Friday, December 14, 2012

యోగాసనాలు ఎందుకు వేయాలి : యోగసాధన వల్ల ఉపయోగాలు


పుట్టినప్పుడు నుండి మనం ఎన్నోసార్లు రకరకాల దుస్తుల్ని ధరిస్తు మారుస్తూ ఉంటున్నాము. ఎన్నోసార్లు ఇల్లు మారుతూ ఉంటాము. అలాగే మనం భుజించే ఆహారం కూడా రకరకాల రుచులతో భుజిస్తున్నాము. కాని మార్పు లేకుండా కడవరకు మనతో ఉండేది మాత్రం మన శరీరం.

మన శరీరాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే, మన కల నెరవేర్చడానికి ఆ శరీరం తోడ్పడుతుంది. మీ మనస్సు మీరు చెప్పిన విధంగా వినకుండా, దాని ఇష్టప్రకారం ఆలోచనలను పెంపొందిస్తుంది.

మీ కలలు నెరవేరాలంటే, మీ మనసు పట్టుదలతో ఉండాలి. మీ మనస్సు, మీ శరీరము మీరు నచ్చినవిధంగా పనిచేయాలని అంటే, మీ మనస్సుని, శరీరాన్ని, మీకు అనుగుణంగా తిప్పుకోవాలి. అలా అనుకూలంగా మనువైపు మరల్చుకొనేదే యోగా.
 వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది . జీవన విధానం శరవేగంతో మారిపోతుంది . ఇడ్లీ సాంబార్ల స్థానం బ్రెడ్ ఆమ్లెట్, పిజ్జా బర్గర్లు ఆక్రమించుకున్నాయి. ఖండాంతర జీవనం అతి మామూలు విషయం అయ్యింది. పెరిగే ఆదాయంతో పాటు పెరుగుతున్న మానసిక ఒత్తిడులు మనల్ని తేలికగా వ్యాధుల బారిన పడేస్తున్నాయి. ఇటువంటి సమయంలో కాస్త సమయం మన సంప్రదాయ ఆరోగ్య పద్ధతులకు కేటాయిస్తే, ఆరోగ్యంతో పాటు, మానసిక ప్రశాంతత కూడా మన సొంతమవుతుంది . అలాంటి పద్ధతుల్లో మనం మొట్ట మొదటగా పేర్కొనవలసింది యోగా.
              యోగాసనాలు ప్రాక్టీస్ చేయాలంటే మీరేమీ పెద్దగా ఖర్చు చేయనక్కరలేదు . దీనికి కావలసినవి మంచి వెంటిలేషన్ వున్న గది, ఒక కార్పెట్ , ఆసనాలు వేయడానికి తేలికపాటి చుడీదార్ లేదా స్పోర్ట్ సూట్ మాత్రమే .

యోగసాధన ఎందుకు

అత్యాధునిక పరికరాలతో ఆకర్షణీయమైన దుస్తుల ధరించి పాశ్చాత్య సంగీతాన్ని వింటూ శరీరపు ఫిట్‌నెస్‌ను చక్కదిద్దే ఫిట్‌నెస్ కార్యక్రమాలు అనేకం ఉండగా యోగసాధన మాత్రమే ఎందుకు చేయాలి అనే సందేహం ఎవరికైనా తలెత్తవచ్చు. సందేహా నివృత్తిలో భాగంగా ఫిట్‌నెస్ కార్యక్రమాలకు, యోగసాధనకు గల వ్యత్యాసాన్ని మీ ముందుంచుతున్నాము.


ఫిట్‌నెస్ కార్యక్రమాలు పరిమిత లక్ష్యానికి మాత్రమే నిర్దేశించబడి ఉండగా, యోగసాధన మానవునికి సంపూర్ణత్వాన్ని ప్రసాదించే పూర్తి స్థాయి ప్రక్రియ. కేవలం శారీరక ఆరోగ్యానికి మాత్రమే ఫిట్‌నెస్ కార్యక్రమాలు పరిమితం కాగా, యోగాతో మనిషి శారీరక, మానసిక మరియు భావోద్వేగపూరిత ఆరోగ్యాన్ని పొందుతాడు. దినసరి ప్రామాణికాలకు లోబడి ఫిట్‌నెస్ కార్యక్రమాలు ఉంటాయి. యోగసాధనతో రోజురోజుకు మీరు చవిచూసే మార్పులు మీకు దివ్యానుభూతిని కలిగిస్తాయి. ఫిట్‌నెస్ కార్యక్రమాల్లో సాధకుల మధ్య అనారోగ్యకరమైన పోటీ తత్వం ఉంటుంది. యోగసాధనలో అంతర్గత శక్తులను చైతన్యపరిచి మానసిక ఆనందాన్ని పొందే మార్గంలో సాధకునికి ఎవరూ పోటీ కాదు.

ఫిట్‌నెస్ కార్యక్రమాలు కేవలం దేహానికి ఇబ్బంది కలిగించే దేహదారుఢ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సాగుతాయి. యోగసాధనతో శారీరక విశ్రాంతి లభిస్తుంది. రోజువారీ లక్ష్యాలను మీరు చేరుకోనట్లయితే ఫిట్‌నెస్ కార్యక్రమంలో మీరు పరాజితుల కింద లెక్క. సాధన చేసే కొద్ది అనిర్వచనీయ ఫలితాలను యోగా అందిస్తుంది.
ఫిట్‌నెస్ కార్యక్రమాలు కండరాలను పెంచి భారీ రూపాన్ని కల్పిస్తే, యోగసాధన అమూల్యమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఫిట్‌నెస్ కార్యక్రమాల ముగింపులో మీరు అలసటను సాధిస్తారు. అదే యోగసాధన చివరి ఘట్టంలో మానసిక ఉల్లాసాన్ని, నిర్మలత్వాన్ని సంతరించుకుంటారు.
యోగాభ్యాసమన్నది మన పూర్వీకులు మనకందించిన అమూల్యమైన ఆరోగ్య విజ్ఞానం అని చెప్పుకోవచ్చు. దీనిని ప్రాక్టీస్ చేయడానికి వయసు పరిమితి లేదు. మూడేళ్ళ పసికందు నుండి, తొంభై ఏళ్ళ పై బడిన వయసు వారి వరకు అందరూ యోగాసనాలు వేయవచ్చు . ఏవైనా తీవ్ర ఆరోగ్య సమస్యలున్నవారు, ఆపరేషన్లు జరిగినవారు మాత్రం వారి డాక్టర్ ను సంప్రదించి మొదలుపెట్టడం మంచిది .
               యోగాను ఒక సైన్స్ గా అభివర్ణించవచ్చు . పతంజలి అనే ఋషిని యోగశాస్త్ర పితామహుడిగా చెప్తారు.  క్రీస్తు పూర్వం నాడే  వర్ధిల్లిన ఈ విజ్ఞానం, క్రీస్తు శకం లోని వారికి కూడా ఆరోగ్యం అందించగలుగుతుంది. ఏరోబిక్స్ వంటి ఆధునిక వ్యాయామ పద్ధతులు శరీరానికి కొంత మేలు చేయగలుగుతున్నా, ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను చేకూర్చడంలో యోగాకి సాటి ఏదీ లేదని చెప్పుకోవచ్చు.
 Sources: http://www.zetacorner.com and http://telugu.webdunia.com...

No comments:

Post a Comment