Saturday, May 25, 2013

"రోహిణీ కార్తె" అంటే ?

సూర్యోదయమప్పుడు ఏ చుక్క (నక్షత్రం) చంద్రుడికి దగ్గరగా ఉందనే దాన్ని బట్టి ఆ రోజు నక్షత్రం నిర్ణయమవుతుంది. పున్నమి రోజు చంద్రుడు ఏ చుక్కతో ఉంటే ఆ నెల పేరును ఆ చుక్క పేరు మీదుగా పెట్టేశారు మనవాళ్ళు: చిత్రా నక్షత్రమైతే చైత్రం, విశాఖ ఐతే వైశాఖం, ఇలా వరసగా. (పున్నమి నుంచి పున్నమికి దాదాపు 30 రోజులు. చైత్రమాసంలో పున్నమి రోజు చిత్రా నక్షత్రం వస్తే 27 రోజుల తర్వాత 28వ రోజు మళ్ళీ చిత్రా నక్షత్రం వస్తుంది. 29 వ రోజు స్వాతి, 30 వ రోజు విశాఖ. అదే వైశాఖ పున్నమి. ప్రతి సంవత్సరం ఇదే వరస!) ఈ చుక్కలన్నిట్లోకీ రోహిణీ మరింత చక్కని చుక్క. ఆ రోహిణీ నక్షత్రానికి పున్నమి చంద్రుడితో గడిపే అవకాశం కార్తీక మాసంలో గానీ రాదు. ఆ నెలలో పున్నమి పూర్తవకుండానే కృత్తికా నక్షత్రం వెళ్ళిపోయి రోహిణి వచ్చేస్తుంది. అప్పుడు చంద్రుడెంతగా వెలిగిపోతాడంటే అంత ప్రకాశవంతమైన వెన్నెల సంవత్సరం మొత్తం మీద మరే నాడూ ఉండదు. అసలు కార్తీక మాసానికే వెన్నెల మాసమని పేరు.
ఇక సూర్యుడి విషయానికి వస్తే సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉన్నాడనేదాన్ని బట్టి కార్తె నిర్ణయమవుతుంది. సంవత్సరానికి మొత్తం 27 కార్తెలు. ఎప్పుడు ఏ కార్తె వచ్చేదీ కాలెండర్ లో చూసి తెలుసుకోవచ్చు. (ఈ సంవత్సరం రోహిణీ కార్తె మే 24 నుంచి జూన్ 8 వరకు ఉండింది.) రోహిణీ కార్తెలో సూర్యుడెంతగా వెలిగిపోతాడో చెప్పనవసరం లేదు: "రోహిణీ ఎండలకు రోళ్ళు పగులుతాయి" అనే సామెతే ఉంది.
 రోహిణీ కార్తె రాకతో రైతులు సాగుకు మంచి రోజులుగా భావిస్తారు. ప్రతి ఖరీఫ్‌కు ఈ కార్తె నుంచే సాగుకు సమయాత్తమవుతారు. నార్లు పోసుకునేందుకు చాలా మంది రైతులు ఈ కార్తె ప్రారంభమైన రోజు నుంచే మొలక వేసుకుంటారు. అయితే ఈ సారీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఈ నెలలో మునుపెన్న డూ లేని విధంగా ఎండలు మండుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు సాగుకు సిద్ధమయ్యే పరిస్థితి లేదు.

2 comments:

  1. >ఇక సూర్యుడి విషయానికి వస్తే సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉన్నాడనేదాన్ని బట్టి కార్తె నిర్ణయమవుతుంది.

    కాదు. సూర్యుడు యే నక్షత్రంలో సంచరిస్తున్నాడో అది ఆ పేరుగల కార్తె. రోహిణీ‌కార్తెలో సూర్యుడు రోహిణీ నక్షత్రంలో సంచరిస్తాడు.

    రాశిచక్రంలోని 360 డిగ్రీలను మొత్తం 27 నక్షత్రాలుగా సమానంగా విబజించారు. ప్రతి నక్షత్రమూ 13డిగ్రీ20భాగల ప్రమాణం. సూర్యసంచారం యే నక్షత్రంలో‌ఉంటుందో అది ఆ నక్షత్రనామం గల కార్తె అన్నమాట. నిజానికి మనం లెక్కించేది నిరాయణసూర్యగమనాన్ని. ఇది జ్యోతిస్సిధ్ధాంత సంబందమైన విషయం. సంవత్సరంలో ప్రతి కార్తె ఇంచుమించు అదే ఇంగ్లీసు కాలెండరు తేదీకి వస్తుంది.

    ReplyDelete
  2. Sir,తప్పును సరిచేసినందుకు కృతజ్ఞతలు

    ReplyDelete