‘ఐస్ టీ’ని అతిగా సేవిస్తే కిడ్నీలో రాళ్లు ఏర్పడడం ఖాయమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. లయోలా విశ్వవిద్యాలయం వైద్య కేంద్రం యూరాలజిస్టులు తాజాగా జరిపిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి ప్రధాన కారణమైన ‘ఆక్సలేట్’ ఐస్ టీలో ఎక్కువగా ఉంటోందని పరిశోధకులు తేల్చారు. ఐస్ టీ కారణంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడి మూత్ర సంబంధ వ్యాధులతో పలువురు బాధపడుతున్నట్లు గుర్తించారు. కాగా, ఆరోగ్యకరమైన ద్రవపదార్ధాలను తీసుకోనందునే కిడ్నీలో రాళ్లు ఏర్పడుతున్నాయని లయోలా వర్సిటీ వైద్య కేంద్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జాన్ మిల్నర్ హెచ్చరిస్తున్నారు. సాధారణంగా వేసవి కాలంలో చెమట ద్వారా శరీరంలోని అధిక శాతం నీరు బయటకు పోతుందని, ఈ సమయంలో ఉపశమనం పొందేందుకు చాలామంది ఐస్ టీ సేవిస్తున్నారని ఆయన తెలిపారు. అందుకే వేసవిలో పరిశుభ్రమైన నీటితోపాటు ఇతర ద్రవాలను విరివిగా తీసుకోవాలి. కేలరీలు తక్కువగా ఉంటూ, మంచి రుచి కలిగిన ఐస్ టీని తాగేందుకే ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. వేడి టీలో కూడా హానికరమైన ఆక్సలేట్ ఉన్నప్పటికీ కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి తక్కువ ప్రభావం చూపుతుంది. మహిళలకంటే పురుషుల్లోనే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడడం ఎక్కువని, 40 ఏళ్లు పైబడ్డ వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని పరిశోధకులు తేల్చారు. ఈ సమస్యను అధిగమించాలంటే తరచూ పరిశుభ్రమైన నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. సిట్రస్ అధికంగా ఉండే నిమ్మకాయలను వాడడంవల్ల కిడ్నీలో రాళ్ల ఎదుగుదలను నివారించవచ్చు. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు ఆక్సలేట్లు అధికంగా ఉన్న పాలకూర, చాక్లెట్లు, గింజలు వంటివి వినియోగించరాదని పరిశోధకులు సూచిస్తున్నారు. ఉప్పు, కాల్షియం కలిగిన ఆహార పదార్ధాలను, మాంసం ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్యకు దూరం కావచ్చు. ముఖ్యంగా మంచినీటిని ఎక్కువగా తాగాలని నిపుణులు పదే పదే సలహా ఇస్తున్నారు.
Source : Andhrabhoomi
No comments:
Post a Comment