అనంతపురం జిల్లాలో జగన్ ఇప్పటికే నాలుగు విడతల్లో రైతు భరోసా యాత్ర చేశారు. కానీ ఆ నాలుగు విడతలు సాదాసీదాగానే సాగాయి. రైతులను పరామర్శించడం, అక్కడక్కడరోడ్ షోలు చేయడంతో నాలుగు విడతలు సాగిపోయాయి. కానీ ఐదో విడత అనంత రైతు భరోసా యాత్ర అందుకు పూర్తి భిన్నంగానే సాగింది. నాలుగు విడతల్లో కంటే ఎక్కువగానే స్పందన వచ్చింది. ఎమ్మెల్యేలు ఫిరాయిస్తుండడం, అందులోనూ కేవలం ఓకే ఎమ్మెల్యే మిగిలిన జిల్లాలో జగన్ యాత్రకు ఈస్థాయి స్పందన రావడాన్ని లోతుగా పరిశీలించాల్సిందేన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎమ్మెల్యే ఫిరాయించిన కదిరిలో జరిగిన సభకు జనం పోటెత్తడం చూసి వైసీపీ శ్రేణులు సంబరపడుతున్నాయి. అదే సమయంలో పట్టణప్రాంతాల్లో వైసీపీ బలహీనంగా ఉందన్న భావన కూడా ఉండేది. కానీ ఎస్పీ కార్యాలయం ముందు జగన్ నిర్వహించిన ధర్నాకు వేలాదిగా తరలిరావడం గమనించిదగ్గ పరిణామలే. జగన్ రావడానికి గంట ముందు అడ్డుకుంటామంటూ టీడీపీ కార్యకర్తలు హడావుడి చేశారు. కానీ జగన్ వచ్చే సమయానికి ఒక్కసారిగా వేలాది జనం, వైసీపీకార్యకర్తలు రోడ్ల మీదకు రావడంతో అధికార పార్టీ శ్రేణులు ఆ ప్రాంతంలో కనిపించలేదు. అయితే గత నాలుగు విడతలతో పోలిస్తే ఐదో విడతలో స్పందన అధికమవడానికి ప్రధానంగా రెండుకారణాలు వినిపిస్తున్నాయి.
రెండేళ్లు పూర్తయినా అనుకున్నస్థాయిలో రాజధాని నిర్మాణం గానీ, ఇతర అభివృద్ది కార్యక్రమాలుగానీ ముందుకు సాగకపోవడం వల్ల ప్రభుత్వంపై ప్రజల్లో భ్రమలు తొలుగుతున్నాయా అన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. రెండవది జగన్ చెప్పుల కామెంట్స్‌ను టీడీపీ బాగా ఎక్కువ చేసి చూపడం కూడా వైసీపీకి కలిసొచ్చిందన్న భావన వ్యక్తమవుతోంది. చంద్రబాబుపై వ్యాఖ్యలకు నిరసనగా జగన్ యాత్రను అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించడంతో జనంలో రైతు భరోసా యాత్రపై ఒక విధమైన ఆసక్తి పెరిగింది. మీడియాలోనూ నెగిటివ్‌గానైనా జగన్ యాత్రకు కవరేజ్ బాగా పెరిగింది. యాత్రను అడ్డుకుంటామన్న టీడీపీ పిలుపుతో వైసీపీ శ్రేణులు, పార్టీ అభిమానులు కూడా పోటాపోటీగా యాత్రకు తరలివచ్చారు. ఒక విధంగా చెప్పుల వ్యాఖ్యలపై టీడీపీ అతిస్పందన వల్ల అప్పటి వరకు పాసివ్ మోడ్‌లో ఉన్న వైసీపీ శ్రేణులు కూడా కదిలివచ్చేలా చేసిందంటున్నారు. ఒకవేళ జగన్ చెప్పుల వ్యాఖ్యలకు చంద్రబాబు నుంచి చోటా లీడర్ వరకు ఈ రేంజ్‌లో అతిగా స్పందించి ఉండకపోతే జగన్ యాత్రపై ఇంతస్థాయిలో చర్చ కూడా జరిగేది కాదంటున్నారు. మొత్తం మీద వైసీపీ బలహీనంగా ఉందనుకున్న జిల్లాలో జనం ఈ స్థాయిలో కదలిరావడం ఆ పార్టీకి బూస్ట్‌లాంటిదే.
Click here to Read:http://teluguglobal.com/jagan-anantapur-meeting-success/
No comments:
Post a Comment