Monday, April 9, 2012

రామోజీరావుపై చీటింగ్ కేసు నమోదు చేసిన ఏసీబీ

విశాఖపట్నం సీతమ్మధార స్థలం కేసులో ఏసీబీ ఎఫ్‌ఐఆర్
రెండో నిందితుడిగా రామోజీ తనయుడు కిరణ్
రామోజీకి సహకరించిన ఇద్దరు ఐఏఎస్‌లు ఎస్వీ ప్రసాద్, కేవీ రావులపైనా కేసు
ఈనెల 16లోపు కోర్టుకు సమగ్ర నివేదిక సమర్పించనున్న ఏసీబీ

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘ఈనాడు’ అధినేత రామోజీరావు అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. తనది కాని స్థలాన్ని రోడ్డు విస్తరణకు ఇచ్చి, అందుకు ప్రతిఫలంగా ప్రభుత్వం నుంచి అక్రమంగా మరో స్థలాన్ని పొందిన వ్యవహారంలో రామోజీరావుపై కుట్ర, చీటింగ్, ఫోర్జరీ, అధికార దుర్వినియోగం వంటి పలు సెక్షన్ల కింద ఏసీబీ విచారణ ప్రారంభించింది. ఏసీబీలోని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ) శనివారం ఎఫ్‌ఐఆర్ (నంబర్ 5/2012) నమోదు చేసింది. రామోజీరావును మొదటి నిందితుడిగా, ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్ ఎండీ సీహెచ్ కిరణ్‌ను రెండో నిందితుడిగా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. రామోజీకి సహకరించిన ఐఏఎస్ అధికారులు ఎస్వీ ప్రసాద్, కేవీ రావుల పేర్లను కూడా నిందితుల జాబితాలో చేర్చారు. విశాఖపట్నంలోని ఈనాడు కార్యాలయ స్థలం వ్యవహారంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా ఏసీబీ విశాఖపట్నం ప్రత్యేక న్యాయస్థానం గత నెలలో ఆదేశాలు జారీచేసింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా ఏసీబీ ఉన్నతాధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 

ఏప్రిల్ 16 లోగా సమగ్ర నివేదికను కోర్టుకు సమర్పించాల్సి ఉంది. సీఐయూ చీఫ్ కె.సంపత్‌కుమార్ నేతృత్వంలో ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది. కుట్ర, 420(మోసం), 465 (ఫోర్జరీ), 467 (విలువైన సంపద కోసం పోర్జరీ చేయడం), 471 ఐపీసీ సెక్షన్లతోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 5 (1డి), అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు సెక్షన్ 30, లేని అధికారాలను ఉపయోగించినందుకు జనరల్ క్లాజెస్ యాక్ట్ సెక్షన్ 6 కింద దర్యాప్తు సాగుతోంది. విశాఖపట్నంలోని సీతమ్మధారలో ‘ఈనాడు’ కార్యాలయం ఉన్న స్థలాన్ని మంతెన ఆదిత్య ఈశ్వర కుమార కృష్ణవర్మ నుంచి 1974లో రామోజీరావు లీజుకు తీసుకున్నారు. అందులో కొంత భాగం రోడ్డు విస్తరణకు పోయింది. ఆ భూమి యజమాని వర్మకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా రోడ్డు విస్తరణకు పోయిన భూమికి ప్రతిఫలంగా ప్రభుత్వం నుంచి 872 చదరపు మీటర్ల స్థలాన్ని రామోజీ తన కుమారుడు కిరణ్ పేరిట తీసుకున్నారు. దానిపై భూయజమాని వర్మ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో దర్యాప్తునకు కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

రామోజీ మోసం ఇలా..

హైదరాబాద్‌కు చెందిన ఆదిత్య ఈశ్వర కుమార కృష్ణవర్మకు విశాఖపట్నం సీతమ్మధారలోని 2.78 ఎకరాల స్థలం ఉంది. అందులో 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న 10 పెద్ద భవనాలను నెలకు రూ.3 వేల చొప్పున 33 ఏళ్ల వరకు రామోజీరావుకు 1974లో లీజుకిచ్చారు. రామోజీ అందులో ‘ఈనాడు’ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. 1984-85లో ఆ స్థలంలో 289 చదరపు మీటర్లు రోడ్డు విస్తరణలో పోయింది. భూ యజమానికి కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఆ స్థలం తనదేనంటూ దానికి ప్రతిఫలంగా రేనపువానిపాలెం సర్వే నెంబర్ 52లో 872 చదరపు మీటర్ల స్థలం ఇవ్వాలని 1985 జనవరి 17న విశాఖ కలెక్టర్‌కు రామోజీ లేఖ రాశారు. రామోజీరావు కోరిన స్థలం ప్రైవేటు వ్యక్తులదని, అక్కడ మిగులుభూమి లేదని, ఆ స్థలం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నందున దాన్ని కేటాయించే అధికారం తమకు లేదని తహశీల్దార్ స్పష్టంగా కలెక్టర్‌కు తెలియజేశారు. 

ఈ మేరకు పలు ఆధారాలతో (ఆర్‌సీ నెంబర్ 1117/85) కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. అప్పటి కలెక్టర్ ఎస్వీ ప్రసాద్ అవన్నీ పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా రామోజీ కోరిన 872 చదరపు మీటర్లు అప్పగిస్తూ 1985 ఏప్రిల్ 17న ఉత్తర్వులు జారీచేశారు. రోడ్డు విస్తరణలో స్థలం కోల్పోయిన యజమాని ఎవరనే విషయంపై కనీస విచారణ కూడా జరపకుండా... తానే యజమానినన్న రామోజీ మోసానికి అధికారులు వంతపాడారు.

ఎలా బయటపడిందంటే..

సీతమ్మధారలో ఆదిత్యవర్మ నుంచి రామోజీరావు తీసుకున్న స్థలం లీజు గడువు 2007తో పూర్తయింది. లీజు గడువు పొడిగించడానికి స్థలం యజమాని ఆదిత్యవర్మ అంగీకరించకపోవడంతో రామోజీరావు అదనపు జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన పిటిషన్‌తోపాటు.. రోడ్డు వెడల్పు సందర్భంగా కోల్పోయిన స్థలానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం నుంచి 872 చదరపు మీటర్ల స్థలాన్ని పొందినట్లు కోర్టుకు వివరించారు. అందుకు సంబంధించి అప్పటి కలెక్టర్ ఎస్వీ ప్రసాద్ జారీచేసిన ఉత్తర్వులను కూడా కోర్టుకు అందించారు. దీంతో రామోజీ మోసపూరిత కుట్ర వెలుగులోకి వచ్చింది. ఈనాడు కార్యాలయ స్థలం రోడ్డు వెడల్పుకు ఇచ్చిన తర్వాత ప్రతిఫలంగా ప్రభుత్వం నుంచి స్థలాన్ని తీసుకున్న వ్యవహారంపై ఆదిత్య వర్మ కలెక్టర్ కార్యాలయం నుంచి నకళ్లు తీసుకున్నారు. రామోజీరావు కోర్టుకు సమర్పించిన పత్రాలకు, కలెక్టర్ కార్యాలయం ద్వారా తీసుకున్న పత్రాలకు మధ్య వ్యత్యాసం ఉండటాన్ని వర్మ గమనించారు. భూమి కొలతలను రామోజీరావు భిన్నంగా పేర్కొన్నట్లు బయటపడింది. 

దీంతో ఆదిత్యవర్మ విశాఖలోని నాలుగో అదనపు ప్రధాన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసు వేశారు. ఈ కేసు ప్రాథమిక ఆధారాలపై సంతృప్తి చెందిన న్యాయమూర్తి విచారణకు ఆదేశించారు. విశాఖ పోలీసులు దర్యాప్తు చేసి రామోజీరావు, ఉపోదయా పబ్లికేషన్స్, ఈనాడు ఎండీ కిరణ్‌పై మోసం, అధికార దుర్వినయోగం సెక్షన్ల కింద చార్జిషీటు దాఖలు చేశారు. అప్పటి కలెక్టర్, తహశీల్దార్‌లు ఇచ్చిన అసలు పత్రాలను కోర్టుకు సమర్పించారు. ఇదే అంశంపై ఆదిత్యవర్మ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో దర్యాప్తునకు ఆదేశాలు జారీ అయ్యాయి.

No comments:

Post a Comment