Thursday, December 27, 2012

సంపాదన వన్.. టూ.. త్రీ!

‘ఒకరు లేక ఇద్దరు చాలు’ ఈ ప్రకటన చాలామందికి సుపరిచితం. రెండు మూడు దశాబ్దాల క్రితం -పిలకలేసుకున్న పిల్లల బొమ్మలతో వీధి గోడలమీదో, థియేటర్లలో స్లైడ్ షో మాదిరిగానో కనిపించేవి. కుటుంబ నియంత్రణ శాఖ హోరెత్తించే ఈ ప్రకటనలు రేడియో ప్రసారాల్లో, పత్రికా ప్రకటనల్లోనూ కనిపించేవి. ప్రకటనల మహత్యమో, బతుకుదెరువు ప్రాబ్లమో తెలీదు కానీ, ‘ఒంటికాయ సొంఠికొమ్ము’ స్టయిల్‌కు నానో కుటుంబాలు ఎప్పుడో అలవాటుపడ్డాయి. అందుకే -కుటుంబ నియంత్రణ శాఖ ప్రకటనలూ కనిపించకుండా పోయాయి. ‘సంతానం ఒక్కరే అయితే ఫరవాలేదు. సంపాదన మాత్రం రెండు మూడుండాలి’ అంటూ గ్లోబల్ మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ చేస్తున్న సూచనలనే సరికొత్త పాఠంగా ఆచరించాల్సిన పరిస్థితి వచ్చింది. అవును -నిజం. లైఫ్‌లో ఒకింత ఫైనాన్స్ రిలాక్స్ ఉండాలంటే -ఒక సంపాదన సరిపోదు. రెండు సంపాదనలైతే మంచిది. మూడునాలుగైతే మరీ బెటర్. -‘మేం చేసేది బల్లకిందా పైనా చేతులు పెట్టి రెండుచేతులా సంపాదించే ఉద్యోగం కాదుగా? బహుళజాతి సంస్థలో ఐటి ఉద్యోగం’ అన్న అనుమానాలు చాలామందికి కలగొచ్చు. అలాంటి డౌట్లు ఎవరికి మందొస్తే, వాళ్లే ముందుగా కొన్ని సూత్రాలు పాటించాలి మరి. లేదంటే.. లైఫంతే! *** మూడు పదుల సీనియారిటీతో రిటైరయ్యే నాన్నకు వచ్చే బెనిఫిట్స్ మొత్తం కంటే -పాతికేళ్ల వయసున్న కొడుకు మొదటి నెలలో సంపాదిస్తున్న జీతం ఎక్కువగా ఉంటున్న రోజులివి. సంపాదన బాగానే ఉంటుంది. మరి -ఆ సంపాదన ఎప్పుడూ అలాగే ఉండిపోతుందా? అంటే గెడ్డం కింద చేయి, మూతిమీద వేలు వేసుకుని ఆలోచించాల్సిన పరిస్థితి. ఒకవేళ ఆ జీతం తలకిందులైతే అన్న డౌటు మొదలైందనుకోండి, అప్పుడు స్టార్టవుతుంది అసలు టెన్షన్. -రష్యాలో వానపడితే మన కమ్యూనిస్టులకు జలుబు చేస్తుందంటూ గతంలో జోకులు వినిపించేవి. కానీ ఇప్పుడు -ఇరాక్‌పై అమెరికా దాడి చేస్తే దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. ఆ దెబ్బకు -హైటెక్ సిటీలో పని చేసుకునే అమలాపురం కుర్రాడు కొన్ని ఖర్చులను సర్దుకోవాల్సి వస్తుంది. ఏమంటే -‘కంపెనీ కాస్ట్ కటింగ్’ అంటాడు. తీవ్రత ఎక్కువై ఉద్యోగం ఊడితే -తట్టాబుట్టా సర్దుకుని ఇంటికెళ్లిపోవాల్సి రావచ్చు. ఈరోజుల్లో -ఈరోజు జీతం ఎంతైనా కావచ్చు. రేపటి జీతం, జీవితం రెండూ మన చేతుల్లో ఉండవు. అందుకే వారన్ బఫెట్ (ఆయనెవరూ అని అడిగితే మాత్రం మీరు చాలా సూత్రాలు చదువుకోవాల్సి ఉంటుంది) చెప్పిన మొదటి సూత్రం -ఒకే ఆదాయంపై ఆధారపడకు. ఉద్యోగంలో చేరిన కొత్తలోనే జీతంనుంచి సాధ్యమైనంత వరకు పొదుపు పెట్టుబడులు పెట్టాలిట. క్రమంగా జీతంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలట. నిజమే -ఉద్యోగం చేయడం వేరు. జీతంపై ఆధారపడటం వేరు. అందుకే -‘మన పెట్టుబడులు మన జీతాన్ని మించి ఆదాయాన్ని కల్పించే విధంగా వ్యూహం ఉండాలి’ అంటాడాయన. మనం చేసే పనికి లభించేది -జీతం. పెట్టుబడులపై లభించేది -అదనపు ఆదాయం. అంటే -రెండో సంతానం. ఒకవేళ కొంతకాలానికి ఉద్యోగంలో తేడావచ్చి జీతం తగ్గినా, రాకున్నా -బెదిరిపోవాల్సిన పనిలేకుండా అదనపు ఆదాయం మీద ఆధారపడొచ్చు అంటాడాయన. అచ్చంగా -ఇలాగే ఉండాలని లేదు. ఆయన చెప్పేదేమంటే -‘అవకాశాలను బట్టి ఒకటికిమించి ఆదాయాలను మనమే కల్పించుకోవాలి’ అని. ** ఇక -సంపాదించడమే కాదు, ఖర్చు పెట్టడమూ కళే! ‘అనవసర వస్తువులు కొనడం హాబీ చేసుకుంటే -అవసరమైన వస్తువులు అమ్ముకోవడం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది’ అన్నది బఫెట్ చేసే పెద్ద హెచ్చరిక. మార్కెట్‌లో ఏది కొత్తగా అనిపిస్తే అది కొనడం కొందరికి అలవాటుతో కూడిన హాబీ. ఆరంభంలోనే ఐదంకెల జీతాలు తీసుకుంటున్న కుర్రాకారు చాలామందిలో ఈ వ్యవసం కనిపిస్తోందన్న సర్వేలూ వెలువడుతున్నాయి. వస్తువు తప్పనిసరైతే కొనడంలో అర్థముంది. కానీ వ్యసనంగా కొనడం మొదలెడితే ఆర్థిక క్రమశిక్షణ లేక దెబ్బతింటారు. ఆఫీసులో పక్కవారి వద్ద కొత్త మొబైల్ చూసి, మనం ‘స్మార్ట్’్ఫన్ కొనడానికి పరుగులు తీయడం అవసరమా? ‘స్క్రీన్’ వ్యాపారంలో కోట్లు సంపాదిస్తున్న హీరో రజనీకాంత్ వద్ద బేసిక్ మొబైల్ మాత్రమే ఉండటాన్ని ఓ సినీ జర్నలిస్టు గుర్తించాడట. అంతే, ఆశ్చర్యంగా ముఖం పెట్టి ‘అదేంటీ? మీరు ఇలాంటి ఫోన్ వాడుతున్నారు?’ అని ప్రశ్నించాడట. దానికి రజనీ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? -‘నేను మాట్లాడేందుకు, ఎదుటివారు మాట్లాడింది వినడానికి సెల్‌ఫోన్ వాడతాను. ఆ పనులకు ఇది బాగానే పని చేస్తుంది’ అని. గొప్పల కోసం వృధా ఖర్చులు అనవసరం అన్నది -జగమెరగాల్సిన సత్యం. *** పిల్లల చదువు కోసమో, వృద్ధాప్యంలో కష్టనివారణకో ఉద్యోగంలో చేరినప్పటి నుంచే పొదుపు చేయవచ్చు. వివిధ పథకాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఇలా చేయడం వల్ల తరువాత కాలంలో మీరు మోసే భారాన్ని ఇప్పటి నుంచే సులభతరం చేసుకోవచ్చు. మీ జీతంలో కనీసం పదిశాతం పొదుపు క్రమానుగతి పెట్టుబడిపై పెట్టండి. కనీసం ఐదేళ్ళు అలా చేయాలి. ఐదేళ్ల కాలంలో మీకొక అవగాహన వస్తుంది. రిటర్స్న్ ఏమేరకు వస్తున్నాయో, రిస్క్ ఎంతవరకు తీసుకోవచ్చో తెలుస్తుంది. పెట్టుబడులు ఎలా ఉండాలి? అనే దానికి వారెన్ బఫెట్ ఓ చక్కని మాట చెప్పారు. పెద్ద పళ్లెంలో మొత్తం అన్నం మాత్రమే ఉంటే ఎలా ఉంటుంది. పళ్లెంలో అన్నీ ఉంటేనే చూడడానికి బాగుంటుంది. తినడానికి అంతకన్నా బాగుంటుంది. అంతే తప్ప ఒక్క అన్నం మాత్రమే ఉంటే ఏం లాభం. అలానే మీ పెట్టుబడుల్లో సైతం అన్ని రుచులు ఉండాలి. స్టాక్స్, బాండ్స్, నేషనల్ సేవింగ్స్ సర్ట్ఫికెట్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటివన్నీ ఉండాలి. చివరగా బఫెట్ చెప్పిన మరో ముఖ్యమైన సూత్రం -ఎవరిపైనా ఎక్కువ నమ్మకం పెట్టుకోవద్దని. ఆర్థిక వ్యవహారాల్లో ఇతరులపై ఎక్కువ నమ్మకాలు పెట్టుకుంటే మరీమరీ దెబ్బతింటామని. నమ్మకాలు వద్దు, ఎదుటి వ్యక్తులపై అనుమానాలూ వద్దు. డబ్బును డబ్బుగానే చూడాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బందులూ ఉండవ్. ఇంకెందుకు ఆలస్యం? మరో మూడువారాల్లో ఎలాగూ జీతం అందుకోబోతున్నారు కదా! ముహూర్తాలు చూడకుండా, పొదుపు పెట్టుబడులు ప్రారంభించండి. ఆర్థిక సూత్రాలు విప్పిచెప్పిన బఫెట్ అంతటి వాళ్లం కాకపోయినా, బాగుపడతామని ఆశించడంలో ఎలాంటి సందేహాలూ అక్కర్లేదు. 
-మురళి ( From Andhrabhoomi.net )

No comments:

Post a Comment