శ్రీకాళం జిల్లా వంగరమండలం లక్ష్మీపేట దళితులపై దాడి జరిగి నెలమీద అయిదు రోజులు అవుతున్నా, కేసు ఒక కొలిక్కి రాకపోవడం పట్ల దళిత సంఘాలు మండిపడుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడు- మంత్రి బొత్స సత్యనారాయణను ఒకటో ముద్దాయిగా చేసి ఎస్సీ-ఎస్టీ అత్యాచార (నిరోధక) చట్టం కింద కేసుకట్టాలని దళితసంఘాలు మంగళవారం డిమాండ్ చేశాయి. మరో మంత్రి కొండ్రు మురళీని కూడా మరో ముద్దాయిగా ప్రకటించాలని వారు డిమాండ్ చెయ్యడం గమనార్హం. మంగళవారం ఉదయం మంత్రుల క్వార్టర్స్‌ను ముట్టడించి ఈ డిమాండ్ చేశాయి.
అసలు లక్ష్మీపేటలో ఏం జరిగింది?
వెనకబడిన శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల కుగ్రామం లక్ష్మీపేట హఠాత్తుగా జాతీయస్థాయి ప్రాచుర్యానికి నోచుకుంది. జూన్ పన్నెండో తేదీన ఈ గ్రామానికి చెందిన దళితవాడపై జబ్బబలం, డబ్బుబలం ఉన్న వందమంది దుండగులు బాంబులూ, గొడ్డళ్లూ, కర్రలూ, కత్తులతో సాగించిన అమానుషమయిన దాడి కారణంగానే ఈ ప్రాచుర్యం లభించడం దురదృష్టకరం. ఈ దాడిలో అయిదుగురు దళితులు బలయ్యారు. పాతికమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మరెందరో ఇప్పటికీ ఆస్పత్రులలో పడిఉన్నారు. ఈ దాడి వెనక పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్రమంత్రి బొత్స సత్యనారాయణ హస్తం ఉందని వివిధ సంఘాలకు చెందిన దళితులు, రాజకీయ వాదులూ ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బొత్సను, ఆయన సమీప బంధువులనూ ఈ కేసులోంచి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని దళితులు మానవ హక్కుల కమిషన్ దృష్టికి సైతం తీసుకెళ్లారు. వైఎస్‌ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ లక్ష్మీపేట వెళ్లి బాధితులను పరామర్శించి వచ్చారు. జులై 17 మంగళవారం ఉదయం దళిత సంఘాలు మంత్రుల క్వార్టర్స్‌ను చుట్టుముట్టి ఆందోళన చేశారు.
దళితులపై దాడి ఎందుకు జరిగింది?
మడ్డువలస రిజర్వాయర్ నిర్మాణం నిమిత్తం పదేళ్ల కిందట సేకరించిన 250 ఎకరాల భూముల సాగు విషయమే దళితులకూ, బొత్స సత్యనారాయణ బంధువర్గానికీ మధ్య గొడవలు జరగడానికి మూలకారణం. ఎనిమిదేళ్ల కిందట శ్రీకాకుళం జిల్లా రెవిన్యూ అధికారులు ఈ భూములను సాగుచేసుకోవలసిందిగా దళితులకు మౌఖికంగా ఆదేశాలిచ్చారు. అప్పట్నుంచీ, 80 దళిత కుటుంబాలు 60 ఎకరాల భూమిని సాగుచేసుకుంటూ జీవిక సాగిస్తున్నారు. మిగతా 190 ఎకరాల భూమిని బొత్స సత్యనారాయణ బంధువులూ, కులస్థులూ ఆక్రమించుకున్నారు. దళితులు దున్నుకుంటున్న భూములతో సహా మొత్తం 250 ఎకరాలకూ వారికే పట్టాలిప్పిస్తానని బొత్స వాగ్దానం చేయడంతో లక్ష్మీపేటలో అగ్గి రగులుకొంది. ఈ మొత్తం వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి -విజయనగరం డీసీసీ అధ్యక్షుడు- వాసుదేవరావు. ఈయనను బొత్స బినామీగా జిల్లాలో చెప్పుకుంటారు.
దళితులెందుకు మండిపడుతున్నారు?
జూన్ పన్నెండో తేదీనాటి దాడి -పోలీసులకు సంబంధించినంత వరకూ- అనూహ్యమేమీ కాదు. దాడికి సన్నాహాలు పోలీసుల పర్యవేక్షణలోనే జరిగాయని దళితుల ఆరోపణ. అంతకుమించి, దాడి జరిగి కొందరు బాంబుల దెబ్బకు అక్కడికక్కడే చనిపోయినా, పోలీసులు స్పందించలేదు. ఎన్ని ఫోన్ కాల్స్ చేసినా అదిగో ఇదిగో అనడమే తప్ప ఒక్క కానిస్టేబుల్ కూడా దళితవాడ దగ్గిరకు రాలేదు. ఇదంతా ఒక పథకంలో భాగంగానే జరిగిందని దళితులకు అనిపించడంలో వింతేముంది? ఈ పథకాన్ని బొత్స సత్యనారాయణే స్వయంగా సిద్ధంచేసి ఉంటారని నమ్మడంలో మాత్రం విడ్డూరమేముంది? దళితుల ఉసురు తీసిన బొత్సను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న మంత్రి కొండ్రు మురళి -పుట్టుకతో దళితుడే అయినా- దళిత శత్రువుల దగ్గిర ఏదో కతికే ఉంటాడని దళిత నేతలు అనుమానించడంలో ఆశ్చర్యమేముంది?
ఎన్ని నిజ నిర్ధారక కమిటీలు ఏం చెప్పినా, ఎన్ని పత్రికా కథనాలు ఏం బయటపెట్టినా, ఎందరు దళితనేతలు ఎంత విమర్శించినా చెక్కుచెదరని మన ముఖ్యమంత్రి బొత్స సత్యనారాయణను ఒడ్డెక్కించే యత్నం కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయన పట్టుదలకు జోహార్లు!
No comments:
Post a Comment