Thursday, May 30, 2013

రెంటికీ చెడిన రేవడి అయిన జూ.ఎన్టీయార్

hero-jr-ntr-need-advisors

బహుశా జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పు డు తెలుగు పద్యాలు ఏవీ చదువుకుని వుండకపోవచ్చు. లేదంటే, తన కోపమె తన శతృవు..తన శాంతమె తనకు రక్ష…అన్న నానుడి పట్టుబడి వుండేది. కనీసం తెలుగు మీడియంలోనైనా చదివి వుంటే, ఓర్చినమ్మకు తేటనీరు అన్న సామెతన్నా తెలిసి వుండేది. ఇలాంటి విషయాలు ఏవి తెలిసి వున్నా, ఇప్పడిలా కోరి తలకాయనొప్పులు తెచ్చుకునేవాడు కాదు.
జూనియర్ ఎన్టీఆర్ నిజానికి ఓ సక్సెస్ స్టోరీ. తండ్రి, ఓ కుటుంబం ఇలాంటి వాటికి దూరంగా తల్లితోడదే లోకంగా బతికాడు. భగవంతుడు అనుగ్రహించి, బాబాయిలకు సైతం పూర్తిగా రాని తాత అందాన్ని అందించాడు. ఆపై అనుకోకుండా నటవారసత్వం అందివచ్చింది. జనం జేజేలు పలికారు. కానీ అక్కడే జూనియర్ తో తేడా వచ్చింది. ఇదంతా తన అదృష్టం అనుకున్నట్లు కనిపించలేదు. తనకు తిరుగులేదన్న ధీమా పెంచుకున్నట్లు కనిపించింది.
గడచిన ఎన్నిక్లలో పార్టీ తరపున ప్రచారం చేయడం తెలుగుదేశానికి సీట్లు తెచ్చిపెట్టకపోయినా, జూనియర్ రాజకీయ కాంక్షకు బీజాలు వేసిందేమో? తనను తాను కాస్త ఎక్కువగానే ఊహించుకునేలా చేసిందేమో? బండి బాట మారిపోయింది. తెలుగుదేశం వారసత్వం తనకు కావాలన్న తపన పెరిగినట్లుంది. సినిమా రంగంలో కావచ్చు, రాజకీయరంగంలో కావచ్చు..రౌతు మనసు ఎరిగి పరిగెత్తే గుర్రాలే ఎక్కువ. మంచి సలహాలు, దారితప్పితే వచ్చితే ముప్పు విప్పి చెప్పేవారు తక్కువ. ఎన్టీఆర్ విషయంలో కూడా అదే జరిగివుండొచ్చు.నిన్ను మించిన వాడు లేడు జగాన..అని భజన చేసేవాళ్లు చేసి వుండొచ్చు. కానీ మన కాళ్ల కింద నేల ఏపాటి గట్టిది అన్న ఇంగిత జ్ఞానం మనకు వుండాలి.
పట్టుమని పది హిట్లు లేని తరుణంలో, తన కెరియర్, చరిష్మా, తన వ్వయహారాలు అన్నీ తన సినిమాలతో ముడిపడి వున్న తరుణంలో వాటిపైనే దృష్టి కేంద్రీకరించుకోవాల్సి వుంది. వయసు చూస్తే తక్కువ. కనీసం మరో పదో, ఇరవయ్యో సినిమాలు చేయాల్సి వుంది. హిట్లు కొట్టాల్సి వుంది. టాలీవుడ్ లో పోటీ సామాన్యంగా లేదు. ఇలాంటప్పుడు తన సర్వ శక్తులు, ఆలోచనలు పూర్తిగా అటే కేంద్రీకరించాల్సి వుంది. పైగా తనకంటూ ఓ వెన్ను దన్ను వుండాలి. అంది అందించగలవాళ్ల అభిమానాన్ని పొందే మార్గం చూసుకోవాలి. ఇవన్నీ మాని, ముఖ్యమంత్రిగా చిరకాలం పనిచేసి, తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో వున్నా కూడా పార్టీని బతికించుకుంటూ వస్తున్న అనుభవం కలిగిన చంద్రబాబుతో ఢీ కొనడం ఎంతవరకు అవసరం? అది ఏ మేరకు లాభమో, నష్టమో తెచ్చిపేడుతుందో జూనియర్ ఆలోచించారా? బాలకృష్ణకు స్వంత చరిష్మా లేకనే బావ పక్కన నిలిచారా? అసలు సినిమాల్లో స్వంత వ్యవహారాలు, రాజకీయాలు చొప్పించి ప్రయోజనమేమిటి? దమ్ము సినిమా ఎందుకు దెబ్బతింది. కథను తన చిత్తం వచ్చినట్లు, తన స్వంత వ్వవహారాల చుట్టూ తిప్పడం వల్లనే కదా? ఒక విధంగా జూనియర్ కూడా జగన్ లాంటి తొందరపాటునే ప్రదర్శించారనిపిస్తోంది. ఎన్ని అంతస్తులైనా ఒక్కొక్కటీ ఎక్కాల్సిందే. అమాంతం ఎగిరే అవకాశం అందరికీ రాదు. ఒక వేళ బాబు తెలుగుదేశం వారసత్య పగ్గాలను లోకేష్కు అందివ్వాలానే అనుకున్నారని అనుకుందాం. హరికృష్ణ తనయుడి గురించి ఆలోచించినట్లు, బాబు తన కొడుకు ఆలోచించడంలో తప్పులేదు. కానీ ఇక్కడ ఒకటే సమస్య ఎవరి బలం ఏమిటన్నది చూడాలి. బాబు బలం ఎక్కువ అని గమనించినపుడు తగ్గి వుండాలి. వేరే విధంగా ఆయన నుంచి లాభం పొందడానికి చూసుకోవాలి. కెరియర్ పరంగా, ఇంకేమైనా పదవుల పరంగా. అది ఒక్కటీ తప్ప..అన్న చందంగా, వారసత్వ పగ్గాలు ఆశించకుంటే, ఏదడిగినా ఇవ్వడానికి బాబుకు కూడా అభ్యంతరం వుండకపోవచ్చు. ఇవన్నీ ఆలోచించకుండా తొందరపడి పార్టీకి, పార్టీ నేతలకు దూరం కావడం అన్నది ఎన్టీఆర్ దుందుడుకు చర్య. అతగాడి అనుభవ రాహిత్యానికి అది ఉదాహరణ.
నిజానికి మహానాడుకు ఆహ్వానం రాలేదనే అనుకుందాం..అయినా వెళ్లి..హుందాగా పాల్లొని, మొన్న తాత సమాధి దగ్గర చెప్పిన మాటలేవో అక్కడే చెప్పి, కావాలంటే, ఆహ్వానం లేకపోయినా వచ్చానని చెప్పివుంటే, బంతి బాబు కొర్టులో పడివుండేది.
ఇప్పు డు బంతి ఎన్టీఆర్ కోర్టులో వుంది. ఇక మరే పిలుపు రాదు. పిలవకుండా వెళ్లడానికి అహం అడ్డువస్తుంది. దిగజారడని అనుకుంటారన్న ఆందోళన. చేతిలో వున్నది ఒకటి రెండు సినిమాలు. మొన్నటికి మొన్న దమ్ము సినిమా పరాజయానికి తెలుగుదేశం అభిమానుల ఎస్ఎమ్ఎస్ లు కూడా కారణం అన్న వార్తలు వినవచ్చాయి. యుద్ధం అన్నాక అలాగే వుంటుంది. భవిష్యత్ లో సినిమాలకు కూడా ఈ తరహా యుద్దాలు తప్పకపోవచ్చు. ఈ చిన్న వయసులో ఇన్ని తలకాయ నొప్పులు అవసరమా? రాజకీయాల్లో ఎంతయినా వేచి వుండాల్సిందే. బాబు సైతం ఎన్ని ఏళ్ల అనుభవం తరువాత ముఖ్యమంత్రి కాగలిగారు? అది మరిచిపోయి..’నేను కాబోయే సిఎమ్ ను’ అన్న భ్రమల్లో గడిపితే ఫలితం లభించదు.
జూనియర్ తండ్రి హరికృష్ణకు ఇటువంటి దుందుడుకు తనమే వుంది. అదే వారసత్వంగా జూనియర్ కు వచ్చినట్లుంది. కానీ తండ్రి రాజకీయాల్లో విఫలమైనట్లు, తానూ విఫలం కాకూడదనుకుంటే, జూనియర్ ఆలోచనా విధానం సమూలంగా మారాల్సి వుంది. అందుకు కావాల్సింది రెండు . ఒకటి సరైన సలహాదారులు. రెండు వాటిని తలకెక్కించుకునే యోచన.
Source:  http://24by7news.com/headlines/hero-jr-ntr-need-advisors/#.UadnsawV84I

No comments:

Post a Comment