Saturday, April 14, 2012

సమసమాజ సూర్యుడు అంబేద్కర్‌(భారతరత్న డాక్టర్‌ అంబేద్కర్‌ 121వ జయంతి సందర్భంగా...)
మండు వేసవిలో ఒకరోజు ఒక బాలుడు తీవ్రమైన దాహంతో ఉండి ఇంట్లో నీళ్ళులేక బయట ఒక బావి దగ్గరకు వచ్చి నిలుచున్నాడు. నీళ్ళు తోడి పోయడానికి ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు. ఎంతసేపు చూసినా ఎవరూ రాలేదు. దాహానికి నోరు పిడచకట్టుకుపోతోంది. తట్టుకోలేక స్వయంగా తోడుకొని నీరు తాగాడు. ఈ సంఘటనను దూరం నుంచి చూస్తున్న కొందరు అక్కడకు చేరి నిర్దాక్షిణ్యంగా కొట్టారు. కారణం ఆ బాలుడు అంటరానివాడట. అంటరానివారైన మహర్‌ కులస్తులు ఆ బావిని తాకకూడదట! అలా అవమానానికి గురయిన బాలుడెవరో కాదు భీమ్‌రావు అంబేద్కర్‌.
1891 ఏప్రిల్‌ 14న రామ్‌జీ మాలోజీ సక్పాల్‌, భీమాబాయి దంపతులకు భీమ్‌రావు జన్మించారు. భీమ్‌రావు సతారాలో చదువుకునే వయసులోనే అస్పృశ్యత, అంటరానితనం పట్ల తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించేవారు. భీమ్‌రావు అనేక అవమానాలకు గురయ్యారు. ఒకసారి మంగలి వద్దకు వెళ్ళి తనకు జుట్టు కత్తిరించమని అడిగితే, తన కత్తెర మైలపడుతుందని చీదరించుకున్న క్షురకుడే, బర్రె దూడల వెంట్రుకల్ని కత్తిరించడం చూశారు భీమ్‌రావు. చిన్నతనం నుంచి ఇటువంటి అవమానాలెన్నింటినో చవిచూశారాయన. భీమ్‌రావు అటువంటివి అక్కడక్కడే వదిలివేసి, తన లక్ష్యసాధన విద్యతో ఉన్నతిని సాధించాలనుకున్నారు. భీమ్‌రావుకి సంస్కృతం నేర్చుకోవాలనే అభిలాష ఉండేది. కానీ మహర్‌ కులస్థుడు కావడం వల్ల అనుమతి లభించలేదు. (ఆ తరువాతి రోజుల్లో సంస్కృతాన్ని అధ్యయనం చేసి, ఒక జర్మన్‌ విశ్వవిద్యాలయంలో సంస్కృతం బోధించే స్థాయికి ఎదిగాడు.)
భీమ్‌రావులోని చురుకుతనం, సహనం, పట్టుదల మేధావితనం (చిన్నతనంలోనే) చూసి, ఒక బ్రాహ్మణ ఉపాధ్యాయుడు అయిన అంబేద్కర్‌ అనే ఆయన అతనిని (భీమారావుని) ప్రేమతో, వాత్సల్యంతో చూసేవాడు. భీమ్‌రావులో ఆత్మస్థయిర్యాన్ని నింపి, ఉన్నతస్థాయికి ఎదిగేలా సహాయం చేశాడాయన. ఆయన పట్ల గౌరవభావంతోనే తన పేరుతో ఃఅంబేద్కర్‌ః పేరును లీనం చేసుకొని గురుభక్తిని చాటుకొన్నారు భీమ్‌రావు. అప్పటినుంచి భీమ్‌రావు పేరుగా కాకుండా అంబేద్కర్‌గా కోట్లాది ప్రజల హృదయాలలో చోటుచేసుకున్నారు.
బిఎ పాస్‌ అయిన తరువాత ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం వున్నప్పటికీ, బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఊడిగం చేయలేనని, దేశభక్తిని చాటుకొని బరోడా సంస్థానంలో చేరారు. తోటి ఉద్యోగుల నుంచి అవమానాల్ని ఎదుర్కొన్నారు అంబేద్కర్‌. అయితే వాటిని లెక్క చేయలేదు. అంబేద్కర్‌లోని కార్యదక్షతను, ఉన్నత చదువులు చదవాలనే ఆసక్తిని గమనించి బరోడా మహారాజు అమెరికాలోని కొలంబియా యూనివర్శిటీకి పంపడం ఆయన జీవితంలో మరొక అధ్యాయంగా చెప్పవచ్చు.
అమెరికాలో ఉండగానే నిరాడంబర జీవనశైలిని అలవరచుకున్నారు అంబేద్కర్‌. తదేకదీక్షతో విద్యాభ్యాసాన్ని కొనసాగించారు అంబేద్కర్‌. తనకున్న మేధా సంపత్తితో విదేశాలలోనే స్థిరపడిపోయే అవకాశం ఉన్నప్పటికీ, స్వదేశం మీద ప్రేమతో హిందూసమాజాన్ని సంస్కరించాలనే ఆకాంక్షతో అన్నిరకాల అవమానాలను ఆత్మస్థయిర్యంతో ఎదుర్కోవడానికి సిద్ధపడి దేశానికి తిరిగి వచ్చిన నిజమైన దేశభక్తుడు డాక్టర్‌ అంబేద్కర్‌. దేశానికి తిరిగి వచ్చాక కూడా తను అనేక అవమానాలకు గురయ్యారు.
1927 డిసెంబర్‌లో మహర్‌ పట్టణంలోని చౌదర్‌ చెరువులో అస్పృశ్యులు నీళ్ళు తాగడాన్ని నిషేధించారు. దీనితో డాక్టర్‌ అంబేద్కర్‌ దళితులతో కలిసి ఉద్యమం చేపట్టారు.
స్వరాజ్యమే లక్ష్యంగా ఎంచుకుని దాని సాధనకు పోరాడాలని 1930 ఆగస్టు 8న నాగపూర్‌లో జరిగిన నిమ్నవర్గాల కాంగ్రెస్‌ మొదటిసభకు అధ్యక్షత వహిస్తూ డాక్టర్‌ అంబేద్కర్‌ పిలుపునిచ్చారు. ఆ విధమైన అంబేద్కర్‌ గర్జనకు ఇటు బ్రిటిష్‌ పాలకులు, అటు కాంగ్రెస్‌లోని చాందసవాదులకు దడపుట్టింది. దానికి కారణం అంబేద్కర్‌ ఒక వర్గానికి నాయకుడని, దేశద్రోహి అని కొంతమంది ప్రచారం చేస్తున్న రోజులవి. కానీ అటువంటి నిందారోపణలకు భయపడకుండా, దళితులలో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ, మరోవైపు దేశ ప్రయోజనాలను కాపాడుతూ దళితులలో దేశభక్తిని పెంచి పోషించిన మహనీయుడు డాక్టర్‌ అంబేద్కర్‌.
నెహ్రూ మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా వుంటూనే, హిందూ సామాజిక వ్యవహారాలను సమూలంగా సంస్కరించే ఉద్దేశంతో, హిందూ కోడ్‌ను చట్టసభలో ప్రవేశపెట్టారు అంబేద్కర్‌. అయితే దానికి మద్దతు రాలేదు. దానితో నిరాశ చెందారు. కాశ్మీర్‌ వ్యవహారంలో పండిట్‌ నెహ్రూ వహిస్తున్న వైఖరి నచ్చలేదు సరికదా, వారి (నెహ్రూ) విదేశాంగ విధానాన్ని వ్యతిరేకించడమే గాక, ఆ వైఖరివల్ల భవిష్యత్తులో కాశ్మీర్‌ సమస్యగా తయారవుతుందని నాడు అంబేద్కర్‌ హెచ్చరించారు. కానీ నెహ్రూ ఆ హెచ్చరికను (దీని ఫలితమే నేటికీ కాశ్మీర్‌ సమస్యగానే ఉంది) పెడచెవిన పెట్టారు. దానితో తనపదవికి రాజీనామా చేశారాయన.
1956 డిసెంబర్‌ 6న డాక్టర్‌ అంబేద్కర్‌ పరమపదించారు.
వేదుల జనార్దనరావు ( From Andhra Prabha )

1 comment: