పవిత్రతే పరమపద సోపానంగా
ముస్లిం సోదరులు భావించే మాసం రంజాన్. పసిపిల్లల నుంచి పెద్దవారి వరకు
అందరి హృదయాలలో పవిత్రతని..
అంతకు మించిన భావనని నింపే మాసం ఇదే..
మానవాళికి ముక్తి మార్గాన్ని చూపించేందుకు
దైవం పంపిన పరమ పవిత్రమైన ''ఖురాన్'' గ్రంథం అవతరించిన మాసమిది.
అందునా మన భారతావనిలో
పరమత సహనానికీ ప్రతీకగా నిలచేలా
ఈ పండుగ జరుపుకోవటం ఆనవాయితీ....
రంజాన్ లేదా రమదాన్ ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం మతస్తులు ఆచరించే ఒక ఉపవాస దీక్షా వ్రతం మరియు ఇస్లామీయ కేలండర్‌లోని ఒక నెల పేరు నెలల క్రమంలో తొమ్మిదవది.పండుగ, పర్వదినం అంటే శుభవేళ, ఉత్సవ సమయం అని అర్థం. పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తున్నాయి. పండుగ అనేది ఏ మతానికి సంబంధించినదైనా సరే.... దాని వెనుక ఒక సందేశం దాగి ఉంటుంది. పండుగ మానావాళికి హితాన్ని బోధిస్తుంది. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ సైతం ఇదే హితాన్ని మావవాళికి అందిస్తుంది. తెలుగు వారి మాదిరిగానే ముస్లింలు 'చాంధ్రమాన కేలండర్''ను అనుసరిస్తారు. చాంధ్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల రంజాన్. దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం. దివ్వ ఖురాన్ గ్రంథం ఈ మాసంలో ఆవిర్భవించడమే! క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే. రంజాన్ మాసం.
ఆత్మ ప్రక్షాళనకు త్రికరణ శుద్ధితో ఉండే ఉపవాస వ్రతాన్నే ''రోజా'. ఈ ఉపవాసాల వలన మానవాళి చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం లభిస్తుంది. ఆకలి కోసం అలమటించే అన్నార్తుల బాధలను స్వయంగా అనుభవించడమే ఈ ఉపవాసాల ఉద్దేశం. దీనివల్ల ఉపవాసం ఉన్న వారిలో సాటివారిపట్ల సానుభూతితోపాటు దైవ చింతన కూడా కలుగుతుందని భావన. ఈ నెల రోజుల పాటు రాత్రి వేళ ''తరావీహ్'' నమాజును నిర్వహిస్తారు. ప్రతి వంద రూపాయలకు రెండున్నర రూపాయల చొప్పున పేదలకు ''జకాత్'' పేరుతో దానం చేస్తారు. ''ఫిత్రా'' రూపంలో పేదలకు గోధుమ పిండిని దానం చేస్తారు. జకాత్, ఫిత్రాల పేరుతో అన్నార్తులకు వితరణ చేయడం పుణ్యాన్నిస్తుంది. మహమ్మద్ ప్రవక్త బోధించిన నియామాలను అనుసరించి ప్రతి రోజూ సూర్యదోయంలో జరిపే ''సహరి'' నుంచి, సూర్యాస్తమం వరకు జరిపే ''ఇఫ్తార్'' వరకు మంచి నీళ్లను సైతం త్యజించి కఠోర ఉపవాస దీక్ష చేపడతారు. అతిధులు, అభ్యాతుల సాంగత్యంలో సహరీలు ఇఫ్తార్లు జరుపుకుంటారు. ఉపవాస వ్రతాలను ఆచరించడం వల్ల మనుషుల్లో వారి వారి దైనందిన జీవితాల్లో తప్పకుండా మార్పులు సంభవిస్తాయి. గతం కంటే వారు ఎంతో పవిత్రంగా, శాంతికాముకులుగా పరివర్తన చెందుతారు. రంజాన్ స్త్రీ, పురుషులందరూ ఉపవాస వ్రతాన్ని తప్పనిసరిగా పాటించాలని ఆదేశించిన భగవంతుడు చిన్న పిల్లలకు, వృద్ధులకు, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో స్త్రీలకు, వ్యాధిగ్రస్తులకు కొన్ని మినహాయింపులు ప్రసాదించాడు. వీరందరికీ ఉపవాస వ్రతం నుంచి మినహాయింపు ఉంది. కేవలం ఆహారం తీసుకోకపోవడమే ఉపవాస లక్షణం కాదు. ఆహారంతోపాటు వారు చెడు ప్రవర్తనకూ, చెడు చేష్టలకు కూడా దూరంగా ఉండాలి. ఈ లక్ష్యాన్ని ప్రతి సోదరుడూ గుర్తెరిగి దీక్ష వహిస్తాడు. కాబట్టి వారిలో దైవ భీతితో కూడిన నిస్వార్ధపర్వతం పెంపొంది ఆత్మ శుద్ధి చేసుకుని భగవంతుని దీవెనలు పొందుతారు.
నిష్ట నియమాలు
రంజాన్ మాసం ప్రారంభమైన నాటి నుంచి ముగిసేవరకూ ముస్లింలు పగలు నిష్టగా 'రోజా' ఉపవాస దీక్షలను పాటిస్తారు. కేవలం ఆహార పానీయాలను మానివేయడం మాత్రమే రోజా కాదు. నిష్టనియమాలతో కూడుకున్న జీవన విధానం అది. తెల్లవారుజామున భోజనం చేసిన తర్వాత ఉపవాసం ఉండే భక్తులు సాయంత్రం సూరా ్యస్తమయం తర్వాత దీక్షను విరమిస్తారు. తెల్లవారుజామున ఆహారం తీసుకోవడాన్ని'సవార్'అని సాయంత్రం ఉపవాస వ్రత దీక్ష విరమణలో తీసుకునే ఆహారాన్ని 'ఇఫ్తార్' అని అంటారు. అంటే రంజాన్ నెలలో ప్రతిరోజు సూర్యోదయం పూర్వం నుంచి సూర్యాస్తమయం వరకు సుమారు 13 గంటల పాటు కఠిన ఉపవాస దీక్షలు పాటిస్తారు. ఉపవాస దీక్ష పాటించేవారు అబద్దం ఆడకుండా, పరనిందకు పాల్పడకుండా గడపడంతో పాటు, శారీ రక, మానసిక వాంఛలకు దూరంగా, నిగ్రహంతో వుంటూ ఆసాంతం దైవచింతనతో గడుపుతూ వుంటారు. ఈ ఉపవాస దీక్ష లక్ష్యం మనిషిలో దైవభీతి. దేవుడిపట్ల నమ్మకం మొదలైన మహత్తరమైన సుగుణాలున పెంపొందిం పజేయడమే! దీనిని ఖురాన్ 'తఖ్వా' అని అంటుంది.
ఉపవాస నిధి
రంజాన్ మాసంలో ఉపవాసదీక్షలను పూర్తి నెల రోజుల పాటు పాటించడం అనేది వయోజనులైన స్త్రీ పురుషులం దరికీ విధిగా నిర్ణయించబడింది. అయితే వృద్ధులు, పిల్లలు, వ్యాధిగ్రస్తులు, ప్రయాణంలో ఉన్నవారు ఈ విధి నుంచి మినహాయింపబడ్డారు. దివ్వఖురాన్ ఉపవాస విధిని గురించి, రంజాన్ నెలలో విధిగా నెలంతా ఉపవాసం పాటించాలి. అయితే ఎవరైనా ప్రయాణంలో వుంటెె వ్యాధిగ్రస్తులయితే వారు ఆ ఉపవాసాలను వేరే రోజులలో పూర్తి చేయాలి. దేవుడు మీకు సౌలభ్యం కలుగజేయాలని భావిస్తూ ఉన్నాడు కానీ, మిమ్మలను ఇబ్బందులలో పడవేయాలని అనుకోవడం లేదు అని పేర్కొంది. రంజాన్ అనగా ఉపవాస దీక్షలు మాత్రమే కాదు మనిషిలోని చెడు భావనల్ని, ఆధర్మాన్ని ద్వేషాన్ని రూపుమాపేది. ఈ మాసంలో పేదవాడికి ఒక పూట నీవు ఆహారం పెడితే నీకు ఆ అల్లా వేయి పూటలు ప్రసాదిస్తాడు.
గల్ఫ్‌లో రంజాన్
భారతదేశంలో ముస్లింలు రాత్రి నిద్రపోయి తెల్లవారి నాలుగు గంటలకు లేచి సహర్ చేస్తారు. గల్ఫ్ దేశాల్లో రాత్రంతా తింటూ తెల్లవారు జామున సమాజ్ చదివి పడుకుంటారు. రంజాన్ నెల మొత్తం రెస్టారెంట్లు రోజంతా మూసివేస్తారు. బహిరంగంగా తినకూడదని, తాగకూడదని హెచ్చరికలుంటాయి. దుబాయిలోని ఏకైక హిందూ దేవాలయమైన కృష్ణ మందిరంలో భక్తులకు ప్రసాదాన్ని రంజాన్ నెలలో ఇఫ్తార్ వేళల తర్వాతే ఇస్తారు. అరబ్బులు గల్ఫ్‌లోని అన్ని మసీదులలో రంజాన్ సందర్భంగా పౌష్టికాహారాన్ని నెల రోజుల పాటు ఉచితంగా సరఫరా చేస్తారు. బహిరంగంగా తింటూ కనిపిస్తే శిక్ష తప్పదు.మసీదుల ముందు బిక్షాటన చేసే వారికి కాకుండా ప్రభుత్వం ఆమోదం పొందిన చారిటీలకు మాత్రమే జకాత్ సొమ్మును ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ బిచ్చగాళ్ల బెెడద విపరీతంగా ఉంటుంది. భారత్, బంగ్లాదేశ్, ఇరాన్, యెమన్ దేశాలలో ఇది మరీనూ... అందుకే మక్కా, మదీనా పుణ్యక్షేత్రాలలో ప్రత్యేక వాహనాలలో బిచ్చగాళ్ల నిర్మూలన దళాలు 24 గంటలూ పనిచేస్తాయి. స్వదేశానికి వెళ్లడానికి విమానం టిక్కెట్లకు డబ్బు లేకుండా జైళ్లలో మగ్గుతున్న భారతీయులకు మతంతో నిమిత్తం లేకుండా తమ జాకత్ సొమ్ముతో విమాన టిక్కెట్లను అనేకమంది అరబ్బులు అందించడం విశేషం.
ఏతేకాఫ్
ఈ విధంగా అత్యంత నిష్టనియమాలతో ఉపవాస దీక్షలతో గడిపే ముస్లింలు రాత్రింబవళ్లు నమాజులో లీనమై ఉంటారు. సాధారణంగా ముస్లింలు ప్రతిరోజు ఐదుసార్లు నమాజు చేయడం అందరికీ తెలిసిందే! వీటికి తోడు రంజాన్ నెలలో ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు. ఈ నెలలో సాయం సంధ్యవేళలో (ఇఫా) ఫర్జ్ నమాజ్ తర్వాత అదనంగా ఇరవై రకాల తరావీహ్ నమాజ్ చేస్తారు. ఇది నెలంతా నిర్వహిస్తారు. రంజాన్ నెల 21వ రోజు నుంచి చివరి వరకూ ఒక ప్రత్యేకత వుంది. 'ఏతెకాఫ్', ఏతెకాఫ్ అంటే ఒకరకమైన తపోనిష్ట. దీనిని పాటించదలచినవారు మసీదులోనే ఒక ప్రక్క డేరాలా ఒక తెరను కట్టుకుని అక్కడ దైవధ్యానం, ప్రార్థనలు, ఖురాన్ పారాయణం చేయ డంలో నిమగ్నమై ఉంటారు. ఈ సమయంలో ఏతెకాఫ్ ఉన్న వారు బలమైన కారణం ఉంటే తప్ప మస్జిద్ వదిలి బయటకు పోకూడదు.
షబ్ ఎ ఖద్ర్
రంజాన్ నెలలోని 27వ తేదీన షబ్ ఎ ఖద్ర్ జరుపుకుంటారు. దివ్యఖురాన్ ఈ రోజుకే అవతరించిందని భావించే ముస్లిం సోదరులు ఆ రోజు రాత్రి జాగరణ చేసి ప్రార్ధనలు చేస్తూ గడుపుతారు. ఆ రాత్రి భక్తితో కఠోర దీక్షతో ప్రార్థనలు చేసేవారికి 83 సంవత్సరాల పాటు ప్రార్థనలు చేసిన ఫలితం దక్కుతుందనే నమ్మకం వుంది. ఆ రాత్రి చేసే ప్రార్థనల వల్ల సర్వపాపాలు తొలగిపోతాయని భావిస్తాం.
జకాత్
రంజాన్ నెలలో మరొక విశేషం అత్యధిక దానధర్మాలు చేయడం. సంపాదనాపరులైనవారు. సంపన్నులైనవారు రంజాన్ నెలలో జాకత్ ఆచరించాలని ఖురాన్ భోధిస్తోంది. ఆస్తిలో నుంచి నిర్ణీత మొత్తంను పేదలకు దానం చేయడాన్ని జకాత్ అంటారు. దీనిని పేద ఆర్థిక హక్కుగా పేర్కొంటారు. దీని ప్రకారం ప్రతి ధనికుడు సంవత్సరాం తంలో మిగిలిన తన సపంద నుంచి రెండున్న శాతం చొప్పున ధర, వస్తు, కనకాలను ఏవైనా నిరుపేదలకు దానంగా ఇస్తారు. పేదవారు కూడా అందరితో పాటు పండుగను జరుపుకొనడానికి, సంతోషంలో పాలుపంచుకునేందుకు ఈ జకాత్ ఉపయోగపడుతుంది.
ఫిత్రా
జకాత్ తో పాటు ఫిత్రా దానానికి రంజాన్ నెలలో ఎంతో ప్రాముఖ్యత వుంది. మూడుపూటల తిండికి, ఒంటినిండా బట్టకు నోచుకోని పేదవారు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి అభాగ్యులకు, పేదవారికి పండుగ సందర్భంలో దానం చేయాలని ఇస్లాం మతం ఉద్భోధిస్తుంది. దీనినే 'ఫిత్రాదానం' అని పిలుస్తారు. ఉపవాసవ్రతాలు విజయవంతంగా ముగిసినందుకు దేవుడి పట్ల కృతజ్ఞతగా... పేదలకు ఈ ఫిత్రాదానం విధిగా అందజేస్తారు. ఈ ఫిత్రాదానంలో 50 గ్రాముల తక్కువ రెండు కిలోల గోధుమలను గానీ, దానికి సమానమైన ఇతర ఆహార ధాన్యా లను గానీ, ధనాన్ని గాని పంచిపెట్టాలి. ఈ దానం కుటుంబంలోని సభ్యులందరి తరపున పేదలకు అందజేయాలి. దీనివలన సర్వపాపాలు హరించబడి, పుణ్యం దక్కుతుందనే నమ్మకం ఉంది.దైవ ప్రవక్త ఫిత్రాధానాన్ని విధిగా నిర్ణయించడానికి కారణం ఉపవాస వ్రత నియమాన్ని పాటించే సమయంలో హృదయంలో కలిగే చెడు తలంపు లు, ఆలోచనలు, నోటినుంచి వెలువడే అసత్యాలు, పనికిమాలిన మాటలు ఫిత్రాదానం వల్ల క్షమించ బడతాయి. అని మహామ్మద్ అనుచరుడు అబ్దుల్లా బిన్ మసూద్ తెలిపాడు.
షవ్వాల్
ఈ విధంగా రంజాన్ నెల అంతా పవిత్ర కార్యక్రమాలతో ముగుస్తూనే... 'షవ్వాల్' నెలవంక ప్రత్యక్షమవుతుంది. ఈ నెలవంక దర్శనమిస్తూనే ముస్లిం సోదరులు ఉపవాసవ్రతాన్ని విరమించి... మరుసటి రోజు రంజాన్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో, సంతోషానందాలతో జరుపుకుంటారు. షవ్వాల్ నెలవంక మొదటి రోజున జరుపుకునే రంజాన్ పండుగను ఈదుల్‌ఫితర్ అని అంటారు.
ఈద్‌ముబారక్
ఈ పండుగను పేద, ధనిక తేడా లేకుండా అత్యంత భక్తి ప్రవత్తులతో జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించి పండుగ నమాజును ఊరిబయట నిర్ణీత ప్రదేశాలైన ఈద్‌గాహ్‌లలో చేస్తారు. అనంతరం ఒకరికొకరు ఈద్‌ముబార్(శుభాకాంక్షలు) తెలుపుకుంటారు. ఈ నమాజ్ కోసము వెళ్లడానికి ఒకదారి, రావడానికి ఇంకొక దారిలో రావలెెను.
ఇఫ్తార్ విందు
ఈ నెలలో జరిగే విందులో ఆత్మీయత సహృద్భావాలు ప్రసుష్ఠమవుతాయి. పరస్పర ధోరణికి, విశాల ఆలోచనా దృక్పథానికి ఇవి నిదర్శనం.ఈ విధంగా పవిత్ర ఆరాధనలకు ధార్మిక చింతనకూ, దైవభీతికి, క్రమశిక్షణకూ, దాతృత్వానికి రంజాన్ నెల ఆలవాలం అవుతుంది. మనిషి సత్ఫ్రవర్తన దిశలో సాగడానికి మహమ్మద్ ప్రవక్త బోధించిన మార్గాన్ని రంజాన్ సుగమం చేస్తుంది.
రంజాన్ పండుగ విశిష్టత
వివేకపు ద్వారాలు తెరచి సౌహార్ధ సమభావాల్ని పంచాలనే దైవ ఆదేశాన్ని పాటించడానికి అమలిన హృదయాలతో ఒకరికొకరు సహయపడాలి. ఇందుకు సామూహిక శక్తి అవసరం. ఈ శక్తిని కలిగించేది నమాజ్ దుష్టచింతనల్ని. దురాగతాల్ని, కుహనా సంస్కారాన్ని నమాజ్ ఎదుర్కొగలదు. సత్ప్రవర్తనను నేర్పించగలదు. సత్ప్రవర్తనగల వ్యక్తి సర్వేశ్వరుని దృష్టిలో అందరికన్నా మిన్న (ఖురాన్ 49:13) ఈద్‌ను శ్రామికుని వేతనం లభించే రోజు అని ఖురాన్ విస్పష్టం చేసింది. నెల రోజులు కఠోరవ్రతం పాటించినవారి శ్రమకు పరిపూర్ణ ప్రతిఫలం ఈ రోజే లభిస్తుందని విశ్వాసం. పర్వదినాన ఉదయం స్నానపానాదులు ముగించుకుని వస్త్రాలు ధరించి సుగంధం పన్నీరు పూసుకుని తక్బీర్ పఠిస్తూ ఈద్‌గాహ్ చేరుకుంటారు. అక్కడ ప్రార్థన చేస్తారు. ఇహ్‌దినస్సిరాత్ ముస్తఖీమ్ (మాకు సన్మార్గాన్ని చూపు). సమస్త మానవాళి హృదయాల్ని సద్బుద్ధితో నింపాలని కోరుతారు. ఈద్‌గాహ్‌లో నమాజ్ పూర్తి అయిన అనంతరం అక్కడ సమావేశమైన వారిలో వీలైనంత ఎక్కువ మందిని కలిసి సుహృద్భావంతో చేతులు కలుపుతారు. హృదయాలు సన్నిహితమవుతాయి. సద్గుణాల పరిమళం పరిఢవిల్లుతుంది. ఈద్ ముబారక్ తెలియజేసుకుంటారు. అనంతరం ముస్లిమేతర సోదరుల్ని ఇంటికి ఆహ్వానిస్తారు. అమితానందంతో పరస్పరం ఆలింగనం చేసుకుంటారు. విందు ఆరగిస్తారు. ఈద్‌విలాప్ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ మతసామరస్యానికి, పరస్పర సదవగాహనకు, సమైక్యతకు ప్రతీకలు. మతసహనం మానవలోకానికి మణికిరీటంగా భావిస్తే, మనిషి మనిషిగా జీవిస్తే భగవంతునికి ఎనలేని హర్షం. ప్రతి వ్యక్తి నిస్వార్ధ సేవ చేస్తే జీవితంలోని వాస్తవిక ఆనందం బోధపడుతుంది. ఇతరుల శ్రేయం కోసం జీవిస్తే అది విరాటజీవనంలో పదార్పణమవుతుంది. అప్పుడే సర్వేశ్వురుడు మన జీవితాలకు సాఫల్యం సమకూరుస్తాడు. తన హృదయ వైశాల్యాన్ని ప్రతి వ్యక్తీ లోకానికి చాటినప్పుడే జన్మకు సార్ధకత, సంపూర్ణత. అది డబ్బు గడించడం వల్ల రాదు. కోరికలు నెరవేర్చుకోవడం వల్ల ఒనగూడదు. ఇది అనంత జీవిత సత్యం. పర్వదినాల సారాంశం.
పవిత్ర భావనల రోజా
ఉపవాసదీక్ష అంటే కేవలం అన్నపానీయాలకే కాకుండా చాలా విషయాలకు వర్తిస్తుంది. అల్లా నిషేధించిన చెడుమాటలను నోటితో పలకకూడదు. చెడుమాటలు చెవులతో వినరాదు. చెడును కళ్ళతో చూడొద్దు. ఏ పనులైతే అల్లాకు నచ్చవో చేతులద్వారా వాటిని చేయకూడదు. వెళ్ళరాని చోట్లకు వెళ్ళకూడదన్న నియమాలు కూడా ఉన్నాయి. రోజా పాటిస్తున్న సమయంలో పవిత్ర భావాలతో ఉండటమే కాకుండా, ఎక్కువ సమయం దైవప్రార్థనలో గడపాలి. ఇస్లాంమత చివరి ప్రవక్త మహమ్మద్ సల్లెల్లాహు అలైహివసల్లం నమాజ్, రోజాలను స్థాపించారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ముస్లిం నడవాలి.
- మహమ్మద్ ఇస్మాయిల్ హుస్సేన్, పిసిసి మైనారిటీవిభాగం రాష్ట్ర కన్వీనర్,
వరల్డ్ హ ూ్యమన్ రెట్స్ ప్రొటెక్షన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు.
No comments:
Post a Comment