Wednesday, April 11, 2012

వైఎస్‌పై కాంగ్రెస్ 'డబుల్ గేమ్' :మంత్రుల్లో ముదురుతున్న విభేదాలు


కాంగ్రెస్‌లో ‘వైఎస్’ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. వైఎస్ మంత్రివర్గంలో పని చేసిన మంత్రులకు, నేరుగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో మంత్రులైన వారికి మధ్య వైఎస్ విషయంలో విభేదాలు స్పష్టంగా బయటపడుతున్నాయి.
దీంతో వైఎస్‌పట్ల కాంగ్రెస్ హైకమాండ్ ‘డబుల్ గేమ్’కు తెరతీయనుంది. వైఎస్‌ను కాంగ్రెస్ నాయకునిగా సొంతం చేసుకుంటూనే, మరోపక్క వైఎస్‌ను విమర్శించే వారిని ప్రోత్సహించాలన్న అభిప్రాయంతో ఉంది. కొంతమంది మంత్రులు వైఎస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతుండటంతో వైఎస్ మంత్రివర్గంలో కూడా పని చేసిన మంత్రులు ఇబ్బందుల్లో పడుతున్నారు. ఈ విషయంలో మంగళవారం కొంతమంది మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి తమ అభిప్రాయాలు తెలియజేశారు.
ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మంత్రులు రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, ధర్మాన ప్రసాదరావు, దుద్దిళ్ల శ్రీ్ధర్‌బాబు, సునీతాలక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు. ముఖ్యంగా మంగళవారం ఒక టీవీ చానల్‌లో వైద్య ఆరోగ్య మంత్రి కొండ్రు మురళి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇదే విషయాన్ని కొంతమంది మంత్రులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. వైఎస్‌మీద అంత తీవ్రస్థాయిలో మంత్రి కొండ్రు మురళి ధ్వజమెత్తాల్సింది కాదని ముఖ్యమంత్రి కిరణ్ కూడా అభిప్రాయపడినట్టు తెలిసింది. మంత్రి కొండ్రు మురళి కూడా ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. తాను వైఎస్‌మీద ఎటువంటి విమర్శలు చేయలేదని, ఎస్సీ, ఎస్టీలకు వైఎస్‌కన్నా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బాగా చేస్తున్నారని మాత్రమే చెప్పానని వివరించినట్టు తెలిసింది. ‘వైఎస్ విషయంలో పార్టీపరంగా ఒక విధానం తీసుకోవాలి. దాన్ని పార్టీ శ్రేణులకు తెలియజేయాలి. ఎవరిష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతుంటే మాకు ఇబ్బందిగా ఉంది. చివరకు పార్టీ కూడా చిక్కుల్లో పడుతుంది. వైఎస్‌ను కాంగ్రెస్ పార్టీ తనవాడిగా సొంతం చేసుకుంటుందా? లేదా? అన్న స్పష్టత ఇవ్వాలి’ అని మంత్రులు ముఖ్యమంత్రిని కోరినట్టు తెలిసింది. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘వైఎస్ ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడే. ఈ విషయంలో మరో అభిప్రాయం లేదు. దీనిపై నేను మీడియాలో వివరణ ఇస్తాను’ అని అన్నట్టు తెలిసింది.
కాంగ్రెస్ డబుల్ గేమ్
ఇలావుండగా, వైఎస్ విషయంలో కాంగ్రెస్ డబుల్ గేమ్‌కు తెరతీయనుంది. వైఎస్‌ను పూర్తిగా సమర్ధించే పరిస్థితిలోగాని , అదేవిధంగా పూర్తిగా వ్యతిరేకించే స్థితిలోగాని కాంగ్రెస్ లేదు. ఇందులో ఏరకమైన నిర్ణయం తీసుకున్నా చిక్కుల్లో పడే పరిస్థితి ఉంది. ఒకపక్క రాష్ట్రంలో కొంతమంది కాంగ్రెస్ నేతలు వైఎస్‌ను తీవ్రంగా విమర్శిస్తుంటే, మరోపక్క కొంతమంది నేతలు వైఎస్‌ను విమర్శించేందుకు ఇష్టపడటం లేదు. ఇంకోపక్క హైకమాండ్‌కు చెందిన నాయకులు కొందరు వైఎస్‌ను ఇప్పటికీ పొగుతూండటం కాంగ్రెస్‌లోని ఆయన వ్యతిరేకులకు రుచించడం లేదు. కేంద్రమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల మాజీ ఇంచార్జి వీరప్పమొయిలీ రెండు రోజుల కిందట నగరానికి వచ్చినపుడు మీడియాతో మాట్లాడుతూ ‘వైఎస్ గొప్ప పాలనాదక్షుడు. ఆయన హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది’ అని ప్రశంసించారు.
వైఎస్ విషయంలో కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో అధికారికంగా ఒక నిర్ణయం తీసుకోవాలని నాయకత్వం నిర్ణయించింది. రెండుసార్లు కాంగ్రెస్‌ను రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చి, రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వైఎస్ పార్టీపరంగా మా నాయకుడే’ అని నాయకత్వం ప్రకటించాలని నిర్ణయించింది. వైఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ప్రకటనలు చేస్తే అవి వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని చెప్పనుంది. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువ అని, పార్టీ నేతలు ఎవరిష్టం వచ్చినట్టు వారు మాట్లాడే భావ ప్రకటనా స్వేచ్ఛ ఎక్కువని సమర్థించుకోనుంది. ఇందుకు వైఎస్‌నే ఉదాహరణగా పేర్కోనున్నారు. కాంగ్రెస్ పార్టీ 1989నుంచి 1994వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్నపుడు ఎం చెన్నారెడ్డి, నేదురుమల్లి జననార్దన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రులుగా పని చేశారు. అప్పుడు అసమ్మతి నేతగా ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ముగ్గురు ముఖ్యమంత్రుల మీద బహిరంగంగా ధ్వజమెత్తేవారు. ఇపుడు వైఎస్ మీద విమర్శలు చేసే నేతలను ఇదే కారణం చూపి నాయకత్వం సమర్థించనుంది. అంటే వైఎస్ తమ నాయకుడే అని ఒక పక్కన చెబుతూనే, ఆయన్ని విమర్శించే నాయకుల్ని ఇంకోపక్క ప్రోత్సహించనుంది. దీనివల్ల వైఎస్ మంత్రివర్గంలో పని చేసిన ప్రస్తుత మంత్రులకు కొంత ఊరట లభిస్తుందని, వైఎస్‌ను విమర్శించడం లేదన్న అపవాదు వారిమీద రాకుండా ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

No comments:

Post a Comment