విజ్ఞానం వంటి విషయాలపై యువతలో తగిన అవగాహన కల్పించేందుకు కుటుంబ పరంగా కానీ, సమాజ పరంగా గానీ ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. మానసిక అపరిపక్వతతో యువతీ యువకులు క్షణికావేశంలో నేరాలకు పాల్పడుతున్నారని, వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు వంటి విషయాలకు విద్యా బోధనలో ఎక్కడా చోటు లేకపోవడంతో ప్రేమోన్మాద సంస్కృతి పెచ్చుమీరిపోతోందని మానసిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Source: Andhrabhoomi

2 comments:

  1. చక్కటి ఆర్టికల్.

    ReplyDelete
  2. ఇది కేవలం ఉన్మాదం మాత్రమె ఇక్కడ ప్రేమ అనే పదం వద్దు

    ReplyDelete