Thursday, August 2, 2012

త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య





జాతీయ పతాకం రెపరెపలాడే వరకు ఒక్క తెలుగు వారే కాకుండా.. జాతియావత్తూ స్మరించుకోదగిన మహాపురుషుల్లో పింగళి వెంకయ్య ఒకరు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని భట్లపెనుమర్రు (ప్రస్తుతం మొవ్వ మండలములో ఉంది) గ్రామంలో హనుమంతరాయుడు-వెంకటరత్నమ్మ దంపతులకు జన్మించారు. వెంకయ్య చిన్నప్పటి నుండే చాలా చురుకైన విద్యార్ధి. ఈయన ప్రాధమిక విద్య చల్లపల్లిలో మరియు మచిలీపట్నములోని హిందూ ఉన్నత పాఠశాలలో జరిగినది.

ఈయన ఉన్నత పాఠశాల పూర్తిచేసుకొని సీనియర్ కేంబ్రిడ్జ్ చేసేందుకు కొలంబో వెళ్లాడు. 19 ఏళ్ల ప్రాయంలోనే దక్షిణాఫ్రికాలో జరుగిన బోయర్ యుద్ధములో పాల్గొన్న దేశభక్తుడు. దక్షిణాఫ్రికాలోనే మహాత్మా గాంధీని కలిసిన తెలుగు యువనేత. వీరిమధ్య ఏర్పడిన సాన్నిహిత్యం అర్ధ శతాబ్దం పాటు సాగింది. 1913 నుంచి ప్రతి కాంగ్రెస్ సమావేశానికి హాజరై నాయకులందరితోనూ జాతీయ పతాక ప్రతిష్ఠాపన గురించి చర్చలు జరిపారు. 1916లో "భారతదేశానికొక జాతీయ జెండా" అనే పుస్తకాన్ని ఇంగ్లీషులో రాసి ప్రచురించారు. 
అనంతరం బందరు జాతీయ కళాశాలలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన పింగళి నాడు చిత్రించిన పతాకమే నేటి త్రివర్ణ జాతీయ జెండాగా రూపొందింది. 1916 సంవత్సరం




లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండానే తొలిసారి ఎగురవేశారు. 1919లో జలంధర్ వాస్తవ్యులైన లాలా హన్స్ రాజ్ మన జాతీయ పతాకంపై రాట్న చిహ్నముంటే బాగుంటుందని సూచించగా గాంధీజీ దాన్ని అంగీకరించాడు. 1921లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు బెజవాడలో జరిగాయి.

గాంధీజీ, వెంకయ్యను ఆ సమావేశానికి పిలిపించి కాషాయం- ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్య రాట్నం గల ఒక జెండాను తయారు చేయమని కోరారు. మహత్ముని సూచనపై కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్యలో రాట్నం చిహ్నం గల జాతీయ జెండాను రూపొందించారు. అనంతరం సత్యం-అహింసలకు ప్రత్యక్ష నిదర్శనమైన తెలుపు రంగును కాషాయం-ఆకుపచ్చ రంగుల మధ్య ఉండేలా రూపొందించాలని గాంధీజీ అభిప్రాయపడగా.. వెంకయ్య ఆ జెండాలో అదనంగా తెలుపు రంగును చేర్చి ప్రస్తుతం శతకోటి భారతీయలు సెల్యూట్ చేస్తున్న నేటి మువ్వన్నెల జెండాను దేశానికి అందించారు. మన జాతీయ పతాకం మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి రూపొందించడం.. ఆంధ్రులందరికీ గర్వకారణమైన విషయం.  



త్రివర్ణ పతాక ప్రత్యేకత ఇదే...
కాషాయ రంగు హిందువులకు చిహ్నమని, ఆకుపచ్చ ముస్లీంలకని పేర్కొన్నారు. అయితే.. భిన్నత్వంలో ఏకత్వమైన సువిశాల భారతావనిలో ఇతర మతాలకు సమాన ప్రాధాన్యత కల్పించాలన్న జాతిపిత అభిప్రాయంతో ఆకుపచ్చ, కాషాయ రంగులుతో పాటు తెలుపు కూడా చేర్చి త్రివర్ణ పతాకాన్ని వెంకయ్య రూపొందించారు. మధ్యనున్న రాట్నం చిహ్నం గ్రామ జీవనాన్ని, రైతు కార్మికత్వాన్ని స్ఫురింపజేస్తుంది. అంటే కార్మిక కర్షకులపై ఆధారపడిన మన దేశం, సత్యం-అహింసలపై ఆధారపడటంతో సుభిక్షంగా ఉంటుందని గాంధీజీ ఆశయం. ఆ ఆశయ చిహ్నమే మన త్రివర్ణ పతాకం.

అయితే.. 1947, జూలై 22 వ తేదీన భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ.. త్రివర్ణ పతాకంలో రాట్నం గుర్తుకు బదులుగా అశోకుని ధర్మచక్రం ఉండాలని సూచించారు. దీంతో రాట్నంకు బదులు ధర్మచక్రం ఏర్పాటు చేశారు. ఆ ఒక్క చిహ్నం మార్పు తప్పితే పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి మన జాతీయ జెండాకు తేడా ఏమీ లేదు. అశోకుని ధర్మచక్రం మన పూర్వ సంస్కృతికి సంకేతంగా పేర్కొంటారు. ( నేడు పింగళి వెంకయ్య వర్ధంతి )

No comments:

Post a Comment