Tuesday, October 30, 2012

స్త్రీ శక్తికి సాక్షి "ఇందిరా గాంధీ"

"భారతదేశంలో మహిళలకు అత్యంత గౌరవిస్తారు. స్త్రీని శక్తిస్వరూపిణిగా పూజిస్తారు. స్త్రీ సృష్టికి, శక్తికి మూలం. "ఇందిరాగాంధీ అంటే ఒక శక్తి" ఆడది (క్షమించాలి. . . ) పరిపాలన ఏం చేయగలదు!" అంటూ పెదవి విరిచిన పురుషపుంగవులు దిగ్భ్రాంతి చెందేలా అత్యంత సమర్ధవంతంగా సుధీర్ఘ కాలంపాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించడమేకాక, శత్రుభీకరంగా దేశాన్ని తీర్చిదిద్దటానికి ప్రయత్నించారు.

దేశం గౌరవించే నెహ్రూల కుటుంబంలో జవహర్‌లాల్ నెహ్రూ- కమలానెహ్రూ దంపతులకు 19న నవంబర్, 1917వ సంవత్సరం అలహాబాద్‌లో 'ఇందిరా ప్రియదర్శినీ జన్మించింది. చిన్నతనంలో తల్లి అనారోగ్యం, తండ్రి దాదాపు చాలాకాలం జైలుజీవితం గడపడం లేదా ఉద్యమాల్లో పాలుపంచుకోవడానికి వెళ్ళడంతో ఇందిర ఒంటరితనాన్ని గడపడం లేదా బొమ్మలతో ఆడుకోవడంతో గడిచిపోయింది. మోతీలాల్ నెహ్రూ, జవహర్‌లాల్ నెహ్రూ వంటి ఉన్నతశ్రేణి స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో జన్మించిన ఇందిరాప్రియదర్శిని సహజంగానే స్వాతంత్ర్య ఉద్యమం వైపు ఆకర్షితురాలైంది. వారిని, వారి సహచరులను సమీపం నుంచి గమనించగలగడం, వారి కార్యక్రమాల గురించి వినడం వంటివాటి నుంచి స్ఫూర్తి పొందిన ఇందిర స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాలు పంచుకున్నారు. తరువాతికాలంలో ఇందిర ఇంగ్లాండ్‌కు వెళ్ళడం జరిగింది. అక్కడే ఇందిర ఫిరోజ్ గాంధీని కలవడం, ప్రేమలో పడటం, పెళ్ళి జరిగాయి. (భావావేశంలో వయసు ప్రభావం వలన ఇందిర అతన్ని ప్రేమించిందని, తరువాత అందుకు పశ్చాత్తాప పడిందని అంటారు. వారు ఎక్కువ శాతం విడివిడిగానే గడిపారు.)

ఇందిర 1955వ సంవత్సరం నుండి భారత జాతీయ కాంగ్రెస్‌లో కీలక సభ్యురాలిగా ఎదిగారు. 1959వ సంవత్సరంలో పార్టీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. నెహ్రూ మరణాంతరం లాల్‌బహుదూర్ శాస్త్రీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ ప్రభుత్వంలో సమాచార ప్రసారశాఖ మంత్రిగా ఇందిర బాధ్యతలు స్వీకరించారు. 1966వ సంవత్సరంలో లాల్‌బహుదూర్ శాస్త్రి ప్రధానిగా వుండగానే తాష్కెంట్ సమావేశం జరుగుతున్నపుడు గుండెపోటుతో హఠాత్తుగా మృతిచెందటంతో, ఇందిరాగాంధీ ప్రధాని పదవిని స్వీకరించారు. ఇందిర ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, ఆమె పరిపాలనేం చేయగలుగుతుందని పలువురు నేతలు బహిరంగంగానే దాదాపు 17 సం||ల సుధీర్ఘ కాలంపాటు ప్రధానిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారు. ఇందిర సుదీర్ఘ ప్రధాని పదవీ కాలంలో మెరుపులే కాదు మరకలు కూడా బాగానే వున్నాయి. భారతదేశానికి తొలి (మరియు ఏకైక) మహిళా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన ఇందిర మహిళాలోకానికి గర్వకారణాంగా నిలిచారు.

ప్రధానమంత్రిగా వున్న సమయంలో ఇందిర అధికారపరంగా, పాలనాపరంగా, రాజకీయపరంగా అనేక సవాళ్ళు ఎదుర్కున్నారు. 1971వ సంవత్సరంలో తూర్పు బెంగాల్ రాష్ట్రం సమస్య విషయంలో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో విజయం సాధించడం, బంగ్లాదేశ్ ఏర్పడటం జరిగాయి. పాలనాపరంగా సాధించిన విజయాలు, పార్టీలో, ప్రభుత్వంలో ఎదురులేకపోవడం వంటి కారణాల వలన ఇందిరలో ఆత్మవిశ్వాసంతోపాటు, అహంకారం కూడా పెరిగిపోయింది. అంతే కాక చుట్టూ భజనపరులు చేరి "ఇందిరే ఇండియా. ఇండియాయే ఇందిర" అంటూ- ఆమెలోని అహంభావపు స్థాయిని పెంచారు. దాంతో తానే సర్వస్వమని భావించిన ఇందిర నియంతలా ప్రవర్తించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించిన నాయకులు అందరినీ అరెస్ట్‌ చేసి, దేశంలో ' ఎమర్జెన్సీ' విధించారు. ఆ కాలం భారత చరిత్రలో చీకటిదశ, ఇందిర జీవితానికి మాయని మచ్చగా మిగిలింది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో జయప్రకాష్ నారాయణ్ ప్రమేయంతో ఇందిర ఓటమిపాలైంది. కానీ, త్వరలోనే తనను కమ్మిన మబ్బులను తొలగించుకున్న ఇందిర తరువాత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి, తిరిగి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.

పాలనాపరంగా ఎన్నో సంచలన నిర్ణయాలు ఇందిర తీసుకున్నారు. బ్యాంకులను జాతీయం చేయడం, సంస్థానాధీశులకు యిచ్చే భరణాలను రద్దు చేయడం, అణు పరీక్షలకు అనుమతినివ్వడం, బంగ్లాదేశ్ అవతరణకు సైన్యసహకారమందించడం వంటి పలుసంచలనాత్మక నిర్ణయాలు ఇందిర సాహసపూరిత వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. పంజాబ్‌లో సంభవించిన హింసను అణచివేయడానికి చేపట్టిన అపరేషన్ 'బ్లూస్టార్' సిక్కుల మనోభావాలను దెబ్బతీసింది. సిక్కుల పవిత్ర దేవాలయం అయిన అమృతసర్‌లోని 'స్వర్ణ' దేవాలయ ప్రాంగణంలో కాల్పులు జరగడం వారిని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఇందిరాగాంధీ 1984వ సంవత్సరంలో ఒకరోజు ఇంటినుండి ఆఫీస్కు వస్తుండగా, ఆమె బాడీగార్డు అయిన ఒక సిక్కు ఆమెను కాల్చిచంపాడు. "స్త్రీ బలహీనురాలు" అన్నది తప్పని నిరూపించి, స్త్రీ శక్తికి, మనోస్థైర్యానికి ప్రతీకగా నిలిచిన ఇందిరా గాంధీ ఆదర్శనీయురాలు.

మూలం: భారతీయం, ఆదెళ్ళ శివకుమార్, ఓం పబ్లికేషన్స్.

Originally at: telugudanam

No comments:

Post a Comment