భారత జనాభా 121 కోట్లకు చేరుకుంది. గడచిన దశాబ్దితో పోల్చుకుంటే, దేశ జనాభాలో 17.7 శాతం పెరుగుదల నమోదైంది. హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే 2011 తుది జనాభా లెక్కల వివరాలను మంగళవారం విడుదల చేశారు. ఈ లెక్కల ప్రకారం 2011 మార్చి 1 నాటికి దేశ జనాభా 121,07,26,932. గత 2001 నాటి జనాభా లెక్కలతో పోల్చుకుంటే, 2011 నాటికి జనాభాలో 18.196 కోట్ల పెరుగుదల నమోదైంది. అయితే, పురుషుల జనాభా కంటే, మహిళల జనాభాలోనే కాస్త ఎక్కువ పెరుగుదల నమోదు కావడం గమనార్హం.
పురుషుల జనాభా 9.097 కోట్లు పెరగగా, మహిళల జనాభా 9.099 కోట్లు పెరిగింది. పురుషుల జనాభాలో 17.1 శాతం పెరుగుదల నమోదవగా, మహిళల జనాభాలో 18.3 శాతం పెరుగుదల నమోదైంది. భారత జనాభా 2001-11 మధ్య కాలంలో 17.7 శాతం పెరగగా, అంతకు ముందు దశాబ్దిలో 21.5 శాతం పెరిగింది. దశాబ్ద కాలంలో అత్యధిక జనాభా పెరుగుదల నమోదైన రాష్ట్రాల్లో బీహార్ (25.4 శాతం) అగ్రస్థానంలో నిలిచింది. మరో 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సైతం జనాభా పెరుగుదల 20 శాతాని కంటే ఎక్కువగానే నమోదైంది. తాజా జనాభా లెక్కల ప్రకారం దేశంలోని 83.35 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 37.71 కోట్ల మంది పట్టణాల్లో ఉన్నారు.
పట్టణ జనాభాలో ఢిల్లీదే అగ్రస్థానం
పట్టణ జనాభాలో ఢిల్లీ (97.5%) అగ్రస్థానంలో ఉండగా, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తొలి నాలుగు స్థానాల్లో గోవా (62.2%), మిజోరాం (52.1%), తమిళనాడు (48.4%), కేరళ (47.7 శాతం) ఉన్నాయి.
అక్షరాస్యతలో తగ్గుతున్న వ్యత్యాసాలు
దేశంలో అక్షరాస్యత శాతం 2001 నాటికి 64.8 శాతం ఉండగా, 2011లో దాదాపు 8 శాతం పెరిగి, 73 శాతానికి చేరుకుంది. తాజా జనాభా లెక్కల్లో పురుషుల్లో అక్షరాస్యత గత జనాభా లెక్కల కంటే 5.6 శాతం పెరిగి 80.9 శాతానికి చేరుకోగా, మహిళల్లో అక్షరాస్యత గత జనాభా లెక్కల కంటే 10.9 శాతం పెరిగి, 64.6 శాతానికి చేరుకుంది. అక్షరాస్యతలో అత్యధిక పెరుగుదల కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్‌హవేలీలో నమోదైంది. ఈ ప్రాంతంలో 2001లో 57.6 శాతం ఉన్న అక్షరాస్యత 2011 నాటికి 76.2 శాతానికి (18.6 పాయింట్లు) చేరుకుంది.
బీహార్‌లో అక్షరాస్యత 47.0 శాతం నుంచి 61.8 శాతానికి (14.8 పాయింట్లు), త్రిపురలో 73.2 శాతం నుంచి 87.2 శాతానికి (14.0 పాయింట్లు) పెరిగింది. మిజోరాం మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ, కేంద్రపాలిత ప్రాంతాల్లోను పురుషుల కంటే మహిళలే అక్షరాస్యతలో ఎక్కువ పురోగతి సాధించారు. మిజోరాంలో అక్షరాస్యత పెరుగుదల మహిళల్లోను, పురుషుల్లోను సమానంగా నమోదైంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత వ్యత్యాసం ప్రతి జనాభా లెక్కల్లోనూ తగ్గుతోంది. అలాగే, మహిళలు, పురుషుల అక్షరాస్యత వ్యత్యాసం కూడా తగ్గుతూ వస్తోంది. అక్షరాస్యతలో తొలి ఐదు స్థానాల్లో కేరళ (94 శాతం), లక్షదీవులు (91.8 శాతం), మిజోరాం (91.3 శాతం), గోవా (88.7 శాతం), త్రిపుర (87.2 శాతం) ఉన్నాయి. అక్షరాస్యతలో అట్టడుగు ఐదు రాష్ట్రాల్లో బీహార్ (61.8 శాతం), అరుణాచల్ ప్రదేశ్ (65.4 శాతం), రాజస్థాన్ (66.1 శాతం), జార్ఖండ్ (66.4 శాతం), ఆంధ్రప్రదేశ్ (67 శాతం) ఉన్నాయి.
లింగ నిష్పత్తిలో హర్యానా అత్యంత దారుణం
తాజా లెక్కల ప్రకారం లింగ నిష్పత్తిలో హర్యానా పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. హర్యానాలో ప్రతి వెయ్యిమంది పురుషులకు 879 మంది మాత్రమే స్త్రీలు ఉన్నారు. లింగ నిష్పత్తిలో ముందంజలో ఉన్న తొలి ఐదు రాష్ట్రాల్లో కేరళలో ప్రతి వెయ్యిమంది పురుషులకు 1,084 మంది మహిళలతో అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు (996), ఆంధ్రప్రదేశ్ (993), ఛత్తీస్‌గఢ్ (991), ఒడిశా (979) ఉన్నాయి. దేశవ్యాప్తంగా చూసుకుంటే, 2011 నాటికి ప్రతి వెయ్యిమంది పురుషులకు 943 మంది స్త్రీలు ఉన్నారు. గత జనాభా లెక్కల్లో ఈ సంఖ్య 933గా నమోదవగా, ఈసారి స్వల్పంగా పెరుగుదల చోటు చేసుకుంది. దేశంలో పిల్లల జనాభా నామమాత్రంగా 0.4 శాతం మాత్రమే పెరిగింది. 2001 నాటికి 0-6 ఏళ్ల వయసు లోపు గల పిల్లల జనాభా 16.38 కోట్లు కాగా, 2011 జనాభా లెక్కల్లో 16.45 కోట్లుగా నమోదైంది. 2001 లెక్కలతో పోల్చుకుంటే 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తగ్గుదల నమోదైంది.
జనసాంద్రతలో బీహార్ టాప్
దేశంలో జనసాంద్రత కూడా పెరిగింది. గత 2001 లెక్కల ప్రకారం చదరపు కిలోమీటరుకు 325 నమోదైన జనసాంద్రత, 2011 నాటికి 382కు చేరుకుంది. జనసాంద్రత విషయంలో ప్రధాన రాష్ట్రాల్లో బీహార్ (1106) అగ్రస్థానంలో నిలిచింది. 2001 నాటి లెక్కల్లో పశ్చిమ బెంగాల్ తొలిస్థానంలో ఉండేది. అత్యధిక జనసాంద్రత గల నగరంగా ఢిల్లీ (11,320) తొలిస్థానంలో నిలవగా, చండీగఢ్ (9,258) రెండోస్థానంలో నిలిచింది. -
See more at: http://www.sakshi.com/Main/FullStory.aspx?CatId=590198&Categoryid=1&subCatId=32#sthash.L06XqZof.dpuf
See more at: http://www.sakshi.com/Main/FullStory.aspx?CatId=590198&Categoryid=1&subCatId=32#sthash.L06XqZof.dpuf
ReplyDeleteదీనినిబట్టి తెలుస్తున్నది.-10 యేళ్ళలో అభివృద్ధి ఉన్నా ,ఇంకా మనం పూర్తిగా అభివృద్ధి చెందలేదని.ముఖ్యంగా బీహార్ వంటి రాష్ట్రాలు జనాభాలో '' అభివృద్ధిని ''గాక, ,సంపదను పెంపొందించుకొంటేగాని పెదరికం తగ్గించుకొని బయటపడలేవు.ఆంధ్రప్రదేశ్ అభ్వృద్ధి చెందిన రాష్ట్రమైనా ప్రాథమికవిద్యలో వెనుకబడిఉన్నది.కేరళ,తమిళ నాడులకన్నా ఎక్కువ వనరులు (resources) వున్నా వాటికన్నా వెనుకబడిఉన్నాము.ఆరోగ్యం,ఉన్నతవిద్య,పరిశ్రమలు,వ్యవసాయం రంగాల్లో పరవాలేదు.విద్యుత్శక్తి,పారిశుధ్యం బాగులేవు.