Wednesday, June 13, 2012

జగన్ పార్టీ కేంద్రంగా ఊపందుకున్న పందేలు

ఒకప్పుడు క్రికెట్ ఆటకే పరిమితమైన బెట్టింగ్‌లు కొంతకాలంగా రాజకీయాలకు సైతం పాకాయి. గతంలో వన్‌డే క్రికెట్ మ్యాచ్‌లు, వరల్డ్‌కప్ మ్యాచ్‌లు, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్‌లు జోరుగా కాసేవారు. ఇప్పుడు ఆ బెట్టింగ్‌లు రాష్ట్రంలో, దేశంలో జరిగే ఎన్నికల, ఉప ఎన్నికలపై సైతం కాస్తున్నారు. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో సైతం జగన్ పార్టీ గెలుపుపై కోట్ల రూపాయల బెట్టింగ్‌లు జరిగినట్లు సమాచారం. రాష్ట్రంలో 18 అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి మంగళవారం ఎన్నికలు జరిగాయి. ఈ స్థానాలను గెల్చుకునేది ఎవరన్న దానిపై జోరుగా బెట్టింగ్‌లు నడుస్తున్నట్లు సమాచారం. ఇందులో టోకుగానూ, రిటైల్‌గానూ బెట్టింగ్‌లు ఉండటం విశేషం. మొత్తంగా జగన్‌కు ఎన్ని వస్తాయన్నది ఒక బెట్టింగ్ అయితే.. ఎక్కడెక్కడ ఎవవరు గెలుస్తారు? ఎంత మెజార్టీ వస్తుంది? అనే కేటగిరీల్లో సైతం బెట్టింగ్ రాయుళ్లు నోట్లు బయటికి తీస్తున్నారు. ఈ బెట్టింగ్‌ల ద్వారా కోట్లు చేతులు మారే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత ఉప ఎన్నికల ఫలితాలు ఈ నెల 15న వెల్లడికానున్నాయి. అప్పటిదాకా ఈ జోరు మరింత పెరుగుతుందే తప్పించి.. తగ్గే అవకాశాల్లేవని పలువురు పందెంరాయుళ్లు చెబుతున్నారు. రెండు నెలల క్రితం జరిగిన ఉప ఎన్నికల సమయంలో కూడా బెట్టింగ్ జోరుగా జరిగింది. ముఖ్యంగా కోస్తాంవూధాలోని కోవూరు అసెంబ్లీ స్థానం నుంచి జగన్ పార్టీ తరఫున బరిలో దిగిన నల్లపుడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై కొందరు జోరుగా పందేలు కాసినట్లు వార్తలు వచ్చాయి. జగన్ పార్టీకి ఇక్కడ భారీ మెజారిటీ దక్కుతుందని, ప్రసన్నకుమార్‌డ్డి 40 వేలకు పైగా మెజారిటీతో గెలుస్తాడంటూ పందేలు నడిచాయి. అయితే ఆ ఎన్నికల్లో వారు ఆశించిన మేరకు ఆయనకు మెజారిటీ రాలేదు. ప్రస్తుతం కేసుల్లో ఇరుక్కుని జైల్లో ఉన్న జగన్ కేంద్రంగా వైఎస్‌ఆర్సీ అభ్యర్థులపైనే బెట్టింగ్‌లు ఎక్కువగా నడుస్తున్నాయి. అయితే ఈ సారి జగన్ పార్టీ అత్యధిక స్థానాలు గెల్చుకుంటారా? ఆ పార్టీ అభ్యర్ధులు భారీ మెజారిటీతో విజయం సాధిస్తారా?, లేక కోవూరు ఫలితం పునరావృత్తమై పందాలు కాసిన వారి జేబులకు చిల్లు పడుతుందా? అనేది మరో మూడు రోజుల్లో తేలనున్నది.

No comments:

Post a Comment