కొండపల్లికీ బొమ్మలకూ ఏదో సంబంధం ఉందనిపిస్తుంది. కృష్ణా జిల్లా కొండపల్లిలో 30 కుటుంబాలకు చెందిన ఆర్య క్షత్రియులు ‘తెల్ల పొణికి’ కర్రతో అద్భుతాలనునాలుగు శతాబ్దాలుగాసృష్టిస్తున్నారు. హైదరాబాద్‌లోని దోమల్ గూడాలో కొండపల్లి శేషగిరిరావు గారు కంటికింపయిన రంగుల్లో మహాద్భుతాలను -ఏడెనిమి దశాబ్దాలపాటు- సృష్టిస్తూ పోయారు. ఆ కొండపల్లి బొమ్మలూ, ఈ కొండపల్లి బొమ్మలూ కూడా ప్రపంచమంతటా తెలుగువాళ్ల జెండా ఎగరేశాయి.
లాలిత్యం-లావణ్యం
ఎనబై ఎనిమిదేళ్ల వృద్ధాప్యంలో, భార్యపోయిన ఒంటరితనంలో ఇక కట్టెని ఈడ్వలేక, కన్నుమూశారు సుప్రసిద్ధ చిత్రకారులు -మంచి మనిషి- డాక్టర్ కొండపల్లి శేషగిరిరావు. సంస్కారం-లాలిత్యం-లావణ్యం నిండిఉండే ఆయన చిత్రాలయినా మనకు మిగిలినందుకు సంతోషించాలి. మధురమయిన ఆయన మాటతీరు, నిండయిన ఆయన విగ్రహం, నిగర్వానికి మారుపేరయిన ఆయన వ్యక్తిత్వాలను మనసారా స్మరించుకోవాలి. ఒక సీతనూ, సావిత్రినీ, శకుంతలనూ, వరూధినినీ, రాణీ రుద్రమనూ, ఒక నన్నయనూ, పోతననూ, త్యాగయ్యనూ, అన్నమయ్యనూ -తెలుగుతనం మూర్తీభవించే తీరులో- తీర్చి దిద్దిన కొండపల్లికి మన జాతి కలకాలం రుణపడిఉంటుంది. ఎన్నడూ రాముణ్ణి చూడని తనకు ఆ భాగ్యం కొండపల్లి శేషగిరిరావు బొమ్మలద్వారానే దక్కిందనీ విప్లవ కవి వరవరవరావు చెప్పడం గమనార్హం.
మూలమలుపు
వరంగల్ జిల్లా మహబూబాబాద్‌ను స్థానికులు, దాని పూర్వనామమయిన మానుకోట పేరిటే వ్యవహరించడం కద్దు. ఆ మానుకోట సమీపంలోని పెనుగొండే కొండపల్లి జన్మస్థలి. 1924 జనవరి 27న మానుకోటలో పుట్టిన శేషగిరిరావు చిన్ననాటనే చిత్రరచనపట్ల మక్కువ ప్రదర్శించారు. ఆయన ఉపాధ్యాయవర్గం కొండపల్లి ఆసక్తిని గమనించి, ఆ రంగంలో అన్యులకు అసాధ్యమయిన ఎత్తులను అధిరోహించేలా పోత్సహించారు. అయితే అది తొలిమెట్టు మాత్రమే. నవాబ్ మెహ్‌దీ యార్ జంగ్ ఆదరణ పుణ్యమాని శేషగిరిరావు రవీంద్రుడి శాంతి నికేతనానికి వెళ్లి, నంద లాల్ బోస్ శిష్యరికంలో ఒక సంవత్సరం పాటుమెలకువలు నేర్చుకుని రావడం ఆయన జీవితాన్నే మలుపు తిప్పిన పరిణామం. మన దామెర్ల, వరదా, అడివీ, మాగోఖలే, రాజాజీ వేసిన చిత్రాలకూ- కొండపల్లి బొమ్మలకూ తేడాల కన్నా పోలికలే ఎక్కువ! వాళ్లలో ఎవ్వరికీ లేనంత విస్తృతి కొండపల్లిలో కనబడడం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం.
సాహిత్యమే మోడల్!
కొండపల్లి వేసిన భక్త పోతన చిత్రం (1982లో ఆంధ్ర సచిత్ర వార పత్రిక ముఖచిత్రంగా వచ్చింది) ఇప్పటికీ చిత్రకళా విద్యార్థులకు పాఠ్యాంశంలా పనికొస్తోంది. ఆంధ్ర మహా భాగవతాన్ని మథించి, దానికర్త ముఖ కవళికలను దిద్దితీర్చడమనే మెథడ్‌లోనే ఉంది ఆ బొమ్మ విశిష్టత. వీరేశలింగం అనువాదం చేసిన అభిజ్ఞాన శాకుంతలం క్షుణ్ణంగా చదివి, కొండపల్లి వేసిన శకుంతల బొమ్మలు అప్పట్లో ఓ సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా కొలను నుంచి నీళ్లు తెచ్చుకునే శకుంతల వెనక్కి తిరిగి (దుష్యంతుడిని?) చూస్తున్న భంగిమలో వేసిన చిత్రానికి వందల సంఖ్యలో నకళ్లు ‘ఉత్పత్తి’ కావడం చరిత్ర! ‘మనుచరిత్ర’లో పెద్దన సృష్టించిన వరూధినే కొండపల్లికి ‘మోడల్’. జానపద, చారిత్రిక, పౌరాణిక గాథలనే మూలాలుగా తీసుకుని బొమ్మల్లోకి అనువదించడమనే ప్రక్రియలో కొండపల్లి శేషగిరిరావుకు సరిసాటి ఎవరూ లేరనే చెప్పాలి.
కార్టూనిస్ట్ మోహన్ చెప్పినట్లు తెలుగువాడు తెలుగు బొమ్మే వెయ్యాలన్న సందేశం ఇస్తాయి కొండపల్లి బొమ్మలు. రవివర్మ ప్రాధాన్యం తగ్గించే కుట్రలో భాగంగా ఆయనను ‘క్యాలెండర్ ఆర్టిస్ట్’గా కొట్టిపారేసే మహానుభావులున్నట్లే, కొండపల్లిని నియో క్లాసిసిస్టుగా తీసిపారేసే ప్రబుద్ధులు కూడా ఉన్నారు. వీళ్లలో ఎందరు ఆయన వేసిన ప్రకృతి దృశ్యాలనూ, జానపదుల చిత్రాలనూ చూశారో అనుమానమే. కళాకారులకు లేబిల్స్ తగిలించడం తేలిక- వాళ్ల కృషి వెనకాల ఉన్న స్ఫూర్తిని అర్థం చేసుకోవడం కష్టం. ఎవరయినా తేలికయిన పని చెయ్యడానికే ఇష్టపడతారు గానీ కష్టం జోలికి పోతారా? కొండపల్లి శేషగిరిరావు జీవితం- కృషి- వ్యక్తిత్వాలను ఆవిష్కరిస్తూ, ఆయన గురించి ప్రముఖ చిత్రకారుల అభిప్రాయాలను రికార్డు చేస్తూ ధన్‌రాజ్ తీసిన డాక్యుమెంటరీ చిత్రం యూట్యూబ్‌లో దొరుకుతుంది- ఇదీ లింకు:
http://www.youtube.com/watch?v=0nRgg3d2uls&feature=player_detailpage
No comments:
Post a Comment