Monday, June 18, 2012

మహిళా సంక్షేమంలో కెనడా భేష్



విద్య, ఉపాధి రంగాల్లో పురుషులతో పాటు మహిళలు కూడా ఎంతో ముందుకు దూసుకుపోతున్నారని మన పాలకులు ఎంతగా గొప్పలు చెబుతున్నా- వాస్తవ దృశ్యం ఇందుకు భిన్నంగా ఉంది. బాల్య వివాహాలు, బానిసత్వం, భ్రూణహత్యల వంటి ప్రతికూల అంశాలతో మన దేశం అగ్రభాగాన నిలిచింది. ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన జి-20 దేశాలతో పోల్చిచూస్తే మహిళా సంక్షేమానికి సంబంధించి కెనడా ముందంజలో ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆరోగ్య సంరక్షణ, ఉపాధి, సమానత్వం, భద్రత వంటి విషయాల్లో తగిన విధాన నిర్ణయాలతో మహిళలకు అండగా నిలవడంలో కెనడా ప్రశంసనీయమైన పాత్రను పోషిస్తోంది. మహిళల హక్కులను పరిరక్షించడంలో, వారికి తగిన స్వేచ్ఛ ఇవ్వడంలో ఈ దేశం మెరుగైన విధానాలను అమలు చేస్తోంది. ఆరోగ్యం, విద్య, ఆర్థిక స్వాతంత్రం వంటి విషయాల్లో మహిళలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని ఇటీవల మెక్సికోలో జరిగిన ఓ సదస్సులో కెనడా ప్రతినిధి ఫరా మొహముద్ చెప్పారు. పౌరహక్కులు, గృహహింస చట్టాలు, విద్యకు అవకాశాలు, ఉపాధి కల్పన, భావ ప్రకటన స్వేచ్ఛ వంటి విషయాల్లో అమెరికా వంటి సంపన్న దేశాలు వెనుకబడే ఉన్నాయ. ఇవే విషయాల్లో భారత్‌తో పాటు చాలా దేశాలు ఎంతో సాధించాల్సి ఉందని సర్వేలో గుర్తించారు.
మహిళా సంక్షేమానికి సంబంధించి కెనడా తర్వాతి స్థానంలో జర్మనీ, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, అమెరికా, జపాన్ ఉండగా 20వ స్థానంలో ఇండియా నిలిచిందని అధ్యయనం నిర్వహించిన ‘ట్రస్ట్ లా’ సంస్థ ప్రకటించింది. సౌదీ అరేబియాలో మహిళలు విద్యారంగంలో రాణిస్తున్నప్పటికీ వారికి వాహనాలను నడిపేందుకు అనుమతించక పోవడం గమనార్హం. ఈ దేశంలోని మహిళలకు ఈ మధ్యనే ఓటు హక్కు మాత్రం కల్పించారు. ‘సౌదీ అరేబియా సంపన్న దేశం, భారత్ పేదరికంతో సతమతమవుతున్న దేశం.. అయినప్పటికీ ఈ రెండు చోట్లా మహిళలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నార’ని సర్వే నిపుణులు అభిప్రాయపడ్డారు. మహిళల హక్కుల కోసం చాలా దేశాల్లో చట్టాలు చేస్తున్నా ఆశించిన మేరకు ఫలితాలు దక్కడం లేదన్నందుకు భారత్ ఓ ఉదాహరణగా నిలుస్తోంది. బాల్యవివాహాలు, వరకట్నం, భ్రూణహత్యలు, లింగ నిర్ధారణ పరీక్షలు, గృహహింసను అరికట్టేందుకు భారత్‌లో ఎన్నో చట్టాలు చేస్తున్నారు. పాత చట్టాలను సవరణల పేరిట ఆధునీకరిస్తున్నారు. అయినప్పటికీ, మన దేశంలో ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతునే ఉన్నాయి. కట్నం వేధింపులు, మహిళలపై హింస యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే జి-20 దేశాల అధిపతుల సమావేశం నేపథ్యంలో వివిధ అంశాలపై అధ్యయనం చేయగా, పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. ‘్భరత్‌లో మహిళలు, బాలికలు హింస, బానిసత్వం, వివక్ష కారణంగా సతమతమవుతున్నార’ని బ్రిటన్‌లోని ‘సేవ్ ది చిల్డ్రన్’ సలహాదారు గుల్షన్ రెహమాన్ అంటున్నారు. లింగ వివక్ష వల్ల మహిళలకు భారత్‌లో భద్రత,్భవిత లేకుండా పోతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆరోగ్య సంరక్షణ, హింస నుంచి విముక్తి, రాజకీయ ప్రాతినిధ్యం, ఉపాధి అవకాశాలు, విద్య, ఆస్తిహక్కు, స్వేచ్ఛ, సామాజిక భద్రత వంటి కీలక విషయాలకు సంబంధించి ఆరు కేటగిరీలుగా విభజించి జి-20 దేశాల్లో పరిస్థితులను నిపుణులు విశే్లషించారు. 63 దేశాలకు చెందిన ప్రతినిధులు, పలు అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు అధ్యయనంలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. మహిళలకు సంబంధించి కెనడాలో సానుకూల పరిస్థితులు ఉన్నాయని మెజారిటీ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, ఆర్థిక స్వాతంత్య్రం, భద్రత వంటి విషయాల్లో మహిళలకు ఎంతో చేయాల్సి ఉందని వారు సూచించారు. కొన్ని దేశాల్లో ప్రమాదకరమైన గర్భస్రావాల కారణంగా మహిళల ఆరోగ్యం ప్రమాదాల బారిన పడుతోందని ఆందోళన చెందారు. లింగ వివక్ష, హింస నివారణకు కెనడా అనుసరిస్తున్న వినూత్న విధానాలు ఇతర దేశాలు ఆదర్శప్రాయమని నిపుణులు సూచిస్తున్నారు.

Source: Andhrabhoomi

No comments:

Post a Comment