Tuesday, April 24, 2012

మాస్టర్ బ్లాస్టరే అతడు (నేడు సచిన్ పుట్టినరోజు )ఈ కాలం కుర్రకారుకి క్రికెట్ అన్న పేరు చెప్పగానే మొదటగా గుర్తుకువచ్చే పేరు సచిన్‌ రమేష్‌ టెండూల్కర్‌. 1973 ఏప్రిల్‌ 24న సచిన్‌ జన్మించి అంతర్జాతీయ క్రికెట్లో నెంబర్ వన్ స్దానానికి చేరుకున్న క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు ఈరోజుతో 39 ఏళ్లు నిండాయి. 1989లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టిన సచిన అతి తక్కువ సమయంలో ఎన్నో మరుపురాని రికార్డులను నెలకొల్పాడు.
భారత క్రికెట్‌పై తనదైన ముద్రవేసిన మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తనలో సత్తా ఉన్నంత కాలం క్రికెట్‌ను వదిలేది లేదని ఎప్పటినుంచో చెప్తున్నాడు. తనలో దాగున్న అద్భుతమైన టాలెంట్‌కు తోడు అకుంఠిత దీక్ష, నిరంతర శ్రమే సచిన్‌ను 23ఏళ్లుగా మాస్టర్‌ బ్లాస్టర్‌ గా నిలబెట్టింది. 1989 లో క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఈ లిటిల్‌ మాస్టర్‌.. తన ఉనికిని చాటుకోడానికి ఎంతో కాలం పట్టలేదు. తనను తాను భారత క్రికెట్‌కు అమూల్యమైన క్రికెటర్‌గా తీర్చిదిద్దుకున్న మాస్టర్‌ ఆతర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. తన కెరీర్‌లో ఎన్నో రికార్డులను బద్దలేకొట్టాడు. మరెన్నో అనితర సాధ్యమైన రికార్డులను నిర్మించాడు. టెస్టుల్లో, వన్డేల్లో వేలకొలది పరుగులు చేయడమే కాకుండా తాజాగా వందసెంచరీల మహోన్నతమైన రికార్డును నెలకొల్పి ప్రపంచ క్రికెటర్లందరికీ సవాల్‌ విసిరాడు. ఇప్పటికీ సచిన్‌ టెండూల్కర్‌ మ్యాచ్‌లో లేడంటే.. చాలా మంది టీవీల్లో మ్యాచ్‌ చూడడం మానేస్తారు. ఇప్పటికీ ఇటువంటి ట్రెండ్‌ కొనసాగుతుందంటే కేవలం మాస్టర్‌ క్లాసే కారణం.
ఇప్పుడు వస్తున్న క్రికెటర్లందరినీ మీ ఇన్‌స్పిరేషన్‌ ఎవరు అని అడిగితే చెప్పే పేరు ఒక్కటే మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌. 23 ఏళ్లుగా సచిన్‌ క్రికెట్‌ పై మమకారాన్ని చాటాడు. ఇప్పటికీ క్రికెట్‌ పై మోజు తగ్గలేదంటున్న సచిన్‌.. తగ్గిన రోజు వైదొలుగుతానన్నాడు. అతడి రికార్డులు, అవార్డులు, రివార్డులు మరే ఇతర క్రికెటర్‌ సాధించి ఉండడు. ద్రవిడ్‌, సెహ్వాగ్‌ నుంచి విరాట్‌ కోహ్లి, రైనా, రోహిత్‌, రహానే వంటి క్రికెటర్ల వరకు అందరూ చెప్పేది ఒకటే పేరు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌. తన విధ్వంసాలు, విన్యాసాలను చూసి భారత్‌లో బ్యాట్‌ పట్టిన క్రికెటర్లు కొన్ని వందల మంది ఉంటారు.
గత ఏడాది వరల్డ్‌ కప్‌లో తన పవర్‌ చూపించిన మాస్టర్‌.. వరల్డ్‌ కప్‌ గెలవడంతో ఉబ్బితబ్బిబె్బైపోయాడు. ఆతర్వాత 2011 ఐపీఎల్‌లోనూ రెచ్చిపోయి ఆడాడు. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత కొన్ని రోజులు రెస్ట్‌ తీసుకున్న సచిన్‌ ఇంగ్లండ్‌ టూర్‌కు వెళ్లాడు. ఆటూర్‌లో జట్టు ఘోర ప్రదర్శన ఇచ్చింది. దాన్లో సచిన్‌ కంట్రిబ్యూషన్‌ కూడా ఉంది. ఆవెంటనే జరిగిన రెండు వన్డే సిరీస్‌లకు మాస్టర్‌ దూరంగా ఉన్నాడు. నవంబర్‌లో వెస్టిండీస్‌తో స్వదేశంలోనే జరిగిన టెస్టు సిరీస్‌లో సచిన్‌ భారీ స్కోర్లు చేయలేకపోయాడు. సచిన్‌ ఆటలో లోపం లేకున్నా.. వందో సెంచరీ ఒత్తిడి అతడిపై స్పష్టంగా కనిపించింది. 50 పరుగులు దాటిన తర్వాత మాస్టర్‌ ఒత్తిడికి గురై వికెట్‌ సమర్పించుకునేవాడు. ఆ వైఫల్యం ఆ తర్వాత జరిగిన ఆస్ట్రేలియా టూర్లోనూ కనిపించింది. ఆస్ట్రేలియాలో 4 టెస్టులు, దాదాపు 7 వన్డేలు ఆడిన సచిన్‌.. ఒక్క సారి కూడా సెంచరీ చేయలేకపోయాడు. సిడ్నీ టెస్టులో ఆ అవకాశం లభించినా సద్వినియోగపర్చుకోలేకపోయాడు.  గతేడాది వరల్డ్‌ కప్‌లో సౌతాఫ్రికాపై చేసిన సెంచరీ తర్వాత సచిన్‌ మరో సెంచరీ చేయడానికి ఏడాది కాలం పట్టింది. ఎందుకంటే అతడికి అది వందో వంద కాబట్టి. ఏడాది పాటు ఊరించిన ఈ మెమొరబుల్‌ ఫీట్‌ను టెండూల్కర్‌ గత నెలలో బంగ్లాదేశ్‌లో జరిగిన ఏషియా కప్‌లో సాధించాడు. బంగ్లాతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో సచిన్‌ 138 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్స్‌ సాయంతో శతక శతకాన్ని సాధించాడు. ఈ సెంచరీ కోసం అభిమానులు 12 నెలలుగా వేచి చూశారు. సచిన్‌ సెంచరీ అనంతరం అభిమానులు పరవశించిపోయారు.
క్రికెట్‌ ఎవరెస్ట్‌గా ఎదిగిన సచిన్‌ టెండూల్కర్‌ భారత క్రికెట్‌పైనే కాకుండా యావత్‌ ప్రపంచ క్రికెట్‌పై తనదైన ముద్రను వేశాడు. భారతదేశ కీర్తి ప్రతిష్టలను నలుదిశలా వ్యాపింపజేసిన వారిలో మొదటి వరుసలో మాస్టర్‌ నిలిచాడు. తన అకుంఠిత దీక్షతో క్రికెట్‌లో అత్యున్నత స్థానానికి ఎదిగిన సచిన్‌.. ఎందరో యువకులకు ఆదర్శప్రాయుడయ్యాడు. అటువంటి మాస్టర్‌కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇచ్చి గౌరవించాలని దేశం నలువైపులనుంచి అభిమానులు, క్రికెటర్లు, రాజకీయనాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం సచిన్‌ పేరును భారతరత్న నామినేషన్స్‌కు కూడా సిఫార్సు చేసింది. భారత ప్రభుత్వం ఇటీవలే భారతరత్న నామినేషన్స్‌ జాబితాలోకీ క్రీడాకారులను కూడా అనుమతించడంతో సచిన్‌ పేరును నామినేట్‌ చేయాలని డిమాండ్లు ఎక్కువయ్యాయి. అన్నీ కుదిరితే అతి త్వరలోనే సచిన్‌ టెండూల్కర్‌ పేరుకు ముందు భారతరత్న వచ్చి చేరుతుంది.
ఓ వైపు వయసు మీదపడుతోంది. మరోవైపు ద్రవిడ్‌, పాంటింగ్‌, గంగూలి వంటి సమకాలీన క్రికెటర్లు ఆటకు గుడ్‌ బై చెప్తున్నారు.దీంతో సచిన్‌పై రిటైర్మెంట్‌ ఒత్తిడి బాగా పెరిగింది. దీనికితోడు గత ఏడాదిగా అతడికి టైమ్‌ సరిగా కలిసిరాట్లేదు. వందో సెంచరీ కోసం ఏడాది పాటు ఆగాడు. మరోవైపు గాయాలు కూడా బాధిస్తుండడంతో సచిన్‌ను క్రికెట్‌ నుంచి వైదొలగాలి అన్న డిమాండ్లు బాగా పెరిగాయి. దీని సచిన్‌ డైరెక్ట్‌గా కాకపోయినా ఇండైరెక్ట్‌గా సమాధానమిచ్చాడు. తనలో పరుగుల కాంక్ష చావలేదని. తనలో పరుగులు చేయాల్సిన సత్తా తగ్గిన రోజు క్రికెట్‌ను వీడుతానని చెప్పాడు. దీంతో సచిన్‌ ఇప్పట్లో రిటైర్మెంట్‌ ఇచ్చేది లేదని పరోక్షంగా చెప్పాడు. ఏదేమైనా ఈ పుట్టినరోజు సచిన్‌కు ఆనందంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

2 comments:

 1. ఇవ్వాళ సచిన్, నిన్న గవాస్కర్, రేపు మరొకరు.
  వీళ్ళు పరుగులు తీస్తారు, బంతులు వేస్తారు క్యాచ్ లు పదతారు....ఇంకా ఏంటేంటో చేస్తారు.ఆటల వంక తొ చిత్ర విచిత్ర చేస్టలెవొ చేస్తారు.
  ఇవ్వాళ భారత దెశం లొ వంద కోట్ల జనాభా పరువు ప్రతిష్టలు కాపాడింది సచినేనట. ఇన్ని కోట్ల జనం, తమ పరువు కోసం ఒక మనిషి భుజాల మీద పడి వేల్ళాదుతున్నారు.ఈ అనామకుల్ని అసమర్ధుల్ని 'అప్రదిష్టా నించీ కాపాడినందుకు, అతనికి రాష్త్ర ప్రభుత్వాలన్నీ కోట్ల కోట్ల ధన రాసుల్ని గుమ్మరిస్తున్నాయి. ఎకరాల ఎకరాల స్తలాలు ధారధత్తం చేస్తున్నాయి. మంత్రులూ గవర్నర్లూ ప్రెసిడెంటు తొ సహా, ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. పెట్టుబడిదారులంతా ఎగబడి పెద్ద పెద్ద కంపెనీల కార్లతొ సహా ఎన్నెన్నో బహుమానాలు సమర్పిస్తున్నారు! 'వీరుడు,పులీ బిరుదుల తొటీ, ఊరేగింపులతోటీ, సమ్నానల తోటీ ముంచెత్తుతున్నారు!
  ఇంతకీ ఏమిటీ అతను చేసింది? 'ఆదేదో' పొటీలకు ఫొయి ఒక సంవత్సరం పాటు పరువు కోసం పాకులడే భారతదేశ ప్రజల కోసం వందొ వంద పరుగులని సాధించాదట. ఇదీ అతగాడి వీరత్వం

  ReplyDelete
 2. ఇలంటి వీరత్వాలు ఎవరైనా ఎల సంపాయిస్తారు? మనుషులు సహజంగా నేర్చుకొవలిసిన చదువు సంధ్యలన్నీ పక్కన కట్టి పెట్టి, మనుషులు తప్పనిసరిగ చెయ్యవలిసిన ఏ పని పాటల జొలికీ పోకుండా, రోజంతా పరుగులు తీసె..బంతులు వెసె ప్రక్టీసులె చేస్తూ చేస్తూ, దానికోసం మితి మీరిన తిండి నె పెట్టుబడి గ పెట్టి, మనిషి శరీరాన్ని మనిషి శరీరం కాని శ్తాయి కి తీసుకెల్ళి! భవిష్యత్తు లొ వరించబొయె బహుమనాల కోసం, ధన రాసుల కోసం, సన్మనాల కోసం కలలు కంటూ కంటూ కంటూ; అదే రంధి తొ, అదె యావ తొ - ఆ రకంగా యెల్ళ తరబడీ బరువెలెత్తుతూ,పరుగులు తీస్తూ వ్యాయమాలు చేస్తూ అలవర్చుకొనె వీరత్వం అది

  ReplyDelete