Monday, July 2, 2012

గృహిణులు.. కొన్ని జాగ్రత్తలు

వంటిల్లే ఒక ప్రత్యేక ప్రపంచం. నిరంతరం వంటింటిలో సంచరించే ఇల్లాలు ఎన్నో మెళకువలు, జాగ్రత్తలు తీసుకుంటేనే గానీ వంట పని పూర్తికాదు.
గ్యాస్‌స్టౌవ్‌తో ప్రతిరోజూ అవసరమే. జాగ్రత్తగా ఉపయోగించాలి. గ్యాస్ సిమ్‌లో సరిగా వెలుగుతుందో లేదో చెక్ చేసుకుని వంట మొదలుపెట్టండి. రిపేరులో ఉన్న స్టౌవ్‌ని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బాగు చేయించుకోవటమో లేదా కొత్త స్టవ్ కొనుక్కోవడమో చెయ్యాలి. వంటిల్లు వెలుతురుగా ఉండేలా చూసుకోవాలి. అలాగే, ప్రెషర్ కుక్కర్‌ను శుభ్రపరచడానికి గట్టి పదార్థాలను వాడరాదు. వాటిమీద చారలు పడతాయి. అందుకని మెత్తని వాషింగ్ క్రీమ్‌లనే వాడాలి. ప్రెషర్ కుక్కర్‌ను క్లీన్‌చేసేముందు దానిని వేడి చెయ్యండి. పైభాగాన్ని అమ్మోనియా, కింద భాగంలో మరుగుతున్న నీరు ఉంచండి. ఇలా కొద్దిసేపు తర్వాత చల్లార్చి చన్నీళ్ళతో కడిగేయాలి. ఇందువల్ల కుక్కర్ పూర్తిగా శుభ్రపడటమే కాకుండా తళతళలాడిపోతుంది. వేడినీళ్ళతో వాషింగ్ సోడా ఉపయోగించి, స్టెయిన్‌లెస్ స్టీలు పాత్రలు శుభ్రపరచవచ్చు. సిల్వర్ పాత్రలు కూడా ఇలాగే శుభ్రపరచుకోవచ్చు. కొయ్య పాత్రలను శుభ్రపరచడానికి ఆలివ్ నూనెలో ముంచిన మెత్తని ఊలు గుడ్డతో రుద్దితే మరకలు పోతాయి. గాజు పాత్రలను శుభ్రపరచడానికి టూత్‌పేస్టుని వాడవచ్చు. అది మెత్తగా, సున్నితంగా ఉంటుంది. దానిలో ఉన్న రసాయనిక పదార్థాలు గాజును శుభ్రపరుస్తాయి. తర్వాత నీళ్ళతో కడిగేస్తే గాజు పాత్రలు మెరిసిపోతాయి. కొయ్యగాని, దంతంగాని, చైనా హేండిల్సున్న పాత్రలను నీళ్ళల్లో తడపకూడదు. అల్యూమినియం పాత్రలను శుభ్రపరచటానికి వెనిగర్ చుక్కలు వేసిన నీటిలో నానబెట్టి, ఆ తర్వాత శుభ్రమైన నీళ్ళతో కడిగేయాలి. చేతులను వంట చేసేటప్పుడు మధ్య మధ్యలో కడిగేసుకుంటుంటే ఏ వంటకానికి ఆ వంటకం ప్రత్యేకంగా చేసే వీలుంటుంది. అన్నీ ఒక్కసారి చేసేయడం వలన పదార్థాల రుచులు మారతాయి.
-హిమజా రమణ ( Andhrabhoomi Daily )

No comments:

Post a Comment