Wednesday, December 5, 2012

నార్వే కోర్టు తీర్పు ఓ హెచ్చరిక


కన్నబిడ్డను మందలించిన కేసులో తెలుగు దంపతులకు నార్వేలోని ఓస్లో జిల్లా కోర్టు విధించిన శిక్ష మనకు ఓ హెచ్చరిక. ముందు వెనుక ఆలోచించకుండా విదేశాలకు వెళ్లేవారికి కనువిప్పు కలిగించే తీర్పు ఇది. కన్నబిడ్డను మందలించిన కేసులో ప్రవాసాంధ్ర దంపతులు వల్లభనేని చంద్రశేఖర్, అనుపమలను దోషులుగా నిర్ధారించిన ఓస్లో జిల్లా కోర్టు మంగళవారం వారికి శిక్షను ఖరారు చేసింది. తండ్రి చంద్రశేఖర్‌కు 18 నెలలు, తల్లి అనుపమకు 15 నెలల జైలుశిక్ష విధించింది. ఈ తీర్పుపై ఎగువ కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు వారికి రెండురోజుల సమయం ఇచ్చింది. ఈ తీర్పు ఇక్కడ మనల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కాని అక్కడ చట్టప్రకారం కోర్టు ఆ శిక్ష విధించింది. ఇటువంటి విషయాలలో మనకు అన్యాయం అనిపించింది వారికి న్యాయం అనిపిస్తుంది. 

సంస్కృతీ సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లతోపాటు చట్టాలు ఒక్కో దేశంలో ఒక్కోరకంగా ఉంటాయి. ఇతరుల సంస్కృతీ సంప్రదాయాలను, భాషలను మనం ఎలా గౌరవిస్తామో అదేవిధంగా చట్టాలను గౌరవించాలి. అది తప్పనిసరి. అక్కడి అలవాట్లు, కట్టుబాట్లను అనుసరించి మనం నడుచుకోవాలి. ఇక్కడ నేర ప్రవృత్తి ఎక్కువ. అవినీతి అంతకంటే ఎక్కువ. మన దేశంలో మాదిరి అక్కడ వ్యవహరిస్తే కుదరదు. ఏ దేశంలోనైనా అక్కడి ఆచారాలు, అలవాట్లు, కట్టుబాట్లు, అవసరాలు, పరిస్థితులు, సంప్రదాయాలు, మానవసంబంధాలు, జనాభా ఎక్కువ, తక్కువ..... ఇలా అనేక అంశాలపై ఆధారపడి చట్టాలను రూపొందిస్తారు. అలాగే వాటిని ఎంతో గౌరవిస్తారు. తప్పనిసరిగా చట్టప్రకారం నడుచుకుంటారు. మనకు ఆ అలవాటు లేదు. అందు వల్ల విదేశాలకు వెళ్లినప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మన దేశంలోనూ చట్టాలు ఉన్నాయి. శిక్షలూ విధిస్తారు. అయితే ఇక్కడ వాటిని అమలు చేసే తీరువేరు. నియమ నిబంధనలను, చట్టాలను అతిక్రమించడం ఇక్కడ సర్వసాధారణం. ఇక్కడ అవినీతి ఎక్కువ. దాంతో ఏ పనైనా చిటికలో అయిపోతుంది. ఇక్కడ చట్టాలను అంతగా గౌరవించరు. కొన్ని దేశాలలో చట్టం పట్ల పౌరులకు ఎంతో గౌరవం ఉంటుంది. చట్టాలను అతిక్రమించడం అంటే వారు పెద్ద నేరంగా భావిస్తారు. చట్టం చేసుకున్నది దేనికి? తప్పనిసరిగా అనుసరించడానికి అనేది వారి సమాధానం. 

ఉన్నత చదువుల కోసం, ఉద్యోగం, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లేవారు అక్కడి చట్టాలను తప్పనిసరిగా తెలుసుకోవలసిన అవసరాన్ని ఈ తీర్పు గుర్తు చేస్తోంది. అలాగే విదేశాలకు వెళ్లేవారికి ఆయా దేశాల సంప్రదాయాలు, చట్టాలపై అవగాహన కలిగించవలసిన అవసరాన్ని విదేశాంగ శాఖ గుర్తించాలి. చట్టాలను వారు ఎంత గౌరవిస్తారో కూడా తెలియజెప్పవలసి అవసరం ఉంది. అలాగే విదేశాలలోని ప్రవాసభారతీయుల హక్కులను కాపాడటంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వారికి న్యాయసహాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు అంతర్జాతీయ కంపెనీలు (ఎంఎన్ సి) తమ ఉద్యోగులను ఉద్యోగ రీత్యా కొద్ది కాలం విదేశాలకు పంపడం ఎక్కువయింది. చంద్రశేఖర్‌,అనుపమలు కూడా అలా వెళ్లినవారే. ఈ విధంగా తమ ఉద్యోగులను విదేశాలకు పంపించే సమయంలో ఆయా కంపెనీలు వారికి ఆయా దేశాల సంస్కృతీ సంప్రదాయాలతోపాటు అక్కడి చట్టాలపై అవగాహన కలిగించవలసిన అవసరం ఉంది. చట్టాలు ఒక్కో దేశంలో ఒక్కోరకంగా ఉంటాయి. గల్ఫ్ దేశాలలో శిక్షలు కఠినంగా ఉంటాయి. మహిళల పట్ల ఏమాత్రం అమర్యాదగా ప్రవర్తించినా కఠినంగా శిక్షిస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన ప్రవాస భారతీయులు అనేక మందికి అక్కడి చట్టాల గురించి తెలియదు. దాంతో మనం చిన్నచిన్నవి అనుకునే తప్పులు చేసి కఠిన శిక్షలు అనుభవించారు. ఇంకా అనుభవిస్తున్నారు. అక్కడ సంప్రదాయాలు, చట్టాలు తెలియక అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఇతర దేశాలలోని చట్టాలకు, మన దేశంలోని చట్టాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. మన చట్టాల ప్రకారం చిన్నచిన్న తప్పులు అనుకునే విషయాలు, అక్కడ వారు పెద్ద నేరాలుగా పరిగణిస్తారు. ఇప్పుడు నార్వేలో జరిగింది అదే. చిన్న పిల్లలను మందలించడం, అదుపులో పెట్టడం ఇక్కడ నేరంకాదు. కానీ అక్కడ నేరం. అందువల్ల మనం ఏ దేశం వెళ్లాలనుకున్నా ముందుగా అక్కడి ఆచారాలు, అలవాట్లు, పద్దతులు, చట్టాలు తెలుసుకొని వెళ్లడం మంచిది. విదేశాలకు వెళ్లడం తప్పుకాదు. విజ్జాన సముపార్జనకు, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లడం తప్పనిసరి అయింది. ప్రసార మాధ్యమాలు, ప్రయాణ సౌకర్యాలు, కమ్యూనికేషన్ ... అందరికీ అందుబాటులోకి రావడంతో ప్రపంచం చాలా చిన్నదైపోయింది. అయినప్పటికీ కొన్ని దేశాలలో ఆచారాలు, కట్టుబాట్లు, చట్టాలు చాలా పురాతనమైనవే ఉంటాయి. ఆ చట్టాలలో మార్పు రావడానికి ఇంకా ఎన్నో ఏళ్లు పడుతుంది. అందువల్ల మన జాగ్రత్తలో మనం ఉండాలి. 
link here

2 comments:

  1. అవును. మీరు చెప్పింది నూటికి నూరు పాళ్లూ నిజం. రోమ్ లో ఉన్నపుడు రోమన్ లా ఉండాలి కదా...

    ReplyDelete
  2. Ikkada jarrigindi manadalinchadam kadu. Belt tho kottadam, vathalu pettedam. Much more severe and abusing the child.

    ReplyDelete